తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు చూసినా హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. కొత్త పార్టీలు పుడుతుంటాయి, పాతవి విలీనాలు అవుతుంటాయి. ఎన్నో జరుగుతాయి. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం తెలంగాణ రాజకీయం మొత్తం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంపై ఇప్పుడు చాలామంది కన్నేశారు. ఇది కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలా కాకుండా.. తమ పట్టు నిరూపించుకోవడానికి పలువురు నాయకులు చేస్తున్న విశ్వప్రయత్నంలా కనిపిస్తోంది. ప్రధానంగా తమ సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే, ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకుంటేనే దాని ప్రభావం తర్వాత జరిగే జీహెచ్ఎంసీ, ఇతర మునిసిపల్ ఎన్నికల మీద ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కృతురాలైన కేసీఆర్ తనయ కవిత తానే స్వయంగా బరిలోకి దిగుతారా.. లేదా తెలంగాణ జాగృతి బ్యానర్ కింద ఎవరినైనా నిలబెడతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించి బయటకొచ్చి, తాజాగా కొత్తగా పార్టీ పెట్టుకున్న తీన్మార్ మల్లన్న కూడా ఈ స్థానం మీద దృష్టి సారించారు. ఇందులో కవిత, తీన్మార్ మల్లన్న ప్రధానంగా బీసీ మంత్రం పఠిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆయన సోదరుడు వజ్రనాథ్, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ల పేర్లు వినిపించాయి. ఆ పేర్లన్నింటినీ పరిశీలించిన తర్వాత.. చివరకు మాగంటి భార్య సునీత అభ్యర్థిత్వానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొగ్గు చూపించారు. అయితే, ఇన్నాళ్ల పాటు గోపీనాథ్‌కు కుడిభుజంగా వ్యవహరించిన ………………. తాను కూడా టికెట్ ఆశించారు. ఇప్పుడు ఇన్నాళ్లుగా వెనక ఉండి రాజకీయాలు నడిపించిన తనను కాదని, సెంటిమెంటు కోసం సునీతకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తన అనుచరగణాన్ని మొత్తం తెరవెనుక కూడదీస్తున్నారు. వాళ్లంతా కలిసి సహాయ నిరాకరణ మంత్రం జపిస్తే మాత్రం బీఆర్ఎస్ విజయం అంత సులభంగా అయ్యే పని కాదని తెలిసిపోతోంది.
ఉప ఎన్నికలు అంటేనే బీఆర్ఎస్‌కు బాగా కలిసొచ్చే అంశం. ఇంతకుముందు తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వాటిలో తిరిగి భారీగా నెగ్గిన సందర్భాలున్నాయి. అలాగే ఈసారి కూడా తమకే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఊహాగానాల్లో విహరిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం వాళ్లకు అదంత కేక్ వాక్ కాదని తెలిసిపోతోంది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో జనంలోకి వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడటం తన పార్టీ ప్రధాన లక్ష్యమని మల్లన్న స్పష్టం చేశారు. ఇకపై జరిగే ఎన్నికల్లో ఎక్కడైనా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆయన ప్రకటించారు. బీసీలు ఈ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. మల్లన్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. మల్లన్న పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్ స్థానంలో విజయం సాధిస్తారా.. లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే కచ్చితంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి మాత్రం ఉపయోగపడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత కూడా కొత్త పార్టీ స్థాపనపై ఆలోచిస్తున్నట్లు టాక్ ఉంది. అధికారిక ప్రకటన చేయకపోయినా, ప్రస్తుతం తెలంగాణ జాగృతి పేరిట ప్రజల్లో చురుకుగా కదులుతున్నారు. కేసీఆర్ కుటుంబ అభిమానులను, బీఆర్ఎస్ లో అసంతృప్తులను తనవైపు తిప్పుకోవాలని కవిత ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలూ తమ బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మల్లన్న తన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున, కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరి వల్ల ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకరు కాంగ్రెస్ నుంచి, మరొకరు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యి కొత్త దారులు ఎంచుకోవడం, రెండు ప్రధాన పార్టీల ఓటు బ్యాంక్‌ను ఎటు తిప్పుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ 43.94% ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ 35.03%, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 14.11%, ఎంఐఎం అభ్యర్థి ఫరాజుద్దీన్ 4.28% ఓట్లు సాధించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ సెగ్మెంటులో కాంగ్రెస్ పార్టీకి 50,83%, బీజేపీకి 36.65%, బీఆర్ఎస్‌కు 10.43% ఓట్లు పోలయ్యాయి. మారిన పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు ఎటు తిరిగి ఏమవుతుందోనన్న ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ క్రమంలో నియోజకవర్గ నేతలు, పార్టీ నేతలతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదీకాక.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. అందువల్ల జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని తీరాలని రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం ప్రణాళికులు సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో పార్టీలన్నీ బీసీ మంత్రం పఠిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ వేటుకు గురై .. తన ఉనికి చాటుకోవాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత చాలా ముందు నుంచే బీసీ రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌లో ఉండగా ఢిల్లీ మద్యం స్కాంలో జైలుకు వెళ్లి, తిరిగి బెయిలు మీద బయటకు వచ్చిన కొన్నాళ్ల నుంచి ఆమె బీసీ గళం ఎత్తుకున్నారు. సరిగ్గా ఫులె జయంతి సమయంలో ఆమె ఈ ప్రయత్నం చేయగా, ముందుగానే దాన్ని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫులె జయంతిని అధికారికంగా నిర్వహించి, ఆ బీసీ రాజకీయాన్నికొంతవరకు హైజాక్ చేయగలిగింది. ఇంకోవైపు తాజాగా చింతపండు నవీన్ కుమార్… అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా బీసీ మంత్రంతోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయనకు ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ కూడా తన మద్దతు తెలియజేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా డీజీపీ హోదాలో పనిచేసి పదవీవిరమణ చేసిన డాక్టర్ జె. పూర్ణచంద్రరావు ప్రస్తుతం ఏఐబీఎస్పీకి జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఆయన కులగణన లెక్కలు పట్టుకుని బీసీలకు 52% అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సందేనని వాదిస్తున్నారు. ఆయన సైతం ఇప్పుడు తీన్మార్ మల్లన్న పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్నాళ్లుగా బ్లాక్ షర్ట్ ఉద్యమం చేస్తూ, పెరియార్ రామస్వామి నాయకర్ బోధనలను వినిపిస్తున్న పూర్ణచంద్రరావు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఒక గాటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా తిరుగుతున్నారు. తెలంగాణలో తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వడం ద్వారా ఇక్కడ కూడా ఆ వాదాన్ని వినిపించే ప్రయత్నంలో పడ్డారు. మరోవైపు బీజేపీ కూడా జాతీయ స్థాయి నుంచి బీసీలకు అనుకూలంగా మాట్లాడుతోంది. రాష్ట్రంలో కూడా బీసీలను ప్రోత్సహించే విధానాలు అవలంబిస్తోంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ క్రమంగా బీసీల వైపు మొగ్గు చూపుతూ, జనాభాలో దాదాపు 52%గా ఉన్న వారి ఓటు బ్యాంకును సాలిడ్‌గా చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
ఇంకోవైపు.. ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటోంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుండగా, వ్యయాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. పదేళ్లు అధికారంలో కొనసాగిన టీఆర్ఎస్-బీఆర్ఎస్ ఖజానా మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టిందంటూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆరోపిస్తోంది. ఇప్పుడు కొత్తగా మెట్రోరైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ లాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటున్నారు. వీటన్నింటికీ చాలా భారీగా నిధుల అవసరం ఉంటుంది. కానీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమర్పించిన లెక్కల ప్రకారం ఆదాయం కంటే వ్యయాలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం అంతకంతకూ దిగజారిపోతోంది.
కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావడంతో తమకు అంతగా సహకరించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాజాగా జీఎస్టీ సంస్కరణల కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం మరింతగా తగ్గిపోతుంది. ఈ మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలన్నా కూడా కష్టం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాలు చూస్తున్నా, పన్నులు గానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలుగానీ పెంచితే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కత్తిమీద సాములాగే మారనుంది.
– సమయమంత్రి చంద్రశేఖర శర్మ


