Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Telugu literarute: పుస్తక ప్రపంచంలో కొత్త పరిణామాలు

Telugu literarute: పుస్తక ప్రపంచంలో కొత్త పరిణామాలు

ఏప్రిల్‌ 23న ప్రపంచవ్యాప్తంగాఅనేక దేశాలలో పుస్తక దినోత్సవంజరుపుకుంటారు. భారత్‌తో సహా అనేక ఐరోపా, ఆసియా దేశాల్లో దీన్నివారోత్సవాలుగాకూడా జరుపుకోవడం జరుగుతుంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్‌ దేశాల్లో అయితే, పుస్తకాలమీద పోటాపోటీగా తగ్గింపులు ప్రకటించి విక్రయించడం జరుగుతుంటుంది. నిజానికి పుస్తక దినోత్సవాన్ని, పుస్తక వారోత్సవాలను అనేక దేశాల్లో ఒక పండుగగా జరుపుకుంటుంటారు. ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు, ముఖ్యంగా 16 ఏళ్ల లోపుబాల బాలికలకు చరిత్రకు, వినోదానికి, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను పంచి పెడుతుంటారు. ఇక వివిధ దేశాలలో సెమినార్లు, గోష్ఠులు, చర్చలు జరపడం కూడా పరిపాటి. ప్రపంచం మొత్తం మీద దాదాపు 96 దేశాలలో పుస్తకాల ఎగ్జిబిషన్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది.రైల్వే స్టేషన్లలోనూ, బస్టాండులలోనూ, విమానాశ్రయాలలోనూ, మాల్స్‌లోనూ ఎక్కడ పడితే అక్కడ ఈ పుస్తక ప్రదర్శనలే దర్శనమిస్తాయి. విచిత్రమేమిటంటే, అక్షరాస్యత అత్యధికంగా ఉన్న న్యూజీలాండ్‌, స్వీడన్‌, నార్వేదేశాలలో లిక్కర్‌ దుకాణాలను, బార్‌లను ఈ పుస్తక దినోత్సవం సందర్భంగా మూసేయడం కూడా జరుగుతుంది. తల్లితండ్రులు తమ పిల్లా పాపలతో ఈ పుస్తక ప్రదర్శనలశాలల్లో ఎక్కువగా దర్శనమిస్తుంటారు.
ఇంతకూ ఏప్రిల్‌ 23నే పుస్తక దినోత్సవం జరుపుకోవడం ఎందుకో తెలుసా? ప్రతి పుస్తకం ఎంతో మంది కలలకు ఆధారమని, ఇది సామాన్యుడి ఆయుధమని చాలా దేశాల్లో భావిస్తారు. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో అన్నాడు గురజాడ అప్పారావు. ఒక మంచి పుస్తకం వెయ్యి మంది మిత్రులతో సమానమని మరో సాహితీవేత్త అన్నారు. అందమైన అక్షరాలతో చక్కని వినోదం, విజ్ఞానం అందించి పాఠకుల్ని తనలో లీనం చేసుకోవడంతో పాటు అందలాలు ఎక్కించేది పుస్తకమని ప్రసిద్ధ రచయితలంతా అంటుంటారు. ఒంటరి తనంలో తోడుగా ఉండేది ఒక మంచి పుస్తకమేననికూడా కొందరు ప్రపంచ ప్రసిద్ధ రచయితలు తమ గ్రంథాల్లో రాసుకున్నారు. అంతేకాదు, ఉదయాన్నే చాయ్‌ తాగినప్పుడు మొదటి చప్పరింపు ఎంత హాయినిస్తుందో మంచి పుస్తకం అంత హాయినిస్తుందని ఒక భావుకవి వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఆ విధంగా అన్నిటినీ మరపించి విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఉల్లాసాన్ని అందించేది విజ్ఞాన భాండాగార పుస్తకం.
మారుతున్న అభిరుచులు
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి, ఎంతో మంది తమ జీవిత అనుభవాలను తెలియజేయడానికి అక్షరాలనే ఆశ్రయించారు. వారి కష్టనష్టాలను కూడా అక్షర రూపంలోనే పాఠకులకు అందించారు. నిజానికి, పుస్తకమనేది ఒక విధమైన ధైర్యాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. సన్యాసులు, సాధువులు సైతం జీవితాన్నంతా త్యాగం చేసినా పుస్తకాన్ని మాత్రం ఒక పట్టాన వదిలిపెట్టరు. “నాకు నా భార్యా బిడ్డలకన్నా పుస్తకమే ఎక్కువ. నా ప్రాణమంతా నా పుస్తకంలోనే ఉంది” అని సాక్షాత్తూ బి.ఆర్‌. అంబేద్కర్‌ వంటి మహోన్నత మానవతావాది వ్యాఖ్యానించారు. ఆయన కాలంలో పుస్తకాలకు అంత విలువనిచ్చేవారు. పాఠ్య పుస్తకాలు కాకుండా జీవితంలో మరే పుస్తకమూ చదవనివాడిని తక్కువ చూపు చూసేవారు. ఇప్పుడు కూడా పుస్తకాలు ఎక్కువగా చదవకపోవచ్చు కానీ, విజ్ఞాన కాంక్ష మాత్రం రాను రానూ పెరిగిపోతూనే ఉంది. టీవీలు, సోషల్‌ మీడియాలు, కంప్యూటర్లు, సెల్‌ ఫోన్లు వగైరాలలో వార్తలు, విశేషాలు చదవని వారుండరు. విజ్ఞానం పెంచుకోని వారుండరు. పుస్తకాల స్థానాన్ని ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఆక్రమించాయి.
ఇంతకూ ఏప్రిల్‌ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవం జరుపుకోవడంపై విభిన్న కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి.ఐరోపా దేశాల్లో 17వ శతాబ్దంలో ఈ రోజును సెయింట్‌ జార్జ్‌ డే గా పరిగణించేవారు. స్వయంగా గ్రంథకర్త అయిన ఆయన నిత్య పఠనాభిలాషి. రోజులో 18 గంటలు ఆయన చదువుతూనో, రాస్తూనో గడిపేవారని ప్రతీతి. కాగా, స్పెయిన్‌లో ఇదే రోజున ఎవరు ఏ పుస్తకం కొన్నా, దానితో పాటు ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇచ్చేవారు. ఇక, సెవాంతెస్‌, షేక్స్‌పియర్‌, ఇన్నా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత అంతర్జాతీయ స్థాయి రచయితలు 1616లో ఇదే రోజున మరణించారు. అంతేకాదు, జోసెఫ్‌ ప్లా, వ్లాదిమర్‌, మారిస్‌ ద్రువాం తదితర రచయితలు చాలామంది ఇదే రోజున జన్మించడమో, మరణించడమో జరిగింది. ఈ రోజున పుస్తక దినోత్సవం జరుపుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతారు. వాస్తవానికి, చాలా కాలం వరకు వివిధ దేశాలలో వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలను నిర్వహించేవారు. అయితే, ఏప్రిల్‌ 23న పుస్తక దినోత్సవం నిర్వహించాలని 1955లో యునెస్కో ప్రకటించింది.అంతేకాకుండా ఇదే రోజున ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినోత్సవంగా కూడా జరపాలని, రచయితలు, ప్రచురణ కర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున తప్పనిసరిగా సత్కరించాలని అది సూచించింది. పైగా, ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో ప్రకటిస్తూ వస్తోంది.
పెరుగుతున్న పఠనాసక్తి
విచిత్రమేమిటంటే, పుస్తకాల స్థానాన్ని ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, వీడియోలు, ఆడియోలు ఆక్రమిస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చదువరులు సంఖ్య నిలకడగా పెరుగుతున్నట్టు యునెస్కో తన 2021 వార్షిక నివేదికలో వెల్లడించింది.ఒక అంతర్జాతీయ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రచురణ అవుతున్న పుస్తకాల సంఖ్య ఆయేటికాయేడు 2.75 శాతం పెరుగుతున్నట్టు తెలిసింది.దాదాపు 102 దేశాల్లో 96 లక్షల పుస్తకాలు ఏటా అచ్చవుతున్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది.అంతేకాక, పుస్తకాలను చదివేవారి సంఖ్య కూడా 1990ల నుంచి కొద్దిగా నైనా పెరగడమే తప్ప తగ్గడం లేదని కూడా తెలియవచ్చింది.ఇతరత్రా ఎంతగా విజ్ఞానం పెరుగుతున్నప్పటికీ, పుస్తకాలను చదివేవారిలో పెద్దగా మార్పులేదని, చదివే వారి సంఖ్య పెరుగుదలలో కొద్దిగా వేగం తగ్గిన మాట మాత్రం నిజమని ఆ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. వంద మందిలో సగటును పుస్తకాలు చదివేవారి సంఖ్య 12 వరకూ ఉంటోందని, ఇది భవిష్యత్తులో 27కు పెరిగే అవకాశం లేకపోలేదని కూడా సర్వే తేల్చి చెప్పింది.
పుస్తక పఠనంలో ఉన్న ఆనందం, ప్రశాంతత, ఉల్లాసం ఫోన్లు, కంప్యూటర్లలో విజ్ఞానాన్ని పండించుకోవడంలో లేదని పాఠకుల్లో 56 శాతం మంది అభిప్రాయపడగా, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లలో మాదిరిగా ప్రతిసారీ సమాచారం కోసం లేదా విజ్ఞానం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, పుస్తకాల ద్వారా భద్రపరచుకోవడానికి కూడా అవకాశం కలుగుతోందని, అవకాశం ఉన్నప్పుడు చదువుకోవడానికి వీలు అవుతోందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లలో చదువుకోవడం కంటే, పుస్తకాలలో చదువుకోవడం మానసిక ఉల్లాసాన్ని ఇస్తోందని కూడా 73 శాతం మంది పాఠకులు అభిప్రాయపడ్డారు. ఒక్క భాషలో ప్రచురణ అయిన పుస్తకం అనేక భాషల్లోకి తర్జుమా కావడం, టూరిజం పెరగడం వల్ల, ప్రపంచీకరణ జరగడం వల్ల వివిధ దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోవడం, ఇతర దేశాల పుస్తకాలను చదవడానికి విస్తృతంగా అవకాశాలు ఏర్పడడం వల్ల పుస్తకాలను చదవడంలో ఉన్న తృప్తి మరింత అనుభవంలోకి వస్తోందనికూడా అంతర్జాతీయ పాఠకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పుస్తక ప్రచురణ రంగం కూడా నిలకడగా ముందుకు సాగుతోందని, 1970లు, 1990ల మధ్య ఉన్న కాలం మాదిరిగా పుస్తక ప్రియత్వం ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం లేదని ప్రచురణ సంస్థలు కూడా భావిస్తున్నాయి. మొత్తానికి, ఏటా అనేక దేశాలలో, అనేక నగరాలలో నిర్వహించే పుస్తక ప్రదర్శనలు, పుస్తక దినోత్సవాల వల్ల పుస్తక పఠనం మళ్లీ ఊపందుకుంటోందనిపిస్తోంది.

- Advertisement -

– ఎస్‌. రాజేశ్వర్‌ గౌడ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News