‘కమ్మని మనభాషన మధురమ్ములు కలవనిదలంచి రసరమ్యముగన్ అమ్మల జోజో పాటల కమ్మదనమె తెలుగటంచు కవనం జేసెన్!’ శ్రీ మెరుగు మల్లేశం గారు రహీంఖాన్ పేట, గ్రామ వాస్తవ్యులు ఆత్మకూరు మండలంలో వ్యవసాయం చేస్తూ శ్రీమతి పద్మగారి శుభఫల దాయకంగా ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలతో సంసార సాగరాన్ని ఈదుతున్న కర్షక కవి వర్యులు. వీరు పెద్దగా చదవక పోయిన వీరి కవన పాండిత్యం అమోఘమని చెప్పాలి. పూర్వజన్మ సుకృత ఫలంగా కవిత్వ సృజన చేకూరిందని చెప్పక తప్పదు. శ్రీమతి వెంకటమ్మ లచ్చయ్య నోము ఫలముగా కలిగిన వరప్రసాదుడు మల్లేశం ధన్యుడు. గీతకార్మికుడు కౌండిన్య గోత్రుడు మెరుగు మల్లే శం గౌడు వ్యవసాయ క్షేత్రంలో ఫలాలనందిస్తూ సాహితీ క్షేత్రంలో కూడా తాను ఫలాలను పండించగలననే నిండైన ఆత్మవిశ్వాసంతో ఈ శతకం రాశాడనిపిస్తుంది. బమ్మెర పోతన మాదిరిగా ‘కలహలములందు ఘనుడురా పోతన్న’ అన్నట్లు మల్లేశం గారు పోతన వరవడిని పునికిపుచ్చుకుని పద్యాన్ని రసవంతంగా భావయుక్తిగా అందించాలనే తపన మాటల్లో ముఖాభినయంలో తొణికిసలాడుతు ఉంటుంది. యాదాద్రి జిరసంలో సభ్యుడిగా పరిచయమై పలు సందర్భాలలో సాహిత్యం గూర్చి చర్చోపచర్చలు చేయడం చరవాణిలో అనుమానాలను నివృత్తి చేసుకోవడంలో స్నేహం బలపడింది. పాఠశాల విద్యనభ్యసించి పద్య ఛందస్సులో పట్టు సాధించడం గొప్ప లక్షణం. అదే వరవడి కొనసాగించి ‘తేనియలొలుకు మనభాష తెలుగు భాష’ అనుపాద మకుటంతో తేటగీతిలో శతకం రాయడం ముదావహం. మోత్కూరు భువనగిరి ప్రాంతాల్లో జరిగే సాహిత్య సమావేశాలకు హాజరు కావడంవల్ల వీరికి రచనా పటిమ బలపడిందని చెప్పవచ్చు. సహజంగా ప్రతిభ ఉన్నా అభ్యాసం లేకుండా ఉత్పత్తి జరుగదు. ‘రాపిడి లేనిది రత్నం ప్రకాశించదు కదా’ ఈయనకు ఉన్న సహజ పాండిత్యంనకు ప్రాంత వాసులందరి సహాయ సహకారముందనే భావించాలి. వీరికి తెలుగు భాష సంస్కృతి పట్ల మక్కువ ఎక్కువ. తీరని దాహమే వీరిని పుస్తకాలను చదివించి సృజనశక్తికి మెరుగులు దిద్దగా మెరుపుగా పొంగిన పదప్రవాహమే రమణీయ భావమై తేటగీతులై నవరస నాట్యం చేశాయి. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ మాతృ భాషాతల్లినీ’ అన్నట్లు తెలుగు భాషను మకుటంగా ధరించి తెలుగు మకరందాలను తెలుగు వారందరికి ద్రాక్షా పాకంలో అందించారు. వీరి దీక్ష అకుంఠితమైంది మూడేళ్ళుగా వీరి అనుభవాన్ని రంగరించి తెలుగు లెస్ కాదు ‘తెలుగు లెస్స’ అని శతకం ద్వారా నిరూపించారు ప్రతి పద్యంలో మెరుపులు విరుపులు విన్యాసాలు దర్శనమిస్తాయని చెప్పవచ్చు. ‘అమ్మపాలలో… కమ్మదనము’ 4 పెరిగె పరభాషపై మోజు-5 అవధాన విద్య-7 వాసి పోని పుష్పకర మా వాణి తెలుగు-10 ‘గానామృమంటు