Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Teacher the role model: సమాజానికి దిక్సూచి, మార్గదర్శి, నిర్మాత ఉపాధ్యాయుడే

Teacher the role model: సమాజానికి దిక్సూచి, మార్గదర్శి, నిర్మాత ఉపాధ్యాయుడే

110 డాక్టరేటులు ఇచ్చారు రాధాకృష్ణకు, 150 గ్రంథాలు రచించారు

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర.. అన్నదానం ఆకలిని తీరిస్తే, అక్షర ఙ్ఞానం అఙ్ఞానమును తొలగిస్తువుంది. చదువుకు క్రమశిక్షణ తోడు అయితే, బంగారంకి తావి అబ్బినట్లుంటుంది. బయట కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యము గల వ్యక్తులు ఎంతో ప్రమాదం. విద్య లక్ష్యం సంపాదనే కాదు విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి. ఈ మాటలు, సూక్థులు వేలాదిగా మంచి మాటలు చెప్పిన మహను భావుడు ఎవరో కాదు. అపరమేధావి, తత్వవేత్త, అధ్యాపకుడు, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎనలేని సేవ చేసిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌. వీరి జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవముగా జరుపుకుంటారు. వీరి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. కొన్ని ముఖ్యఘట్టాలు పరిశీలన చేస్తే వీరి గొప్పదనం తెలుస్తుంది.
1918లో మైసూర్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్లా రు. అక్కడ వారు 1921వరకు పనిచేసి అధికారుల, విద్యార్థుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. వారు కలకత్తా యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్తున్నప్పుడు ఇంటినుండి రైల్వేస్టేషన్‌ వరకు రాధాకృష్ణన్‌ కూర్చున్న గుర్రపు బండిని విద్యార్థులే లాక్కెళ్లి ట్రెయిన్‌ ఎక్కించారు. ఇది చరిత్రలో అపూర్వ సంఘటన. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో వైస్‌-ఛాన్సిలర్‌ అశుతోష్‌ ముఖర్జీ కోరిక మేరకు రాధా కృష్ణన్‌ జార్జి- మెంటల్‌అండ్‌ మోరల్‌ సైన్స్‌ శాఖకు ఆచార్యులుగా వచ్చి చేరారు. ఇక్కడనే వారి బృహత్‌వేదాంత గ్రంధం ‘ఇండియన్‌ఫిలాసఫీ రెండు సంపుటాలుగా 1480 పుటలతో (1923,1927) ముద్రించారు. ఈ గ్రంథం వారికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టింది. భారతీయ సంస్కృతిని, నాగరికతను ప్రపంచ దేశాలలో తమ అపూర్వ ప్రసంగాల ద్వారా చాటిచెప్పిన విద్యాభాస్కరులు డా. రాధాకృష్ణన్‌. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. విశేషంగా విస్తృతంగా చదివిన పండితుడు. ఘనుడైన విద్యావేత్త, ప్రఖ్యాత రచయిత, ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించిన వేదాంతి, విజ్ఞుడైన రాజ్య కార్యదురంధరులు, విజయమును సాధించిన దౌత్యవేత్త, సమర్థుడైన పార్లమెంటేరియన్‌. ఆదిశంకరాచార్యుల వారి తరువాత సంస్కృతంలోనున్న ప్రస్థాన త్రయానికి (భవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు) గొప్ప వ్యాఖ్యానం ఆంగ్లంలో రాసిన గొప్ప జ్ఞానభాస్కరుడు డా. రాధాకృష్ణన్‌. రాధాకృష్ణన్‌ మద్రాసుకి దగ్గరలోని తిరుత్తణి గ్రామంలో 05-09-1888వ తేదీన పుణ్యదంపతులైన శ్రీమతి సీతమ్మ, శ్రీసర్వేపల్లి వీరసామయ్యల రెండవ కుమారుడిగా జన్మించారు.వీరసామయ్య పూర్వీకులు చిత్తూరు జిల్లాలోని సర్వేపల్లి గ్రామంలో నివసించేవారు. కాలగమనంలో వారు తిరుత్తణి పుణ్యక్షేత్రం వచ్చి అక్కడ స్థిరపడ్డారు. రాధాకృష్ణన్‌ ప్రాథమిక విద్య తిరుత్తణిలో అభ్యసించి, సెకండరీ విద్య తిరుపతిలో లూథరన్‌ మిషన్‌ హైస్కూలులో పూర్తి చేశారు. పిమ్మట వారు వెల్లూరులోని వూర్హే కాలేజిలో ఎప్‌.