Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: గ్రామీణ సంస్కృతికి మలిదశ తెలంగాణ ఉద్యమానికి వారధి నర్రా ‘పొత్తి’ నవల

Telugu literature: గ్రామీణ సంస్కృతికి మలిదశ తెలంగాణ ఉద్యమానికి వారధి నర్రా ‘పొత్తి’ నవల

తెలంగాణ మాండలిక భాషలో..

కవి, రచయిత, విమర్శకుడు, వక్త,సాహితీవేత్త, నవలాకారుడు, కథకుడు, నాటకకర్త ఇలా తెలుగు సాహిత్యంలో ఎన్ని రకాల పాత్రలు ఉన్నా కానీ దానిలో ఒదిగి పోవాలంటే వారిలో ఉండాల్సిన తొలి లక్షణం సాహిత్యం పట్ల అభిరుచి, అపారమైన జిజ్ఞాస, నిశితమైన పరిశీలన, నిరంతర పఠనం, సభలు సమావేశాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనడం. సమాజాన్ని అధ్యయనం చేస్తూ మానవ జీవితాన్ని తరచి చూసి పొందిన అనుభవాలను అక్షరబద్ధం చేస్తే ఒక అందమైన జీవిత గ్రంథం అవుతుంది. గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రగులుకున్న ఉద్యమ పోరాటంలో అసువులుబాసిన విద్యార్థులను చూసి ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల రాతిగోడలు కార్చిన కన్నీటి గాధను వివరించిన డా.నర్రా ప్రవీణ్ రెడ్డి మేధస్సు నుండి ప్రవహించిన అక్షరాలా జీవనది “పొత్తి” నవల (ది బౌండరీ).
ఇక్కడ ముందుగా ప్రస్తావించవలసింది నవలాకారుడైన నర్రా ప్రవీణ్ రెడ్డి గురించి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే వాక్కుకు నిలువెత్తు నిదర్శనం ప్రవీణ్ జీవితం. పాఠశాల స్థాయి నుంచే తెలుగు సాహిత్యం పై మక్కువ పెంచుకొని పలు రచనలు చేస్తూ, కళాశాల స్థాయికి వచ్చేలోపే దినపత్రికలలో తెలుగు సాహిత్యం,సమకాలిన అంశాలపై పలు వ్యాసాలు రాస్తూ ఎన్నో సాహిత్య సమావేశాలకు హాజరయ్యి తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘ఉస్మానియావిశ్వవిద్యాలయంలో’ఎం.ఏ తెలుగులో సీటు సంపాదించాడు. ఎం.ఏ ప్రథమ సంవత్సరంలో ఉండగానే యు.జి.సి నెట్/ జే.ఆర్.ఎఫ్ సాధించాడు. తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ సీటు సంపాదించి ఆచార్య ఎస్.రఘు పర్యవేక్షణలో ‘ ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యం సమగ్ర అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసి తన పరిశోధన గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఇటీవలే డాక్టరేట్ ను పొందారు.

- Advertisement -

డా.నర్రా ప్రవీణ్ రెడ్డిచే రచింపబడిన“ పొత్తి” నవల వివరాల్లోకి వెళితే తెలంగాణ మాండలిక భాషలో “ పొత్తి ” అనేది వ్యవసాయదారులు ఉపయోగించే పారిభాషక పదం. కల్లం మడిలో వడ్ల రాసి చుట్టూ గీసిన ఒక రక్షణ రేఖ పేరు పొత్తి. నవలాకారుడు ఈ నవలకు తెలంగాణ మాండలికం పేరు పెట్టడం ఆలోచిస్తే తనకు తెలంగాణ పట్ల ఉన్న ఇష్టాన్ని నిరూపించుకున్నాడు. ఈ నవలను“తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి హైదరాబాదు” వారు ముద్రించారు. ఈ నవల రాయడానికి ప్రవీణ్ కి స్ఫూర్తినిచ్చిన వారు తన తాతగారైననర్రా రాఘవరెడ్డి (నకిరేకల్ మాజీ శాసనసభ్యులు).ఈ నవలను తనకు ఎంతో ఇష్టమైన ప్రియమైన గురువు ఆచార్య కూరెళ్ల విఠలాచార్య గారికి ( పద్మశ్రీ 2024 ) వినమ్రతతో అంకితం చేశాడు.
ఈ నవలకు ‘మహాదానందం’ పేరుతో డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య, ‘సృజనాత్మక రచయిత’ పేరుతో అంపశయ్య నవీన్ ‘చిరుప్రాయం పెను దుమారం’ పేరుతో డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ‘మూలాలను మేల్కొలిపే‘పొత్తి’ అనే పేరుతో డాక్టర్ ఎస్.రఘు, ‘తొల్సురుపలుకులు’, ‘నెరరుగల్ల’ అనే శీర్షికలతో నవలాకారుడు నర్రా ప్రవీణ్ రెడ్డి ముందు మాటలు రాశారు. ‘పొత్తి నవల వ్యవసాయక వృత్తి చిత్రణం’అనే శీర్షికతో చివరిమాట సి.హెచ్నరేందర్రాశారు. ఈ నవల గురించి కవులు, విమర్శకులు పలు వ్యాసాలను రాశారు.
‘పొత్తి’ నవల లోని పాత్రలు : యాదమ్మ, వీరయ్య, గంగ, బంగారం ( బర్రె ), మల్లారెడ్డి, శారదమ్మ, శంకర్, సోమిరెడ్డి, సుశీలమ్మ, పుల్లారెడ్డి, రంగారావు, మారెన్న, డాక్టర్ దానయ్య, మారెమ్మ, గొల్ల కేతమ్మ, అంజయ్య, , లింగయ్య, కోటయ్య, గౌండ్ల మారన్న, పోషక్క, పెద్దగొల్లవీరమల్లు, కుమ్మరి పెద్దలు, బైండ్ల పాపయ్య, సాకలినర్సిమ్మ, కిష్టయ్య, శంకర్, గంగ, గీత, సోని, పింకీ, హరి, రవి, సూరి… మొదలైన పరిమిత పాత్రలతో అపరిమితమైన కథాంశాన్ని ఎంపిక చేసుకుని తన నవలా రచనకు పూనుకున్నాడు. గ్రామీణ జీవితాలను చిత్రిస్తూ, మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయ వాతావరణాన్ని, తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటాన్ని, హైదరాబాద్ నగర వాతావరణాన్ని విద్యార్థుల యొక్క జీవితాలను సమపాళ్లలో తన నవలలో పొందుపరిచాడు.సందర్భానుసారంగా సామెతలు, జాతీయాలు ఉపయోగించి నవలకు నిండుదనాన్ని చేకూర్చాడు. మొత్తం 158 పుటలతో వ్యవసాయ జీవితపు చిత్రాలు, తనకు విద్య నేర్పిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల చిత్రాన్ని, పిడికిలెత్తి ఉద్యమిస్తున్న విద్యార్థుల చిత్రాలతో ప్రతి ఒక్కరూ చదివి దాచుకునే విధంగా ఈ నవలను మన ముందుకు తీసుకొచ్చారు నర్రా.
‘పొత్తి’ నవలలో గ్రామీణ జీవన చిత్రణ :
దేశానికి వెన్నెముక లాంటివి గ్రామాలు అలాంటి గ్రామాలలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం.ఈ నవలలో నవలాకారుడు వ్యవసాయ ఆధారిత జీవితాలను చాలా హృద్యంగాచిత్రీకరించాడు.ముఖ్యంగా మానవ సంబంధాలు అనుబంధాలకు పట్టం కట్టాడు.జంతువుల పట్ల ప్రేమానురాగాలు చూపిస్తూ మనుషుల మాదిరిగానే జంతువులను కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవడం నేటికీ మనం గ్రామాల్లో చూస్తుంటాం. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పును సునిశితంగా పరిశీలించడం నవలా కారుని పరిశోధనా పఠిమకు నిదర్శనం. వ్యవసాయం వృత్తి పట్ల అపారమైన ఇష్టాన్ని ఇందులో వ్యక్తపరిచాడు. శ్రమజీవుల కృషి పైననే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలిపాడు.
గ్రామాల్లో వేళ్లూనుకు పోయిన కుల వ్యవస్థ, అంటరానితనం అనే మూఢాచారాల హద్దులను ఈ నవల ద్వారా చెరిపి వేశాడు.పిల్లలపై తల్లిదండ్రులకు గల ప్రేమను వీరయ్య, యాదమ్మ, మల్లారెడ్డి, శారదమ్మల పాత్రల ద్వారా తెలిపాడు. శంకర్, గంగ ఇద్దరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే తమ చదువును కొనసాగిస్తూ ఉండడం. తొలుత వీరి ప్రేమ వార్త విన్న తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు. వారి ఉద్యమ పోరాటం చదువు పట్ల వారికి ఉన్న ఇష్టం లక్ష్యసాధనకై పోరాడటం ఇరువురి తల్లిదండ్రులకు వారిపైన నమ్మకం ఏర్పడింది. మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోలీసు బుల్లెట్ గాయాలకు గాయపడి ఆపదలో ఉన్న శంకర్ కు గంగ ఆసుపత్రిలో అండగా ఉండటం ఒక సంఘటన. గ్రామంలో పంట పొలంలో పడిపోయి తలకు బలమైన గాయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మల్లారెడ్డికి వీరయ్య రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం. ఈ రెండు సంఘటనలో మానవత్వం వెల్లివిరిసింది. ఈ రెండు సంఘటనలే శంకర్ గంగల యొక్కప్రేమను వారి పెద్దలు ఒప్పుకొని వారి విలువలను పెంచాయి. కులం అనే అడ్డుగోడను తొలగించి మార్పు వైపుకు తొలి అడుగు పడింది.
చదువుకోవడం ద్వారా వచ్చే సంస్కారానికి గ్రామీణులు ఎక్కువగా విలువనిస్తారుఅని చదువు యొక్క గొప్పతనాన్ని రచయిత తెలిపాడు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజల మధ్య ఐక్యమత్యం వారు ఉపయోగించే జీవభాషనునిషితమైన పరిశీలన ద్వారా రచయిత పట్టుకోగలిగాడు పశువులు ఇష్టంగా తినే ‘కామంచగడ్డి’ రకం పేర్లను నవలలో ఉపయోగించటం వృత్తి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు.
అన్నదమ్ములు ఐకమత్యంతో ఉంటే బాగుంటుంది కానీ మల్లారెడ్డి సోమిరెడ్డి ల మధ్య పాలోల పంచాయతీ జరుగుతుంటే కొట్లాడుకుంటుంటే తల్లి పడే ఆవేదనను సందర్భ సహిత సామెతల ద్వారా తెలియజేశాడు. నాటు ఆయుర్వేద వైద్యం గురించి దెబ్బలకు కట్టే ‘గుంటే గరడాకు’ నలిపి కట్టడం నేటి తరానికి పరిచయం చేశాడు. తల్లిదండ్రులు తమ పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి భరోసానివ్వడం.అలాగే పిల్లలకు తాము పుట్టి పెరిగిన ఊరిపై ప్రేమను సంతోషాన్ని తెలుపుతూ, చదువు యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించేలా కులాల మధ్య అంతరాలను తొలగించేది చదువు ఇచ్చే సంస్కారం అనే ఆయుధం ద్వారా చెరిపి వేయవచ్చని నిరూపించాడు.
రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే మోసాలకు అప్పుల బాధలో ఉన్న సోమిరెడ్డిని పుల్లారెడ్డి మధ్యవర్తిత్వం వహించి భూమి అమ్మించి వచ్చిన డబ్బులు ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు. చివరకు సోమిరెడ్డి వద్ద ఉన్న డబ్బులు మొత్తం కోల్పోయి హైదరాబాదు నగరానికి వెళ్లి అక్కడ అడ్డా కూలిగా మారడం చూస్తే మోసాలు చేయడం మోసపోవడం మనుషులకుకాలాతీతంగావస్తునే ఉందని వివరించాడు. అప్పుల బాధతో ఆస్తులు అమ్ముకోవడం దాని వెనకున్న బాధను సోమిరెడ్డి పాత్రతో వివరించాడు. అప్పుల బాధలో ఉన్న తమ్ముడు భూమిని అమ్ముకోవడం చూసి తమ్ముడి కుటుంబం ఆగమవుతుందిఅని బాధపడటం అన్నదమ్ముల ఆప్యాయత వెతుకులాటలుమల్లారెడ్డి పాత్ర ద్వారా మనకు తెలియజేశాడు. మంచిగా బతికేటోడినిదిగజార్చి మోసం చేసి రోడ్డుపాలు చేసే ఎత్తుగడ రియల్ ఎస్టేట్ వ్యాపారం,ఫైనాన్స్ బేరం ద్వారా చూపించాడు. ఒక మనిషిని నమ్మించి ఎలా మోసం చేయొచ్చు, బొంకుతూ కల్లబొల్లి మాటలు చెబుతూ అమాయకులను మోసం చేస్తూ, పబ్బం గడుపుకోవడం పుల్లారెడ్డి పాత్ర ద్వారా వివరించాడు.
గ్రామాలలో పిల్లలు ఆడే ఆటలు పచ్చి సాట, ఓనగుంతలాటదాడాట, సాంప్రదాయ వస్తువులు ‘తాటిపొరక’, చెక్కుడు సంచి (డబ్బులు దాచేది) మొదలైన వాటి పేర్లను నవలలో వాడాడు. సాధు జంతువుల పట్ల ప్రేమానురాగాలు చూపించడం యాదమ్మ పాత్ర ద్వారా చిత్రంచాడు బర్రె ఈనే ముందు యాదమ్మ పడిన సంఘర్షణను చాలా బాగా వివరించాడు గ్రామీణులు ఆచారాలు సంప్రదాయాలు చాలా బాగా పాటిస్తారని ఈ పాత్ర ద్వారా తెలిపాడు. సమయం చూసుకునేందుకు గ్రామీణులంతా ఆకాశంలో నక్షత్రాల ఆధారంగా సమయం ఎంత అయిందో సులభంగా తెలుసుకోగలుగుతారు.గ్రామాలలో కరువు తాండవించడంతో ప్రజలు కూలి దొరకక ఇల్లు గడవక తమ బిడ్డలకు ఉద్యోగాలు రాక దిగులుగా బాధపడడం వలస పోయిన బతుకులు ఎలా ఉంటాయో వివరించాడు. ఊరు ఆగమవడం చూసి ఊరంతా ఒక్కటైబొడ్రాయి పండుగ గొప్పగా జరుపుకొని తమ దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలని అనుకోవడం ప్రజల మధ్య ఐక్యత ను వివరించాడు. ఇలా గ్రామీణ జీవితాన్ని చాలా అందంగా నవలలో చిత్రించాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మలిదశ తెలంగాణ ఉద్యమ చిత్రణ :
ఈ నవలలో రెండవ పార్శ్వం హైదరాబాదు నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటం. గ్రామ జీవితాలను నగర జీవితానికి పరిచయం చేసింది శంకర్ గంగల యొక్క చదువు ఉన్నత విద్య కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన శంకర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న ఉద్యమ నాయకుడు.గంగ పాత్ర ద్వారా నగర జీవితాన్ని పరిచయం చేశాడు నవల కారుడు సిటీ శైలిని చూసి అమాయకత్వంతో గంగా తాను చిన్నప్పుడు చదివిన ‘హైదరాబాద్ నగరం’ పాఠంను గుర్తుచేసుకుంది.నగరంలో యువత గ్రామీణులను చూసి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించాడు. హైదరాబాదు నగర సిటీ బస్సులో ఒక వింత వేషధారణతో రింగుల జుట్టు వేసుకొని ఒక అబ్బాయి ‘ వావ్ బ్యూటిఫుల్ విలేజ్ గర్ల్’అంటూ కామెంట్ చేయడం గంగకు ఒక వింతగా అనిపించింది.హైదరాబాదునగరంలో విద్యార్థినులు ఉపయోగించే దుస్తులను పాశ్చాత్య సంస్కృతిని ఖండిస్తూ గ్రామీణ సంస్కృతికి గొప్ప గౌరవం ఇచ్చాడు. మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆచారాలను ఆచరించి పాటిస్తేనే భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తామని విద్యార్థినుల పాత్ర ద్వారా చెప్పాడు ప్రవీణ్.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన విధానం విద్యార్థుల తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిన వేల ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థుల మధ్య జరిగిన చర్చలను ఉద్యమ సరళిని చాలా చక్కగా వివరించాడు. శంకర్ గంగల మధ్య ఉద్యమంతో పాటు ఆకర్షణ మొదలైంది. శంకర్ పోలీసు తోటాలకు గాయాల పాలైన తర్వాత ఆసుపత్రిలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడం నవల మరో సామాజిక మార్పుకు నాంది పలికింది. ముడుచుకున్న ఆకులో సైతం ఎత్తిన పిడికిలిని చూడటం నవలా కారునినిషిత పరిశీలకుడిగా నిలబెట్టింది తెలంగాణ ఇక రాదేమో అనుకొని ఆత్మహత్య చేసుకున్న రవిని చూసి తల్లడిల్లిన క్యాంపస్ విద్యార్థులను ఉద్యమించిన విద్యార్థుల ఉక్కు పిడికెళ్లను పోలీసులు లాటి చార్జీలు రబ్బర్ బుల్లెట్లు విద్యార్థులపై భాష్ప వాయువు ప్రయోగం చేయడం వంటి వాటికి విద్యార్థుల జీవితాలను పోలీసు గొడవల మధ్య క్యాంపస్ వాతావరణాన్ని విపులంగా వివరించాడు. శంకర్ మిత్రుడు సూరి ని పోలీసులు ఎన్కౌంటర్ చేయగా ఆ వార్తను శంకర్ పేపర్లో చదివి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు .తన మిత్రుడు అంటే శంకర్ కు ఎంత ప్రాణమో తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ కవులు ఇచ్చిన ఉద్యమ నినాదాలు ప్రతి ఒక్కరిని ఉద్యమానికి పిడికిలెత్తి నినదించేలా కదం కలిపి ఉద్యమంలో పాల్గొనేలా చేశాయి.
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణంలోని పోలీసుల బుల్లెట్ల తూటాలకు గాయపడిన శంకరును చూడడానికి నగరానికి చేరుకున్న తల్లిదండ్రులు శంకరును ఆ స్థితిలో చూసి విలవిలలాడిపోవడం ఉద్యమ సమయంలో బలైన ఎందరో అమరవీరుల తల్లిదండ్రుల హృదయ విధారక ఘట్టం గుర్తుకు తెచ్చి కంటతడి పెట్టించేలా రచన చేశాడు. ఎత్తిన పిడికిళ్ళు, ఎగిరే జెండాలు, వీరుల త్యాగాలు, ఉద్యమ సైన్యాలు, తెలంగాణను సాధించి పెట్టి ప్రతి ఒక్కరి జీవితాన్ని గెలిపిస్తాయని విద్యార్థుల అపారమైన నమ్మకమే ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా ముందుకు తీసుకువెళ్లాయి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2 2014 న ఏర్పాటయ్యింది. శంకర్ గంగ వీరు తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకొని తర్వాత ఉద్యోగ సాధనకై మళ్లీ క్యాంపస్ బాట పట్టి తమ లక్ష్యాలను సాధించుకోవడానికి చదువులో తలమునకలైపోయారు. దీనిని బట్టి నేటి యువత కూడా తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తమకు ఉన్న అనేక వ్యాపకాలను పక్కనపెట్టి లక్ష్యసాధనకై పోరాడాలని రచయిత సూచించాడు.
నర్రా ప్రవీణ్ రెడ్డి తొలి నవల ‘పొత్తి’ అంపశయ్య నవీన్ ఫౌండేషన్ వారి ఉత్తమ నవలా పురస్కారం గెలుచుకోవడం తోపాటు కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి పలుమార్లు పోటీలో నిలవడం గమనార్హం.దీనికి గల కారణం నర్రా ఎంచుకున్న నవల ఇతివృత్తం, పాత్రలు, సజీవ భాషా, జీవద్భాష, రచన ప్రణాళిక ,ప్రతిభ, ఊహ శక్తి, సన్నివేశాల కల్పన, సంక్షిప్తతో కూడిన కథనం,స్ఫూర్తివంతమైన రచనా విధానం, తెలంగాణ మాండలిక పదజాల సంపదను విరివిగా వాడడం.గ్రామీణ సంస్కృతికి నగర సంస్కృతికి మలిదశ తెలంగాణ ఉద్యమాలకు వారధిగా నిలిచింది నర్రా‘పొత్తి’ నవల. భవిష్యత్తులో ఈ నవల ఎన్నో పురస్కారాలను గెలుచుకొని నర్రా ప్రవీణ్ రెడ్డిని ‘పొత్తి ప్రవీణ్ రెడ్డి’ గా గౌరవాన్ని నిలబెడుతుందని ఆశిస్తూ ..

పల్లె సతీష్
తెలుగు పరిశోధక విద్యార్థి
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News