ఘంటసాల…’ ‘అష్టదిగ్గజాల ‘శ్రీ శ్రీ పోరుబాట తెలుగు 16 ఆత్మీయభాషంటూ 31, 34 జాన నవ్వుల శ్రీవారు- 47 వింతపదసంపద తెలుగు సొంతమయ్యె-51 తలకుపాగజుట్టియట్లు తలలనెత్తి-54 పాడిపంటల తీయని పాయసాలు-63 తెలుగు భాషను మరిచిరి తెలుగు వారు-82 భాషపరిపుష్టి బాధ్యత వలయు మనకు-84 మాతృభాషలేకున్న మనుగడ అసాధ్యం అనే భావనలో ఈ పద్య కుసుమం ‘తల్లివేరుయు లేకున్న తరులు లేవు తల్లి భాషయు లేనట్టి పల్లెలేదు అన్నిటికి మూల సూత్రంబు అమ్మభాష-89 ప్రతి జీవికి శ్వాస అవసరం భాషకు ధ్వని మూలం అన్నట్లుగా తెలుగు వారి భావవ్యక్తీకరణ తెలుగులోనే జరుతుంది కాబట్టే అమెరికాలోనైన తెలుగు వారే తేజోవంతంగా ఉన్నత పదవులలో అధికారాన్ని అవలీ లగా చలాయిస్తున్నారు దానికి మూలం వారు మాతృ భాషలో సంపాదించిన పరిజ్ఞానమే అనే భావన ముమ్మాటికీ సత్యం. ‘శ్వాసలేకున్న ప్రతిజీవి చచ్చిపోవు భాషలేకున్న భావాలు పలుక లేవు దేశ భాషలందున మన తెలుగు లెస్స’ 19 ‘ఏ భాష చెణుకైన మన తెలుగులో ఒదిగిపోతుందన్న’ సినారె మాటలకు పద్యం కాలానుగుణంగా కమ్మనైన భావయుక్తిగ సుందరంగా ఉంటుంది మన తెలుగు. ‘కడలి కెరటాల వలెనేడు కమ్మనైన నిత్య నూతనమౌ భాష సత్యశీల గద్యపద్యాల సుందరం కాంతి తెలుగు’ 102 నన్నయార్యుని నుండి సినారె వరకు 104 విశ్వనాథుని సాహిత్య విత్తమయ్యె 106 ఇలా తెలుగు భాషగురించి పెక్కు పార్శ్వాల ఆనందానుభూతుల భావ వ్యక్తీకరణ మనకు దర్శనమిస్తాయి. కవి మూడుపాదాలలో తాను చెప్పదలచుకున్న భావాలను చెబుతూ నాలుగో పాదంతో ‘తేనియలొలుకు మనభాష తెలుగు’ సమన్వయం చేశారు. కవి సృజన శిల్పిగా తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. వీరి ప్రతి పద్యం రమణీయ భావసౌందర్యంగా అర్థవంతంగా అలరారుతున్నాయి. అక్కడక్కడా జాతీయాలు సామెతలు నుడికారాలు ద్వంద్వోక్తిగా సర్వాంగ సుందరంగా తేటగీతిలో తన రచనా వైదుష్యాన్ని చూపిండని చెప్పవచ్చు. ‘తెలుగు భాష లోకమునకు వెల్గు చూపు తేటతెనుగు మాట మనకు తెలివినిచ్చు తేటతెనుగు ఎదలకెంతో తీయదనము’ అంటూ తెలుగు తీయందనాన్ని ఆస్వాదించమంటూ తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ నుంచి నేటి కాలపు నవ కవుల వరకు తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్దిగా తెలుగు భాషను ప్రేమించాలంటూ బ్రతికించాలంటూ రాసిన ప్రబోధ శతకం సాహిత్య లోకం తప్పక ఆదరిస్తుందని తెలుగు వారందరూ చదువుతారనీ నమ్ముతూ శ్రీ మెరుగు మల్లేశం కవిని హృదయపూర్వకంగా అభినందిస్తూ నిరంతర సాహితీ కృషీవలుడై మరిన్ని రచనలు చేయాలనీ ఆకాంక్షించిస్తూ శుభాభినందనలు తెలుపుతూ.
– డా॥ పాండాల మహేశ్వర్
తెలుగు భాషా ఉపాధ్యాయులు,
భూదాన్ పోచంపల్లి.