సహృదయత లేని సాహిత్యం తావిలేని పూవు లాంటిది. చుక్కానిలేని నావ లాంటిది. దేవుడు లేని గర్భగుడి ఔతుంది. గుక్కెడు నీటి కోసం ఉప్పునీటి సముద్రం ముందు మోకరిల్లినట్టు ఉంటుంది. గుండె కరువైన మనిషి అవుతుంది. అదే సమయంలో హృదయ సంపన్నత కలిగిన సాహిత్యం మహోన్నత శిఖరాలకు దరి చేరుస్తుంది, మహిమాన్విత వ్యక్తుల మార్గానికి దారి చూపుతుంది. మానవ జీవన సాఫల్యతకు సార్ధకతను చేకూరుస్తుంది. ఎడారిలో ఓయాసిస్ లా దాహార్తిని తీరుస్తుంది. కొత్త కుండలో మట్టి వాసన పరిమళంలా గ్లాసెడు నీళ్ళ ద్వారా నరనరాన గిరికీలు కొట్టిస్తుంది. అదీ అసలైన సిసలైన తేడా. ఇటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే ఉండే ఉంటారు, కానీ బూతద్దం పెట్టి వెతికితేనే కనిపిస్తారు అక్కడక్కడ. నదిపక్కన నల్లటి ధూళిని మూకుడులో జల్లెడ పడితే ఎపుడో ఒకపుడు మెరిసే బంగారు రేణువులులా, దసరా పండుగ రోజు ఊరిబయట చెట్ల కొమ్మలమీద అలు పెరుగని వెతుకులాటకు ఆలంబనగా ఎగుర్తూ కనిపించీ కనిపించక, వినిపించి వినిపించక కను మరుగయ్యే పాల పిట్టలా మనకు వీరు కనిపిస్తారు. అటువంటి కోవలో ప్రత్యేక తోవలో పయనించే శ్రీమతి కృష్ణవేణి పరాంకుశం గారు ఒకరు. పేరుకు తగినట్లుగానే నదీమ తల్లి తన ప్రవా హంలో ఎదురయ్యే సమస్త కల్మషాలను ప్రక్షాళన గావించి పవిత్రంగా సాగిపోయినట్టు తనకే ప్రత్యేకమైన మధుర మార్మిక చిరునవ్వులో కృష్ణవేణి సమస్త సామీప్య సమూహాన్ని శుద్ధిచేసి తోడ్కొని వెళతారు.
కృష్ణా నది పడమటి కనులలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో పుట్టి ప్రవాహ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ గుంటూరు జిల్లా హంసలదీవి చేరినట్టు ఎక్కడో నెల్లూరు జిల్లా మారుమూల ప్రాంతం దగదర్తిలో జన్మించి, గుంటూరు ప్రాంతంలో విద్యను అభ్యసించి ఒంగోలు ప్రాంతానికి తరలివచ్చారు. ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై, నభోవీధి పైనం తై అన్నట్టు బాల్యం నుండి సాహిత్యకుటుంబ నేపథ్యం ఉండి పండితులైన బంధువర్గం సాంగత్యంలో పాండిత్య ప్రకర్షకు పదును పెట్టుకున్నారు. తనలో నిబిడీకృతమైన కవితోత్సాహాన్ని పసిగట్టిన తల్లిదండ్రులు ఇరువురూ వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సాహాన్ని ఇచ్చి మల్లెతీగకు పం దిరి వేశారు. కాలేజీలో ఇంటర్మీడియేట్ పూర్తయిన వెంటనే శ్రీనివాసాచార్యులుతో వివాహబంధం ముడిపడి ఇద్దరు బిడ్డల తల్లిగా రూపుదాల్చి సంపూర్ణ స్త్రీత్వాన్ని సంతరించు కున్నారు. తన బాల్యంలో కప్పివేయబడ్డ కవన పరిమళా లను భర్త ప్రోద్భలంతో, సహకారంతో తిరిగి పాదులువేసి సాకారం చేసుకొన్నారు. ఆ సౌరభాల ప్రవాహానికి కత్తువ వేసి ఈ మధ్యే తను రాసిన కవితా సంపుటి ‘నా అంత రంగాలు – కృష్ణా తరంగాలు’ అనే సుందర జలాశయం రూపంలో మనకు అందించారు. సున్నిత భావాలు సుకు మార ఆలోచనలు ఉత్తమోత్తమ మానవీయ విలువలను కలగలిపి భావకవిత్వం ప్రాతిపదికగా అనేకానేక అంశా లను తన కవితలలో గుదిగుచ్చి పూదోటలో పరిమళం చేస్తూ కవితా సంపుటిలో ప్రోది పరిచారు. ప్రాథమికంగా పండిత కుటుంబం నుండి రావడం వలన అసాధ్యమైన భాషా పటుత్వం తనకు అవలీలగా వంటబట్టింది. జుట్టున్న అమ్మ ఎన్ని కొప్పులైనా కడుతుంది అన్నట్టు సాధికార బాషాపరిజ్ఞానం, సునిశిత భావవైశాల్యం రెండూ ఉన్న పుడు ఇక ఆ కలాన్ని ఆపగల శక్తి హరిహరాదులకు కూడా ఉండదు. అది కృష్ణవేణి విషయంలో నిత్య సత్యంగా నిర్వి ఘ్న యాగంగా నిరంతర కృత్యంగా నిరూపింపబడింది.
కృష్ణవేణి కవిత్వం సమ్మిశ్రిత భావనల సమ్మేళనం. కాదేదీ కవిత కనర్హం అన్నట్టు ఆమె కవితలన్నీ ఆత్మా శ్రయమై అంతర్ముఖీణమై, ఆచరణయుక్తమై, ఆదరణీయ శక్తియై అనంత అంతర్లోచనలతో అంతర్లోకాల్లో విహరింప జేసి పాఠకులను ఆలోచింపజేసే గొప్ప లక్షణాలను పుణికి పుచ్చుకున్నాయి. ఆమె కవనంలో సుందర జలపాతాలు, పచ్చిక మైదానాలు, పక్షుల కిలకిలలు సెలయేటి గలగలలు ,సురుచిర తారకా కుసుమ శోభి నభోంగణలు, విజయ గాథల వీరాంగణలు, రంగుల రంగోలీలు, తొలి వలపుల పిలుపుల ప్రేమలేఖలు, నవశక నిర్మాతల ప్రతిబింబాలు ఇంకా అనేకానేక అందమైన అంశాలూ మొక్కజొన్న చేలపై నుండి వీచే పైరగాలిలా, వరిసాగు మడులలో దూకే నీటి గలగలలా మనసులను హాయిగా ఆకాశంలో తారల మెరు పులను సున్నితంగా స్పృశిస్థాయి. అద్దం లాంటి సున్నిత మైన కవయిత్రి భావనలలో మన ప్రతిబింబాలు చూసుకో వచ్చు. సమిక్షకుడూ చాలా భద్రంగా వాటిని కళాత్మక వ్యక్తీకరణలతో సంబాళించుకోవడం సమర్థవంతంగా నిర్వ హించండం ఈ ప్రయత్నంలో కొంతవరకైనా రాణించడం ఒక పెద్ద సాధనే. చేయి జారిందంటే ప్రయత్నం పగలనూ వచ్చు, చేయీ వేళ్ళూ కోసుకుపోవచ్చు. పాఠక మహా శయుల సౌకర్యార్థం మచ్చుకు కొన్ని కవన వాక్యాలు ఉటంకించి విపులీకరించటానికి ప్రయత్నం చేస్తాను.
కవయిత్రికి పుస్తకాలంటే ఎంత మక్కువో అక్షరా లంటే ఎటువంటి ఆరాధనో ఎంత అనుభూతి పారవశ్యం లో సేద తీరుతారో చేదబావిలో తేనె నీటిఊటలా ఆస్వా దిస్తారో ఈ కవితలోకి వెళ్తే తెలుస్తుంది. మరి పదండి ఆలస్యం ఎందుకు.
‘పుస్తకం అంటే భావాల లోగిలి అనుభూతుల వాకిలి
నిద్ర తెలియని మెలకువల మేలుకొలుపు
తెలుసుకోవాలనే తపనకు చక్కని మలుపు
తెల్లని కాగితంపై నల్లని అక్షరాలు
వలస పక్షులై మెదడులోకి పయనిస్తూ…
కొన్ని తేనె జల్లులను చిలకరిస్తాయి
ఇంకొన్ని విరజాజులుగా పరిమళిస్తాయి.’
