Telangana unemployment crisis : తెలంగాణ గడ్డపై ప్రవహించేది గోదావరి, కృష్ణా జలాలే కాదు, కొన్ని తరాలుగా నిరుద్యోగ యువత కన్నీళ్లు కూడా. ప్రభుత్వ కొలువు అనే ఒకే ఒక్క కల, వారి జీవితాల్లో వెలుగులు నింపే ఏకైక ఆశాకిరణం.
ఆ కల వెనుక కేవలం ఒక ఉద్యోగం, నెల జీతం మాత్రమే ఉండవు. తన బిడ్డను ప్రయోజకుడిగా చూడాలని రెక్కలు ముక్కలు చేసుకున్న ఓ తండ్రి శ్రమ ఉంటుంది. అప్పులు చేసి లక్షలు ఫీజులు కట్టిన ఓ తల్లి త్యాగం ఉంటుంది. బంధువుల శుభకార్యాల్లో ‘ఇంకా ఉద్యోగం రాలేదా..?’ అనే సూటిపోటి ప్రశ్నకు తలదించుకున్న అవమానం ఉంటుంది. ఈ ఆశలు, ఆవేదనల పునాదుల మీదే తెలంగాణలో రాజకీయ మార్పు సంభవించింది. ‘మేం ఉన్నాం, మీ కలలను సాకారం చేస్తాం’ అంటూ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ అనే ఒకే ఒక్క హామీ, యువతను కొత్త ప్రభుత్వం వైపు నడిపించిన ప్రధాన చోదకశక్తి. కానీ, అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా, ఆ ‘కొలువుల జాతర’ జాడ కానరాక, హామీల మేఘాలు కమ్ముకున్నాయే తప్ప, నియామకాల చినుకులు రాలడం లేదు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి పరిపాలనా దక్షతకు పెడుతున్న అతిపెద్ద అగ్నిపరీక్ష. యువత సహనానికి పెడుతున్న కఠిన పరీక్ష.
ఓ నిరుద్యోగి ఆత్మఘోష : ” తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ లేఖ రాస్తున్నది ఒక ఓటరుగా కాదు, మీరు ఇచ్చిన ఒక్క హామీని నమ్మి, తన యవ్వనాన్నే పణంగా పెట్టిన ఒక నిరుద్యోగిగా. నా గది ఒక సమాధి. దాని గోడ మీద ఉన్నది క్యాలెండర్ కాదు.. అది నా వయసును, నా ఓపికను రోజురోజుకీ లెక్కగడుతున్న శిలాశాసనం. నా చుట్టూ ఉన్న పుస్తకాల గుట్టలు… అవి నన్ను మరో దారిలో వెళ్లకుండా బంధించిన అక్షరాల సంకెళ్లు.
“A silent scream in a crowded room, Waiting for a promised bloom.”
ఇప్పుడు నాకు అశోక్ నగర్ వీధుల్లో నా అడుగుల చప్పుడు వినబడట్లేదు. నేను నడిచే దారి నా ఆశల శవయాత్రలా ఉంది. కళ్లు మూసుకుంటే చాలు, కోచింగ్ సెంటర్ ఫీజు కోసం నాన్న అమ్మిన తులం బంగారం, కుదువ పెట్టిన తరి పొలం నా కళ్ల ముందు కదలాడి, గుండెను పిండేస్తున్నాయి. రాత్రిపూట ఫోన్‌లో అమ్మ అడిగితే ‘తిన్నాను’ అని చెప్పిన అబద్ధం, నా కడుపులోని ఆకలిని వెక్కిరిస్తోంది. మీరు ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు, మా కళ్ల ముందు కదలాడుతూ ఊరిస్తున్న ఎండమావులు. ‘జాబ్ క్యాలెండర్’ అంటున్నారు, అది మా జీవితాలకు కాదు, మీ రాజకీయాలకు అనుకూలమైన పంచాంగంలా మారింది. దయచేసి, నా సర్టిఫికెట్ నా జ్ఞానానికి గుర్తింపు కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యాధారం అనేలా చేయకండి.”
ఇది ఒకరి ఆవేదన కాదు, లక్షలాది మంది యువతీ యువకుల అరణ్య రోదన. వారి గదుల్లోని గడియారపు ముళ్లు శత్రువుల్లా వెంటాడుతున్నాయి. అవి టిక్ టిక్ మని కాదు, వారి ఆయుష్షును సెకన్లకొద్దీ హరిస్తూ, గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. చరిత్ర పుటల్లోని సామ్రాజ్యాల సరిహద్దులు, పాలిటీ నిబంధనల చిక్కుముడులు, ఎకానమీ వృద్ధిరేట్ల గారడీ… అన్నీ మెదడులో నిక్షిప్తమై ఉన్నాయి. చక్రవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుడిలా సిద్ధంగా ఉన్నా, యుద్ధాన్ని ప్రకటించాల్సిన శంఖారావం వినిపించడం లేదు. ఈ నిశ్శబ్దం వారిని చంపేస్తోంది. అని వాపోతున్నారు.
ప్రక్షాళన – నిర్లక్ష్యం పేరుతో ప్రాణ సంకటం : ప్రక్షాళన పేరుతో జరుగుతున్న జాప్యం, ఇప్పటికే ఫలితాలు పొంది, ర్యాంకులు సాధించిన వారి నియామకాలను సైతం నిలిపివేయడం యువతను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత పాలనలో టీఎస్‌పీఎస్సీపై నమ్మకాన్ని కోల్పోయిన వారికి, వ్యవస్థను బాగుచేస్తామన్న మాట భరోసానిచ్చింది. కానీ, ఆ ప్రక్రియ నిరవధికంగా సాగుతూ, వారి వయోపరిమితిని హరించివేస్తుంటే ఆవేదన చెందక ఏముంటుంది? “ఒక రోగికి శస్త్రచికిత్స చేసే ముందు, గంటల తరబడి ఆపరేషన్ థియేటర్‌ను శుభ్రం చేస్తూ కూర్చుంటే, బయట ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి పరిస్థితి ఏంటి?” అన్న వారి ప్రశ్నలో హేతువు ఉంది, ఆవేదన ఉంది.
“కళ్లల్లో ఆశల దీపాలు ఆరిపోతున్నాయి ..
వయసు వాకిట్లో వసంతాలు వెళిపోతున్నాయి.”
పండగలొస్తున్నాయంటే భయం, శుభకార్యమంటే వణుకు. ‘ఏం చేస్తున్నావ్ బాబూ?’ అనే ఒక్క ప్రశ్న, పదునైన కత్తిలా వారి గుండెల్ని చీల్చేస్తోంది. స్నేహితులు ఒక్కొక్కరుగా జీవితంలో స్థిరపడుతుంటే, తాము ఇంకా అవే పుస్తకాలతో కుస్తీ పడుతున్నామన్న బాధ వారిని మానసికంగా కుంగదీస్తోంది.
ప్రభుత్వ కొలువులే సర్వస్వం కాదని, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వ దార్శనికతను వారు ప్రశ్నిస్తున్నారు. “మా చేతికి పట్టానిచ్చారు సరే, దానికి తగ్గ ఉద్యోగాన్నిచ్చే పరిశ్రమలను కూడా ఈ గడ్డపైకి తీసుకురండి. మేము కేవలం ఓటర్లం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్ నిర్మాతలమని గుర్తించండి” అన్న వారి వాదనలో ఆవేదనతో పాటు బాధ్యత కూడా కనిపిస్తోంది.
పాలకులకు యువత ఒక్కటే విన్నవించుకుంటోంది. “ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాం. మాకు కావాల్సింది సానుభూతి కాదు, ఒక స్పష్టమైన కార్యాచరణ. ఒక నిర్దిష్టమైన ‘జాబ్ క్యాలెండర్’ను మా ముందుంచండి. ఈ అనిశ్చితికి తెరదించండి. గుర్తుంచుకోండి, ఈ నిశ్శబ్దం… తుఫానుకు ముందు ప్రశాంతత.” మరో ఉద్యమం పుట్టకముందే, వారి చేతికి నియామక పత్రం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.యువత కన్నీరు ఆగ్రహంగా మారకముందే ప్రభుత్వం మేల్కొని, వారి ఆశల సౌధాలకు మాటలతో కాదు, చేతలతో పునాదులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


