Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Suspensions turning to be a trend: పెరుగుతున్న సస్పెన్షన్లు

Suspensions turning to be a trend: పెరుగుతున్న సస్పెన్షన్లు

ప్రతిపక్షాలకు తగినంత సమయం ఇవ్వకపోతే జరిగేదిదే

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ ఛద్దాను ఇటీవల రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేయడం పతాక శీర్షికలకు ఎక్కింది. ఆయన తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. సభ్యుడిని సస్పెండ్‌ చేయడానికి రాజ్యసభ చైర్మన్‌కు అధికారం ఉందా, లేదా అని కూడా పరిశీలించడం జరుగుతుందని ఆయన పిటిషన్‌ను స్వీకరిస్తూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన మీద ఒక ఆరోపణపై విచారణ జరుగుతున్న స్థితిలో తనను సస్పెండ్‌ చేయడానికి రాజ్యసభ చైర్మన్‌కు అధికారం లేదంటూ ఛద్దా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యసభ సెక్రటేరియట్‌కు పంపించింది. ఆయన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశించింది. ఆయన ఇటీవల అయిదుగురు ఎంపీల పేర్లను సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేశారు కానీ, ముందుగా ఆ ఎంపీల నుంచి అనుమతి తీసుకోలేదనే ఆరోపణ ప్రస్తుతం విచారణంలో ఉంది. రాజ్యసభ సభాహక్కుల సంఘం దీనిపై విచారణ సాగిస్తోంది. ఆయనను సస్పెండ్‌ చేసే అధికారం చైర్మన్‌కు ఉందా లేదా అన్న విషయం అటుంచి, ఛద్దా సస్పెన్షన్‌తో ఎంపీలను చీటికి మాటికి సస్పెండ్‌ చేయడం జరుగుతోందనే అభిప్రాయం ఒకటి బాగా వ్యాప్తి చెందుతోంది.
నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు, సభలో సమావేశాలను ఆటంకపరుస్తున్నందుకు, ఉద్దేశపూర్వ కంగా సభా నిర్వహణకు, సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నందుకు, చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరిస్తున్నందుకు, క్రమశిక్షణారహితంగా వ్యవహరిస్తున్నందుకు ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో నలుగురు ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం జరిగింది. అయితే, ప్రతిపక్ష సభ్యుల మీద చర్యలు తీసుకుంటున్నారే తప్ప, డానిష్‌ అలీ అనే సభ్యుడిని దుర్భాషలాడిన పాలక పక్ష సభ్యుడు రమేశ్‌ బిధూరీ మీద మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. వాస్తవానికి పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చ జరగడం, వాదోపవాదాలు జరగడం అనేది ఏనాడో అంతరించిపోయింది. ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, గందరగోళ పరిస్థితులు సృష్టించడం, కేకలు పెట్టడం, సభా కార్యక్రమాలకు ఏదో ఒక కారణంతో అడ్డు తగలడం నిత్యకృత్యమైపోయింది. ఇందుకు ఇరు పక్షాలనూ తప్పుపట్టాల్సి ఉంటుంది. పార్లమెంట్‌లో సమావేశాలు సవ్యంగా జరగడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా చూడడం వంటి బాధ్యతలన్నీ పాలక పక్షానివేనని ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, తమకు అవసరమైనంత అవకాశం ఇవ్వడం లేదని, తమకు కొద్దిగా కూడా సమయం కేటాయించడం లేదని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, అందుకే తాము సభా కార్యక్రమాలకు అడ్డు తగలడం జరుగుతోందని ప్రతిపక్షాల నాయకులు వాదిస్తున్నారు. అంతేకాక, పాలక పక్ష సభ్యులు తమ విషయంలో నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతోందని కూడా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌ సమావేశాలకు భంగం కలిగించడం, గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుండడం, పాలక పక్షాన్ని లేదా ప్రభుత్వాన్ని సమాధానం చెప్పనివ్వకపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుండడంతో, వారిని సస్పెండ్‌ చేయడం కూడా ఎక్కువైందని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం ఎక్కువ కావడం వల్ల చివరకు ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల చర్యలన్నీ క్రమశిక్షణారహితంగా ఉన్నాయని, అవి ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు సృష్టించడం, సభా కార్యక్రమాలు సజావుగా కొనసాగకుండా అడ్డుపడడం వంటివి చేస్తున్నాయని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పాలక పక్షం తగినంత సమయం ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయనేది సాధారణ అభిప్రాయం. ఛద్దా విషయానికి వస్తే, ఆయన చేసిన పని సరైనదా, కాదా అని నిర్ణయించాల్సింది న్యాయస్థానమే. అయితే, ఆయన తనను నిరవధికంగా సస్పెండ్‌ చేయడానికి తగిన తప్పేమీ తాను చేయలేదనే అభిప్రాయంలో ఉన్నారు. ఇటువంటి సస్పెన్షన్లను గమనించినవారికి పాలక పక్షం ప్రతిపక్షాలు లేని పార్లమెంటునుకోరుకుంటోందనే అభిప్రాయం కలిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పాలక పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా ఆత్మవిమర్శ చేసుకుని తనను తాను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News