మునిమాణిక్యం నరసింహారావు రచనలకు అభిమానులను లెక్క పెట్టడం సాధ్యమయ్యే విషయం కాదు. వందేళ్ల క్రితం రాష్ట్రంలో హాస్య బ్రహ్మ ఎవరంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు మునిమాణిక్యం నరసింహారావు పేరే. జీవితాన్ని అన్ని కోణాల నుంచి కాచి వడపోసిన మునిమాణిక్యం తన అనుభవాలు, జ్ఞాపకాలన్నిటినీ తన హాస్య నాటికల్లో, హాస్య కథల్లో పాత్రలుగా మార్చేశారు. జీవితంలోని ప్రతి అనుభవాన్నీ పాజిటివ్‌గా, లైట్‌గా తీసుకునే మునిమాణిక్యం చివరికి అసలు జీవితాన్నే హాస్యభరితం, హాస్య స్ఫూరకం చేసేశారు. ఆయన రాసిన ప్రముఖ హాస్య కథావళి ‘కాంతం కథలు’ చదివితే సూర్యకాంతాన్ని, ఛాయాదేవిని కలగలిపి వందేళ్ల క్రితమే చూసినట్టుంటుంది. ఆ తర్వాత భానుమతి రాసిన అత్తగారి కథలు కూడా దాదాపు అదే హాస్యాన్ని పండించాయి. 1898 మార్చి 16న గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో జన్మించిన మునిమాణిక్యం 1973 ఫిబ్రవరి 4న కాలధర్మం చెందేవరకూ హాస్యరసం పండించడంలోనే మునిగి తేలారు.ఆయన తన భార్య కాంతాన్నే ఒక పాత్రగా చేసుకుని, కాంతం కథలను సృష్టించారు. నిజానికి ఆయన భార్య కాంతం ఆయన కథల్లో వర్ణించిన కాంతం కాదు. అయితే, ఆయన తన భార్య వ్యవహార శైలిని హాస్యస్ఫూరకం చేసి, తన సరసాలను, ఆమె స్పందనలను కథలుగా అల్లారు.
తెలుగు సాహిత్యంలో మణిపూస అనదగినకాంతం కథలే కాదు, ఆయన కలం నుంచి వెలువడిన ఇతర రచనలుకూడా అంతకు మించి హాస్యాన్ని పండిస్తాయి. ‘అప్పులు చేయడం-తీర్చడం’ అనే పుస్తకంలో ఆయన అప్పుల గురించి, అప్పులు చేసేవాళ్ల గురించి అద్భుతంగా, హాస్యరసంతో కథలు రాశారు. ‘అప్పు చేసిన మొత్తమును తిరిగి ఇచ్చేవాడు అధముడు. కాలం గడిపేవారు మధ్యముడు. తెచ్చిన మరుక్షణములో ఆ విషయాన్ని మరచిపోయేవాడు ఉత్తముడు’ అంటూ ఆయన రాసి న వాక్యాలు హాస్యాన్ని పండించడమే కాకుండా, యథార్థ పరిస్థితిని కళ్లకు కట్టిస్తాయి. ఇక ఆయన దాంపత్య జీవితం మీద రాసిన ‘దాంపత్యోపనిషత్తు’ కథలు కడుపుబ్బ నవ్విస్తాయి. దాంపత్య జీవితంలోని సరిగమలు, పదనిసలను ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. పూర్తిగా వ్యవహార భాషలో రాసినందువల్ల ఇవి చాలా త్వరగా జనాభిమానానికి నోచుకున్నాయి. ‘హాస్య కుసుమావళి’, ‘మాణిక్య వచనావళి’, ‘స్తుతి-ఆత్మస్తుతి’, ‘తెలుగు హాస్యం’, ‘హాస్య ప్రసంగాలు’, ‘కాంతం కైఫీయతు’ తదితర రచనలన్నీ వ్యక్తిగత జీవితాలకు, సామాజిక స్థితిగతులకు అద్దం పట్టేవే.
ఆ కాలంలో కూడా పలువురు రచయితలు సామాజిక స్పృహతో, సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ అనేక రచనలు చేశారు కానీ, ముని మాణిక్యం ఇందుకు హాస్యరసాన్ని అస్త్రంగా చేసుకోవడం ఆయనను ఒక విభిన్న రచయితగా లోకం ముందుంచింది. వ్యక్తిగతంగా ఆయన జీవితంలో కొన్ని విషాదాలు నిండి ఉన్నమాట నిజమే కానీ, ఆయన వాటిని కూడా తన హాస్య ప్రవృత్తిలో కప్పెట్టారు. అయితే, ఆయన ఎంతగానో ప్రేమించిన ఆయన భార్య కాంతం హఠాత్తుగా మరణించడాన్ని మాత్రం ఆయనలో విషాదాన్నే మిగల్చింది. ఆయన ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీని వల్ల ఆయన సహజ హాస్య ప్రవృత్తిలో కొద్దిగా మార్పు చోటు చేసుకున్న మాట నిజం. అయితే, తన మీదపడిన హాస్య ముద్ర కారణంగా ఆయన ఆ తర్వాత కూడా హాస్య రచనలు చేయడం జరిగింది. హాస్యానికి పెద్ద పీట వేసిన తొలితరం రచయితల్లో ఆయన మొదటివారు.