ఎంతటి గొప్ప భావసౌందర్యం ఈ కవితలో పెల్లు బికింది. తెల్లని కాగితంపై నల్లని అక్షరాలను
వలస పక్షుల్లా అభివర్ణించడం చక్కటి పోలికలతో ప్రతీకాత్మకంగా వాడారు.
‘జగతికి వెలుగు మగువ
ప్రగతి పదం మగువ
తెగువ కలది మగువే
గగనపు తరి మగువే
మమతే తన రూపం
సమతే తన లక్ష్యం’.. అంటూ స్త్రీల అస్తిత్వ స్పృ హనూ, ప్రగతి మూలం గురించి, దీక్షాదక్షతల గురించి అందమైన పదాల పొందికతో అల్లిన కవిత ఇది.
ప్రేమ, అనురాగం, అభిభాషణ, ఆపేక్ష భావావేశం అనేవి మనిషిని ఇతర జీవుల నుండి వేరుపరుస్తాయి, ఒక ప్రత్యేక స్థాయిని కల్పిస్తాయి. కవులలో భావోద్విగ్నత భావా వేశం తప్పనిసరి. భావావేశ భావనల శబ్ధ స్వరూపమే కవి త్వం కదా. కవయిత్రి రాసిన సుమభావ మాలికలను అసా మాన్య పోలికలను ఈ కింది కవితలో మీరు పరికించ వచ్చు.
‘నీ ఊహల ఊట బావిలా వెచ్చబడుతున్న అనురాగం
నా దేహాన్ని కౌగిలిస్తుంటే
తనివి తీరని వయసు నీకై జాగారం చేస్తూ ….
ఎదురుచూపుల యామినిలా
వేకువకు లోకువై పోతున్నాను‘
వివశత్వపు కృతిలా గుచ్చుతున్న విరహాగ్ని
రుధిరపు రాగంలా నన్ను దహిస్తుంటే
నీ తలపులు దండయాత్ర చేసి
అశాంతి తీరాలను దాటి ఒంటరితనానికి నన్ను బానిసను చేస్తున్నాయి‘
మరో కవితలో కృష్ణవేణి చూపెట్టిన భాషా భావపటు త్వాన్ని పరిజ్ఞానాన్ని చూసి పాఠకులు ముగ్ధులవ్వాసిందే.
మరో కవితలో..
‘క్ష్మాసుత అంతటి ఓర్పుతో క్షణికావేశములకు లోబడక క్షోభమును దరి చేరనివ్వక
కక్షల ,శిక్షణ కతీతముగా క్షీర సాగరమంతటి అక్షర జ్ఞానాన్ని నీలో పెంపొందిస్తూ క్షుర కత్తుల వంటి పదునైన నీ ఆలోచనలను క్షిపణి వేగం లాంటి
నీ బుద్ధి కుశలతను క్షేత్రస్థాయిలోనే సరైన మార్గంలో మళ్ళించి నీ క్షేమాన్ని, ఉన్నతిని సర్వదా కోరుకునే మార్గ దర్శకులు గురువులు.’
ఈ కవితలో భూదేవి కుమార్తె సీతాదేవి వంటి ఓర్పు తో, కక్షలకు శిక్షలకు అతీతంగా విద్య అనే క్షీరసాగరాన్ని మథనం గావించి అమృతాన్ని సంగ్రహించి విద్యార్థులకు అందించి క్షిపణి వేగంలా దూసుకు పోగలిగే వారి బుద్ది కుశలతను సరైన మార్గంలో మళ్ళించి లక్ష్యం ఛేదించే దిశలో మార్గాన్ని చూపే మార్గదర్శకులు గురువులు అని కవయిత్రి గురువుల గొప్పతనాన్ని తెలియ చేస్తున్నారు. ఎంతటి శబ్ద సౌందర్యం, భావ గాంభీర్యం ఈ కవితను అల్లుకున్నయో వర్ణనాతీతం. ఇవి కవయిత్రి కలలోకి, కలంలోకి ఎలా జాలువారాయి అంటే ఏం చెప్పగలం. అది వారి పూర్వకవుల ప్రభావమూ కావచ్చు, పూర్వజన్మ సుకృతమూ కావచ్చు. తను చదివిన అద్భుతమైన కావ్యాల సుగంధము అంటనూ వచ్చు. సరే ఇక్కడిదాకా వచ్చాం కాబట్టి కాస్త పూర్వాపరాలు చూద్దాం.
