Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Dasabdi Utsavalu: అభివృద్ధి ప‌థం.. దశాబ్ది తెలంగాణ

Dasabdi Utsavalu: అభివృద్ధి ప‌థం.. దశాబ్ది తెలంగాణ

పలు సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంపన్న రాష్ట్రంగా తన ప్రతిష్ఠను ఇనుమడింపచేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం

దగా పడిన తెలంగాణ.., చుక్క నీరు లేని తెలంగాణ.., అభివృద్ధికి ఆమడ దూరం తెలంగాణ.. ఇది పదేళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో వినిపించిన మాటలు. గోదారి.. గోదారి.. ఓ ఓ పారేటి గోదారి.. చుట్టూ నీళ్లు ఉన్న చుక్క‌నీరు లేని ఏడారి మా భూమి.. మా తెలంగాణ భూమి.. అంటూ నాడు వినిపించిన పాట‌లు. ఇదీ ప‌దేళ్ల క్రితమే కాదు. స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌రాయి పాల‌న‌లో రాష్ట్రం న‌లిగిపోయింది. ప‌రాయి పాల‌న నిరాధ‌ర‌ణ‌ ప్ర‌తీ ప‌ల్లెకు ఒక్కో వ్య‌థ‌ను మిగిల్చింది. తెలంగాణ అనే ఒకే ఒక్క ప‌దం నాలుగు కోట్ల ప్ర‌జ‌ల‌ను ఏకం చేసింది. స్వ‌ప‌రిపాల‌న కోసం తండ్లాడి, కొట్లాడి, ఎన్నో త్యాగాల‌తో ఉద్య‌మ‌నేత కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌కంలో తెలంగాణ‌ సాధించుకున్నది. రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు కాబోతుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ నాయకత్వంలో సుభిక్షం సుపరిపాలన కొనసాగుతుంది. సాగునీరే ప్రధాన ఏజెండాగా.. ప్ర‌ప‌ద‌ అంశంగా అడుగులు వేస్తుంది. రాష్ట్రం ఏర్ప‌ట‌య్యితే ఎన్నో స‌మ‌స్య‌ల‌కు నెల‌వుగా మారుతుంద‌నే ప‌రాయి పాల‌కుల, నేత‌ల నోర్లు మూసే విధంగా తొమ్మిదేళ్ల‌లోనే రాష్ట్రం దేశానికి ఆద‌ర్శంగా నిలిచింది. తెలంగాణ అనేక సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను ఆచ‌రిస్తుంటే.. దేశ‌మే అనుస‌రించే స్థాయికి రాష్ట్రం చేర‌డం ప్ర‌తీ తెలంగాణ‌వాదీ గ‌ర్వ‌ప‌డుతున్న స‌మ‌య‌మీది. దాశరథి ఆనాడు అన్నట్లుగా నా తెలంగాణ కోటి రతనాల వీణగా నిరూపితమవుతొంది
తెలంగాణ
కాలేశ్వరం ప్రాజెక్టుతో రైతుల కన్నీళ్లు తుడవడమే కాదు.. తెలంగాణ‌లో సాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా కాళేశ్వ‌రం నిలిచింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్ర‌భుత్వం ఏకంగా గోదావ‌రినే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ ప్రాజెక్టు ద్వారా అనేక జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. మోడువారిన బీడు భూములలో పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్ర‌భుత్వం అహర్నిశలు అహోరాత్రులు కృషిచేసి ప్రాజెక్టును పూర్తి చేయడం గర్వించదగ్గ అంశం. కేవలం ప్రాజెక్టు సాగునీరు అనుకుంటే పొరపాటు అవుతుంది. ఈ ప్రాజెక్టుతో అన్నీ రంగాలు స‌మూలంగా అభివృద్ధి అవుతూ ఆ ప్రాంతం మొత్తం కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. సాగునీరు కావాలని రైతులు గగ్గోలు పెట్టిన సందర్భం కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ల‌ను రైతులు ఎడ‌మ కాలితో నీళ్ల‌ను మ‌ళ్లించుకునే ప‌రిస్తితి ఏర్ప‌డింది. నీళ్ల కోసం రైతులు ఆందోళ‌న చేసిన ప‌రిస్థ‌తి రాష్ట్రంలో ఎక్క‌డా కూడా కనిపించలేదు. వ‌రి కంకులు ప‌ట్టుకొని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే ఏ ఒక్క‌రూ అసెంబ్లీకి రాలేదు. పచ్చని పంట పొలాలతో పల్లెలు కళకళలాడుతున్నాయి. మండుటెండలు నిండుకుండల్లా చెరువులు కుంటలు కాలువలు కొత్త రూపాన్ని ఆవిష్కరించాయి .గతంతో పోలిస్తే సాగు వ్యవసాయ ఉత్పత్తులు పెరగడమే కాకుండా గణనీయమైన స్థాయిలో వరి ఉత్పత్తి పెరిగింది. పరోక్షంగా అనేక రకాలుగా కూలీలకు అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయి

- Advertisement -

రైతుబంధు
కొత్తగా ఏర్ప‌డిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో స‌మ‌స్య‌లుంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ దేశానికి కాదు ఈ రాష్ట్రానికి కూడా రైతే రాజు అంటూ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి అని, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందని, ఈ రాష్ట్రం బాగుంటుందని సీఎం కేసీఆర్ భావించారు. స్వ‌తాహాగా కేసీఆర్ రైతు కాబట్టి రైతు కష్టాలు సాద‌క బాధలు తెలుసు కాబట్టి రైతుల పెట్టుబడికి ఈ పథకం ఎంతో కొంత సహాయ సహకారంగా తోడ్ప‌డుతుంది. రైతులు విత్తనాలు తెచ్చుకోవడం, ఎరువు పురుగు మందులు తెచ్చుకోవడం, కనీస అవసరాల కైనా ఈ సహాయం ఉపయోగపడుతుందని దృడ సంకల్పంతోటి రైతుబంధు పథకం తీసుకురావడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దీనికి అనుబంధంగా రైతు బీమా పథకం తేవడం కేవలం రైతు చనిపోయిన పది రోజులలోపే బీమా వర్తింపజేయాలని చెప్పేసి నిర్దిష్టంగా ప్రణాళికలు రూపొందించడం కెసిఆర్ గారి దూరాదృష్టికి కృతనిచ్చేయానికి నిద‌ర్శ‌నం. కేసీఆర్‌ సంకల్పం.. ఆశయం లక్ష్యంగా రైతు బంధు పథకం, రైతు బీమా పథకం ఉన్నాయని చెప్పడానికి తెలంగాణలోని ప్రతి రైతు సగర్వంగా ప్రకటించాల్సినటువంటి విషయం.
వ్యవసాయ విధానంలో ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కోవిడ్‌ -19 సృష్టించిన సంక్షోభం, లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులను అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మత్స్య సంపద ను రెట్టింపు చేసింది. నాడు తుమ్మలు మొలిసిన చెరువుల పునరుద్ధరణ అంశం ఉద్యమ నినాదమైంది. దీంతో స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి ప్రాధాన్యతగా చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల లెక్క తేల్చారు. మొత్తంగా 46,531 చెరువులున్నట్టు గుర్తించారు. చెరువుల కింద 24.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని నిర్ధారించడంతోపాటు ప్రతి ఏటా 20 శాతం పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. స్వయంగా మిషన్‌ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. వేలాది చెరువులను పునరుద్ధరణ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో 43,791 కోట్ల బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ మిషన్ భగీరథ ను ప్రారంభించింది. రాష్ట్ర ములో 90శాతానికి పైగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఇంటింటికి తాగునీరు అందించారు. మిగతా ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు చివరిదశలో ఉన్నాయి. ప్రస్తుతం 24,225 గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
ఆర్ధిక ప్రగతిని సాధించడం కోసం మౌలిక సదుపాయాల విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌ నగరం ఐటీ రంగానికి వెన్నెముక కాగా, వీటితోపాటు ఫార్మా, టెక్స్‌టైల్‌ సిటీలు పారిశ్రామికాభివృద్ధికి చోదకాలుగా మారాయి. అయితే ఉద్యమ సమయంలో ఉపాధి అవకాశాలపై యువత పెట్టుకున్న అంచనాల అనుగుణంగా ఇప్పటి వరకు 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగా.. మరో 80వేలకు పైగా ఉద్యోగల భర్తీకి ఆర్దిక శాఖ అనుమతులు కూడా ఇచ్చింది.
పాలనను వికేంద్రీకరించడంలో భాగంగా గతంలో ఉన్న 10 జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం 31 జిల్లాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని, 1980లలో అప్పటి ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద పంచాయితీ సమితులను చిన్న మండలాలుగా మార్చిన విభజనతో పోల్చవచ్చు. అప్పటి ఆ నిర్ణయం వల్ల పంచాయితీరాజ్‌ విధానంలో పాలన,రాజకీయ వికేంద్రీకరణ జరుగుతోంది.
..ధనిక రాష్ట్రంగా తెలంగాణ..
తెలంగాణ రాష్ట్రముగా ఏర్పాటులో చివరి రాష్ట్రమే అయినా అనతికాలంలోనే పలు రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. తెలంగాణ లోని పలు పథకలను దేశం అనుసరిస్తున్నది. దశాబ్దాలుగా కరువు, కాటకాలతో ఉమ్మడి రాష్ట్రంలో అల్లాడిపోయిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే ధనిక రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. గడచిన తొమ్మిదేళ్లల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలతో ధనిక రాష్ట్రంగా రికార్డులకు ఎక్కిందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిగణనలోకి తీసుకునే సూచీల్లో (పారామీటర్స్) విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమబెంగా ల్ వంటి రాష్ట్రాలతో భూమిపరంగా చిన్నదైన, కేవలం తొమ్మిదేళ్ల వయస్సున్న రాష్ట్రం పోటీపడుతోందని, ఈ విషయం ఆర్‌బిఐ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. కొందరు సీనియర్ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఇండియా బ్రాండ్ ఈ క్విటీ ఫౌండేషన్ (ఐబిఈఎఫ్) గణాంకాల ఆధారంగా దేశంలో ధనిక రాష్ట్రాల జాబితా, ఆయా రా ష్ట్రాల బలాలు అనే అంశం పై ఆర్‌బిఐ గ్రౌండ్ రిపోర్టును తయారు చేసింది. ఈ నివేదికల ఆధారంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన కేవలం తొమ్మిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని మొదటి 12 ధనిక రాష్ట్రాల జాబితాలో ఏకంగా 8వ స్థానం లో నిలువడం విశేషం. ఇక సంక్షేమ పథకాలలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎస్సి, ఎస్టీ, బీసీలు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం‘ కల్యాణలక్ష్మీ’.. మైనార్టీ కమ్యూనిటీ యువతుల వివాహ సందర్భంగా ఆయా కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు షాదీముబారక్ ఎంతగానో దోహదపడుతున్నాయి.పేదింట్లో పెద్దదిక్కుగా ఎంతో కొంత సహకారంగా ఉండాలని అండగా నిలబడాలని ఈ పథకాన్ని తీసుకువచ్చినది. ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగులు నింపింది. ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా పెద్ద మనసుతోటి ఈ చెక్కులను అందించడమే కాకుండా అక్కడక్కడ కొంతమంది ఔత్సాహిక ప్రజాప్రతినిధులు సొంత నిధులతోటి తాళిబొట్టు మెట్టెలు బట్టలు ఇంటి సామాగ్రి అందించడం విశేషం. తెలంగాణ దళిత బంధు పథకం తెలంగాణతో పాటు దేశ దళిత సమాజంలో అభివృద్ధి వెలుగులు ప్రసరింప చేసేందుకు దోహదపడుతోంది. దళితులను ఆర్థిక వివక్ష నుంచే కాకుండా, సామాజిక వివక్ష నుంచి కూడా దూరం చేసి వారి ఆత్మ గౌరవాన్ని ఎత్తిపట్టేందుకే తెలంగాణ దళిత బంధు పథకం ఒక మైలురాయిగా నిలుస్తుంది. దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరం అవుతారనే విశ్వాసాన్ని బ‌లంగా న‌మ్మిన సీఎం కేసీఆర్ ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు.ద‌ళిత‌బంధు ప‌థ‌కంలో ల‌బ్ధిదారులంతా ఉత్ప‌ద‌క శ‌క్తులుగా ఎదిగారు. స్వరాష్ట్ర మార్క్ చూపించేందుకు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయన్నీ నిర్మించాడంతో పాటు అంబెడ్కర్ పేరు నామకరణం చేసింది. కొత్త సచివాలయం కానీ, అక్క‌డే ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్‌ భారీ విగ్రహం, తాజాగా ఆవిష్కరించనున్న అమరవీరుల స్మారక చిహ్నం తెలంగాణ అస్థిత్వపు ప్రతికాలుగా నిలువనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎవరి అంచనాలకు అందకుండా తాత్కాలిక ప్రయోజనాలను పక్కకు పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్మాణాలు జరగడం అత్యంత అద్భుతం. రంగ రంగ వైభవంగా సంబురంగా ఈ నిర్మాణాల ప్రారంభ వేడుక జరగడం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించాల్సిన అతి గొప్ప విషయం.

