Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: కావూరి మీటిన కోటిరత్నాల వీణ

Telugu literature: కావూరి మీటిన కోటిరత్నాల వీణ

పద్యం, వచనం రెండు విభాగాల్లో ఆరితేరిన సవ్య సాచి, పద్యం ఎంత లాలిత్యంగా నడిపించగలరో వచనాన్ని అంతే వయ్యారంగా నడిపించగల దిట్ట డాక్టర్‌ కావూరి పాపయ్య శాస్త్రి, సమకాలీన విషయాలను సామాన్యులకు సైతం పద్యం గుండా అందించడంలో ఆయనకు ఆయనే సాటి, అలాంటి పద్య ప్రతిభా సౌరభాలను తెలం గాణకు చెందిన చిరస్మరణీయుల చిరు జీవిత చిత్రాలకు అందంగా అలంకరించారు డాక్టర్‌ కావూరి.
నేటితరం యువత తెలుసుకోదగ్గ తెలంగాణ జాతి రత్నాల గురించి అందమైన ఆట వెలదులు తేటగీతున్నారు గురించి అందించారు చారిత్రక రాజకీయ సామాజిక సం స్కృతిక సాహిత్య కళా రంగాలకు చెందిన అనితర సాధ్య మైన ప్రతిభామూర్తులకు నిలయం మన తెలంగాణ సీమ అక్కడ పుట్టి పెరిగి తమ మూర్తిమతత్వంతో నేల నలుదిశల వెదజల్లిన విశిష్ట వ్యక్తుల జీవన చిత్రిక ఈ ‘కోటి రత్నాలవీణ’ పద్య వితా విరిదండ, ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని నినదించి నాటి నైజం పాలనపై తనదైన అక్షర శరసంధానం చేసిన దాశరధి కృష్ణమాచార్య మొదలుకొని నేటి తరం తెలంగాణ పోరాట ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరకు 111మంది కృషిని కొండ అద్దమందు అన్న చందంగా అందించారు. తెలంగాణమ్మకు తొలి జ్ఞానపీఠాన్ని అందించిన అక్షర వల్లభుడు విశ్వంభరకు జనకుడు అయిన సినారెలోని నవ నవోన్మేషకావ్య తత్వం ఎంతో సొంపుగా చెప్పారు ఇందులో. మెదక్‌కు చెందిన మళ్లినాథ సూరి కాళిదాసు కవనానికి ఎలా ప్రాచుర్యం నింపాడో చెబుతూనే ఖమ్మం యొక్క కవన మార్గపు అభ్యుదయాన్ని చెబుతూ అందుకు ఆధ్యుడైన కవి రాజ మూర్తిని గుర్తు చేసి పాపయ్య శాస్త్రి తన జన్మభూమి రుణం తీర్చుకున్నారు.
సిద్దిపేటకు చెందిన వేముగంటి కవీంద్రునిగా ఖ్యాతి గాంచిన ‘వేముగంటి నరసింహచార్యు‘లను ఈ తరం సాహి తీవేత్తలకు గుర్తు చేయడంతో పాటు, ప్రతాపరుద్ర భూషణం వ్రాసినాడు ఘన కీర్తి పొందిన చలమచర్ల రంగాచార్యుల, కృషిని కూడా మరవని పాపయ్య గారి ప్రతిభ తెలంగాణలో మరుగున పడిపోయిన జాతి రత్నాలను వెలికి తీయాలనే తపన అడుగడుగునా ఆగుపిస్తుంది ఈ పద్య కలశంలో. నాటి తెలంగాణకే కాక ఎక్కడా ఎవ్వరు చేయనటు వంటి బహుముఖీయమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశీల సహోదరుల గురించి చెబుతూ.
ఇద్దరన్నదమ్ములు లినుగుర్తి వాసులు/రాణకెక్కి నొద్ది రాజు కవులు/ప్రజ్ఞ చూపినారు బహు రంగముల నందు/ ఒకరికొకరు నిలిచి యొద్దికగను!.. అంటూ వొద్దిరాజు సోద రుల కీర్తి బావుటాను ఈ తరం వారికి దర్శింపజేశారు. నటుల కెల్లస్ఫూర్తి నాటకమునకు దీప్తి/ బహుళ యశము గన్న ప్రార్ధనమ్ము/రాగ మధురమగు పరబ్రహ్మ కీర్తన/ వ్రాసి కీర్తిగాంచె దాసుకవి… అంటూ తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవదాసు గురించి చెబుతూ నాటకాలకు ఓంప్రదమైన పరబ్రహ్మ కీర్తన రచయిత కూడా ఆయనే అని సమయస్ఫూర్తిగా వెలువరించిన ఖ్యాతి కావూరి వారికే చెల్లుతుంది.