తెలుగు సాహిత్యాన్ని తమ సుందర, సమున్నత రచనలతో సుసంపన్నం చేసినంత మంది సాహితీకారులు, వాగ్గేయకారులు, కీర్తనాకారులూ ఏ భారతదేశ భాషల లోనూ ఉండరు అనేది నిష్టురసత్యం, నిర్వివాదాంశం. బహుశా తెలుగు సాహిత్య రంగంలో వచ్చినన్ని వాదాలు, నాదాలు నినాదాలు, వివాదాలు విభేదాలు ప్రపంచ సాహి తీ చరిత్రలోనే వచ్చి ఉండవు అనేది సాహిత్య పరిశోధకుల అభిప్రాయం. ఇవన్నీ కూడా తెలుగు సాహిత్య పంటను తెగులులా విచ్చేదన చేయకుండా వాన పాముల్లా భూమిని గుల్లబార్చి కోల్పోయిన సారవంతమైన మట్టిని పునరుత్పత్తి చేయడంలో సహాయపడతూ కోతకు గురిచేస్తూ, సారవం తమైన నేలగా చేశాయి సీతాకోక చిలుకలలా పంటను కళాత్మకంగా మార్చివేశాయి. పొలంలో వేరువేరు పంటలు పండించడంలో సహాయపడే కీటకాల మాదిరిగా పరాగసం పర్కం జరిగి మంచి దిగుబడి వచ్చింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో మహా కావ్యాలు అనదగినవి మూడు ఉన్నాయనేది సాహితీ స్రష్టలూ ద్రష్టలయిన చేరా మాస్టారు రారా మాష్టారు కారా మాష్టారుల ఉవాచ. వీటిలో మొట్ట మొదటిది సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత మహాకవి శివారెడ్డి ఆసుపత్రి గీతం ఆయితే ఇక రెండవది దిగంబర కవుల మార్గదర్శి మహాముని నగ్నముని కొయ్యగుర్రం. ముచ్చటగా మూడవది ప్రఖ్యాత వాగ్గేయకారుడు కవిత్వం లో మట్టి వాసన పరిమళాలు చిందించే కవి గోరటి వెంకన్న విరచించిన అలసెంద్రవంక. ఇంతటి విభిన్న సాహిత్యం వెల్లువెత్తిన భాషలో పట్టు సాధించిన కృష్ణవేణి ఈ తరహా కవితా పాదాలు మృదువుగా కాంతివంతంగా ఉంచడంలో ఆశ్చర్యమేముంది.
ఇంకో చక్కని హృదయోల్లాస కవితను మీ సహృద యానికి పరిచయం చేయ ప్రయత్నిస్తాను.
‘దేహాలన్నీ అచేతనాన్ని కౌగిలించుకుని
బద్దకానికి ముద్దులు పెట్టేనిశ్శబ్ద చీకటిలో నిద్దుర పడవలో
అలసట తీరాన్ని నిశ్చింతగా దాటేసిన పక్షులు
కువకువల కుహు కుహు రాగాలతో నిహార కంబళ్ళ ను నిట్ట నిలువునా చీలుస్తూ వస్తున్న ప్రభాత సూర్యునికి వినమ్ర ఆహ్వానం పలుకుతున్నాయి
తూరుపు మీటిన వెలుగు తీగనుండి వినిపిస్తుందొక వేకువ గీతం’
కవయిత్రి ఈ కవితలో ప్రత్యూష సమయంలో ఉషా దేవి పాడే ఉదయ రాగాలను ప్రభాత సూర్యునికి పక్షులు పాడే స్వాగత గీతాలను తూరుపు కొండల వెనుక నుండి నిహార కంబళ్ళను చీలుస్తూ వినిపించే వేకువ గీతాలనూ వీనుల విందుగా వినిపిస్తూ, వివరిస్తూ, స్మరిస్తూ, తరిస్తు న్నారు. తన్మయత్వంతో తనివితీరా మీరూ వినండి.
