అత్యధిక సంపన్నుల మీద భారీగా పన్ను విధించాలన్న ప్రతిపాదనపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే, ఇటీవల చోటు చేసుకున్న ఒక సర్వే ప్రకారం, ఈ ప్రతిపాదనకు భారత దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఎర్త్ ఫర్ ఆల్, గ్లోబల్ కామన్స్ అలయెన్స్ అనే అంతర్జాతీయ సంస్థల సర్వేలలో ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 68 శాతం మంది, భారతదేశంలో 74 శాతం మంది అత్యధిక సంపన్నులు, అపర కుబేరుల మీద అత్యధిక శాతంలో పన్ను విధించాలని కోరుతున్నారు. ఈ విధంగా వసూలైన మొత్తాన్ని అసమానతలను రూపుమాపడం మీద, వాతావరణ మార్పుల మీద, పేదరికం నిర్మూలన మీద ఖర్చు చేయాలని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం జి-20కి అధ్యక్షురాలిగా ఉన్న బ్రెజిల్ అపర కుబేరుల మీద మరో రెండు శాతం ఎక్కువగా పన్ను విధించాలనే ప్రతిపాదనను జూలైలో జరగబోయే ఆర్థిక మంత్రుల సమావేశంలో ప్రవేశబెట్టబోతోంది.
విచిత్రమేమిటంటే, ఈ ప్రతిపాదనకు ఇతర దేశాల్లో కంటే భారతదేశంలోనే అత్యధిక మద్దతు లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక మౌలికమైన, ప్రాథమికమైన ఆదాయం ఉండాలనే అభిప్రాయాన్ని కూడా 71 శాతం మంది దేశ ప్రజలు గట్టిగా సమర్థిస్తున్నారు. భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలను రూపొందించుకుని ఆచరణలో పెట్టాలని, ఆరోగ్యం మీద, పర్యావరణం మీద మరింతగా పెట్టుబడులు పెట్టాలని కూడా అత్యధిక శాతం ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి సర్వేలు, అధ్యయనాలు ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు అద్దం పడుతుంటాయి. వీటిని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పకుండా పరిగణనలోకి తీసుకుని తమ అధికారిక విధానాలను తదను గుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. వారసత్వ సంపదపై పన్ను, అపర కుబేరులపై పన్ను వంటి అంశాలు గత ఎన్నికల ప్రచారంలో కొద్దిగా చర్చనీయాంశాలయ్యాయి.
ఇటువంటి అంశాలను ప్రస్తావించడంలో ఉద్దేశం ఏమిటంటే, అసమానతలు తగ్గించ డం, సంపదను సరిసమానంగా పంపిణీ చేయడం. బ్రిటిష్ పాలకుల కాలం నాటి కంటే భారతదేశంలో ఇప్పుడు అసమానతలు పెరిగిపోయాయని, సంపద కొందరి చేతుల్లో కేంద్రీకృతం అవుతోందని ఇటీవల వరల్డ్ ఇనీక్వాలిటీ క్లబ్ ఒక సర్వే ద్వారా వెల్లడించింది. అసమానతలను తగ్గించాలన్న పక్షంలో పన్నుల వ్యవస్థ మీద ఆధారపడడం తప్ప మరో మార్గం లేదని కూడా అది స్పష్టం చేసింది. అపర కుబేరుల మీద (వెయ్యి కుటుంబాల కంటే తక్కువ) నాలుగు శాతం పన్ను అధికంగా విధించే పక్షంలో జీడీపీలో ఒక శాతం రెవిన్యూను సృష్టించడం జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ మీద చేసే ఖర్చుకు ఇది సమానం. పన్ను శాతాన్ని పెంచే పక్షంలో మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడతాయనే అపోహ ఒకటుంది. అయితే, ప్రస్తుతం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రతిపాదన కేవలం అత్యధిక సంపన్నులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేయడం జరుగుతోంది.
నిజానికి ప్రస్తుతం అమలులో ఉన్న పన్నుల వ్యవస్థ సంపన్నులకు మాత్రమే ఉపయోగపడుతోంది. పన్నులకు, పన్నులకు సంబంధించిన వ్యయాలకు మధ్యతరగతివారు, పేదలు చెల్లిస్తున్న మొత్తాలు సంపన్నులు ఇందుకు చెల్లించే మొత్తాలకంటే బాగా ఎక్కువ. ఆరోగ్యం, పర్యావరణం, వాతావరణ మార్పుల మీద ప్రజలు దృష్టి పెట్టడం, వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైందని, అందువల్ల వీటి కోసం పన్నుల పెంచడానికి వారికి అభ్యంతరం లేదని సర్వేల్లో వెల్లడైంది. ప్రజలు వీటిని సమర్థిస్తున్నారంటే వారు సంక్షేమానికి, పన్ను సంబంధమైన న్యాయానికి మద్దతునిస్తు న్నారని కూడా అర్థం చేసుకోవాలి. అయితే, రాజకీయ ప్రచారాల్లో పన్ను విధానాలు, ఆరోగ్య సంరక్షణపై వ్యయాలు, పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పులు వంటి ప్రధానాంశాలకు ఆశించిన ప్రాధాన్యం లభించడం లేదు. అయితే, భారతదేశంలో మాత్రం వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. సాధారణంగా తమ మీద ప్రభావం కనబరచే సమస్యలనే ప్రజలు పట్టించుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే.