పిల్లల, పెద్దల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి అందాల చందమామ పత్రికలో అత్యధిక, అత్యుత్తమ కథలు రాసిన రచయిత మాచిరాజు కామేశ్వరరావు పాఠకలోకానికి చిరపరిచితులే. ఆయన రాసిన ఏకవింశతి ..అంటే 21 కథలతో ఇటీవల ఓ చక్కని పుస్తకాన్ని ‘ దేశ సేవ ‘ పేరుతో వెలువరించారు జె.పి. పబ్లికేషన్స్ వారు. ఈ కథలలో 14 కథలు చందమామలో ప్రచురితం అయినవి కాగా, మిగిలినవి ఇతర పత్రికలలో ప్రచురితం అయినవి.
ఇందులోని కథలన్నీ ఏర్చి..కూర్చిన ముత్యాలే అయినా ముఖ్యంగా కొన్ని కథలను ప్రస్తావించుకోవాలి. ‘ గొప్ప మనసు ‘ ఓ గొప్ప కథ. ఇందులో దశరథరామయ్య ఇంట్లో డబ్బు సంచి దొరకగానే ఏ మాత్రం ఆలోచించకుండా అది, తమదిగానే భావించాడు. తల్లి కూడా ఆ ధనంతో నగలు చేయించుకోవాలని ఉబలాటపడింది. కానీ కూతురు సుమతి మాత్రం సునిశితంగా ఆలోచించి ఆ డబ్బు, తమకు ఇంటిని అమ్మిన రామయ్యకు చెందుతుందని, ఆ ధనం అతడికే ఇచ్చేస్తానంటుంది. ఒప్పుకోక తప్పని పరిస్థితిలో ‘ రేపు ఇద్దువు గానిలే ‘ అంటారు తల్లిదండ్రులు. కానీ ఆ రోజు ఇవ్వటమే భగవంతుడు మెచ్చే పని అంటూ డబ్బు సంచిని రామయ్యకు ఇవ్వడానికి వెళుతుంది. సుమతి ..పిల్ల చిన్నది..బుద్ధి గొప్పది.
ధర్మ సూక్ష్మాన్ని చక్కగా విశదీకరించి కథ ‘ ఏది ధర్మం ? ‘ ఇందులో రాజేశం వంశానుగతంగా వచ్చే వృత్తి, వ్యాపారాలు అనే దృష్టితో ఆ పనులను కొనసాగించడం కన్నా , ఏది పది మందికి ఉపయోగపడే పని అయితే దాన్ని కొనసాగించడం ధర్మం అని నీరజకు వివరిస్తాడు. చాలా విలువైన మాట ఇది.
‘ పారిపోయిన దొంగ ‘ మేటి కథ. ఈ కథలో నిర్భయంగా దొంగకు ఆశ్రయమిచ్చి, తన మాటలతో అతడిలో పరివర్తన తెచ్చిన రమ పాత్ర అద్భుతం. ఆమె మాటలతో జైలు నుంచి పారిపోయి వచ్చిన దొంగ శిక్షాకాలం సవ్యంగా పూర్తి చేసుకుని, భవిష్యత్తులో బాగుపడాలని తిరిగి జైలుకే వెళతాడు. ఆ జైలు అధికారి అయిన రమ తండ్రి, ఆలస్యంగా ఇల్లు చేరి, అందుకు కారణం ఓ దొంగ పారిపోవడమని చెపుతాడు. అప్పుడు రమ జైలు అధికారులు, ఖైదీలను కేవలం శిక్షించడం కాకుండా, వారిలో పరివర్తన కలిగేలా చూడాలని తండ్రికే బోధ చేయడం కొసమెరుపు.
‘ సత్తిగాడి కోరిక! ‘ కథలో భూపతి, తన బిడ్డను యాంత్రికంగా కాపాడిన బిచ్చగాడు సత్తిగాడిని ఏదైనా కోరుకోమంటాడు. కనీసం ఒక్క రోజైనా తనను అందరూ గౌరవించేలా బతకాలని తన కోరిక అంటాడు సత్తిగాడు. భూపతి, అతడి వేషం మార్చేసి, తమ ఇంట జరిగిన వేడుకలో అందరికీ తన మిత్రుడిగా పరిచయం చేస్తాడు. సత్తిగాడు ఆనందించి సెలవు తీసుకోబోతాడు. అయితే, కష్టపడి పనిచేస్తే ఆ గౌరవం శాశ్వతంగా దక్కుతుందని చెప్పి, సత్తిగాడికి ఉద్యోగం కల్పిస్తాడు భూపతి. చేసిన ఉపకారానికి కాసింత ధనం ఇచ్చి వదిలేయకుండా, అతడి జీవితాన్ని మేలైన బాటకు మరల్చిన భూపతి గొప్ప ఆదర్శ పాత్ర!
‘ పాలేరు చెప్పిన పాఠం ‘ కథలో పేరిశాస్త్రి
ఉపాధ్యాయుడిగా సుదీర్ఘ కాలం పని చేసినా తన బోధనలో లోపాన్ని తెలుసుకోలేక పోతాడు. పదవీ విరమణ తర్వాత వయోజనులకు విద్య బోధించాలనుకుంటాడు. నేర్చుకోవడానికి ఒక్క వెంకయ్య మాత్రమే వస్తాడు. ‘ ఒక్కడికి ఏం చెపుతాను ‘ అనుకున్నా, వెంకయ్య.. తాను ఒక్క దూడే ఉన్నా దాణా వేస్తాననడంతో , అతడికే అర్థరాత్రి వరకు తనకున్న జ్ఞానాన్నంతా బోధించే ప్రయత్నం చేశాడు. ఆ దెబ్బతో మర్నాడు వెంకయ్య రాలేదు. కోపంగా వెళ్లి ప్రశ్నించి కారణం తెలుసుకున్నాడు. అప్పటి నుంచి పేరి శాస్త్రి నేర్చుకునే వారి స్థాయిని బట్టి బోధించసాగాడు. ఉపాధ్యాయులకు కనువిప్పు కలిగించే మంచి కథ.
