Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: ప్రేమ సాగరపు తీరాన్ని..

Telugu Literature: ప్రేమ సాగరపు తీరాన్ని..

కవికి ఉండే సహజ భావాలున్న ఈ కావ్యానికి అక్షరాభినందనలు

ప్రేమ సాగరపు తీరాన్ని
కవనమై చూపిన గుండెల్లో గోదారి…
ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో బావుకత్వంలో హెచ్చు తగ్గులైన తారతమ్యాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన మనసు మాటను ప్రపంచానికి తెలియజేయాలి..! అని కవి తన అంత రంగపు భావాలను సమాజానికి అందించాలనుకుంటాడు.. ఆ సమా జంలో కొద్ది మార్పునైనా తన రచనల ద్వారా కళ్ళారా చూడాలి..!! అని ప్రగాఢంగా విశ్వసించే వారి మొదటి వరుసలో ఒకరైన జగిత్యాల జిల్లా ధర్మపురి వాసి, కవి మాడిశెట్టి శ్రీనివాస్‌. తను రచించిన మొదటి కవితా సంపుటి గుండెల్లో గోదారి… పలు సాహితీ సంస్థలచే పురస్కా రాలు అందుకొన్నది.
తన కవితా సంపుటిలో హృదయ గతమైన అనుభూతులకు అంద మైన అక్షర రూపం కల్పిస్తూ,.. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థా లతో ఒక ప్రత్యేకమైన భావోద్వేగమైనటువంటి, ఊహాజనితాన్ని అక్షర బద్దం చేయగలిగాడు శ్రీనివాస్‌.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రకమైన ప్రేమ ఎవరిపైనో ఒకరి పైన అనేది నిర్మించుకోక, పంచి పెట్టక తప్పదు. మానసికంగా, శారీరకం గా బలమైన ఆప్యాయతతో కూడిన భావోద్వేగాలు, ప్రవర్తనలు మరి యు నమ్మకాలు ఆ ప్రేమ నందు మిళితమై ఉంటాయి. నేటి తెలుగు సినీ చరిత్రలో గాని, టెలివిజన్లో ధారావాహికలుగా ఏళ్ల తరబడి ప్రేమ కాన్సెప్ట్‌ తో ఇక అంతం లేదు అనే విధంగా ఎన్నో, మరెన్నో కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక కవి గాని ఒక రచయిత గాని తను ఎంచుకున్న కవిత లోనైనా కథలోనైనా వస్తువుగా ప్రేమను సరైన కోణంలో అక్షరీకరించినట్లయితే ఆ కవితకు కానీ ఆ కథకు కానీ శుభం కార్డు ఉండదు. కారణం ఏమిటంటే కవి హృదయం అనంత మైనదని, కనిపించని మనసు అందాలను, ఊహలకందని కొత్త ధనా న్ని సృష్టిస్తుంది. ఆ ప్రతిఫలంగా బరువెక్కిన గుండెగా గాని, ఆనం దాన్ని పంచే హృదయంలో మరో కోణాన్ని ఊహించు కునే విధంగా సాగరమై ప్రవహిస్తూనే ఉంటుంది. తను వెలువరించిన ఈ మొదటి కవితా సంపుటిలో…. నా గుండెల్లో పవిత్రంగా దాచుకున్న పాదముద్ర లే నీవైనప్పుడు నువ్వెక్క డుంటే నాకేం…!! అంటూ తెలుగు చలన చిత్రాలలోని పాటల శైలిని తనదైన కోణంలో…… శ్రీనివాస్‌ అందిస్తున్న ఈ కవితా సంపుటిలోని కొన్ని కవితలను పరిశీలిస్తే….
అలసిన గుండె…కవితలో…
నేస్తం…!!
ప్రతిసారి నాలోని నీ జ్ఞాపకాల్ని మోసుకెళ్తావు…
ఊహలతీరం చేరుకునేలోపే
ఊహాతీతంగా వాటిని చిదిమేస్తావు.
ప్రతి జ్ఞాపకాన్ని
జాగ్రత్తగా అల్లేస్తావు…కప్పేస్తావు…
మన ప్రేమ పూరిగుడిసె
పైకప్పుగా…
