Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Super computers in India: సూపర్‌ కంప్యూటర్లు భారత్‌లో ప్రవేశం

Super computers in India: సూపర్‌ కంప్యూటర్లు భారత్‌లో ప్రవేశం

త్వరలో భారతదేశం సూపర్‌ కంప్యూటర్ల శకంలోకి అడుగుపెడుతోంది. ఫ్రాన్స్‌ నుంచి అతి వేగవంతమైన, అతి శక్తివంతమైన కంప్యూటర్లను భారత్‌ కొనుగోలు చేస్తోంది. ‘హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌ (హెచ్‌పిసి) అనే పేరుతో వ్యవహరించే ఈ సూపర్‌ కంప్యూటర్లు ఆధునిక అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న భారతదేశానికి చాలా అవసరం. ఫ్రాన్స్‌కు చెందిన ‘అటోస్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 4,500 కోట్ల ఖర్చుతో ఈ కంప్యూటర్లను కొనుగోలు చేయడం జరుగుతోంది. ఈ మేరకు ఒక ఒప్పందంపై కొంత కాలం క్రితం సంతకాలు జరిగాయి. మొదటి విడతగా రెండు కంప్యూటర్లను దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఈ రెండు కంప్యూటర్లలో ఒకదానికి పుణేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీలోనూ, రెండవదాన్ని నోయిడాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌లోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రెండు సెంటర్లలోనూ ఇప్పటికే మిహిర్‌, ప్రత్యూష్‌ అనే పేర్లతో రెండు శక్తివంతమైన కంప్యూటర్లను నెలకొల్పడం పూర్తయింది. ఈ కంప్యూటర్లు ప్రధానంగా వాతావరణ పరిశోధనలను చేపట్టడం, వాతావరణ సూచనలను జారీ చేయడం వంటి అవసరాలను తీరుస్తున్నాయి. దినసరి వాతావరణం నుంచి దీర్ఘకాల వాతావరణ మార్పుల వరకు అనేక వాతావరణ ప్రధానమైన సమాచారాలను ఇవి అందించాల్సి ఉంటుంది.
వాతావరణంలో అతి వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నందు వల్ల వాతావరణ మార్పులను ముందుగానే పసికట్టడానికి ఇటువంటి కంపూటర్ల అవసరం ఉంటుంది. అనేక విధాలైన వాతావరణాలను ఇది అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త వాతావరణ మార్పులనే కాకుండా, భవిష్యత్తులో చోటు చేసుకోబోయే వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవి తెలియజేస్తాయి. వాస్తవానికి ఇరవయ్యేళ్ల క్రితం సూపర్‌ కంప్యూటర్లుగా అభివర్ణించిన కంప్యూటర్లన్నీ ప్రస్తుతం ఇళ్లలో లాప్‌టాప్‌లుగా, డెస్క్‌ టాప్‌లుగా ఉపయోగపడడం జరుగుతోంది. అయితే, ఇప్పుడు వస్తున్న కంప్యూటర్లలో కొద్దిగా తేడా కనిపిస్తుంది. ప్రొటీన్‌ బయాలజీ, ఏరోస్పేస్‌ మోడలింగ్‌, ఏఐ సంబంధిత అప్లికేషన్స్‌ వగైరా ఆధునిక టెక్నాలజీ మార్పులు చేర్పులనన్నిటినీ ఇవి పరిష్కరిస్తాయి. టెక్నాలజీ రంగంలో తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించుకోవడానికి చాలా దేశాలు ఇటువంటి సూపర్‌ కంప్యూటర్లు తమ వద్ద ఉంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 500లకు పైగా సూపర్‌ కంప్యూటర్లు వాడకంలో ఉన్నాయి. ఈ కంప్యూటర్లను రెండేళ్లకొకసారి అప్‌డేట్‌ చేస్తూ ఉండాల్సి వస్తుంది.
ఇక, 13 పెటాఫ్లాప్స్‌ వేగంతో పనిచేసే కంప్యూటర్‌ ఒకటి పుణేలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ సంస్థలో చాలాకాలంగా పనిచేస్తోంది. ఇది పూర్తిగా భారతీయ తయారీ కంప్యూటర్‌. కాగా, ప్రస్తుతం ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న కంప్యూటర్లు 18 పెటాఫ్లాప్స్‌ వేగంతో పనిచేస్తాయని చెబుతున్నారు.ఇటువంటి పెటాఫ్లాప్‌ రేంజిలో పనిచేసే కంప్యూటర్ల అవసరం భారతదేశంలోని అనేక సంస్థలకు ఇప్పటికే ఏర్పడి ఉంది. శాస్త్రవేత్తలు కొన్ని జటిలమైన వైజ్ఞానిక సమస్యలను పరిష్కరించడానికి ఇటువంటి కంప్యూటర్ల అవసరం ఉంది. దేశంలోని అనేక వైజ్ఞానిక పరిశోధన సంస్థలు ఈ కంప్యూటర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ కంప్యూటర్ల శక్తి, వేగం, సామర్థ్యం వంటి విషయాలతో సంతృప్తి పడకుండా, ఇవి ఛేదించిన అనేక వైజ్ఞానిక సమస్యలను ప్రజల ముందుకు తీసుకు రాగలిగినప్పుడే వీటికి సార్థకత ఉంటుంది. వైజ్ఞానిక, ఇంజనీరింగ్‌, టెక్నాలజీ ఫలాలను అవసరమైన విధంగా వాడుకోవడం కూడా జరగాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News