Homeఎడిటోరియల్ / బహుళపతనావస్థలో వ్యవస్థలు

పతనావస్థలో వ్యవస్థలు

ఎర్రటి ఎండల ఒక్క జడివాన దంచి కొట్టేసరికి అంతా అతలాకుతలమై ఉత్తరప్రదేశ్‌లో వందల మంది చనిపోయిండ్రు. కానీ అదే జడివానకు తెలంగాణలో మాత్రం రాజ్యాంగ వ్యవ స్థలు, ఆ వ్యవస్థలను నడిపించే వ్యక్తుల రంగులు వెలిసిపోయి నయి. ముసుగులు తొలిగినయి. ఖుల్లం ఖుల్లా ఎవరు? ఎంత నియ్యతి తోటి ఉన్నరో రుజువులు దొరికినయి. ఆ జడివాన బండి భగీరథ్‌పై పోక్సో కేసు రూపంలో వచ్చింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల రంగు బహిరంగమైంది. పోలీసు అధికారులు ముద్దాయిలను ఎంత ముద్దు చేస్తున్నరో తెలిసింది. మీడియా కుమ్మక్కు రాజకీయాలు సామాన్య ప్రజలకు సైతం క్లియర్‌గా అర్థమయ్యాయి. ఇప్ప్పుడు ఎవరు ఎన్ని ముసుగులేసుకొని వచ్చినా ప్రజలు వాళ్ళను గుర్తించే విద్య నేర్చుకున్నరు. ఇప్పటికీ ఒకే ఒక్క ‘న్యాయ వ్యవస్థ’ మీదనే అంతో ఇంతో నమ్మకమున్నది. ఆ నమ్మకం కూడా పోయిందంటే ‘పాసిజం’లోకి పోయినట్లే!

- Advertisement -

వెకేషన్‌ బెంచ్‌లో బండి భగీరథ్‌ కేసుని విచారిస్తున్న జస్టిస్ తంగిరాల మాధవిదేవి  శుక్రవారం నాడు ‘సోషల్‌ మీడియాలో తన నిజాయితీకి మచ్చ తెచ్చే ప్రయత్నం జరుగుతున్నది గమనిం చారా?’ అని కేసుని వాదిస్తున్న న్యాయవాదులను అడిగారు. తాను ఈ కేసు విచారించడం పట్ల మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి తప్పుకుంటాను అని కూడా ఆమె బాధతో వ్యాఖ్యా నించారు. అయితే ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమె ఈ విచారణను కొనసాగించారు. ఈ విషయమై హైకోర్టు రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిండు. అదే రోజు ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ సోషల్‌ మీడియా, సమాచార హక్కు కార్యకర్తలను పరాన్న జీవులు, బొద్దింకలుగా పోల్చి తన గౌరవానికి తానే భంగం కలి గించుకున్నారు. ఈ విషయాన్ని అదే సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగి, విమర్శ రావడంతో, సెక్షన్‌ ఆఫ్‌ మీడియా తప్పుగా అర్థం చేసుకున్నది అని తెల్లారి వివరణ ఇచ్చుకున్నాడు.
అయితే బండి భగీరథ్‌ విషయంలో కోర్టులు ప్రో యాక్టివ్‌గా వ్యవహరించాయి. మొదటిది పోక్సో కేసులో తన పేరు వాడ కుండా బండి సంజయ్‌ కోర్టులో వేసిన పిటి షన్‌పై ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన పేరుని వాడొద్దు అని పేర్కొ న్నారు. ఇప్పుడు బండి భగీరథ్‌ని డ్యాష్‌ కుమారుడు అని చెప్పాల్సి వస్తున్నది. ఇది ఆచరణలో ఎంత కష్టమో గమనించాలి. తీర్పుని ఉటంకిస్తూ అదే రోజు అన్ని తెలుగు, ఇంగ్లీషు పత్రికలు బండి సంజయ్‌ కుమారు డు అనే పేర్కొన్నాయి. వాటిని మరో విధంగా రాయ డం వీలుగాదు. సరే ఆ విషయాన్ని పక్కన బెడితే బండి భగీరథ్‌ కేసులో వివిధ పార్టీలు, వ్యవస్థలు ఎట్లా వ్యవహరించాయో పరిశీలించినట్లయితే అసలు నిజాలు వెలుగు లోకి వస్తాయి.

