Tuesday, September 10, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: కథా సాహిత్యంలో అరుదైన మజిలీలు

Telugu Literature: కథా సాహిత్యంలో అరుదైన మజిలీలు

మధిర సుబ్బన్న దీక్షితులు అనే కవి, రచయిత ‘కాశీ మజిలీ కథలు’ రాసి సుమారు వందేళ్లు కావస్తోంది. 1926లో మొదటిసారిగా ముద్రించిన ఈ 12 సంపుటాల కాశీ మజిలీ కథలకు ఇంతవరకూ వన్నె తగ్గలేదు. ఇప్పటికీ కాశీకి వెళ్లే వారు రైల్లో కూర్చుని చదువుకోవడానికి వీలుగానే ఉంటాయి. మణి సిద్ధుడనే ఓ పండితుడు దక్షిణ ప్రాంతం నుంచి కాలినడకన కాశీ బయలు దేరుతాడు. ఈ కాశీ యాత్రలో తనకు తోడుగా ఉండడానికి గోపకుమారుడనే పశువుల కాపరిని కూడా వెంట తీసుకు వెడతాడు. దారిలో జరిగే సంఘటనలను కథలుగా మలచడంతో పాటు, తమకు తెలియవచ్చిన కథలను, తాము చెప్పుకునే కథలను గుదిగుచ్చి సంపుటాలుగా వెలువరించడం జరిగింది. ఇందులో పది సంపుటాలను మధిర సుబ్బన్న దీక్షితులే రాయగా, మిగిలిన రెండు సంపుటాలను ఆయన తర్వాత ఆయన కుమారుడు మధిర కొండయ్య శాస్త్రి రాయడం జరిగింది. ఈ 12 సంపుటాల కాశీ మజిలీ కథలకు తెలుగు సాహిత్యంలో తిరుగులేని స్థానం ఏర్పడింది. కాశీ యాత్రకు సంబంధించి ఇంతకన్నా అత్యుత్తమ గ్రంథం మరొకటి ఉండదనే పేరు కూడా వచ్చింది.
ఈ కథా రచన ఇతివృత్తం ఏమిటంటే, మణిసిద్ధుడనే ఒక బ్రహ్మచారి పరమ పవిత్ర క్షేత్రమైన కాశీకి బయలుదేరుతాడు. అప్పట్లో వాహన సదుపాయాలు లేకపోవడం వల్ల, అడువులు, కొండలు, లోయల్లో ప్రయాణం చేయాల్సి రావడం వల్ల ఈ యాత్రలో తనకు ఎవరైనా తోడుంటే బాగుంటుందని అతను అను కుంటాడు. ఎవరిని అడిగినా ఎవరూ ముందుకు రారు. చివరకు శ్రీరంగపురం శివార్లలో నివసిస్తున్న పశువుల కాపరి, అనాథ కోటప్ప అతనితో కాశీ బయలు దేరడానికి ముందుకు వస్తాడు. మణిసిద్ధుడు, కోటప్ప కలిసి కాశీకి బయలుదేరి, మధ్య మధ్య సత్రాల్లోనూ, పూటకూళ్ల ఇళ్లలోనూ బస చేస్తూ కథలు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తారు. ఇందులో ఎన్నో ఉప కథలు, గొలుసుకట్టు కథలు కూడా ఉంటాయి. మార్గమధ్యంలో తనకు కథలు చెబుతూ, అలసట పోగొడుతూ, సరదాగా కబుర్లు చెబుతూ వస్తేనే తాను వస్తానని కోటయ్య షరతు పెట్టడం వల్లే చివరికి ఈ కాశీ మజిలీ కథలు రూపుదిద్దుకున్నాయి.
ఈ కథల్లో పతివ్రతల ప్రభావం. దుష్ట స్త్రీల కుత్సిత స్వభావం, సత్పురుష సాంగత్యం, దుష్టుల సావాసం, దేశాటనం, పండిత సంపర్కం, రాజనీతి, వ్యవహార వివేకం, వదాన్య లక్షణం, లోభి ప్రవృత్తి వంటి అనేక విషయాలకు సంబంధించిన వర్ణన ఉంటుంది. ఇవే కాకుండా, శ్రీకృష్ణ దేవరాయలు, భోజరాజు, శంకరాచార్యులు, విక్రమార్కుడు, నారదుడు, ప్రహ్లాదుడు వంటి మహాపురుషుల కథలు, గాథలను కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు కాశీ యాత్రకు కష్టాలు పడాల్సిన అవసరం లేకపోయినా, ప్రయాణ దూరం, ప్రయాణ సమయం తగ్గినా కథలకు మాత్రం ఏమాత్రం ప్రాధాన్యం తగ్గలేదు. రైల్లో కాశీ యాత్రకు బయలుదేరుతున్న ప్పుడు చాలామంది సాహిత్య అభిమానులు ఈ సంపుటాలను వెంట తీసుకుని, చదువుతూ వెళ్లే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కథలు నవరసాలనూ పండిస్తాయి. ఆద్యంతం ఉత్కంఠ కూడా కలిగిస్తాయి. అక్కడక్కడా అప్పుడప్పుడూ శృంగార రసాన్ని కూడా ఒలికించి గిలిగింతలు పెడతాయి.
మొత్తం మీద కాశీ మజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణను, పఠనాసక్తిని సాధించాయి. ఇవి తెలుగు సాహితీ లోకంలో సుస్థిర స్థానాన్ని పొందడమే కాక, పలువురు గ్రంథ రచయితలకు, కథా సాహిత్య భిమానులకు స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచాయి. అంతేకాదు, ఈ కథలు1950ల నుంచి 70ల వరకు చలన చిత్రరంగం మీద కూడా తమ ప్రభావాన్ని చూపించాయి. అనేక జానపద చిత్రాలకు ఈ కథలే మూలమయ్యాయి. వీటిని ఆధారంగా చేసుకోవడమే కాకుండా, వీటిని యథాతథంగా చిత్రాలకు ఉప యోగించుకోవడం కూడా జరిగింది. సాహిత్య రంగంలో, ముఖ్యంగా కథా సాహిత్య రంగంలో పలువురు రచయితలు ఈ కథలను అనుసరించడంతో పాటు, వీటిని స్ఫూర్తిగా తీసుకుని, రచనలు చేయడం కూడా జరిగింది. పేదరాశి పెద్దమ్మ కథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథలలో ఈ కథల్లోని ఇతివృత్తాలు, శైలి, నాటకీయత, శిల్పం వంటి వాటిని అనుసరించడం, అనుకరించడం వంటివి కూడా జరిగాయి. ఈ కథల్లో అద్భుతమైన ఉపమానాలతో పాటు, అలంకారాలు, వ్యాకరణ విశేషాలు కూడా ఎన్నో లభ్యమవుతాయి.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News