Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Surveys-War rooms: ప్రజలు ఎవరిని నమ్మాలి?

Surveys-War rooms: ప్రజలు ఎవరిని నమ్మాలి?

ఎలక్షన్ ప్రచారంలో తెరచాటు యుద్ధం

మన దేశంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై వివిధ రాష్ట్రాల ఎన్నికల తేదీల ప్రకటనతో పాటు కోడ్ అమల్లోకి వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలో నవంబర్‌ 30న ఎన్నికలు, డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడించనుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలు, మేనిఫెస్టో(పథకా)లు వెల్లడిస్తున్నారు. పార్టీ (నాయకు)లు ఒకరిని మించి ఇంకొకరు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి మేనిఫెస్టోలో ఆశలు రేపే హామీల జోరు కొనసాగుతుంది. మా పథకాలను మీరు కాపీ కొట్టారని! కాదు మీరే కాపీ కొట్టారని మాటల జోరుతో వేడిని పెంచుతున్నారు. నేటి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా పార్టీ (నాయకు)లు కప్పదాటుడును.. జంప్‌ జిలానీలను ప్రోత్సహిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, వాగ్దానాలను, ఇచ్చిన మాటలను తుంగలో తొక్కేసి రాత్రికి రాత్రే పార్టీ (కండువా)లు మార్చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి ఎన్ని చట్టాలు చేసినా లాభం లేకుండా పోతుంది. రాజకీయాల్లో నైతిక విలువలు కనుచూపు మేరలో కానరావడం లేదు. ప్రజాస్వామ్య విలువలు అడుగంటి పోతున్నాయి. సీటుకు నోటు, ఓటుకు నోటు, తాయిలాలు, ఉచితాల హామీలతో ఓటర్లను తమ ఖాతాలో వేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. మీరు చేసింది శూన్యం! కాదు మీరేం చేశారని విమర్శలు, ప్రతి విమర్శలతో వారిని బంగాళాఖాతంలో కలపండి అంటే..కాదు వారిని పాతాళంలోకి నేట్టేయండనే మాటలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాల్లో అన్ని పార్టీలు ‘ఆ తాను ముక్కలే’ అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ (నాయకు)లు సభలు, సమావేశాలతో దూకుడుగా ప్రచారవేగాన్ని పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఎవరిని నమ్మాలో తెలియక ప్రజలను కన్ఫ్యూజన్లోకి నెట్టేసే మైండ్‌ గేమ్‌ (మానసిక క్రీడ) మొదలైంది. అన్ని పార్టీ(నాయకు)లు డాక్టర్‌ అంబేద్కర్‌ అందించిన ‘ఓటు బలమైన ఆయుధం’ మీ స్థితిగతులను రాష్ట్ర, దేశ పరిస్థితులను మార్చే ఓటును ఆగం గాకుండా ఆలోచించి, మీకు మేలు చేసే వారికి ఓటు వేయండి అనే ఓటు నీతు (భజన)లు మొదలుపెట్టారు. ఎవరిని నమ్మాలో! ఎవరిని నమ్మకూడదో.. అర్థం కాని అయోమయ స్థితిని సృష్టిస్తున్నారు నాయకులు, పార్టీలు. ‘ప్రజల నమ్మకం అమ్ముడై పోవడంతో’ మీ కోసమే పార్టీలు ఫిరాయిస్తున్నామని అభివృద్ధి బోధనలతో ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి ప్రజాపాలకులను నమ్మి జాతి పురోభివృద్ధి కోసం నమ్మకం పునాదుల మీద పార్టీ (నాయకు)లకు ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఓట్లు పడి అధికారం చేతికి వచ్చాక హామీలు, మేనిఫెస్టోలు అమలు చేయని ఫలితంగానే దేశంలో, రాష్ట్రాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వేచ్ఛలో అసమానతల అగాధం పెరిగిపోతుంది. దేశ సంపద గుప్పెడుమంది చేతు(జేబు) ల్లో ఉండిపోయింది. ప్రతిసారి ఎన్నికల ముందు ఇదే తంతు కొనసాగుతుంది. ఆ తర్వాత ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా ప్రజానీకం పరిస్థితులు ఉన్నాయి.
