Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్September 17: విమోచనమా? విలీనమా? తెలంగాణ చరిత్రాత్మక పోరాటం!

September 17: విమోచనమా? విలీనమా? తెలంగాణ చరిత్రాత్మక పోరాటం!

The Story Behind September-17: “బండెనక బండి కట్టి… ఏ బండిల వస్తవ్ కొడుకో నైజాము సర్కరోడా!”ఈ పాట ఒట్టి పాట కాదు. ఈ నేల గొంతుకల పగిలిన ఆక్రోశం. దొరల గడీల అహంకారాన్ని, నిజాం నిరంకుశత్వాన్ని నిలువునా ప్రశ్నించిన ఆత్మఘోష. ప్రతి ఏడు సెప్టెంబర్ 17 రాంగనే, మన ముందు కొన్ని పదాలు గంభీరంగా నిలబడతాయి – ‘విమోచనం’, ‘విలీనం’, ‘జాతీయ సమైక్యత’. ఈ పదాల వెనుక ఉన్న నెత్తుటి చరిత్రను, ఈ గడ్డ మీద పారిన కన్నీటి ఏరులను, ఈ నేల కోసం బలైపోయిన వేలాది ప్రాణాల త్యాగాలను మనం ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నాం..? అది కేవలం నిజాం పాలన అంతమా..? లేక అంతకు మించిన అస్తిత్వ పోరాటమా..?

- Advertisement -

1947 ఆగస్టు 15న ఢిల్లీ ఎర్రకోటపై మన జెండా ఎగురుతుంటే, దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగితేలుతుంటే, తెలంగాణ నేల మాత్రం ఇంకా బానిస చీకట్లోనే మగ్గుతోంది. ఒకవైపు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ “నేను స్వతంత్రుడిని” అనే అహంకారం, మరోవైపు అతనికింద పనిచేసే దేశ్‌ముఖ్‌లు, దొరల భూస్వామ్య పీడన. వెట్టిచాకిరితో జనం నడ్డి విరిగింది. ఈ రెండు పీడనలకు తోడు, కాశీం రజ్వీ అనే మతోన్మాద తోడేలు తన రజాకార్ల సైన్యంతో ఊళ్ల మీద పడ్డాడు. దోపిడీలు, మానభంగాలు, హత్యలతో తెలంగాణ పల్లెలు స్మశానాలయ్యాయి.

ఆ చీకటి రోజుల్లో, ఆ నిస్సహాయ స్థితిలో, ఈ గడ్డ బిడ్డలు ఏకమయ్యారు. అది ఒక్కరి పోరాటం కాదు. అది ఒక సమష్టి తిరుగుబాటు. అహింస పనికిరాదని తెలిసినప్పుడు, ఆయుధం పట్టక తప్పలేదు. ఆ పోరాటానికి ఎన్నో రూపాలున్నాయి. స్టేట్ కాంగ్రెస్ తనదైన శైలిలో పోరాడితే, ఆర్యసమాజ్ మరో దారిలో నడిచింది. కానీ, ఈ గడ్డ మీద అసలైన భూమిపుత్రుల పోరాటానికి, వెట్టిచాకిరి విముక్తికి, భూస్వామ్య వ్యవస్థ పునాదులను పెకిలించడానికి నాయకత్వం వహించింది మాత్రం కమ్యూనిస్టు పార్టీ.

సాయుధ సమరం: ఒక చారిత్రక వాస్తవం : చరిత్రకారులు తరచుగా దీనిని కేవలం నిజాం వ్యతిరేక పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ అది సగం మాత్రమే నిజం. అది అంతకు మించిన, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి నుండి విముక్తి కోసం జరిగిన వర్గ పోరాటం. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం వంటి నాయకుల పిలుపుతో, వేలాది మంది యువకులు, రైతులు, కూలీలు ఎర్రజెండా నీడన ఒక్కటయ్యారు. విస్నూరు దొర రాపాక రామచంద్రారెడ్డి అరాచకాలపై చాకలి ఐలమ్మ చూపిన తెగువ, కడివెండిలో దొడ్డి కొమురయ్య బలిదానం ఈ పోరాటానికి స్ఫూర్తినిచ్చాయి. గడీల మీద దాడులు చేసి, దొరల భూములను స్వాధీనం చేసుకుని, భూమిలేని పేదలకు పంచారు. మేము విముక్తి చేసిన దాదాపు 3000 గ్రామాల్లో ‘గ్రామ రాజ్యాలను’ ఏర్పాటు చేసుకుని, భూమిని దున్నేవాడికే హక్కు కల్పించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా, ఏ ప్రభుత్వమూ చేయలేని భూ సంస్కరణలను ఆ రోజుల్లోనే చేసి చూపించారు.