యాదాద్రి
ప్రపంచమంతా తనవైపు చూడాలే అన్నట్లుగా రెండో తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని యాదాద్రిగా అపురూప అత్యద్భుత ఖండాలతో నిర్మాణం జరిపారు. యాదాద్రి నిర్మాణం ఆహు అన్నట్లుగా చరిత్రలో నిలిచిపోయేలా సుందర స్వప్నంగా ఆ నిర్మాణాలు ఆ ప్రాకారాలు కళాఖండాలు ఆవిష్కరించారు. తెలంగాణ అంటే కేవలం కొన్ని కాదు అన్నింటికీ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం రికార్డు స్థాయిలో యాదాద్రి కి భక్తులు రావడం ఆ నిర్మాణం ఏ స్థాయిలో ఉందనడానికి నిదర్శనం.

24 గంటల కరెంటు
తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు కరెంటు ఉండదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిండు సభలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రలు, మంత్రులు ఎద్దేవా చేశారు. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి నీటి వరకు 24 గంటల కరెంటు ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది.

అమరుల స్తూపం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి త్యాగానికి ఉద్యమానికి గుర్తింపు హైదరాబాద్ నగర నడిబొడ్డున అమరవీరుల స్తూపం. వారిని స్మరిస్తూ చిహ్నాన్ని నిర్మించారు. అమరుల త్యాగాన్ని ఎప్పటికి రాష్ట్రం గుర్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా అమరవీరుల స్తూపం నిర్మాణం చేయడం వారి కుటుంబాలకు త్యాగాలకు, కుటుంబాలకు దక్కిన గౌరవం.

   ఉప్పు కృష్ణ

తెలంగాణ ఉద్యమకారుడు
చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News