చారిత్రక వస్తు సేకరణలో చరిత్ర సృష్టించిన సాలార్జంగ్‌ కృషిని కూడా ఇందులో పొందుపరచడం మరో విశేషం, అలనాటి జానపద చిత్రాల నాయకుడు చలనచిత్ర సీమకు కత్తి పోరాటాల ధీరుడు అయిన టి.ఎల్‌. కాంతారావు ది నల్లగొండ అని ఇందులో తేటతెల్లం చేశారు. అలాగే రాజకీ య రంగంలో ప్రఖ్యాతులు అయిన వారిని కూడా గుర్తు చేస్తూ… వెలుగు రేఖ అతడు తెలంగాణ నేలకు/ రాజకీయ మందు రాణకెక్కె/గొప్ప పేరు వడసె కోదాటినారాయణుండు ఉదమమున కండయగుచు… అంటూ నాటి గొప్ప ఉద్యమ చైతన్య నాయకుడు అయిన కోదాటి నారాయణ గురించి అదేవిధంగా.. నల్ల నరసింహం, మల్లు స్వరాజ్యం, మాడపాటి, బూర్గుల, జమలాపురం, లాంటి సామాజిక, రాజకీయ, చైతన్య మూర్తులను పరిచయం చేశారు.
తెలంగాణ సాహిత్యానికే ప్రత్యేకతను అద్దిన జానపద కళా సాహితీ మూర్తులను కూడా ఇందులో అంతే ప్రత్యే కంగా ఆవిష్కరించారు, ‘బండెనక బండి పదహారు బండ్లు కట్టి/ ప్రాణ రక్షణ కైన యేర్పాట్ల తోడు/ తరలిపోయేడు నైజాము దొరలపైన/ ప్రజల భాషలో యాద్గిరి పాట గట్టె’ అంటూ ప్రజా గాయ కుడు యాదగిరి తోపాటు సుద్దాల, ఒగ్గు సత్తన్న, మిద్దె రాములు, గూడ అంజయ్య, పైడి జయరాజు, అందెశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్‌, వంటి జానపద మూర్తుల కృషిని యాది చేసిన వైనం కావురికే చెల్లు, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, కొమరం భీమ్‌, రాంజీ గోండ్‌ వంటి త్యాగధనుల జీవితాలను అలతి అలతి పదా లతో నాలుగు పాదాల్లో క్రోడీకరించి వివరించిన వైనం కడు రమ్యం.
ఇలా బహు రంగాలకు చెందిన నాటి నేటి తరం తెలం గాణ తేజోమూర్తుల జీవన చిత్రాల పరిచయం సచిత్రంగా అందించడం మరో ప్రత్యేకత, ఇది ఒక విధంగా తెలంగాణ ప్రాంత మహనీయుల కరదీపిక లాంటిది. తక్కువ నడివిలో ఎక్కువ విషయం చెప్పడం కాస్త సాహసోపేతమైన చర్య, అయినా అనంత అక్షర ప్రతిభాశీలి అయిన డా: కావూరి దీనిని అవలీలగా నడిపించి ఔరా! అనిపించారు, తెలం గాణ సామాజిక, చారిత్రక, సాహితీ, అధ్యయనకర్తలకు ఈ పుస్త కం చక్కని విషయ దర్శినిగా మార్గదర్శకత్వం చేస్తుంది అనడంలో ఎలాంటి అసత్యం లేదు. అందమైన పద్యాలను అంతే అందంగా నడిపించిన వైనం పద్య ప్రియులతో పాటు సామాన్య పాఠకులకు సైతం అర్థం అవుతూ పద్య సౌరభ వైభవం అలరారుతుంది, నేటితరం సాహితీ విద్యార్థులంతా విధిగా ఈ ‘కోటి రత్నాలవీణ‘లోని సరిగమల మాధుర్యం సవి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు
    77298 83223
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News