Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్A Legacy Lives : నెత్తుటి నేల నుంచి ఎర్రజెండా శిఖరం దాకా.. కామ్రేడ్ సురవరం...

A Legacy Lives : నెత్తుటి నేల నుంచి ఎర్రజెండా శిఖరం దాకా.. కామ్రేడ్ సురవరం – ఒక చారిత్రక అన్వయం

Suravaram Sudhakar Reddy : చరిత్ర ఎప్పుడూ ఒకేలా ప్రవహించే నది కాదు. అది వైరుధ్యాల సంఘర్షణలోంచి, నెత్తుటి ఏరుల నుంచి, అసంఖ్యాక ప్రజల ఆకాంక్షల ఘోషల నుంచి తన దారిని నిర్మించుకుంటుంది. ఈ చారిత్రక ప్రవాహంలో కొందరు కొట్టుకుపోతారు, మరికొందరు సుడులలో చిక్కుకుంటారు, ఇంకొందరు ఆ ప్రవాహపు గతిని మార్చడానికి తమ జీవితాలనే పణంగా పెడతారు. అలాంటి వారిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సింహాసనాల మీద కూర్చున్న రాజుల పేర్లు కాలగర్భంలో కలిసిపోవచ్చు, అధికార దండాలు ధరించిన పాలకుల జాడలు చెరిగిపోవచ్చు. కానీ, దోపిడీకి గురైన ప్రతి గొంతుకలోనూ నేనున్నానని భరోసా ఇచ్చిన వారిని, తుపాకీ గుండు గుండెకు గురిపెట్టినా, గుండె నిండా ప్రజలనే నింపుకున్న వారిని చరిత్ర తన గుండెల్లో దాచుకుంటుంది. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆ కోవకు చెందిన యోధుడు. ఆయన భౌతిక నిష్క్రమణ కేవలం ఒక వ్యక్తి అస్తమయం కాదు.. అది భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఒక చారిత్రక అధ్యాయం ముగింపు.

- Advertisement -

ఒక మనిషి జీవితాన్ని కేవలం పుట్టిన తేదీ, మరణించిన తేదీ, మధ్యలో కొన్ని సంఘటనల సంకలనంగా చూడటం చారిత్రక ద్రోహం. ముఖ్యంగా, సురవరం లాంటి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే, దాన్ని వర్గపోరాటాల నేపథ్యంలో, చారిత్రక భౌతికవాద దృక్పథంతోనే అన్వయించుకోవాలి. ఆయనెవరు..? ఆయన ఎక్కడ నుండి వచ్చారు..? ఆయన ఎవరి పక్షాన నిలబడ్డారు..? ఆయన ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే ఆయన జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది.

పునాదిరాళ్లు: వారసత్వపు వైరుధ్యం, సిద్ధాంతపు ఎంపిక : ఒక వ్యక్తి నిర్మాణంలో అతని చుట్టూ ఉన్న సమాజం, అతను పుట్టిన చారిత్రక సందర్భం, అతని వర్గ మూలాలు కీలక పాత్ర పోషిస్తాయి. సురవరం కేవలం ఒక వ్యక్తిగా పుట్టలేదు; ఒక చారిత్రక వైరుధ్యాల నడుమ, ఒక పోరాటాల వారసత్వంలో పుట్టారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన పెదనాన్న, తెలుగు జాతి గర్వించదగ్గ సురవరం ప్రతాపరెడ్డి, ఫ్యూడల్ సంస్కృతిపై, నిజాం నిరంకుశత్వంపై అక్షరాయుధంతో తిరుగుబాటు చేసిన సాంస్కృతిక వైతాళికుడు. అంటే, వలసవాద వ్యతిరేకత, ఫ్యూడల్ వ్యతిరేకత ఆయన రక్తంలో, ఆయన ఇంటి గాలిలో ఉన్నాయి.

