Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Supreme Court on rapes: లైంగిక హింసకు ‘సుప్రీం’ పరిష్కారం!

Supreme Court on rapes: లైంగిక హింసకు ‘సుప్రీం’ పరిష్కారం!

కోల్‌కతాలో ఒక వైద్యురాలి మీద సామూహిక అత్యాచారం జరగడాన్ని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేయడాన్ని పురస్కరించుకుని, దేశంలోని వైద్య విద్యా సంస్థలు, ఆస్పత్రులలో మహిళల రక్షణకు సంబంధించి పటిష్ఠమైన చర్యలను సూచించడానికి సుప్రీంకోర్టు ఒక జాతీయ స్థాయి కార్యాచరణ దళాన్ని నియమించింది. ప్రస్తుత చట్టాలు మహిళలపై లైంగిక దాడులను ఆపలేకపోతున్నందు వల్ల, ఈ చట్టాలు నేరస్థులకు పగ్గాలు వేయలేకపోతున్నందువల్ల సుప్రీంకోర్టు ప్రస్తుతం తీసుకుంటున్న చర్య మీద ఆశలు పెట్టు కోవడం జరుగుతోంది. చట్టాలను రూపొందించినంత మాత్రాన ఇటువంటి నేరాలు ఆగి పోతాయని అనుకోవడానికి వీల్లేదు. లైంగిక దాడులకు, లైంగిక హింసకు కారణాలేమిటి, ఎవరు ఎందుకు ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతు న్నారన్న విషయాలను పూర్తిగా అర్థం చేసుకుని, వాటిని వేళ్లతో సహా పెకలించివేయాలి. ఈ కార్యాచరణ దళం మహిళల భద్రతావసరాలను బాగా లోతుగా అధ్యయనం చేసి, అన్ని రకాల దాడులు, హింసల నుంచి మహిళలకు భద్రత కల్పించగల చర్యలను రూపొందిస్తుంది. మహిళలకు ఇంటా బయటే కాదు, వారు పనిచేసే సంస్థల్లో కూడా భద్రత లేకపోవడం మీద ఈ కార్యాచరణ దళం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇటువంటి హింసలు, దాడులు ఒక్క పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయనడంలో సందేహం లేదు. పైగా సంస్థలు, కార్యా లయాల్లో కూడా ఇటువంటివి జరగడం నిజంగా ఆందోళనకరమైన విషయం. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తున్నందువల్ల ఇటువంటివి రాను రానూ పెరుగుతుండడమే తప్ప తగ్గడం లేదు. వైద్య సంస్థల్లో కూడా ఇటువంటి అఘాయిత్యాలు, అకృత్యాలు చోటు చేసుకునే పక్షంలో మహిళలు ఏ సంస్థలోనైనా, ఏ రంగంలోనైనా పురోగతి చెందడం, విజయాలు సాధించడం కష్టమైపోతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సహచరులు, సీనియర్లు, అధికారుల నుంచే రక్షణ లేనప్పుడు మహిళా వైద్యులు, వైద్య శిక్షణలో ఉన్న మహిళలు, మహిళా విద్యార్థులను కాపాడేదెవరని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులను రూపుమాపడానికి ఉద్దేశించిన ప్రస్తుత చట్టాలను దాదాపు మూడు దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న విశాఖ మార్గ దర్శకాలను, వర్మ కమిటీ సిఫారసులను బట్టి రూపొందించడం జరిగింది. అయితే, ఈ చట్టాల్లో అనేక లొసుగులు ఉన్నట్టు సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక దాడి, లైంగిక హింస ఏ రూపంలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా వీటితో కఠినంగా వ్యవహరించడానికి వీలుగా ఈ కార్యాచరణ దళం పటిష్ఠమైన చర్యలను సూచించాల్సి ఉంది. ప్రజలను శాంతింపజేయడానికి రాజకీయ నాయకులు లేదా పాలకులు రూపొందించే చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మహిళల భద్రతకు చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్భయ నిధిని అనేక రాష్ట్రాలు ఇంత వరకూ ఉపయోగించుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని బట్టి రాజకీయ నాయకులకు, పాలకులకు మహిళ భద్రత ప్రాధాన్య అంశం కాదనే విషయం స్పష్టమైపోతోంది.
చట్టాల వల్ల, నిర్భయ నిధుల వల్ల, ఇతర భద్రతా చర్యల వల్ల సమాజ ధోరణిలో కూడా పెద్దగా మార్పు కనిపించడం లేదు. సమాజంలో నెలకొని ఉన్న కొన్ని దురభిప్రాయాలు, పురుషాధిక్య ధోరణులు నేరస్థులకు కావలసినంత భద్రత కల్పిస్తున్నాయి. ఈ కార్యాచరణ దళం సామాజిక ధోరణులను పెద్దగా మార్చలేకపోవచ్చు. కానీ, సంస్థలు, కార్యాలయాల్లో మహిళలు సురక్షితంగా ఉద్యోగాలు చేసుకోవడానికి అవసరమైన మార్గాలు, పద్ధ తులను సూచించే అవకాశం మాత్రం ఉంది. ఈ కార్యాచరణ దళంలో డాక్టర్లు, ఉన్నతాధికారులు కూడా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మహిళల భద్రత కోసం పోరాడుతున్న, పాటుబడుతున్న, పని చేస్తున్న కొన్ని సామాజిక సంస్థల సహాయం కూడా ఈ దళం తీసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News