ఎ చదివి, మద్రాసు క్రిష్టియన్‌ కళాశాలలో బి.ఎ(ఆనర్స్‌ ) విద్యనభ్యసించి ఎం.ఎ డిగ్రీ పొందారు. ఈ కాలంలో వారొక సిద్ధాంత వ్యాసం రాసి పరీక్షాధికారులకు సమర్పించగా వారు దానిని ఆమోదించి 1909లో రాధాకృష్ణన్‌కు డిగ్రీ ప్రసాదించారు. రాధాకృష్ణన్‌ మద్రాసు ప్రభుత్వ విద్యాశాఖలో సబ్‌అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌గా 1910లో నెలకు 60 రూపాయల జీతంతో నియమితులయ్యారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఉద్యోగమిచ్చారు. కొన్ని నెలల తరువాత సైదాపేట్‌ ట్రెయినింగ్‌ కళాశాలలో డిప్లమా కొరకు పంపారు. అక్కడ ఆయన ఎల్‌.టి. కొరకు శిక్షణ పొందుతూ విద్యార్థి దశలోనే అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు తర్కశాస్త్రము బోధించారు. శిక్షణ పూర్తి అయిన పిమ్మట మరల ప్రెసిడెన్సీ కళాశాలలో 1911లో అడిషినల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. అక్కడ మూడు సంవత్సరాలు పూర్తిఅయిన తరువాత పదవిలో ఉన్నతి కల్పించి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. 1916లో వారు మూడు నెలలు అనంతపురం కళాశాలలో పనిచేసిన పిమ్మట 1917లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలకు ప్రొఫెసరు హోదాలో బదిలీ అయ్యారు. ఇక్కడ వారు 1918 వరకు మాత్రమే పనిచేసారు. 1918లో మైసూర్‌ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్లారు. అక్కడ వారు 1921వరకు పనిచేసి అధికారుల , విద్యార్థుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో వైస్‌-ఛాన్సిలర్‌ అశుతోష్‌ ముఖర్జీ కోరిక మేరకు రాధాకృష్ణన్‌ జార్జి- మెంటల్‌అండ్‌ మోరల్‌ సైన్స్‌ శాఖకు ఆచార్యులుగా వచ్చి చేరారు. ఇక్కడనే వారి బృహత్‌ వేదాంత గ్రంధం ‘ ఇండియన్‌ ఫిలాసఫీ రెండు సంపుటాలుగా 1480 పుటలతో (1923,1927)ముద్రించారు. ఈ గ్రంథం వారికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టింది. 1931 నుండి 1936 వరకు వారు వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్‌-ఛాన్సలర్‌గా నియమించారు. ఈ కాలంలో వారు విశ్వవిద్యాలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశారు. 1936లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీలో రాధా కృష్ణన్‌ స్టాన్డింగ్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ది ఈస్ట్రన్‌ దెవిజియన్స్‌ అండ్‌ ఎథిక్స్‌ అన్న పేరున ప్రొఫెసర్‌గా పని చేశారు. 1939 లో రాధాకృష్ణన్‌ బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి వైస్‌-ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈ కాలంలో ఒకవైపు లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో స్టాల్డింగ్‌ ప్రొఫెసర్‌గాను, ఇండియాలో కాశీ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సులర్‌గా ఉద్యోగం చేయడం చరిత్రలో అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన. 1946లో వారు భారత రాజ్యాంగ నిర్మాణ సభకు సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1948లో వారు యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌కు చైర్మెన్‌గా నియమితులయ్యారు. 1949లో రాధాకృష్ణన్‌ రష్యాకు భారత రాయబారిగా నియమితులయ్యారు. ఇక్కడ వారు 1952 వరకు పనిచేసి రష్యా దేశ నాయకుడైన స్టాలిన్‌ ప్రశంసలనందుకున్నారు. రాధాకృష్ణన్‌ భారతదేశం తరపున యునెస్కో సమావేశాలకు హాజరైన ప్రతినిధి వర్గానికి 1946-52 సంవత్సరాల మధ్య నాయకుడిగానుంటూ 1952-54 సంవత్సరాల మధ్య యునెస్కో సాధారణ సమావేశాలకు అధ్యక్షత వహించారు. 