( ప్రేమ గుడ్డిది అనేది ఒక మాట అయితే…. ఒక మనసు ఇం కొక మనిసుని ఆకర్షించడం కానివ్వండి, తన మనసులో స్థానాన్ని కల్పించుకోవడం మరేదైనా పేదరికం అనేది ప్రేమలో అడ్డు కాదు అని తెలియజేస్తూ స్వచ్ఛమైన ప్రేమ మరేదీ ఆశించదు అంటాడు కవి )
మరణాక్షరం…కవితలో
నువ్వు
దూరమైతే నాకేంటి వీడిపోతే నాకేంటి నువ్వెక్కడుంటే నాకేంటి…!? నిన్ను ఉత్తరాల్లో వెదుక్కుంటా
నీ అక్షరాల్తో ఆడుకుంటా
నీ జ్ఞాపకాల్నే కౌగిలించుకుంటా…
ఎదనిండా అక్షరమై
ఎదురుచూపుల గవాక్షమై
నీ ప్రేమలేఖల కౌగిళ్ళో ఒదిగిపోతా… మదినిండా వేదననై
మరువలేని జ్ఞాపకాన్నై
( రవి కాంచని చోటుని కవి కాంచును అనటంలో అతిశయోక్తి లేదు మరి! ఊహల్లో వర్ణన, మనసు భావాలలో ఉన్న కొత్త ధనపు విషయాలను కవి ఈ కవణంలో తెలియజేశాడు
బతుకు చిత్రం…కవితలో
అంతంలేని ఆలోచనలతో గంతలు కట్టుకున్న సమాజంలో
కుళ్ళిన వాసనల మధ్య నడుస్తున్నా దిక్కులేని ఒంటరిలా…!!
నడుస్తున్న నేను ఆగాను…ఆ దృశ్యం చూసి… మండే ఎండలో
రోడ్డు పక్క చెత్తకుండీలో చొంగలు కార్చే కుక్కతో కల్సి
విందారగిస్తోంది ఓ వృద్ధురాలు…
అక్కడక్కడా అన్నం మెతుకులున్న ఆత్రంగా వెతుకుతోంది దేనికోసమో…
( బతుకు జీవన పయనంలో మనిషి చూసే కోణం ఒక ప్రత్యేకత అని తెలియజేయడం కవి యొక్క హృదయం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆలోచించగలుగుతాడు అనే వివరణాత్మక కవనం )
రంగుల కల…కవితలో
రంగులకల జీవితం….! భావాల్లో అనుభవాల్లో బంధాల్లో అనుబంధాల్లో, ముఖానికి రంగేసుకో
మనసుకి రంగేయకు
ప్రేమించు. ప్రేమను పంచు….!!
ప్రేమతత్వాన్ని పెంచు..
మనస్తత్వాన్ని సవరించు….! పరజీవిని ప్రేమించు…
చిరంజీవిగా మరణించు….!!
( రంగుల జీవితం అంటూ సాగిన ఈ కవనం లో మనిషి యొక్క తత్వాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తూ… మనిషి తన జీవన గవనంలో తీరం ఏమిటో తెలుసుకొని ఉన్నతమైన వ్యక్తిత్వ విలువలతో ముం దుకు సాగాలని తెలిపాడు)
ఇలా కవితలతో భద్రపరచిన ఈ సంపుటి సకల భావాలను ఓకే నావపై తీసుకొచ్చిన దీర్ఘకావ్యంలా తలపిస్తుందని చెప్పవచ్చు. ఒక కవికి ఉండే సహజ భావాలను ఈ కావ్యంలో కనిపిస్తున్నాయి. టి ఎస్‌ ఆర్‌టిసిలో సూపరిండెంట్‌ గా గుత్తి బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సాహిత్యం పై తన అభిమానాన్ని పెంచుకొని సాహితీ లోకంలో పయ నిస్తున్న శ్రీనివాస్‌ కవిగా పలు సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. శుభం కార్డు పడని, అంతం లేని వస్తువును ఎంపిక చేసుకున్న ఈ కవితా సంపుటికి తోడుగా మరిన్ని సంపుటిలు తన కలం నుండి వెలువడాలని ఆశిస్తూ అక్షరాభినందనలు తెలియజేస్తున్నాను.

  • డా.చిటికెన కిరణ్‌ కుమార్‌
    ప్రముఖ రచయిత, విమర్శకులు సభ్యులు,
    9490841284
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News