అయితే ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. జాతీయవాద, సంస్కరణవాద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, శ్రామిక వర్గ విముక్తి సిద్ధాంతమైన మార్క్సిజం-లెనినిజం వైపు ఎందుకు ప్రయాణించాడు..? ఇక్కడే మనం చరిత్ర గతిని, దానిలోని అంతర్లీన వైరుధ్యాలను అర్థం చేసుకోవాలి. 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదు, కేవలం అధికార మార్పిడి మాత్రమే. తెల్లదొరల స్థానంలో నల్లదొరలు, బ్రిటిష్ పెట్టుబడి స్థానంలో దేశీయ బడా బూర్జువా, భూస్వామ్య వర్గాలు అధికార పీఠాన్ని అధిష్టించాయి. దోపిడీ రూపం మారింది, కానీ దాని సారం మారలేదు. ఈ చారిత్రక నిజాన్ని గుర్తించినప్పుడే, సురవరం లాంటి వేలాది మంది యువకులు అసలైన విముక్తి ఈ బూటకపు స్వాతంత్ర్యంతో కాదని, శ్రామిక వర్గ విప్లవం ద్వారానే సాధ్యమని గ్రహించారు. ఆయన తన వారసత్వంలోని పోరాట స్ఫూర్తిని తీసుకున్నారు, కానీ దాని లక్ష్యాన్ని, దాని వర్గ స్వభావాన్ని మరింత ఉన్నతంగా, స్పష్టంగా నిర్దేశించుకున్నారు. ఇది వారసత్వాన్ని గుడ్డిగా అనుసరించడం కాదు, దానిని విమర్శనాత్మకంగా స్వీకరించి, ఉన్నత దశకు తీసుకువెళ్లడం.

చైతన్యపు తొలి సెగలు: విద్యార్థి ఉద్యమమే వర్గ పాఠశాల : ప్రతి విప్లవకారుడి జీవితంలోనూ ఒక రాజకీయ పాఠశాల ఉంటుంది. సురవరం గారికి ఆ పాఠశాల విద్యార్థి ఉద్యమం. కర్నూలులో సుద్దముక్కల కోసం చేసిన సమ్మెను పైపైన చూస్తే అదొక చిన్న సంఘటన. కానీ, అది ఆయనకు సమష్టి శక్తిని, వ్యవస్థలోని అధికారాన్ని ప్రశ్నించడాన్ని నేర్పిన తొలి పాఠం. వనరులు ఎవరి చేతిలో ఉన్నాయి..? వాటిని పొందాలంటే ఏం చేయాలి..? అనే ప్రాథమిక వర్గ స్పృహకు అది నాంది.

ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనకు అసలైన రాజకీయ, సైద్ధాంతిక సంఘర్షణ క్షేత్రంగా మారింది. అది కేవలం చదువుల కర్మాగారం కాదు; అది భిన్న సిద్ధాంతాల కురుక్షేత్రం. అక్కడ విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆయన కేవలం ఫీజులు, హాస్టళ్ళ వంటి ఆర్థిక సమస్యల కోసం మాత్రమే పోరాడలేదు. విద్యార్థులను సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, దోపిడీపై స్పందించే రాజకీయ శక్తులుగా తీర్చిదిద్దారు. విద్యార్థి లోకం సమాజానికి బయట ఉన్న ఒక ప్రత్యేక ద్వీపం కాదని, అది సమాజంలోని వర్గ వైరుధ్యాలకు ప్రతిబింబమని ఆయన గుర్తించారు. AISF జాతీయ నాయకుడిగా ఆయన జైలుకు వెళ్ళడం అనేది, బూర్జువా రాజ్యం తన ప్రజాస్వామ్య ముసుగును తొలగించి, అసమ్మతిని, ప్రశ్నించే గొంతుకను ఎలా అణచివేస్తుందో నేర్పిన ప్రత్యక్ష అనుభవం. నిర్బంధం విప్లవకారుడి సంకల్పాన్ని నీరుగార్చదు, ఉక్కుగా మారుస్తుందనడానికి సురవరం జీవితమే ఒక ఉదాహరణ.

చట్టసభలు: వర్గ శత్రువుల కోటలో పీడిత ప్రజల గొంతుక : కమ్యూనిస్టులు పార్లమెంటును ఎలా చూడాలి..? దాన్ని ఉపయోగించుకోవాలా, బహిష్కరించాలా..? అనే చర్చ దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఈ ప్రశ్నకు సురవరం తన ఆచరణ ద్వారా ఒక స్పష్టమైన సమాధానం ఇచ్చారు. పార్లమెంటు అనేది పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయం కాదు, అది బడా బూర్జువా, భూస్వామ్య వర్గాల ప్రయోజనాలను కాపాడే ఒక అధికార కేంద్రం, ఒక వర్గ రాజ్యపు అంగం. అలాంటి శత్రు శిబిరంలోకి అడుగుపెట్టి, దానిని ఒక ప్రచార వేదికగా, పీడిత ప్రజల గొంతుకను వినిపించే సాధనంగా ఎలా వాడుకోవాలో ఆయన చేసి చూపించారు. ఆయన ప్రసంగాలు కేవలం ఆవేశపూరితమైన అనాలోచిత నిర్ణయాలు కావు, అవి గణాంకాలతో, వాస్తవాలతో బూర్జువా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను చీల్చి చెండాడిన సైద్ధాంతిక ఆయుధాలు.