1952 నుండి 1962 వరకు వారు భారతదేశానికి ఉపాధ్యక్షులుగా రెండుసార్లు పనిచేశారు. ఈ కాలంలో వారు 1953 నుండి 1962 వరకు ఢిల్లీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ పదవి కూడా నిర్వహించారు. 1962లో బ్రిటీష్‌ అకాడమీ గౌరవ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 1962 నుండి 1967 వరకు వారు భారతదేశ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు ఇండోచైనా యుద్ధం, ఇండియా పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం నెహూ, లాల్‌బహదూర్‌ శాస్త్రీల మరణం వంటి సంఘటనలు జరిగాయి. 1962లో రాధాకృష్ణన్‌ భారతదేశ రాష్ట్రపతి అయినప్పుడు ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్‌ కింగ్‌ అనే ఊహ నెరవేరినట్లు విద్యావేత్తలు, వేదాంతులు, తత్వ శాస్త్రవేత్తలు, ప్రజలు అమితానందం పొందారు. 1967లో రాధాకృష్ణన్‌ అధ్యక్ష్య పదవి విరమించిన పిమ్మట మద్రాసు వెళ్లి అక్కడ తమ స్వంత భవనం గిరిజలో నివసిస్తూ 1975 ఏప్రిల్‌ 17వ తేదీన పరమపదించారు. రాధాకృష్ణన్‌కు 1954 లో భారతదేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారం ’భారతరత్న నాటి దేశాధ్యక్షుడైన బాబూ రాజేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా అందుకున్నారు. 1964 డిసెంబరులో క్రైస్తవ ప్రపంచ మత ప్రవక్త పోప్‌పాల్‌ వాటికన్‌ సిటీనుండి బొంబాయి వచ్చి అక్కడ అత్యున్నత క్రైస్తవ అవార్డు -రాధా కృష్ణన్‌కు ప్రసాదింపబడింది. కొన్ని నెలలలో రాధాకృష్ణన్‌ మరణిస్తారనగా 95,000 పౌన్ల టెంపుల్‌టన్‌ అవార్డు ఇవ్వబడింది. దానిని వారు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి ఇచ్చి వేశారు. రాధాకృష్ణన్‌ కోరిక మేరకు వారి జన్మదినోత్సవం నాడు మనమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. రాధాకృష్ణన్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తీసుకున్న గౌరవ డాక్టరేట్‌ నుండి ప్రపంచదేశాల వారు వారికి 110 డాక్టరేటులు పైగా ఇచ్చారు. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వారి గ్రంథాలు చాలా వరకు లండన్‌లోని అవ్లెన్‌ అండ్‌ అన్‌విన్‌ కంపెనీ వారు ముద్రించారు. వారి రచనలలో కొన్ని ’ఇండియన్‌ ఫిలాసఫీ ది హిందూ వ్యూ ఆఫ్‌ లైఫ్‌ ’ది ఐడియల్‌వ్యూఆఫ్‌లైఫ్‌ ’ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ ఇన్‌ రిలీజియన్‌ ఫ్రీడం అండ్‌ కల్చర్‌ ’మహాత్మాగాంధీ ’గ్రేట్‌ ఇండియన్స్‌ ’గౌతం ది బుద్ధ లాంటి చాలా రచనలున్నవి. ప్రపంచ దేశాలలో భారతదేశ సంస్కృతిని నాగరికతను తమ ఉపన్యాసాల ద్వారా వెల్లడించిన ఘనుడు భారతీయ తత్వవేత్త రాధాకృష్ణన్‌ భౌతికంగా ఈనాడు మనముందు లేకపోయినా వారు వెలిగించిన విజ్ఞాన చైతన్య జ్యోతి మన హృదయాలలో నిత్యం వెలుగొందుతూనే ఉంటుంది. నేడు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాగే ప్రతి టీచర్‌ సర్వెపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ వృత్తి గౌరవం, గొప్పదనం కాపాడుతూ వుండాలి. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కి బాటలు వేయాలి. సర్వేపల్లి వారసులుగా వృత్తిలో రాణించుదాం. ఈ వృత్తి పవిత్రతని కాపాడుకుందాం. సమాజానికి ఒక వెలుగు, మార్గదర్శి ఉపాధ్యాయులే.

- Advertisement -

-కామిడి సతీష్‌ రెడ్డి,
9848445134
(నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News