మన రాష్ట్రంలో ఎన్నికల వేళ ప్రజల నాడిని అంచనా వేయడం పేరుతో పోల్‌ సర్వే సంస్థలు హడావుడి చేస్తున్నాయి. ఇలా ఎన్నికల ముందు నుండే వందలాది సర్వే సంస్థలు ఫీల్డ్‌ స్టడీ మొదలెట్టాయి. ఈ ఎన్నికల్లో విజయ అవకాశాలు ఎలా! ఏ మేరకు ఉన్నాయని అన్ని పార్టీలు సొంత సర్వే సంస్థలచే సర్వే చేయించుకుంటున్నాయి. వాటి ఆధారంగానే వ్యూహాలు రచించాయి. వివిధ టెలివిజన్‌ ఛానల్స్‌, వార్తాపత్రికలు సొంతంగా లేదా సర్వే సంస్థల ద్వారా చేయిస్తున్నాయి. వీటిని ఒపీనియన్‌ పోల్స్‌ అంటారు. వీటి ఆధారంగా చర్చాగోష్టులను నిర్వహిస్తున్నారు. వీటిలో వైరి వర్గాలు గొడవలు పడుతున్న తీరును చూస్తున్నాం. ఈ సంస్థలే పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహిస్తాయి. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లో, ఎన్ని సీట్లో జోస్యం చెప్తాయి. వాస్తవానికి ఈ సర్వేల విశ్వసనీయతలో అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితమైన అంచనాలు నిరూపించబడలేదు. ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే అంచనాలకు వాస్తవ ఫలితాలకు మధ్య తేడాలే కనిపించాయి. కొన్నిసార్లు అయితే చాలా భిన్నంగా కూడా వచ్చాయి. ఇలాంటి వేళ కనీసం తప్పుడు అంచనాలను ప్రజలపై రుద్దినందుకు గాను క్షమాపణ కూడా కోరలేదు. కొన్ని దేశాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. అలానే చేస్తున్నట్లు సర్వీస్‌ సంస్థలు చెప్పినప్పటికీ, మనదేశంలో అనేక వైవిధ్యాలు, వైరుధ్యాలు, భిన్నత్వంలో ఏకత్వం, జీవనశైలిలో, ఆహార అలవాట్లలో, భాష, అవసరాలు, అనేక సమస్యల వంటివి ప్రతి 60 నుంచి 70 కిలోమీటర్ల దూరానికి మారుతుంటాయి. ఇలాంటి స్థితిలో కొన్ని నియోజకవర్గాల్లోనో, కొద్ది మంది అభిప్రాయాలను సేకరించి ఓ నిర్ధారణకు రావడం చాలా కష్టం. అందువల్లే కచ్చితత్వం లోపిస్తుంది. ఈ విషయం సర్వే సంస్థలకు తెలిసినా ఒప్పుకోరు. దీని వెనుక అనేక అపోహలు, ఆర్థిక లావాదేవీలు ఉంటున్నాయని తెలుస్తుంది. ఈ సంస్థలను ఎన్నికల సర్వేల పేరిట ప్రజలను నమ్మించేందుకే పార్టీ(నాయకు)లు ఉపయోగించుకుంటున్నాయన్న అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. పార్టీలు ప్రజల్లో ఈ సర్వేల కన్ఫ్యూజన్‌ సృష్టిస్తున్నారు. వీటి మెథడాలజీ, శాస్త్రీయతపై సందేహాలు ఉన్నాయి. షెడ్యూల్‌ విడుదల అయ్యేంత వరకే ఈ సర్వేలు హల్చల్‌ చేస్తాయి. ఆ తర్వాత నిషేధించబడుతాయి. ఆ తర్వాత ఎన్నికల అనంతరం ఫలితాలకు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటిస్తారు. వాటిలోనూ అంచనాలు తారుమారే అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆధునిక టెక్నాలజీ కాలంలో సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జోరందుకుంటున్నది. దేశంలోనే ఎక్కువ మొబైల్‌ ఫోన్లు వినియోగించే రాష్ట్రాల్లో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. అందుకే రాజకీయ ప్రచారంలో సామాజిక మాధ్యమాల పాత్ర కీలకంగా మారింది. అన్ని పార్టీలు సోషల్‌ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకోగా, ఇప్పుడు వార్‌ రూమ్లను రంగంలోకి దింపాయి. ఓటర్‌ నాడిని పట్టుకొని వారి మనసును సాంకేతిక తంత్రంతో మార్చడమే వాటి పని. తమ అభ్యర్థుల గెలుపుతో పాటే, ప్రత్యర్థి స్థైర్యాన్ని