కొంతమంది పిల్లలలో తామే ప్రథమ స్థానంలో ఉండాలని, తనతో పోటీపడే వారే ఉండకూడదనే భావన ఉంటుంది. అటువంటి పిల్లలకు ప్రతినిధే ‘ రామకృష్ణులు ‘ కథలోని రాముడు. తనకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన కృష్ణుడి ఉనికిని సహించలేకపోతాడు. అతడివల్లే తను రెండో స్థానంకు చేరాననుకుంటాడు. చివరకు పంతులు గారు చెప్పిన కథ విని ..ఈర్ష్య ప్రమాదకరమని, పోటీ తత్వం ఉంటేనే పైకి ఎదగ గలమని తెలుసుకుంటాడు రాముడు.
ఈ పుస్తకంలో ఉన్న ఒకే ఒక్క రాక్షసుల కథ ‘ రాక్షసుడి వ్యాధి ‘. రమణాచారి ఎంత ఉదార వైద్యుడో, భార్య భానుమతి అంత దురాశపరురాలు. వైద్యం కోసం భర్త దగ్గరకు వచ్చిన రాక్షసుడి వద్ద ధనం ఉందని తెలుసుకుని, దానికోసం అర్థరాత్రి అతడి స్థావరాన్ని వెదుక్కుంటూ వెళ్లిన దుస్సాహసి. తీరా ఆ సంపదతో పాటే అనారోగ్యమూ ఆమెను వరించడంతో ఆమెలో పాపభీతి మొదలైంది. రమణాచారి ఆ సంపదను గ్రామాధికారికి ఇస్తానని, అప్పుడది పదిమందికి ఉపయోగపడుతుందంటాడు. భానుమతి సరేనంది. అలా భానుమతిలో మార్పు వచ్చింది.
‘ పిల్లలూ, తెలుసుకోండి! ‘ కథ నేటి కాలం బాలికలకు ఉపయోగపడే రచన. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన చేసుకుని, తనకు ఎదురైన క్లిష్ట పరిస్థితిలో తెలివిగా నడుచుకున్న ధీర పాత్ర బాగుంది.
ఇక పుస్తకానికి మకుటంగా ఉన్న ‘ దేశసేవ ‘..ఎంతో చక్కని కథ. దేశసేవ గురించి అదేపనిగా ఉపన్యసిస్తూ , ఏ పనీ చేయకుండా కాలం గడుపుతుంటాడు శౌరి. ఇతరుల ఫిర్యాదులతో విసిగిపోయిన తండ్రి, పనికిమాలిన పనులు మానుకోమని చీవాట్లు వేయడంతో శౌరి రాజధానికి వెళ్ళాడు. రాజుగారిని కలిసి తన దేశసేవ గురించి చెప్పాడు. రాజు అభినందించి శౌరిని అతిథిగా గౌరవించి భవనం ఏర్పాటుచేశారు. శౌరి ఆ భవంతిని చూసాడు. ముందున్న విశాలమైన గది మాత్రం అందమైన అలంకరణలతో ఉండగా, మిగతా గదులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. వెంటనే శౌరి అన్ని గదులను బాగు చేయించడం మొదలుపెట్టాడు. పది రోజుల తర్వాత రాజు వచ్చి భవంతిని చూసి ఆశ్చర్యపోతాడు.
భవంతి అంతా పాడుబెట్టి, ముందు గది మాత్రం సుందరంగా ఉంచితే ఏం లాభం అంటాడు శౌరి. అప్పుడు రాజు కేవలం ఒక్క రాజధాని నగరం కాక, రాజ్యంలోని అన్ని ఊళ్లు బాగుండాలని, ఎవరికి వారు తమ ఊరిని బాగుచేసుకుంటే దేశసేవ చేసినట్లేనని, అది అర్థం కావడానికే ఆ భవంతి ఏర్పాటు అని వివరిస్తాడు. అప్పుడు శౌరికి అసలైన దేశసేవ ఏమిటో అర్థమై, వట్టి మాటలు కట్టిపెట్టి, తమ గ్రామం అభివృద్ధికి గట్టి చేతలు చేయాలని సంకల్పిస్తాడు. రేపటి పౌరులైన బాలలు తప్పక చదవాల్సిన కథ ఇది.
‘ పండుగ బహుమానాలు ‘ వంటి కథల్లో కడుపుబ్బ నవ్వించే హాస్యమూ ఉంది. ఇలా అన్ని కథలు ఉల్లాసాన్ని, వివేకాన్ని ఏక కాలంలో కలిగించేలా ఉన్నాయి. చక్కని బొమ్మలు అదనపు ఆకర్షణ. ఉత్తమమైన ఈ కథ సంపుటి అందరూ చదవాలి..చదివించాలి.
( చందమామలా ఆహ్లాదకరమైన పిల్లల కథలు.. దేశసేవ: మాచిరాజు కామేశ్వరరావు; వెల: రూ. 200/- : ప్రతులకు : జె.పి. పబ్లికేషన్స్ , గోదావరి స్ట్రీట్ , అరండల్ పేట, విజయవాడ – 520002
—– జొన్నలగడ్డ శ్యామల
సెల్ : 99896 01113