Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Supreme Court: హద్దులు మీరుతున్న వాక్‌ స్వాతంత్య్రం

Supreme Court: హద్దులు మీరుతున్న వాక్‌ స్వాతంత్య్రం

వాక్‌ స్వాతంత్య్రానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ అంశంపై మరోసారి చర్చకు తెరతీసింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న తీరు మీద అతి సునిశిత వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కరంగా మారింది. అయితే, రాజ్యాంగంలో ఇప్పటికే పొందుపరచిన ఆంక్షలను అది విస్తరించడానికేమీ ప్రయత్నించడం గమనించాల్సిన విషయం. ఉత్తరప్రదేశ్‌ మంత్రివర్గ సభ్యుడొకరు, కేరళ మంత్రి ఒకరు తమ భావ ప్రకటన స్వేచ్ఛను ఇటీవల దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే, ఈ రాజ్యాంగ ధర్మాసనం కొత్త ఆంక్షలు విధించలేమీ విధించలేదు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా అది ఎక్కడా ప్రస్తావించలేదు. పాలనాధికారం కలిగి ఉన్న రాజకీయ నాయకులకు ఒక కొత్త నిబంధనావళిని రూపొందించే అవకాశం ఉందని కూడా అందరూ ఆశించారు. కానీ, ధర్మాసనం వాటి జోలికి కూడా పోలేదు.
ఈ అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు తమ ప్రధానమైన అభిప్రాయాలను వ్యక్తం చేయగా, అయిదవ న్యాయమూర్తి ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగిం ది. వాక్‌ స్వాతంత్య్రానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2)లో పేర్కొన్న ఆంక్షలే విస్తృతంగా ఉన్నాయని, వాటిని మించి న్యాయస్థానం కొత్త నిబంధనలను లేదా ఆంక్షలను జోడించాల్సిన అవసర౦ లేదని వారు పేర్కొన్నారు. అంతేకాక, సమష్టి బాధ్యత కింద సంబంధిత మంత్రిపై ప్రభుత్వం చర్య తీసుకునేలా రూలింగ్‌ ఇవ్వాలన్న అభిప్రాయాన్ని కూడా అత్యధిక సంఖ్యాక న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అయితే, న్యాయమూర్తి బి.వి. నాగరత్న మాత్రం విడిగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ఈ అంశంతో గట్టిగా విభేదించారు. మంత్రి వెలిబుచ్చిన అభిప్రాయం ప్రభుత్వ అభిప్రాయంతో ముడిపడి ఉన్నప్పుడు కానీ లేక మంత్రి అభిప్రాయం ప్రభుత్వానికి సంబంధించినది అయినప్పుడు కానీ, మంత్రి వ్యాఖ్యలకు ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించా రు.
కాగా, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు గనుక దర్యాప్తు చేసే పక్షంలో అన్యాయం జరిగే అవకాశం ఉందనే కారణంతో కొన్ని సున్నితమైన అంశాలపై దర్యాప్తును బయటి దర్యాప్తు సంస్థలకు అప్పగి౦చాలని మంత్రులెవరైనా కోరినప్పుడు ప్రభుత్వాలు కల్పించుకున్న దాఖలాలు ఉన్నాయని న్యాయ మూర్తి గుర్తు చేశారు. రాజకీయ నాయకులు గానీ, మంత్రులు గానీ ఏవైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని, వారు బహిరంగంగా ఏమి మాట్లాడినా అవి ప్రజల్లోకి వెళ్లిపోవడమో, వాటి ప్రభావం తమ అనుచరుల మీద పడడమో జరుగుతుందని న్యాయమూర్తి నాగరత్న పేర్కొన్నారు. వాక్‌ స్వాతంత్య్రంపై న్యాయస్థానంలో జరిగిన చర్చలో అనేక అంశాలు, వాటి ఫలితాలు, ప్రభావాలు ప్రస్తావనకు వచ్చాయి. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు ఓ రాజకీయ నా యకుడు వ్యాఖ్యానాలు చేసినా, దుర్భాషలాడినా దానిపై చర్య తీసుకోవాల్సినంత అవసరమేమీ ఉండ దని, వాటి వల్ల ఏదైనా నష్టం జరిగినప్పుడు మాత్రం చర్య తీసుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే, పాలకులు గానీ, రాజకీయ నాయకులు గానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు లేదా భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినప్పుడు, రాజ్యాంగం ప్రకారం వారిపై చర్య తీసుకోవచ్చో, లేదో నిర్ధారించుకోవడానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి నాగరత్న సూచించారు.
రాజకీయేతర వ్యక్తులు లేదా పాలనలో లేని ప్రైవేట్‌ వ్యక్తులు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించే పక్షంలో న్యాయస్థానాలు కల్పించుకోవచ్చనే అభిప్రాయం ఇక్కడ ప్రాథమికంగా వెల్లడైం ది. ప్రభుత్వంలోని వారే కాక, వ్యక్తులు ఒకరిపై ఒకరు దుర్భాషలాడినా, అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే పక్షంలో చర్య తీసుకోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఆధిపత్యంలోను, అ ధికారంలోనూ ఉన్న వర్గాలు వ్యక్తుల లేదా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం, దుర్భాషలాడడం వంటివి జరిగినప్పుడు అటువంటి వర్గాలపై తప్పనిసరిగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News