దెబ్బతీయడమే వాటి లక్ష్యం. ఆ మేరకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ఓటర్ల చెంతకు తీసుకెళ్లడం వార్‌ రూమ్ల ఏర్పాటు లక్ష్యం. అన్ని పార్టీల భావజాలాలను, ప్రత్యర్థి బలహీనతలను ప్రజల మనసుల్లోకి చొప్పించే వ్యూహాలను సిద్ధం చేస్తాయి. స్వల్ప నిడివితో ఉండే వీడియోలు, పంచులతో ఉండే చిత్రాలను సిద్ధం చేసి నిత్యం సామాజిక మాధ్యమాల్లో వదులుతుంటాయి. ఈ వార్‌ రూమ్‌ బృందంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. ఈ ఒప్పందం ప్యాకేజీ కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది. ప్రజల్లో నానుతున్న అంశమే వారు రూముల ప్రధాన ఆయుధం. ఎక్కడైనా ఒక నాయకుడికి సంబంధించిన లోపం వెలుగు చూస్తే సినిమాల్లో దానికి సంబంధించిన సన్నివేశాలు వ్యంగ్యమైన వ్యాఖ్యలు జత చేసి దృశ్యం ఇవ్వడం, అలాంటి వాటిని స్మార్ట్‌ ఫోన్లు వినియోగించి ఓటర్లకు అనుసంధానం చేయడం వీరి ప్రధాన విధుల్లో ఒకటి. సామాజిక మాధ్యమ బృందాలు ఏర్పాటు చేసి వార్‌ రూంలో రూపొందించే అంశాలు వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇలా వార్‌ రూమ్లో పార్టీల బలాలు, లోపాలను అస్త్రాలుగా ఉపయోగించి ప్రచారానికి తెరచాటు యుద్ధం కొనసాగిస్తున్నారు.
ఇలా ఎన్నికల గోదాలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీ(నాయకు)లు భావోద్వేగ ప్రసంగాలు, విమర్శలు, రెచ్చగొట్టే మాటలతో ప్రజలను ప్రభావితం చేయడం జరుగుతుంది. మరోవైపు ఒపీనియన్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ సామాజిక మాధ్యమాల ప్రచారంతో హల్చల్‌ చేస్తూ ప్రజలను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. వీరు ఓట్లను పొందడం కోసం పడరాని పాట్లతో తిమ్మిని బమ్మిని చేస్తు న్నారు. ఇలాంటి వేళ ప్రజలు ఎవరిని నమ్మాలి! ఎవరిని నమ్మకూడదు? ఓటరు నమ్మకం అమ్మకమౌతుందని, అభాసుపాలౌతుందనే ఆవేదన చెందుతున్నారు. మేనిఫెస్టోలు (పథకాలు), హామీలు, నేతల ప్రమాణాలు నెరవేర్చక పోవడంతో ఆచరణ లేని హామీలుగా మిగిలాయని రూడీ అయిందంటున్నారు.
ఇప్పటికైనా పార్టీ(నాయకు)లు ప్రజల ఆకాంక్షల మేరకు పాలిస్తామని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నేతల స్వార్థం కోసం కాదు, ప్రజల సమ్మిళిత అభివృద్ధి కోసమేనని గ్రహించి నడుచుకోవాలి. చేసిన ప్రమాణా(హామీ) లకు కట్టుబడి ఉండాలి. రాజకీయాల్లో నైతిక విలువలు నిలబెట్టుకోవాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరాదు. ప్రజల పవిత్రమైన ఓటును అంగడి సరుకు చేయబోమనే హామీ ఇవ్వాలి. ప్రశ్నించే స్వేచ్ఛను పరిరక్షిస్తామని, ఆచరణాత్మక హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోండి.. శంకించవలసింది ఓటర్లను కాదు, ముమ్మాటికి రాజకీయ పార్టీ(నాయకు)లనే.. ఆత్మవిమర్శ చేసుకొని చిత్తశుద్ధితో జాతి సంపదను పౌరులకు సమంగా పంచుతామని, పౌర స్వేచ్ఛను కాపాడుతామని ఓట్లను వినమ్రంగా అర్ధించండి. ప్రజా చైతన్యానికి పరీక్షా కాలమే! అయినా తగ్గేదేలేదం టూ, అన్‌ స్టాపబుల్‌ గా ఓటర్లు మనఃసాక్షిగా మీ సమస్యలు పరిష్కారం చేసేవారికి స్వేచ్ఛగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయండి.. ఇదీ ఓటరు చైతన్యమని నిరూపించండి.

  • మేదాజీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News