Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Telangana parties: మూడు పార్టీల్లోనూ బుజ్జగింపుల పర్వం

Telangana parties: మూడు పార్టీల్లోనూ బుజ్జగింపుల పర్వం

అసంతృప్తుల కోసం రంగంలోకి ట్రబుల్ షూటర్స్

తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకుంది. మూడోసారి అధికారంలోకి రావడానికి భారత్‌ రాష్ట్ర సమితి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే 115 సెగ్మెంట్లకు అభ్యర్థుల ప్రకటించించారు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. టికెట్లు దొరికిన వాళ్లు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించారు.
బీఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతలకు చైర్మన్‌ పదవులు
భారత రాష్ట్ర సమితిలో ఇటీవల అసంతృప్తులు జోరందుకున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశించారు. అయితే ప్రకటించిన 115 సీట్లలో సిట్టింగ్‌లకే కేసీఆర్‌ టికెట్లు ఇచ్చారు. దీంతో టికెట్లు ఆశించిన అనేక మంది నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో న్యాయం చేస్తామని అసంతృప్త నేతలకు మాట ఇచ్చారు గులాబీ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారు. తాజాగా అసంతృప్త నేతలకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చారు. ఇలా కార్పొరేషన్‌ పదవులు పొందిన అసంతృప్త నేతల్లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నారు. వీరితో పాటుగా ఇటీవలే పార్టీలో చేరిన మల్కాజ్‌ గిరి కాంగ్రెస్‌ నేత నందికంటి శ్రీధర్‌, మరోనేత ఉప్పల వెంకటేష్‌ ఉన్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా నియమించారు. తాటికొండ రాజయ్యను రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నియమించారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరిన బీసీ నేత నందికంటి శ్రీధర్‌కు ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కేటాయించారు. కాగా మిషన్‌ భగీరథ చైర్మన్‌గా ఉప్పల వెంకటేష్‌ను నియమించారు. ఈ మొత్తం ఎసిసోడ్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు కీలక పాత్ర పోషించినట్లు రాజకీయవర్గాల కథనం.
ప్రతి 15 సెగ్మెంట్లకు ఓ ట్రబుల్‌ షూటర్‌
కర్ణాటక ఎన్నికల్లో విజయంతో తెలంగాణ కాంగ్రెస్‌ లోనూ సమరోత్సాహం పెరిగింది. కర్ణాటక విజయంలో ఐదు గ్యారంటీలు కీలకపాత్ర పోషించాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో తెలంగాణలోనూ విజయ ఢంకా మోగించాలంటే గ్యారంటీలు తప్పవని కాంగ్రెస్‌ పార్టీ డిసైడ్‌ అయింది. ఈ నేపథ్యంలో ఐదు గ్యారంటీలకు మరోటి చేర్చి మొత్తం ఆరు గ్యారంటీలను ఇటీవల కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. కాగా నయా చేరికలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. బీఆర్‌ఎస్‌ నుంచి అసంతృప్తులను చేరదీయడంలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా సక్సెస్‌ అయిందనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌ పార్టీకి కూడా అసంతృప్తుల బెడద తప్పడం లేదు. దీంతో కీలక సమయంలో సీనియర్‌ నేతలు చేజారిపోకుండా కాంగ్రెస్‌ అధిష్టానం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ నేపథ్యంలో ప్రతి పదిహేను నియోజకవర్గాలకు ఓ ట్రబుల్‌ షూటర్‌ను రంగంలోకి దించాలన్నది కాంగ్రెస్‌ ఆలోచనగా కనిపిస్తోంది. పార్టీ సీనియర్‌ నేతలు జైరాం రమేష్‌, దిగ్విజయ్‌ సింగ్‌, సుశీల్‌ కుమార్‌ షిండే, వీరప్ప మొయిలీ, అశోక్‌ చవాన్‌ ట్రబుల్‌ లాంటి వారిని షూటర్లుగా నియమించే ఆలోచనలో కాం గ్రెస్‌ అధిష్టానం ఉన్నట్లు హస్తిన రాజకీయవర్గాల సమాచారం. ఈ పదిహేను నియోజకవర్గాల్లో అసంతృప్తవాదుల సేవలను ఉపయోగించుకుని పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ట్రబుల్‌ షూటర్లు కీలక పాత్ర పోషించాలన్నది అధిష్టానం ఆలోచనలా కనిపిస్తోంది.
టీ – బీజేపీ అసంతృప్త నేతలకు పదవులు
తెలంగాణ బీజేపీలోనూ అసంతృప్తవాదులకు కొదవ లేదు. అయితే ఎన్నికలు తరుముకువస్తున్న నేపథ్యంలో అసంతృప్తలను బుజ్జగించాలని కమలం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ 14 ఎన్నికల కమిటీలను ప్రకటించింది. కొంతకాలంగా అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న నేతలకు ఈ కమిటీల్లో కీలక పదవులు దక్కడం విశేషం. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని నియమించారు. మ్యానిఫెస్టో అండ్‌ పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌ గా వివేక్‌ వెంకటస్వామిని, కన్వీనర్‌గా ఏలేటి మహేశ్‌ రెడ్డిని నియమించారు. పబ్లిక్‌ మీటింగ్స్‌ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నియమించారు. వీరితోపాటు మర్రి శశిధర్‌ రెడ్డి, రఘునందనావు, వెదిరే శ్రీరాములు, ఇంద్రసేనా రెడ్డి, జితేందర్‌ రెడ్డికి కమిటీ పదవులు దక్కాయి. అలాగే సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ కమిటీల ఏర్పాటు, సీనియర్‌ నేతలతో భేటీలు అంతా అసంతృప్తలను బుజ్జగించడంలో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఎన్నికల యుద్దానికి మూడు ప్రధాన పార్టీలు ఆయుధాలతో సన్నద్ధమవుతున్నాయి.

  • ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
    సీనియర్‌ జర్నలిస్ట్‌
    63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News