ముందుగా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుం దాం. కాంగ్రెస్-బీజేపీ బద్ధ శత్రువులు అని ఎన్నికల ప్రచారాల సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే రేవంత్‌ రెడ్డి-బీజేపీ మాత్రం శత్రువులు కాదు. ఎందుకంటే కేసు నమోదైన తర్వాత సైతం ఇద్దరూ జోకులు వేసుకుంటూ జాలీగా నవ్వుకుంటూ దర్శనమిచ్చారు. నవ్వుకోవద్దని కాదు. అయితే ప్రత్యర్థితో అంత సన్నిహితంగా, అదీ ఫోక్సో కేసు నమోదైన సందర్భంలో రాష్ట్ర హోమ్‌ శాఖా మంత్రిగా ఉన్నటువంటి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి ఆ కేసుని ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న పోలీసు అధికారుల మీద ఎట్లాంటి  ప్రభావం వేస్తుందో అని ఆలోచించాలి. అంతేగాదు ఎనిమిది రోజుల వరకు ఒక నిందితుణ్ని లక్షమంది ఉద్యోగులు ఉన్న రాష్ట్ర పోలీసు వ్యవస్థ అరెస్టు చేయలేకపోయిందంటే ఆ నామో షిని రాష్ట్ర హోమ్‌మంత్రిగా రేవంత్‌ రెడ్డే భరించాల్సి వస్తది. దీనికి తోడు ఒక వేదిక మీద రేవంతు మాట్లాడుతూ బండి సంజయ్‌ కొడుకుని అప్పజెప్పాలి అన్నాడు. అందుకు స్పందనగా బండి సంజయ్‌ తన కొడుకుని పోలీసులకు అప్పగించానని చెప్పిండు. భగీరథ్‌ లాయర్లు అదే చెప్పిండ్రు. అప్పగించడం అంటే అప్పటి వరకు అంటే కేసు నమోదు అయిన మే ఎనిమిదో తేదీ నుంచి బండి భగీరథ్‌ ఆయన అధీనంలోనే ఉన్నట్టు కదా! కేంద్ర హోమ్‌ శాఖా సహాయమంత్రిగా ఉంటూ ఒక నిందితుడికి ఆశ్రయం కల్పించారంటే అది నేరం కిందికే వస్తుంది. ఈ అప్పగింతను కేసు నమోదైన రోజే చేసి ఉంటే బండి సంజయ్‌ హీరో అయ్యే వాడు. ఆయనకు ఆ లక్షణాలు లేవని ‘సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందామని ఇంటికి వచ్చిన బాధిత కుటుంబాన్ని బెదిరించినాడు’ అనే విషయం బయటకు పొక్కిన నాడే ప్రజలకు అర్థమైంది. పోలీసులు మాత్రం అరెస్టు అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నరు. ఇప్పుడు అరెస్టా, లొంగుబాటా, అప్పగింతనా? అనే సంశయం ఏర్పడింది.

విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి, బాధిత కుటుంబా నికి న్యాయం జరిగేందుకు వీలుగా, వ్యవస్థలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు గాను బండి సంజయ్‌ స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేసినట్లయితే తన నిబద్ధతను నిరూపించుకున్నట్లయితది. ఎట్లాగూ ప్రధాని విదేశీ పర్యటనల నుంచి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరు గుతుంది అంటున్నారు. అప్పుడు ఆయన పదవి ఊడుతుందం టున్నారు. అయినా మరక అంటినవాళ్లే మాకు పసందు అని భారతీయ జనతాపార్టీ భావించినట్లయితే దేశ ప్రజలు అన్నీ యాదికుంచుకుంటారు. అయితే బండి సంజయ్‌ స్థానంలో మరో తెలంగాణ బీసీకి మాత్రమే పదవిని కట్టబెట్టాలి. లేనట్లయి తే పదవీ, పరువూ రెండూ పోయి తెలంగాణ భారతీయ జనతాపార్టీ రెంటికి చెడ్డ రేవడి అయ్యే అవకాశమున్నది. బండి సంజయ్‌ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అనడం ద్వారా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు రామచందర్‌ రావు తిరోగమన దిశలో నడుస్తున్నాడు అని అర్థమయితున్నది.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేందంటే తెలంగాణకు అమ్మగా కావాలని ఆశపడుతున్న తెలంగాణ రక్షణ సేన అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత బాధిత బాలిక పక్షాన నిలబడకుండా ‘రాజకీయాల్లో లేని వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని బండి భగీరథ్‌కు పరోక్ష మద్ధతు పలికిండ్రు. తల్లి కావాలనుకున్న వారు ముందుగా విక్టిమ్‌కు మద్దతు పలకాలి. నిజానికి ఆమె ఈ విషయంపై ఆలస్యంగా స్పందించారు. అదీ పీడితులకు అనుకూలంగా. సోషల్‌ మీడియాలో పబ్లిక్‌ విరు చుకు పడడంతో తన స్టాండ్‌ మార్చుకొని బండి సంజయ్‌ని మంత్రి పదవి నుంచి తొలగించాలి అని డిమాండ్‌ చేశారు. ఈ రెండింటి మధ్య కాలంలో ఆ పార్టీ పరువూ, ప్రతిష్ట రెండూ దెబ్బతిన్నాయి. ప్రజలు ఏమి గుర్తు పెట్టుకుంటారులే, వచ్చే ఎన్నికల నాటికి అన్నీ మరిచిపోతారు అనుకుంటే అది అజ్ఞా నమే. ఎందుకంటే ఇప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టు అయ్యే విషయాలు పదే పదే ప్రజలకు వాస్తవలను గుర్తు చేస్తూ ఉంటాయి. ఎన్నికల సమయంలో కచ్చితంగా ఇవి ఎజెండా మీదికి వస్తాయని గుర్తుంచుకోవాలి. తన ఒక్క వివాదాస్పద ప్రకటనతో తెలంగాణ రక్షణ సేనను కవిత డిఫెన్స్‍లోకి నెట్టే సింది. రాజకీయ ప్రత్యర్థులకు మేలు జరుగుతుంది కాబట్టి అందుకు ప్రతికూలంగా స్పందిస్తామంటే అది అసలు పార్టీ మనుగడనే ప్రమాదంలోకి నెడుతుందనేది ఆమె గమనించాలి. ప్రజల సెంట్రిక్‌ గా రాజకీయాలుండాలి.

ఇక భారతీయ జనతా పార్టీ రహస్య మిత్రుడు అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ఫోక్సో కేసు విషయంలో ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని చెప్పిండు. అక్కడికి ఆపేస్తే బాగుండేది కానీ బీజేపీని ఒక్క మాట అనకుండా భారత రాష్ట్ర సమితిపై విరుచుకుపడడం ఆయన అసహనానికి తార్కాణం. అట్లాగే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ శాఖ బండి సంజయ్‌ రాజీనామాను డిమాండ్‌ చేసింది కానీ తెలంగాణ శాసనసభలో సిపిఐ ఏకైక సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఎలాంటి ప్రకటన చేయలేదు. మౌనంగా ఉండడం కూడా కుమ్మ క్కుగానే భావించాల్సి వస్తది. కమ్యూనిస్టు పార్టీలకు అను బంధం గా ఉన్న కొన్ని మహిళా సంఘాలు ధర్నాలు నిర్వహిం చాయి. అయితే సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. ప్రజల్లో అభిమానం సంపాదించుకో వడానికి ఇలాంటి సంఘటనలు బంగారు అవకాశం. ఈ అవకాశాలను సిపిఐ (ఎం) నాయకత్వం చేజార్చుకున్నది.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకే ఒక్క మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ అంశంపై స్పందించారు. అట్లా స్పందించినందుకు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కొందరు అధిష్టానానికి ఆయన మీద ఫిర్యాదు చేసిండ్రు. ఒకవైపు రాజ్యాంగ బద్ద పాలన అంటూ ముఖ్యమంత్రి చేష్టలుడిగితే తమ పార్టీ తరపున ఎవరో ఒకరు స్పందించారు అని సంతోష పడాల్సింది పోయి ఫిర్యాదులు చేస్తున్నారంటే ఆ పార్టీ దిశారాహిత్యానికి అది నిదర్శనం. ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీలోప్రొఫైల్‌గా ఉండి రాజకీయ లబ్ది కన్నా బాధితురాలికి న్యాయం జరగడమే ప్రధా నమని భావించి పావులు కదిపింది. ఈ విషయంలో కె.టి.రామా రావు లాంటి వారు స్పందిస్తే అది బీసీలపై ఆధిపత్య కులాల అక్కసు అని ప్రచారం చేసేందుకు అవకాశం వుండేది. అందుకు ఆయన అవకాశమివ్వలేదు. స్ట్రాటెజిక్‌గా ఆర్‌.ఎస్.ప్రవిణ్‌ని ముందుంచి పని నడిపించారు.