లేబర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కోసం ఆయన చేసిన సిఫార్సులు, కేవలం చట్టాలు కావు.. అవి పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చిన్నపాటి రాయితీలు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యమం ఆయన జీవితంలో ఒక మలుపు. ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా రైతుల కోసం పోరాడితే ఈ రాజ్యం ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి సజీవ సాక్ష్యం ఆయనపై జరిగిన హత్యాయత్నం. ప్రపంచ బ్యాంకు వంటి సామ్రాజ్యవాద సంస్థల ఆదేశాలకు తలొగ్గి, సొంత ప్రజలపైనే రాజ్యం కాల్పులు జరుపుతుందన్న నిజాన్ని ఆనాటి బషీర్‌బాగ్ ఘటన, దాని కొనసాగింపుగా సురవరంపై జరిగిన దాడి ప్రపంచానికి చాటి చెప్పింది. అది వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ప్రజల ఆకాంక్షలపై, వారి పోరాడే హక్కుపై జరిగిన దాడి.

పార్టీ సారథ్యం: సిద్ధాంతపు పగ్గాలు చేపట్టిన వేళ : సోవియట్ యూనియన్ పతనం తర్వాత, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు సంక్షోభంలో ఉన్నప్పుడు, దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పేదలను మరింత పేదరికంలోకి నెడుతున్నప్పుడు, మరోవైపు మతతత్వ ఫాసిస్టు శక్తులు దేశ లౌకిక పునాదులను పెకిలించడానికి ప్రయత్నిస్తున్న అత్యంత క్లిష్టమైన సమయంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం బాధ్యతలు స్వీకరించారు. అది పూలపాన్పు కాదు, ముళ్ల కిరీటం. అలాంటి చారిత్రక సందర్భంలో, పార్టీని సైద్ధాంతికంగా దృఢంగా నిలపడం, వామపక్ష ఐక్యతను నిర్మించడం, ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కూడగట్టడం ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యాలు. ఆయన కేవలం ఒక నిర్వాహకుడు కాదు.. పార్టీ శ్రేణులకు, యువ కార్యకర్తలకు నిరంతరం సైద్ధాంతిక స్పష్టతనిచ్చిన గురువు. వర్గ పోరాటాలను, కుల నిర్మూలనా పోరాటాలను, స్త్రీ విముక్తి పోరాటాలను సమన్వయం చేయాల్సిన చారిత్రక ఆవశ్యకతను ఆయన గుర్తించారు.

కామ్రేడ్, నువ్వు మరణించలేదు : సురవరం సుధాకర్ రెడ్డి అనే 84 ఏళ్ల భౌతిక దేహం మన మధ్య ఇప్పుడు లేదు. కానీ ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయనొక ఉద్యమం. ఆయనొక ఆలోచన, ఒక ఆశయం. దోపిడీ, అణచివేత, అసమానత ఈ నేల మీద ఉన్నంతకాలం, వాటికి వ్యతిరేకంగా పోరాటం ఉన్నంతకాలం సురవరం బతికే ఉంటారు. ఆయన మాటలు, రాతలు, పోరాటాలు మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి. ఆయన వారసత్వాన్ని స్వీకరించడమంటే, ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు దండలు వేయడం కాదు. ఆయన జీవితాంతం ఏ శ్రామిక వర్గాల, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడారో, ఆ వర్గాల పక్షాన నిలబడటం. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు సృష్టిస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా, దేశాన్ని కబళిస్తున్న మతతత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద కుట్రలకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో మనల్ని మనం పునరంకితం చేసుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన, అత్యున్నతమైన నివాళి. ఆయన తన జీవితాన్ని ఏ ఎర్రజెండాకు అంకితం చేశారో, ఆ జెండాను మరింత ఎత్తుకు ఎగురవేయడమే మన కర్తవ్యం.


లాల్ సలాం, కామ్రేడ్ సురవరం!
మీ ఆశయాలు వర్ధిల్లాలి! విప్లవం వర్ధిల్లాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad