Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: ఒకే కథా వస్తువుతో మనుషుల, జంతు పాత్రలతో కథలు

Telugu literature: ఒకే కథా వస్తువుతో మనుషుల, జంతు పాత్రలతో కథలు

చొక్కాపు వెంకటరమణ కొత్తగా కథలు..

ప్రముఖ బాలసాహితీవేత్త, కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ కొత్తగా కథలు రాస్తున్న వారికి ఒకే కథావస్తువుతో అనేక రకాలుగా ఎలా కథలు రాసుకో వచ్చో ఆణిముత్యాల వంటి సూచనలు అందించారు.
1) జంతువుల పాత్రలతో రాసిన కథను మనుషుల పాత్రలకు అన్వయించి అదే కథాంశాన్ని రసవత్తరంగా రాయొచ్చు. అలాగే రివర్స్ లోనూ రాసి ఒప్పించ వచ్చు.
2) ఒకే కథా శీర్షికతో అనేక కథలు రాయొచ్చు. బహుమతి, స్నేహం, మంచితనం, ఉపాయం – ఇలా వందలాది కథలు వచ్చాయి.
3) ‘అమాయకుడి తెలివి తేటలు’ అనే పాయింటుతో బోలెడు కథలు సృష్టించవచ్చు.
4) ఒకే కథను అనేక రకాల ముగింపు లతో రాసి మెప్పించ వచ్చు.
5) మూడు పేజీల కథను పది లైన్ లలో రాసుకోవచ్చు. పది లైన్ల కథను మూడు పేజీలకు పెంచి రాసి సూపర్ అనిపించుకొనూ వచ్చు.
6) ఒకే కథా వస్తువుతో మనం ఎన్ని కోణాల నుంచి ఆలోచించగలమో అన్ని కథలు రాయవచ్చు.
పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ కొత్తగా కథలు రాయాలనుకున్న బాలలు, వర్ధమాన రచయితలు సులువుగా రాయవచ్చు.
ఈ వారం మనం మొదటి సూచన తీసుకుని నేను కథలు ఎలా రాశానో చెపుతాను.మనుషుల పాత్రలతో రాసిన ఒక హాస్య కథను జంతు పాత్రలకు ఆపాదించి ఎలా రాశానో గమనించండి.

- Advertisement -


కథ పేరు : ‘ భోజన ప్రియుడు’

శ్రీనాధ్ మంచి భోజన ప్రియుడు. మా స్నేహితుల్లో ఎవరిని ఫంక్షన్ కు పిలిచినా, వారి వెంట వీడూ తప్పక ఉండేవాడు. పక్క వీధుల్లో ఎవరైనా ఫంక్షన్ జరుపుకుంటున్నట్లు తెలిస్తే, పిలవకుండానే అక్కడికి హాజరయ్యేవాడు. ఒకరోజు సాయంత్రం నేనూ, శ్రీనాధ్ నీటుగా తయారయి వీధిన పడ్డాం! ఒక చోట లైట్స్ తో అలంకరించిన భవనం కనిపించింది మాకు.
శ్రీనాధ్ నా వైపు చూస్తూ, “అరేయ్, ఇక్కడ ఏదో పెళ్ళిలా ఉంది, మాంచి భోజనం చేసి వెడదాంరా!” అన్నాడు. నేను వద్దని ఎంత చెప్పినా వినక, నన్నూ బలవంతంగా తీసుకెళ్ళాడు. భవనoగేటు దాక బాగానే వచ్చిన నాకు ఎందుకో లోపలికి వెళ్లబుద్ధి కాలేదు. ఏమైనా సరే “పిలవని ఫంక్షన్కు వెళ్లకూడదనుకున్నాను. శ్రీనాధ్ బలవంతంగా నన్ను లోనికి తోసాడు. ఎంత విడిపించుకుందామన్నా పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుకొన్నాడు. ఇదంతా దూరం మంచి గమనిస్తున్న ఒక పెద్ద మనిషి మా వద్దకు వచ్చి, “ఎవరండీ మీరు? లోనికి రాకుండా అలా పోట్లాడుకుంటారేం?” అన్నాడు. వెంటనే శ్రీనాధ్ ఆ పెద్ద మనిషి వైపు గర్వంగా ఫోజు కొడుతూ, “మొగ పెండ్లి వాళ్ల తరపువాళ్లం అన్నాడు. నేను మాత్రం భయంగా ప్రక్కలకు చూస్తూ నిలుచున్నాను. నాకు ఇంతకు ముందు ఎప్పుడూ అలవాటులేని పని ఇది. ఆ మాటలు విన్న పెద్ద మనిషి నుదురు చిట్లించి, “ఇది పెండ్లి కాదయ్యా! బర్త్ డే ఫంక్షన్!” అన్నాడు. ఆ మాటకు నేనూ, శ్రీనాధ్ వెంటనే అక్కడి నుంచి మెరుపు వేగంతో మాయమయ్యాం! ఇంకోసారి శ్రీనాధ్ కూడా తిండి కోసం ఫంక్షన్లకు పిలవకముందే వెళ్ళటం మానేశాడు.

పైన పేర్కొన్న ‘ భోజన ప్రియుడు’ కథ బాలమిత్రలో మార్చి 1992 సంచికలో
ప్రచురించ బడింది. అంటే 32 సంవత్సరాల క్రితం ఒక నిజ సంఘటన ఆధారంగా ఉత్తమ పురుషలో (నేను/ మేము)
రాసుకున్న కథ.
అదే హాస్య కథా వస్తువు తీసుకుని ‘ ఉల్టా – పల్టా’ పేరుతో జంతుపాత్రలకు ఆపాదించి సరళ తెలంగాణ మాండలికంలో ఎలా రాశానో గమనించండి.

ఉల్టా – పల్టా

అమ్రాబాద్ అడవిల నక్కతో గుడ్డేలుగుకు సోపతి ఉంఢెటిది. నక్క బద్ధకానికి అలవాటు వద్దది. ఏపనీ చేయకుంట ముచ్చట్లు చెప్పుకుంట కాలం గడిపేది. కనీసం తిండికోసం సుత కష్టపడదు. మందికి తెల్విగా మాటల్టెప్పి పొట్టపోసుకుంటది.
ఓపారి గుడ్డేలుగుకు కోడికూర తింతమన్న ఖాయిష్ కల్గింది. గా సంగతే నక్కకు జెప్పింది. “మామా! కోడికూర తిని మస్తురోజులైంది.. నాల్క సుత సప్పవడ్డది. జరంత కారం కారంగ, గరం గరం కోడికూర తినాలనుందే!” అన్నది. “ఛల్! గంతేనా! దినాం యాడ్నోచోట కోడికూర తింటనే ఉంట!” అన్నది నక్క.
గుడ్డేలుగు ఒకపారి కిందకి మీదికి నక్కను జూసింది.
‘నువ్వు గమ్మతున్నవు మామా! మాంసం తింతున్నమని, బొక్కలు మెడల ఏస్కుంటమా? నువ్వు నారాజ్ గాకు. నీ ఇరా నేను తీరుస్త! నడు!!” అన్నది నక్క.

అటెంక ముచ్చట జెప్పుకుంట నక్కా, గుడ్డేలుగు అడవిల ఇరాం లేకుంట తిరిగినయి. పోంగ పోంగ గుడ్డేలుగు ముక్కుకు కోడికూర ఆసన తగిలి ఆగింది. నక్కకూడా వెంటనే ఆసన పసిగట్టింది. “మామా! కోడికూర ఆసనస్తుందే!” అన్నది నక్క. “ఔ! నాక్కూడస్తంది!” రొండూ కోడికూర ఆసనొస్తున్న దిక్కు నడిచినయి.
గప్పటికే పొద్దుమీకింది. దూరంల రంగు రంగుల దీపాలు అగువడ్డయి. “మామా! గాడేదో షాదీ లెక్క కొడుతుంది సూడు!” అన్నది నక్క. “ఔగని, పిలవని దావత్ కు గట్లెట్ల పోతమే!” అన్నది గుడ్డేలుగు.
పరేషానైతవేంది.. మనకాడ మాంచి ఇగురముంది! గీసుంటే పిల్వని షాదీ
లెన్నిటికోబోయి, మస్తు బుక్కిన, ముందుగాలనదు! నువ్వు పరేషానీగాకు!” ధైర్యం చెప్పింది నక్క. గిసుంటే పిలవని దావతులకు మస్తుసార్లు పోయి బొత్త పగల మెక్కింది నక్క. కానీ గుడ్డేలుగుకి గినుంటివస్సలు తెల్వది. పిలపని షాదీయేగాడు పిల్సిన
దావతుకు బోవాలన్నా సిగ్గే.
లోనికెల్లేకాడ తోడేలు, ఏనుగు, లొట్టిపిట్టలున్నయి. వచ్చేటోల్లకు అత్తరుజల్లి, పువ్విస్తన్నయి. “మామా! నాకు రందిగుందే! ఇజ్జత్ వోతది. గలీజుగుంటది!” అన్నది గుడ్డేలుగు.
ఏనుగు గిదంతా దూరం నుంచి జూస్తుండే. నక్క గుఢ్ఢేలుగుల కాడికిపోయి “అగ్గొ! గప్పటికెళ్ళి జూస్తున్న లోనికస్తలేరెందుకు.. మిమ్మల్ని గెంతకుముందు గీ జంగల్ల సుత జూసిన యాదికొస్తలేదు!” అన్నది నెత్తిగోక్కుంట.
గంతే గుడ్డేలుగు గుండె గుభేల్ మన్నది. నక్కమట్టుకు “గట్లనా! మేమెవలమో జెపితేగని నీకు తెల్వ దా..! ఛల్ నడు! ఈడ మన ఇజ్జత్ మొత్తం బోయింది” అన్కుంట ఎగిరింది. “అన్నా! యేమనుకోకే! లోనికచ్చి గరంగరం కోడిపలావ్ తినండి” అన్నది ఏనుగు. గప్పుడు నక్క భుజాలు ఎగరేసుకుంట “గట్లరా దారికి! మగపెండ్లి వారంటే గింతగూడ మర్యాద లేకుండ బోయిందే!”
అంటూ గుడ్డేలుగు వైపు జూసింది. ఆ మాట విన్నంక ఏనుగు ఆగింది. “ఇగ్గో! గిది లగ్గం గాదే! మా పులిరాజు బిడ్డ పుట్టినరోజు దావతు” అన్నది ఏనుగు. గంతె కుయి లేదు! కయి లేదు! నక్క నాల్క కర్చుకుని, ఆగమాగమైంది. బుగులుతోటి గుడ్డేలుగు శెంగో బిల్ల. ఇగురం ఉల్టాపట్టా ఐనందుకు నక్కకూడా గుడ్డేలుగు ఎన్కనే ఉరికబట్టింది.
గమనించారు కదా.. మనుషుల పాత్రల కథను జంతు పాత్రలకు ఎలా ఆపాదించి రాసానో. ఇలా ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. కొత్తగా రాసే వారు ప్రయత్నించి చూడండి.
(వచ్చే వారం చొక్కాపు వెంకటరమణ అందించిన మరో అద్భుత ఆణిముత్య సూచనతో మరికొన్ని కథలు ఎలా రాయాలో తెలుసుకుందాం).

పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
సెల్ : 92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News