అల్పాక్షరాలలో అనల్పార్థ రచన అని పాల్కురికి సోమనాథుడు అన్నట్లు నిగూఢత కవిత్వానికి కొత్త శోభ నిస్తుంది. అందుకే సినారె కప్పి చెప్పేది కవిత్వం అన్నారు. అత్యంత సంక్షిప్తంగా విస్తృతమైన అర్ధాన్నిచేలా కవిత్వం రాయడం కత్తి మీద సామే. కవిత్వ నిర్మాణ కుశలత తెలిసిన వారు మాత్రమే చిన్న చిన్న స్టాంజాల్లో భావాలను గుప్పించగలరు. ఇటీవల తెలుగు సాహిత్యంలోకి పాలగుమ్మితో వచ్చిన చిగురాల్ పల్లి ప్రసాద్ ఈకోవలోనివారే. శ్రీకవనాలు అనే పేరుతో లఘు కవిత ప్రక్రియను ఏర్పరచుకొని రాసిన మినీ కవితలే ఈ పాలగుమ్మి. చేయి తిరిగిన చిత్రకారుడు చక్కని వర్ణ చిత్రం గీసినట్లు చిన్న చిన్న ఫ్రేమ్ లలో చిగురాల్ అద్భుతమైన భావ చిత్రాలను ఈ కవితల్లో చిత్రిక పట్టారు. వీరి కవిత్వంలో జీవితముంది. పల్లె పరిమళాలు వెదజల్లుతుంది. మానవీయ బంధాలను అందంగా ఆవిష్కరించారు. ఆర్తి, ఆవేశం, ప్రకృతి చిత్రణ, మానవీయత వీరి కవిత్వంలో పుష్కలంగా కనిపిస్తాయి.
‘మా దుఃఖాన్ని నూనెగా పోసుకొని దీపం కాపలైంది నాన్న ఫోటోకి’ ఈ కవికి తండ్రిపై అపారమైన ప్రేమ. అనేక కవితలు తండ్రి గురించి రాశారు. తండ్రి పోయిన దుఃఖాన్ని కవిత్వంగా తర్జుమా చేస్తే ఇటువంటి కవిత్వం వస్తుందనడానికి పైన పేర్కొన్న కవిత ఒక ఉదాహరణ మాత్రమే.
నా గుండె గుమ్మానికి /వాడిపోని తోరణాలు/ మా నాన్న జ్ఞాపకాలు అమ్మ /రోజు చెప్పే అనగనగా ఒక రాజు కథలో/ నాన్నే రాజని ఇప్పుడే తెలిసింది. గుండె గుండెకు/ పేగు ముడి వేసిన అమాయకపు దేహం/ అమ్మ వంటి కవితలు చిగురాల్ పల్లిని మానవీయ బంధాలకు మిక్కిలి ప్రాధాన్యత ఇచ్చే కవిగా నిలబెడతాయి. చిగురాల్ పల్లి పేదరికపు రుచి తెలిసినవాడు. శ్రమ జీవన సౌందర్యాన్ని చూస్తూ పెరిగిన వాడు. అందుకే ‘నేను అడ్డమీదికెళ్లినప్పుడల్లా / పార గడ్డపారలు/ చేతులు చాచి పిలుస్తాయి’ అనగలిగాడు.
ఈ కవికి ప్రకృతిని చూస్తే పరవశించిపోయే గుణం కనిపిస్తున్నది.
‘మా ఊరి చెరువు గట్టుకు నేనెప్పుడెళ్ళినా గాలి పిల్లొచ్చి తల దువ్వి పోతుంది’ చెరువొడ్డున నడుస్తున్నప్పుడు గాలి తెమ్మెరలు కురులను సవరించే వైనాన్ని అందంగా అక్షరీకరించగలిగారు. రవి గాంచని చోటును సైతం కవిగాంచును అనడానికి రుజువులుగా చూప దగిన కవితలు అనేకం పాల గుమ్మిలో ఉన్నాయి. ప్రాకృతిక సౌందర్యాన్ని అందమైన ఇమేజ్ లలో బంధించ గలిగిన సౌందర్యోపాసకుడు చిగురాల్ పల్లి. పొద్దున్నే కిటికీ జైల్లో చిక్కుకున్నాడు సూర్యుడు తలుపులు తీసి విడిపించాను. తాను చూసిన దృశ్యాన్ని పాఠ కుల మనోఫలకంపై చిత్రించగల నైపుణ్యం ఈ మినీ కవితలో గమనించ వచ్చు. టీవీ యాంకర్ బాధను పెదాలకు రాసుకొని వార్తలు చదువుతుంది. ముఖానికి మేకప్, పెదాలకు లిప్స్టిక్, చెరగని చిరునవ్వుతో కనిపించే టీవీ యాంకర్ల వెనుక ఉన్న బాధామయ జీవితాలను ఈ కవి చూడగలిగాడు.