ఇక అధికారగణం విషయానికి వస్తే ఒక్క నిందితుణ్ని ఎనిమిది రోజులైనా గాలించలేక పోయిండ్రంటే పోలీసు వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం పోతున్నది. కేంద్ర హోమ్‌శాఖ సహాయమంత్రి కాబట్టి అధికా రులు ముద్దాయికి సానుకూలంగా వ్యవహ రించారా? అనే అనుమానం వస్తున్నది. ఎందుకంటే మొదట బలహీనమైన సెక్షన్లలో నే కేసుని నమోదు చేసిండ్రు. ప్రజల నుంచి వత్తిడి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ‘సిట్‌’ ఆ తర్వాత సెక్షన్లను మార్చిండ్రు. సోమవా రం మరో కొత్త కేసు పెట్టిండ్రు. ఈ విడతల వారి వ్యవహారం అధికారుల లాలూచీని పట్టిస్తున్నది. అంతకు ముందు నిర్మల్‌లో పీడకులే తప్పుడు కేసు బనాయించిండ్రు. బాధితుల తరపున లాయర్‌ బలంగా వాదించడం మూలంగానే నిందితుడికి బెయిల్‌ దక్కలేదు అనేది గుర్తించాలి.

ఈ కేసులో ప్రధాన స్రవంతి మీడియా, సోషల్‌ మీడియాలో ఒక భాగం బాధితుల మీదనే బండలు మోపినాయి. హానీట్రాప్‌ స్టోరీలు అల్లి ప్రచారంలో పెట్టాయి. బాధితుల వివరాలు, ఫోటో లు ఎక్కడా షేర్‌ చేయకూడదు అని చట్టం చెబుతున్నప్పటికీ ఒక పద్ధతి ప్రకారం వాటిని ప్రచారం చేసి విషాన్ని విరజిమ్మారు. తమ ప్రయోజనాలు నెరవేరుతాయంటే ఎంతటి నైచ్యానికైనా దిగజారుతామని ప్రకటించుకున్నారు. ఈ దిగజారుడులో స్త్రీలు కూడా ఉండడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌. తోటి బాలికపై కనికరం లేకున్నా ఫర్వాలేదు. కానీ రాబోయే తరానికి ఎన్ని రేపులు జేసినా ఏమీ కాదు అనే భరోసా ఇస్తున్నామనే విషయంలో వీళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటారా?

ఈ నాలుగు వ్యవస్థలు నాశనం అవుతున్నాయంటే పాల కులు అదే కోరుకుంటున్నారని అర్థం. ఆ నాశనమైన వ్యవస్థలోనే వారి ప్రయోజనాలున్నాయనేది గుర్తించాలి. నిరుద్యోగాన్ని నిర్మూలించకుండా, లీకులు లేకుండా ఎగ్జామ్స్‍ నిర్వహించలేని ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా సమాచార హక్కు కోసం ప్రాణాలర్పిస్తున్న కార్యకర్తలను, సోషల్‌ మీడియా వారియర్స్‍ని బొద్దింకలు, పరాన్నబుక్కులు అని ఎవ్వరు నిందించినా నిక్క చ్చిగా నిలదీయడం ఆపొద్దు.

కాలమ్‌ : సంచకారి

డా.సంగిశెట్టి శ్రీనివాస్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News