ఈ తిరుగుబాటును అణచివేయడానికి, నిజాం తన రజాకార్ల సైన్యాన్ని ఊళ్ల మీదకు ఉసిగొల్పాడు. బైరాన్‌పల్లి వంటి గ్రామాల్లో జరిగిన మారణహోమం, మానవ చరిత్రకే మాయని మచ్చ. స్త్రీ, పురుష, వృద్ధ, బాల భేదం లేకుండా వందలాది మందిని బారులు నిలబెట్టి కాల్చి చంపారు. అయినా ఈ గడ్డ బిడ్డలు భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ప్రతి నెత్తుటి బొట్టు, పోరాట పటిమను మరింత పెంచింది.

ఆపరేషన్ పోలో: ఆలస్యంగా వచ్చిన సైన్యం : ప్రజల సాయుధ పోరాటం ఉధృతమై, నిజాం పాలన పునాదులు కదిలిపోతున్న తరుణంలో, భారత ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఐక్యరాజ్యసమితిలో నిజాం ఫిర్యాదు, కాశీం రజ్వీ ప్రగల్భాలు, ఢిల్లీ పాలకుల రాజకీయ అవసరాలు… కారణం ఏదైనా, 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ పేరుతో భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. దీనికి ‘పోలీస్ యాక్షన్’ అని సున్నితమైన పేరు పెట్టారు. ఐదేళ్ల పోరాటం, వేలాది మంది బలిదానాల తర్వాత, కేవలం ఐదు రోజుల “పోలీస్ యాక్షన్”తో నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది.

విమోచనమా? విలీనమా? లేక అసంపూర్ణ విప్లవమా :  సెప్టెంబర్ 17ను ‘విమోచన దినం’ అంటారు. నిజాం, రజాకార్ల నుంచి విముక్తి లభించింది కాబట్టి అది నిజమే. ‘విలీన దినం’ అంటారు. భారతదేశంలో భాగమయ్యాం కాబట్టి అదీ నిజమే. కానీ, ఈ పోరాటంలో అసువులు బాసిన వేలాది మంది కమ్యూనిస్టు యోధుల దృక్కోణంలో చూస్తే, అది ఒక ‘విద్రోహం’ కూడా. ఎందుకంటే, నిజాంను గద్దె దించిన అదే భారత సైన్యం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత తన తుపాకులను కమ్యూనిస్టుల వైపు తిప్పింది. భూస్వాములకు, దొరలకు తిరిగి అండగా నిలిచింది. పంచిపెట్టిన భూములను తిరిగి లాక్కుంది. ఎర్రజెండాను పట్టుకున్న వేలాది మంది యోధులను వేటాడి, చంపింది.

నిన్నటిదాకా నిజాం శత్రువు, నేడు నెహ్రూ ప్రభుత్వం శత్రువు. విముక్తి ఎక్కడ లభించింది? పోరాటం భూమి కోసం. ఆ భూమి దక్కలేదు. పోరాటం సమ సమాజం కోసం. అది స్థాపించబడలేదు. నిజాం పోయాడు, కానీ అతని స్థానంలో భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చి కూర్చుంది.

అందుకే, సెప్టెంబర్ 17 ఒక సంపూర్ణ విజయం కాదు. అదొక అసంపూర్ణ విప్లవం. అదొక నెత్తుటి సంతకంతో ముగిసిన పోరాటం. కోరుకున్న విమోచనం అది కాదు. కలలుగన్న తెలంగాణ అది కాదు. ఆ పోరాట స్ఫూర్తి ఇంకా ఈ గడ్డ గుండెల్లో రగులుతూనే ఉంది. ఆ ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. నిజమైన విమోచనం కోసం, దోపిడీ లేని సమ సమాజం కోసం, ఈ నేల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad