స్థల కాలాదులకు పరిమితం కాని సృజన రూపం కవిత్వం. కాల యవనిక మీద కవిత్వం వెలుగులు విరజిమ్మింది. విభిన్న సాహిత్యయుగ దశల్లో రూపమేదైనా కవిత్వపు బలీయముద్ర స్పష్టంగా మిగిలింది. సంప్రదాయమైనా, ఆధునికమైనా, ప్రాంతీయమైనా కవిత్వం ఆవిష్కృతమైన తీరు అత్యున్నమేనని చెప్పాలి. చలనమే వైరుధ్యమని ఏంగెల్స్ చెప్పారు. చలనశీలమైన దిశ కవిత్వానికి ముఖ్యమని భావించి సాహిత్య ప్రయాణం సాగించిన వారెందరో ఉన్నారు. నిత్యమై నిరంతర క్రియాశీల భూమికను కవిత్వం నిర్వహించిందన్నది వాస్తవం.
క్రీ.శ 7వ శతాబ్ది తరువాతి వారైన దండి, భామహులు కావ్య అలంకార శాస్త్ర ప్రారంభకులు కాగా వామనుని సౌందర్య విచారణతో అలంకార శాస్త్ర వ్యవహారం ప్రసిద్ధి పొందింది. ఇది పాశ్చాత్యుల ఈస్థటిక్స్ కు సమానార్థకం. అలంకారయుక్తమైన కావ్యాలు రాసిన కవులందరూ కవిత్వ మౌలిక లక్షణాలను విడవకుండా ప్రయోగాత్మక పథంలో సాగిన దృష్టాంతాలున్నాయి. స్వరూపాన్ని కోల్పోకుండా పరిణామ శీలమైన ప్రక్రియగా కవిత్వం నిలిచిపోయింది. సామాన్య లక్షణాలతో ప్రారంభమై
అనంతర దశలో విశిష్టరూపాన్ని ఆపాదించుకున్న ప్రక్రియ కవిత్వం. ఇతిహాసం, పురాణం, శతకం, ప్రబంధం, పద కవిత, దేశికవితా ప్రక్రియ చివరకు వచన వాజ్ఞ్మయం వంటి ప్రక్రియలలో కూడా కవుల కవితాత్మ ఆవిష్కృతమైంది. భావ కవిత్వ దశలో కవిత్వపు నవ్యతాగుణాలు కనిపించినా అది ప్రకృతికి, ప్రణయానికి పరిమితమై సామాజిక నిష్టతకు దూరంగా సాగింది.
19, 20వ శతాబ్దిల్లో అనేక పరిణామాలతో కవితా ప్రక్రియలో నవ్యతా గుణాలు, ఆధునిక లక్షణాలు కనిపించి కవిత్వం ప్రజా వాహికగా మారింది. అభ్యుదయ కవిత్వ ఉద్యమం, విప్లవ కవితామార్గం సరికొత్త మార్గాలకు ప్రేరణలుగా మారాయి. కవిత్వం ఆలోచనాశీలతకు అంతర్వాహినిగా మారింది. రచనాశైలి, ప్రయోగాలలో మార్పులు కనిపించాయి. ఆనాడు జాతీయ పునరుజ్జీవనోద్యమ ప్రభావంతో వెలువడిన సంఘ సంస్కరణ, దేశభక్తి కవిత్వం, కాల్పనికోద్యమంతో ఏర్పడిన భావ కవిత్వం స్థానంలో వస్తువులో, భావంలో, రచనలో మూడింటిలో పరిపూర్ణంగా నవ్యతాలక్షణాలు కలిగిన కవిత్వం ప్రారంభమైంది. తదనంతర కాలంలో సమకాలీనోద్యమాల ప్రభావం, కాలానుగుణమైన పరిణామాలు వివిధ వాదాలు, దృక్పథాలతో విభిన్న కవితా ధోరణులు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద భావకవితా ప్రక్రియను అనుసరించి అధివాస్తవిక కవిత్వం, అభ్యుదయ కవిత్వం, అనుభూతి కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం పేరుతో ధోరణులు బలంగా సాగిన నూతన మార్గాలను నిర్మించాయి. స్త్రీవాద, దళితవాద, మైనార్టీవాద కవిత్వాలు బలమైన ప్రభావాన్ని చూపాయి. నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన ఆధునిక కవిత్వం పద్యం, గేయం, వచనం రూపంలో కొనసాగుతున్నది.
వాస్తవికత, ఆధునికలతో కూడిన సామాజిక స్పృహ కలిగిన కవిత్వాన్ని ప్రాధాన్యత పెరిగింది. కవిత్వం బాధ్యత కూడా ఆనాటితో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు అయ్యింది. వర్తమాన సంఘటనల సమాహారంగా కవిత్వం కీలకపాత్రను నిర్వహిస్తున్నది. నడుస్తున్న కాలానికి వమ్ముకాని నమ్మకంగా కవిత్వాన్ని నిర్మించే కృషి సాగుతున్నది. ఉద్యమ ఒడి నుండి కవిత్వం చిగురించి పోరాట పరిమళాలను అద్దింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అనేకానేక పరిణామాలను గమనంలోకి తీసుకుంటూ పదాల పనితనంగా కాకుండా గాయపడిన హృదయాలకు స్వాంతనను అందించే భరోసాగా కవిత్వం మారుతున్నది. కవిత్వమంతా ఇప్పుడు సామాజిక పరిణామాలు, కవిత్వావరణాలు, దుస్థితులు, దుఃఖాలు, ఊసులు, ఉద్యమాలు, సంఘటనలు పరచుకుని సాగుతూ వైవిధ్యాన్ని, విభిన్నతను ప్రదర్శిస్తున్నది. చీకటి గుహను చీల్చుకుని ఎగిరొచ్చిన పావురంలా కల్మషాల్ని, కాలుష్యాల్ని కడిగేసే స్థితి కవిత్వానికి అందింది. మనిషి కోసం కవిత్వం రాయాల్సిన అవసరం తప్పని సరిగా ఏర్పడింది. రాజాశ్రయానికి ఒకనాడు పరిమితమైన కవిత్వం మానవీయమైన సామాజిక కోణంగా పరిణామం చెందింది. ప్రపంచీకరణ ప్రలోభాలను, అవకాశవాదాల్ని ప్రశ్నించే గొంతుకగా కవిత్వం మారింది. నిరసన పిడికిట్లో నినాదమైంది. పోరాటంలో పాటైంది. గెలుపులో బావుటాగా ఎగిరింది. మనుషులు విచ్ఛిన్నమవుతున్నప్పుడు తెగిపోని బంధాల ప్రాధాన్యతను గుర్తు చేసింది. ఇప్పుడున్న జీవితం కన్నా సరకు ప్రేమ గొప్ప అంటూ బహుముఖ కోణాల్లో అమ్మబడుతున్న మనిషి మార్కెట్ మాయా జాలం ఉచ్చులో పడకుండా కవిత్వం ఎదురొడ్డి హెచ్చరించింది. మానవ అనుబంధాలన్నీ మనీ సంబంధాలవకుండా వారించే ప్రయత్నం, సామాజిక సమరసతను సాధించే పని కవిత్వపరంగా సాగుతూనే ఉన్నది. తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కవిత్వం అగ్నికణమై స్వేచ్ఛా సాధనలో భాగస్వామ్య భూమికను పోషించింది. వస్తువులో, భాషలో, భావంలో, అభివ్యక్తిలో, నిర్మాణంలో చోటు చేసుకున్న మార్పులు కవిత్వపరంగా గత దశాబ్దకాలంగా ఎన్నెన్నో ఉన్నాయి. సామాజిక పరిణామాల పట్ల ఎరుకతో , సత్వరం స్పందించే నైజంతో కలం పట్టిన కవుల చైతన్య శీలానికి ప్రతిబింబంగా వర్తమాన కవిత్వం మారింది. కొత్త ఒరవడితో కవిత్వం వస్తోంది. సామాజిక, సాంస్కృతిక, ఉద్యమ, మానవానుబంధాల పార్శ్వంగా మారి కవిత్వం తన యాత్రను సాగిస్తోంది.
- డా. తిరునగరి శ్రీనివాస్
9441464764