వీరి కవిత్వంలో కొంత తాత్విక ధోరణి కూడా కనిపిస్తున్నది. కాలం సృష్టి గమనానికి శాశ్వత సాక్షి. ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా కాల గమనంలో అదంతా సహజమే అని చెప్పే క్రమంలో ‘కొత్త సంవత్సరాన్ని కూడా పాత గడియారమే స్వాగతించింది’ అంటారు.
చిగురాళ్లపల్లి ప్రసాద్ కవిత్వంలో అలంకారిక సొగసు మనసును కట్టివే స్తుంది. రాత్రి వేళలో కాలనీలో లైట్లు వెలుగుతున్నాయి అని చెప్పడానికి అందమైన రూపకాలంకారాన్ని ప్రయోగించారు. ‘కాలనీలు చీకటి కురులు దువ్వుకొని లైట్ల పూలు పెట్టుకున్నాయి’ బతుకు పూలు, చెమట పువ్వు, గాలి పిల్ల, వయస్సు నది, ప్రేమ సంద్రం, జ్ఞాన నది, బిడ్డ దీపం, ఆల్బమ్ సమాధి, మట్టి దుప్పటి, ఆకలి దీపం, గుండె గది, కవితా గూడు, గాలి బావ, బతుకు తోట, కథల దండ, ముగ్గు దీపం, పిలుపు తోట, ఆకాశపు దుప్పటి, కండ్ల కిటికీ వంటి రూపకాలు ఈ కవిత్వానికి మరింత వన్నె తెచ్చాయి.
ఈ నిచ్చెన మెట్ల సమాజంలో కుల వివక్ష పై ఈ కవి తీవ్ర నిరసన ప్రకటించాడు. సమతా కేంద్రంగా ఉండాల్సిన దేవాలయం వివక్షకు కారణం అవుతున్నందుకు ఆవేదన చెందాడు. అతడు ఊళ్లో మనుషులుగా ఉన్న మమ్మ ల్ని దేవుడి గుడి కట్టి విడగొట్టాడు. ఒకే దేవునికి కులాల వారి దేవాలయాలను నిర్మిస్తున్న వైనం నేటి సమాజంలో గమనించవచ్చు. ఐక్యత ఉండాల్సిన చోట అనైక్యతకు కారణం అవుతున్న ఈ విధానాన్ని కవి వ్యతిరేకించాడు.
నా దేశంలో అంటరానితనం పెట్టిన పుట్టుమచ్చ… ఆవేదనతో రాసిన పద్యమిది. పుట్టుకతో అందరూ సమానులైనప్పుడు తక్కువ కులం అనేది మనిషి కల్పించిందే కదా… ఇంతటి విస్తృత భావాన్ని ఏకవాక్యంలో చెప్పగలిగాడు. ప్రేమ వివాహాల వల్ల కొంత కుల నిర్మూలన జరుగుతుందని ఈ కవి ఆకాంక్షి స్తున్నాడు. వాళ్ల పెళ్లికి రెండు కులాల గోడలు కూలిపోయాయి… అనడం ఇందుకు నిదర్శనం. నువ్వు నేను ఒకటి కాదు మన మధ్యలో కులం గోడలు కట్టిన సమాజం.. అనే కవిత వెనుక సమాజంలోని అసమానత్వం పట్ల కవి ఆవేదన ప్రస్ఫుటమవుతున్నది.
ఒక స్పష్టమైన సామాజిక స్పృహ కవిత్వ దృక్పథం ఉన్న ప్రసాద్ తన కవిత్వ లక్ష్యాన్ని తన కవితల్లో స్పష్టంగా చెప్పారు. నా అక్షరాలు సూర్యుడిపై కాల్చిన రొట్టె ముక్కలు కాదు శ్రీకవనాలకు పూసిన కన్నీటి చుక్కలు శ్రమ జీవుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిలబడుతున్న ఈ కవి భావి సాహితీ ప్రపంచానికి మేలు బంతి లాంటి కవిత్వాన్ని అందిస్తాడనడంలో సందేహం లేదు
- డాక్టర్ సాగర్ల సత్తయ్య
7989117415