Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: కరుణ రసంతో కమనీయ కథలు

Telugu Literature: కరుణ రసంతో కమనీయ కథలు

బలివాడ కాంతారావు కథలు' లకు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది

ఏ విధంగా చూసినా బలివాడ కాంతారావు ఒక విశిష్ట రచయిత. ఏ కథ రాసినా, ఏ నవల రాసినా అది తప్పకుండా హృదయాలను కదల్చి వేస్తుంది. మనసుల్ని పిండేస్తుంది. రాతి గుండెను సైతం కరిగించేస్తుంది. అంతకు మించి బాగా ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా ప్రతి మనసులోనూ మానవత్వాన్ని చిగురింపజేస్తుంది. ఆయన నలభైకి పైగా నవలలు రాశారు. 350కు పైగా కథలు రాశారు. ఇవి కాకుండా అనేక నాటికలు, రేడియో నాటికలు, పర్యాటక సంబంధమైన ట్రావెలోగ్స్‌ రాశారు. అనేకానేక వ్యాసాలు కూడా వెలువరించారు. దాదాపు ప్రతి రచనా సాటి మనిషి పట్ల మనకున్న అభిప్రాయాన్ని, అవగాహనను సమూలంగా మార్చేసి, మరో కొత్త కోణం నుంచి అతన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మడపం అనే గ్రామంలో 1927లో పుట్టిన బలివాడ కాంతారావు చాలా చిన్న వయసు నుంచే రచనా వ్యాసంగం చేపట్టారు. నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, పేదరికం వంటి సమస్యలతో అవస్థలు పడుతున్న తమ గ్రామం పరిస్థితిని, తమ జిల్లా పరిస్థితిని బయటి ప్రపంచానికి ఆయన తన రచనల ద్వారా తెలియజేశారు. అలా తెలియజేయడానికే ఆయన రచనా వ్యాసంగాన్ని ఎంచుకున్నారు.
ఆయన నౌకాదళంలో పనిచేశారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే ఆయన కథలు, నవలలు, నాటికలు, వ్యాసాలను రాయడం ప్రారంభించారు. ఆయన 2000 మే 6న తన తుది శ్వాస వరకూ రాస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా నిరుపేదల స్థితిగతుల మీద తనదైన ధోరణిలో స్పందిస్తూనే ఉన్నారు. మనిషిలోని మంచితనం మీద అపార నమ్మకం కలిగిన బలివాడ కాంతారావు సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. అనేక పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు అందుకున్న బలివాడ తన ‘బలివాడ కాంతారావు కథలు’ అనే కథా సంకలనానికి 1998లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా స్వీకరించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, గోపీచంద్‌ సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, రావి శాస్త్రి స్మారక పురస్కారం, కళాసాగర్‌ విశిష్ట పురస్కారం కూడా ఆయనకు లభించాయి.
ప్రతి రచనలోనూ ఎక్కడో అక్కడ శ్రీకాకుళం మాండలికానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇతివృత్తాన్ని ఎంచుకోవడం దగ్గర నుంచి కథనాన్ని ముందుకు నడిపించే వరకూ ఆయన రచనలో ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత ప్రస్ఫుటమయ్యేవి. దాదాపు ప్రతి రచనా ఇతర భాషల్లోకి అనువాదం అయింది. ఇన్ని కథలు, నవలలు రాయడం ఒక విశేషం కాగా, అవన్నీ ఇతర భాషల్లోకి తర్జుమా కావడం మరో విశేషం. గుజరాతీ, హిందీ, కన్నడ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 1947లో ప్రచురించిన మొట్టమొదటి నవల ‘శారద’ దగ్గర నుంచి 2003 లో ఆయన కాలధర్మం చెందిన తర్వాత ప్రచురించిన ‘అమ్మి-జన్మభూమి’ వరకూ ప్రతి నవలా ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆయన కథలను, నవలలను చదవని వారుండరు. వ్యక్తిగతం కూడా ఆయన ఆదర్శప్రాయుడు. తాను ఆచరించని దాన్ని ఆయన ఏనాడూ ప్రవచించలేదు. ఆయన మాటలు, చేతల్లో ప్రేమ ఉట్టిపడేది. వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన ఎంతగానో క్రమశిక్షణ పాటించేవారు. ఇతరుల మనసులను బాధించే పనేదీ ఆయన చేసేవారు కాదు. అతి సౌమ్యంగా వ్యవహరించేవారు. ఎందరో సాహితీవేత్తలకు, సాహిత్యాభిమానులకు ఆయన మార్గదర్శి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News