Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Tainted leaders: అవినీతి నేతలు జవాబు ఇవ్వాల్సిందే

Tainted leaders: అవినీతి నేతలు జవాబు ఇవ్వాల్సిందే

దేశంలో ఇప్పుడు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నది కేవలం రాజకీయనేతలు మాత్రమే. వారే అవినీతిలో కూరుకుపోతున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రాజమందిరాలు నిర్మించుకోవడం, కోట్లు కూడబెట్టడం, అక్రమాలకు పాల్పడడం చూస్తున్నాం. ఇలా అక్రమ సంపాదనలో మునిగి తేలుతూ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఓట్లను కొల్లగొడుతూ అధికార దర్పం వెళ్లదీస్తున్నారు. ఒకరని చెప్పడానికి లేదు. అన్నీ ఒకే తాను ముక్కలు అక్రమాలపై నిలదీస్తే.. ఎదరుదాడి చేయడం అలవాటు చేసుకున్నారు. మోడీ అక్రమాల గురించి ఆధారాలు ఉంటే నిలదీయాల్సిందే. బిజెపి నేతల అక్రమాలు ఉన్నా నిలదీయాల్సిందే. సోషల్ మీడియా ప్రస్తుతం చురుకుగా ఉంది. చీమ చిటుక్కుమన్నా.. కోడై కూస్తోంది. ఈ క్రమంలో ఎవరి అక్రమాలను వేలెత్తి చూపినా.. వాటి నుంచి బయటపడేందుకు విచారణలను ఎదుర్కోవాలి. కడిగిన ముత్యంలా బయట పడాలి. అంతేగానీ ఇడి, సిబిఐ, ఐటిలను తిడుతూ.. అధికార పార్టీ బిజెపిపై దండెత్తి తమ అక్రమాలను కప్పి పుచ్చుకోవడం కుదరదు. మొన్నటికి మొన్న కర్నాటకలో ఓ బిజెపి ఎమ్మెల్యే తనయుడు లక్షలు లంచంగా తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయాడు. మీడియా ఏకి పారేసింది. బిజెపిని తూర్పారా బట్టింది. అలాగే ఎపి సిఎంగా ఉన్న జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని చేసిన అక్రమాలకు జైలులో ఉండివచ్చాడు. ఆ కేసులేమీ తొలగిపోలేదు. ఎప్పటికైనా విచారణ ఎదుర్కోవాల్సిందే. లాలూ ప్రసాద్ యాదవ్, తృణమూల్ మంత్రులు, ఆప్ నేతలు అంతా కూడా అక్రమ సంపాదలో దొరికిన వారే. లిక్కర్ స్కామ్ ఇంకా నేరం రుజువు కాలేదు. అయితే ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను గతంలో ఓ మారు విచారించారు. మరోమారు విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. అయినంత మాత్రాన ఇడినో, సిబిఐనో విమర్శించడం తగదు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె హుందాతనాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ప్రకటించిన నేపథ్యంలో.. దానిని వదులుకోమని ఎవరూ చెప్పడం లేదు. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచ బోదని ఢిల్లీలో ఉన్న అధికారకాంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం. చేస్తాము అని కవిత చెప్పడంలో అర్థం లేదు. తనపై వచ్చిన కేసులను తెలంగాణతో ముడిపెట్టి.. తెలంగాణ తలవంచబోదని చెప్పడంలో అహంకారం తప్ప అర్థం లేదు. యావత్తు తెలంగాణ కు కవిత ప్రతినీధి ఏమీ కాదు. అందువల్ల తమాయించుకుని.. మాట్లాడాలి. తెలంగాణ తలవంచదు కనకనే పోరాటం చేసింది. అందుకే కేసులు ఎదుర్కోవడం వేరు.. అధికార బిజెపిని నిలదీయడం వేరు. ఈ రెండు విషయాలు వేర్వేరని కవిత గుర్తించాలి. అవినీతి కేసులో విచారణ వేరు.. రాజకీయ పోరాటం వేరు. నిజానికి ఉమెన్స్ డే రోజు కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు *ఈడీ నోటీసులు: రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడు కుంటున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన్పుడే కవిత అరెస్ట్ తప్పదన్న సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటనేదానిపై ఇప్పుడు జనం చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ నాయకులు కేంద్రప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతున్నారు. మోడీకి మూడిందని కొందరు అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారని అంటున్నారు. నిజానికి లిక్కర్ స్కామ్ విచారణకు .. విమర్శలకు పొంతన లేదు. ఈ విషయం మంత్రులు కూడా తెలుసుకోవాలి. కొంతమంది బిఆర్ఎస్ నేతలు మరోలా మాట్లాడుతున్నారు. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని దీమా వ్యక్తం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ మరికొందరు నాయకులు చెబుతున్నారు. నిజానికి కవిత తనకు ఎలాంటి సంబంధం లేదని.. కడిగిన ముత్యంలా వస్తే తప్పులేదు. ఆమెకు జనం బ్రహ్మరథం పడతారు. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలుగు రాష్ట్రాలనే కాదు.. యావత్ దేశాన్నే కదిలిస్తోంది. ఇదే కేసులో ఏపీకి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. దీంతో ఏపీలో కూడా దీనిపై చర్చ సాగుతోంది. వైసీఆర్ సీపీ సైతం ఆచితూచి స్పందిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించనేలేదు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీతో పాటు కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. రేపోమాపో కవిత అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది. ఇదే అంశంపై బిఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగు తోంది. లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు. రావడంతోనే కవితకు.. మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందంటూ సెటైర్లు వేస్తోంది. దీనికి బీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం మెజార్టీ సభ్యులు పార్లమెంటులో బీజేపీకి ఉన్నందున.. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిం చేలా చూడాలని మోడీ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది. మహిళ రిజర్వేషన్లపై పోరాటం చేస్తే తప్పు లేదు. కవితను అంతా అభినంది స్తారు. కానీ లిక్కర్ స్కామ్ లో వస్తున్న అరోపణలపై ఇప్పటి వరకు కవిత ఎక్కడా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తనకు సంబంధం లేదని చెప్పడం లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని గట్టిగా చెప్పలేక పోతున్నారు. నిప్పులేనిదే పొగరాదు. ఈ విషయం కవితకు తెలియంది కాదు. ఇప్పటికే ఈ కేసుల్లో అరెస్ట్ అయిన వారితో, విచారణను ఎదుర్కొంటున్న వారితో వివరాలను రాబట్టిన తరవాతన ఇడి కవితకు నోటీసులు ఇచ్చింది. ఇది గమనించి మాట్లాడాలి. ఎందుకంటే కవితను గతంలోనే ఓమారు ఇది విచారించింది. ఆ విషయం మరిచపోరాదు..

సభావాట్.కళ్యాణ్
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
9014322572

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News