వీరసైనికుడు యుద్ధభూమిలో శత్రుమూకలతో స్త్వ్రర్యి విహారం చేస్తున్నపుడు ఊరిలో ఇంటిదగ్గర అతడి అర్ధాంగి ఆవేదనతో, ఆందోళనతో అతని రాకకై ఎదురు చూసే విలాపగీతం హృదయాన్ని విచ్చేదన చేసే విధానం చెప్ప నలవి కానిది. మీరే స్వయంగా చూడండి
నువ్వు వెళ్లిన నిమిషం నుండి గుండెల్లో దిగులు
మళ్ళీ ఎప్పుడు చూస్తానో అనే గుబులు
చూడగలనో లేదో అనే నిట్టూర్పు
నాకై నేనే…. ఓదార్పు …
గుండెల్లో నీపై ప్రేమను దాస్తూ!
కడుపులో మన బిడ్డను మోస్తూ ! వెల్లువవుతున్న దుఃఖానికి ఆనకట్టలు వేస్తూ!
అక్కడ నీకు ఇక్కడ నాకు నిత్య రణరంగమే’
ఏ సమయసందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు, జీవితంలో ఎప్పుడూ విఫలం కారంటాడు చాణక్యుడు.. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కృష్ణవేణి. అందుకే ఆమె నిర్వ హణలో స్థానిక సాహితీ మిత్రుల సహకారంతో శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో మూన్నెళ్ళ క్రితం ఒంగోలులో నిర్వ హించిన రెండు తెలుగు రాష్ట్రాల సాహితీ సమావేశం కన్నుల పండుగగా జరిపి తన నిర్వహణా సామర్ధ్యం నిరూపించుకున్నారు.
చివరి కవితగా తన తండ్రిగారిపై రాసిన కవితను ప్రస్తావించి నా సమీక్ష ముగిస్తాను. చేయి పట్టి అక్షరా భ్యాసం చేయించి తను కవయిత్రి కావడానికి దోహదపడిన జన్మనిచ్చిన తండ్రి జ్ఞాపకాలు నిత్యం తనతోనే,తనలోనే ఉంటాయి అంటూ తనతండ్రి ఆత్మీయత తనను పరిమళం లా చుట్టుముట్టి నట్లు..
‘పురాణ పఠనంలా…
పంచాంగ శ్రవణంలా…
తాళపత్ర గ్రంథంలా….
నాన్న నా తీయని జ్ఞాపకం’.
అంటూ ఎంతో అపురూపంగా తండ్రి తలపులతో పర మానంద భరితులౌతారు కృష్ణవేణి.
అక్షరానికి ఆకారం తొడిగి సంస్కారం నేర్పిస్తే అది కృష్ణవేణి కవిత్వం అవుతుంది. దానికి మాటలు నేర్పి వివే చన, వినయం, సానుకూల దృక్పథం, సదాలోచన, మృదు తత్వం, ముగ్దత్వమూ అనే ఆహార్యాన్ని, ఆభరణాలను ధరింపజేస్తే కృష్ణవేణిగా రూపాంతరం చెంది మన ముందు ప్రత్యక్షమౌతారు. విభిన్న అంశాలను కృష్ణవేణి గారు తన కవితా సంపుటిలో స్పృశించినా ఇంకా వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి నూతన ఒరవడిని సృష్టించాలని కోరుతూ, సామాజిక అసమానతలపై, సాంఘిక దురాచారాలపై స్త్రీలు ఎదుర్కొనే వివక్షతలపై కూడా కవయిత్రి తన విల్లం బులు ఎక్కుపెట్టాలనీ తన కవితా బాణాలతో వాటిని ఛేదిం చగలరని ఆశిస్తున్నాను.కృష్ణవేణి కవిత్వం భవిష్యత్లో మరింత పరిణితి సాధించి తెలుగు సాహిత్యంలోసుస్థిర స్థానం సంపాదించుకోవాలనీ, నవయువ కవన నారీమణు లలో ఒకరుగా ఖ్యాతికెక్కాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను.
- డాక్టర్ జెల్ది విద్యాధర్
9440496250