Sunday, January 18, 2026
Homeఓపన్ పేజ్Panchayat elections : గ్రామ స్వరాజ్యం ఖూనీ.. ఓటుకు నోటు, పదవికి వేలం!

Panchayat elections : గ్రామ స్వరాజ్యం ఖూనీ.. ఓటుకు నోటు, పదవికి వేలం!

Money power in local elections : ప్రజాస్వామ్యపు ఆత్మ ఎక్కడో బజార్లో వేలానికి పెట్టబడింది. నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామంలో దానికి వెల కట్టారు, 73 లక్షలు! ఇది తాజాగా  మనం చదివిన వార్త.. ఇది కేవలం ఆ ఊరి కథ కాదు, ఇది ఓటు అనే ఆయుధాన్ని, నోటు అనే విషంతో చంపేస్తున్న నేటి తెలంగాణ పల్లె చిత్రం. సర్పంచ్ పదవికి వేలం పాటలు, వార్డు మెంబర్ సీటుకు కేజీ చికెన్, ఫుల్ బాటిళ్లు. 1000 రూపాయలు, ఇది ఎన్నికల తంతు కాదు, ఇది ప్రజాస్వామ్యపు అంత్యక్రియలు. మహాత్ముడు కలగన్న ‘గ్రామ స్వరాజ్యం’, నేడు ‘గ్రామ నరకం’గా మారుతోందా? అధికారాన్ని ప్రజల చేతుల్లోకి, గ్రామస్థాయిలోకి తీసుకురావాలని 73వ రాజ్యాంగ సవరణ ఆశిస్తే, మనం ఆ అధికారాన్ని మద్యం సీసాల్లో, కరెన్సీ కాగితాల్లో ముంచేస్తున్నామా? ఈ డబ్బుల వరదలో కొట్టుకుపోతున్నది కేవలం విలువలు మాత్రమేనా, లేక మన గ్రామ భవిష్యత్తా?

- Advertisement -

అసలు ఈ విపరీత ధోరణికి మూలాలేక్కడ : జీతమే లేని వార్డు మెంబర్ పదవికి లక్షలు ఖర్చుపెడుతున్నారంటే, ఆ డబ్బును తిరిగి సంపాదించుకోవడానికి ఎంతటి విధ్వంసానికి పాల్పడతారో మనం ఊహించలేమా? చదువుకున్న యువత, తమ ఊరి భవిష్యత్తును ఒక క్వార్టర్ సీసాకు, ఓ పదివేల రూపాయల నోటుకు ఎందుకు తాకట్టు పెడుతోంది? మేనిఫెస్టో అంటే ఏమిటో కూడా తెలియని అభ్యర్థులను, మనం మన గ్రామాలకు నాయకులుగా ఎందుకు ఎన్నుకుంటున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకపోతే, మన పల్లెలు బాగుపడవు, మన బతుకులు మారవు.

డబ్బుల జాతర: ఎన్నికల వెనుక నడిచే ‘అసలు’ ఆర్థిక వ్యవస్థ :  ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల  ప్రభుత్వం. కానీ, నేటి పంచాయతీ ఎన్నికల నిర్వచనం మారిపోయింది. “డబ్బున్న వాడి చేత, డబ్బున్న వాడి కొరకు, డబ్బుతో నడిచే ప్రభుత్వం”గా రూపాంతరం చెందింది.
వేలం పాటలు: బంగారిగడ్డలో సర్పంచ్ పదవికి రూ.73 లక్షల వేలం పాట, ఈ వ్యాధికి పరాకాష్ట. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాదు, గ్రామాన్ని, అధికారాన్ని ఒక వస్తువుగా మార్చేయడం. ఇక్కడ అభ్యర్థి యోగ్యత కాదు, అతని ఆర్థిక బలమే అర్హత.

ఓటుకు నోటు: కొన్ని ప్రాంతాల్లో ఓటుకు పదివేల రూపాయల వరకు పంచారంటే, ఈ ఎన్నికల ఆర్థికభారం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్ అభ్యర్థులందరూ కలిసి కొన్ని గ్రామాల్లో 50 లక్షలకు పైగా ఖర్చు చేశారంటే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? అంతకు పదింతలు తిరిగి సంపాదించుకోవాలనే దురాశ నుంచే కదా?

వార్డు మెంబర్ల ‘విలాసాలు’: జీతం లేని వార్డు మెంబర్ పదవికి కూడా లక్ష రూపాయల వరకు ఖర్చు చేయడం, మన రాజకీయ వ్యవస్థ ఎంతగా కుళ్లిపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఈ డబ్బుల జాతరలో, నిజంగా సేవ చేయాలనుకునే సామాన్యుడు, పేదవాడు పోటీ చేసే సాహసమే చేయలేడు. ప్రజాస్వామ్యం, ధనస్వామ్యంగా మారి, అధికారం కొద్దిమంది చేతుల్లోనే బందీ అవుతోంది.

నిధుల మాయాజాలం: సర్పంచ్ ఎందుకంత ఖర్చు పెడుతున్నాడు : ఒక గ్రామ పంచాయతీకి నిధులు ఎలా వస్తాయి? ఈ విషయం తెలిస్తే, ఆ పదవి కోసం ఎందుకింత పోటీయో, ఎందుకింత ఖర్చు పెడుతున్నారో అర్థమవుతుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు: కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు, జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నేరుగా నిధులు వస్తాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS), స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల నిధులు కూడా పంచాయతీల ద్వారానే ఖర్చవుతాయి.

స్థానిక పన్నులు: ఇంటి పన్ను, నీటి పన్ను, మార్కెట్ ఫీజులు వంటివి పంచాయతీ సొంత ఆదాయ వనరులు. ఇసుక క్వారీలు, చెరువుల్లో చేపల వేలం, ఇతర సహజ వనరులపై వచ్చే ఆదాయం కూడా పంచాయతీకే చెందుతుంది. ఈ నిధులన్నింటినీ గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన సర్పంచ్, వాటిని తన ఎన్నికల ఖర్చును రాబట్టుకోవడానికి, తన అనుచరులకు పంచిపెట్టడానికి, అవినీతికి పాల్పడటానికి ఉపయోగిస్తున్నాడు. గ్రామసభ ఆమోదం లేకుండా పనులు చేయడం, నాసిరకం పనులతో బిల్లులు చేసుకోవడం, బినామీ పేర్లతో కాంట్రాక్టులు తీసుకోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. ఇక్కడే, ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడికి లాభాలు గడించే వ్యాపారం మొదలవుతుంది.

రాత, చదువు రాని నాయకులు: యువత వైఫల్యం : ఈ విష చక్రంలో అత్యంత బాధాకరమైన అంశం, చదువుకున్న యువత పాత్ర. తమ ఓటు విలువను తెలుసుకోకుండా, ఒక క్వార్టర్ సీసాకో, కరెన్సీ కాగితానికో అమ్ముడుపోవడం, తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకోవడం లాంటిది. తాజాగా తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ గ్రామానికి ఏం చేస్తారో చెప్పే కనీస ప్రణాళిక (మేనిఫెస్టో) కూడా లేని అభ్యర్థులను గెలిపించడం, మన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. అభ్యర్థి యోగ్యత, నిజాయితీ, సేవా దృక్పథం చూడకుండా, కేవలం కులం, డబ్బు, మద్యం ప్రభావంతో ఓటు వేయడం, ఆ గ్రామానికి ఐదేళ్ల పాటు శాపంగా మారుతుంది. రాత, చదువు రాని సర్పంచ్, వార్డు మెంబర్లు ఉన్న గ్రామంలో, ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయి? నిధులు ఎలా ఖర్చవుతాయి? అధికారులతో ఎవరు మాట్లాడతారు? అంతిమంగా, ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతుంది. దీనికి బాధ్యులు కేవలం ఆ నాయకులే కాదు, వారిని గెలిపించిన ప్రతి ఒక్కరూ.

రాజ్యాంగ ఆశయం ఎక్కడ..?
The real Swaraj will come not by the acquisition of authority by a few but by the acquisition of the capacity by all to resist authority when abused.” – Mahatma Gandhi
73వ రాజ్యాంగ సవరణ వెనుక ఉన్న అసలు ఆశయం, అధికారాన్ని వికేంద్రీకరించి, స్థానిక ప్రజల చేతుల్లో పెట్టడం. ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ చెప్పినట్లు, గ్రామ పంచాయతీలను “ప్రజాస్వామ్యపు నర్సరీలు”గా తీర్చిదిద్దడం. కానీ, మనం చేస్తున్నదేంటి? ఆ నర్సరీలనే ధనస్వామ్యం, కులతత్వం, అవినీతి అనే కలుపు మొక్కలతో నింపేస్తున్నాం.  ఇది కేవలం ఎన్నికల అవినీతి కాదు. ఇది రాజ్యం స్వభావానికి ప్రతిబింబం. అధికారం ఎక్కడ కేంద్రీకృతమైతే, అక్కడ పీడన, దోపిడీ ఉంటాయి. వికేంద్రీకరణ జరిగినప్పుడే, ప్రజలు తమను తాము పాలించుకోగలుగుతారు. రాజ్యం అణచివేతను ప్రతిఘటించగలుగుతారు. కానీ, నేటి పంచాయతీలు ఆ ఆశయానికి విరుద్ధంగా, అవే చిన్న చిన్న పీడన కేంద్రాలుగా, అవినీతి కూపాలుగా మారుతున్నాయి. ఇది వ్యవస్థాగత వైఫల్యం.

పరిష్కారం ఎక్కడ : ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఎన్నికల సంఘం సంస్కరణలతోనో, చట్టాలను కఠినతరం చేయడంతోనో రాదు. మార్పు ప్రజల నుంచే, గ్రామస్థాయి నుంచే మొదలవ్వాలి. ఓటు అనేది మన భవిష్యత్తును నిర్దేశించే ఆయుధమని, దానిని అమ్ముకోవద్దని యువత ప్రచారం చేయాలి. డబ్బు లేకపోయినా, సేవాభావం ఉన్నవారిని గ్రామస్థులు ఏకమై నిలబెట్టాలి, వారి ఎన్నికల ఖర్చును చందాల రూపంలో భరించాలి. గెలిచిన తర్వాత, సర్పంచ్ పనితీరును, నిధుల వినియోగాన్ని గ్రామసభల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి, ప్రశ్నించాలి. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచే అభ్యర్థులను సామాజికంగా బహిష్కరించే ధైర్యం గ్రామస్థులు చేయాలి. ఈ మార్పు సులభం కాదు, కానీ అసాధ్యం అంతకన్నా కాదు. గ్రామ స్వరాజ్యం అనే మహాత్ముడి కల, రాజ్యాంగ నిర్మాతల ఆశయం నెరవేరాలంటే, ముందుగా గ్రామస్థులు మేల్కొనాలి. లేకపోతే, మన పల్లెలు బాగుపడవు, మన తలరాతలు మారవు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఈ ప్రజాస్వామ్యపు ఖూనీని, మనం మౌన ప్రేక్షకుల్లా చూస్తూనే ఉండాల్సి వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News