Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: అంతరంగవు భాష - అగ్ని శ్వాస

Telugu literature: అంతరంగవు భాష – అగ్ని శ్వాస

చెవులు ఉన్న చెవిటితనం, నోరు ఉన్న మూగతనం, కళ్ళు ఉన్న గుడ్డితనం, సత్తవ ఉన్న చేతకానితనం ఉన్న నేటి తరంలో కణం కణంలో అగ్గిని నింపుకున్న అగ్ని కణం నిఖిలేశ్వర్‌ గారు. అభ్యుదయ కవిత్వంకు, విప్లవ కవిత్వంకు మధ్య వారధిగా ఉన్న కవిత్వం దిగంబర కవిత్వం. దిగంబరకవులలో ఒకరు అయిన నిఖిలేశ్వర్‌ గారు నిజాయితీని నిలువెల్ల నింపుకున్నకవి. నిఖిలేశ్వర్‌ గారి అగ్ని శ్వాస నిజంగా అంతరంగపు భాష.
చావు లేని నిజం కోసం
రాజీలేని న్యాయవ్యవస్థలో
నిరంతర ప్రక్షాళనలో
ఆవహించే ఆగ్నేయరూపాలు
ఉవ్వెత్తున ఎగిసి పడే మానవ కెరటాలలో
భగ్గుమనే బడబాగ్ని వేదనలు – విప్లవాలు!
మార్పు కోసం మధనం, తరాల కోసం తపన, విప్లవాల కోసం ఎదురుచూపులు ఉన్న కవి నిఖిలేశ్వర్‌ గారు. ఎందరు ఏమి అన్న నిఖిలేశ్వర్గారిది స్వచ్ఛమైన పునీతమైన భాష అంతకన్నా నిండుగా నింపుకున్న అగ్ని శ్వాస. వారి భాష ఏసీ రూములో బస చేయలేదు, సౌందర్య కుసుమాల కోసం పరితపించలేదు, కీర్తి కిరటాల కోసం తలవంచలేదు. దిక్కులను హెచ్చరించి దివిటి కాంతులందరికీ పంచిన కవి. కాలాన్ని వెంబడించి కాల రహస్యాన్ని వెతికిన కవి. కాల రహస్యం అనే కవితలో ‘బడికంటే గుడి మాత్రమే నడవడి సూత్రం! అని అంటాడు. కడుపు నిండుగా నింపని చదువుల కోసం కడుపు మాడ్చుకొని కోరికలు వాయిదా వేసుకునే తల్లిదండ్రులు నిజంగా వారి జీవితాలు రాజీ పడిన మనస్తత్వాలు బండరాయికి ముడుపులు చెల్లించి తాము మాత్రం నిలువు దోపిడి గురి అయిన కార్పొరేట్‌ బాధితులు.
పట్టించుకోని వ్యవస్థ రాక్షస మనస్తత్వాన్ని తలపిస్తుంటే ప్రభు త్వాలు విద్యానిధులు మళ్లిస్తుంటే నిర్లక్ష్యానికి పాల్పడుతుంటే సర్కార్‌ బడులు భారమవుతుంటే చదువు మసక బారుతుంటే గుడులు మత సంస్థలు మాత్రం రత్నాలు వజ్ర వైఢ్యురాలతో వెలిగిపోతున్నాయి.
నిఖిలేశ్వర్‌ భవిష్యత్‌కి భరోసా ఇచ్చే ఒక ఆశవాది. విజృంభిం చిన రైతు అనే కవితలో రైతుల ఆక్రోషాన్ని ప్రతి అక్షరంలో నిబిడీకృతం చేసిన కవి.
‘తుపాకీ గుండ్లు కురిపించిన
మంత్రులు,- దళారులు బుజ్జగించిన
చెమట ఆక్రోశాన్ని అడ్డుకోలేరు.
అన్నం పెట్టే చేతులకి కన్నం పెట్టే వ్యవస్థలోఉన్నాం. వ్యవసా యం నేడు జూదమైపోయింది. విత్తనాల కొరత యూరియా మందు ధరలు పండిన పంట అప్పనంగా కాజేసే దుర్మార్గపుదళారీ వ్యవస్థ . ప్రకృతి కురిపించే అకాల వర్షాలు , వ్యవసాయదారుడు కి ఏమాత్రం మద్దతు ఇవ్వని మద్దతు ధర, రణ భూమిని మరిపించే రుణ ఊబి నేడు.
అయినా మనిషి ఆశావాది ఏనాటికైనా పంట పండించే వాడే
అధికార పీఠాన్ని అదిలించి పాలించగలడు అని నిఖిలేశ్వర్‌
భవిష్యత్తుకు కొండంత భరోసా ఇచ్చాడు. పాలకుల గుండెల పై
ఇక నాగళ్ళు చెబుతాయి తీర్పు అంటాడు.
కాలమా నీవెక్కడ? అని ప్రశ్నించే కవి నిఖిలేశ్వర్‌ గారు
‘రుతువులు ఎన్ని మారిన
బ్రతుకు తెరువంత ఎండాకాలమే
ఇప్పుడు విజయ నామము మనగానే
జీవనరంగమంతా అపజయమే!
ప్రపంచమంతా ఆధునికరించిన టెక్నాలజీ మారిపోతుంటే ఆకలి సరిగా తీరుతుందో తెలియదు గానీ, అవసరాలు సరిగా తీరుతున్నాయో తెలియదు గాని అరచేయ్యి మాత్రం టచ్‌ ఫోన్‌ తో ఆధునికరించబడుతుంది.ఇదే అభివృద్ది అనుకుంటే అంతకంటే అసత్యం మరొక్కటి లేదు
రుతువులు మారిన బ్రతుకు తెరువు దొరకడం లేదు బతుకు విజయ నామ సంవత్సర అనగానే జీవితం మాత్రం అపజయమే అవుతుంది సుడిగుండాలలో చిక్కుతుంది అని కవి
అక్షరాలతో ఆవేదన వినిపిస్తారు నేడు కష్టజీవులందరిది అసహజ మరణాలే, అవినీతి అక్రమార్జున కులజ్యాడం మగ మృగాలా పైశాచికానందం ఉన్నచోట ప్రతి మనిషిది
అకాల మరణాలే. నిజమే కదా. నిఖిలేశ్వర్‌ గారు నిజాలు నిగ్గు తేల్చే కవి నూతన వ్యవస్థ కోసం పరితపించే కవి అక్షర బాణాలతో వ్యవస్థను ఉతికి ఆరేసిన అసలు సిసలైన కవి.
బాల్యం ఎప్పుడూ పండు వెన్నెలే , స్వచ్ఛత నిండిన నిండు హృదయాలే. బాల్యం గురించి ఎన్ని కవితలు రాసిన కొరత తీరదు. మా ఊరి దారిలో అనే కవితలో మనం పోగొట్టుకున్న ప్రపంచాన్ని టార్చ్‌ లైట్‌ వేసి వెతికి పట్టుకోవడం లాంటిది. నిఖిలేశ్వర్‌ గారు తన బాల్యంలో గడిపిన వీరెల్లి గ్రామం గురించి అక్షరాల్లో బంధించిన వైనం పాఠకులకు మరింత అమృతా నందాన్ని కలిగిస్తుంది. నేడు బాల్యం బందిఖానాగా మారింది.
ఆటపాటలతో నిండవలసిన విద్య నేడు ఐఐటి కారాగారంగా మారింది. పచ్చదనం పోయి వెచ్చదనం వెక్కిరిస్తుంది.
చిన్ననాటి నా దారంతా తలలూపుతూ పలకరించిన
తంగేడు పూల పసుపు ముఖాలు
గునుగు పూల తెల్లనిజడలు
మోదుగ పూల చిలుక ముక్కులు
గుల్‌ మొహర్‌ పరిచిన ఎర్ర తివాచి
అంటూ కవితాత్మకంగా చెప్పిన తీరు చూస్తుంటే మన ఊరు జాడను దొరకబుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. కల్లు ధార ను ఒడిసి పట్టినట్టు అనిపిస్తుంది.
నా మహానగరమైనా? అనే కవితలో ఆచూకీ వెతుక్కుంటున్న ట్లుగా ఉంటుంది. ఉపాధి కోసం ఉద్యోగాల కోసం అవసరాల కోసం రోజురోజు విస్తరిస్తున్న ఈ నగరం విశ్వనగరంగా మారు తుంది. అటు చూసి ఇటు చూసి లోపలే అపార్ట్మెంట్లు వెలుస్తు న్నాయి అరక్షణంలో అడ్రస్లు మారుతున్నాయి. పంట పొలాలు పోటీ బడి మరి రియల్‌ ఎస్టేట్‌ భూములుగా రూపు దాల్చుతు న్నాయి. హైదరాబాద్‌ హైటెక్‌ వేగంతో ఎదుగుతుంటే మనుషులు మరుగుజ్జులుగా మారు తున్నారు.
నా ఆనవాళ్లు వెతుక్కుంటూ
జీవితం తిరిగిన
నా మహానగరమైన ఇది?
అని కవి ప్రశ్నిస్తాడు. వేటాడే వేగంతో దూసుకెళ్తున్న వాహ నాల రోద గుండె కోతకు గురిచేస్తుంది అంటాడు. హుస్సేన్‌ సాగర్‌ జల కాలుష్యాన్ని మరింత పెంచుతున్న వినాయక నిమజ్జనం సమంజస మైన అని ఆత్మఘోషతో వినిపిస్తాడు.
అగ్ని శ్వాస 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన కవితా సంపుటి. నిఖిలేశ్వర్‌గా పేరుపొందిన పొందిన యాదవ రెడ్డి. ప్రతి ఒక్కరు యాది లో ఉంచుకోవాల్సిన కవి. తాను కదులుతూ కదిలిస్తూ అక్షరాలతో నిత్యం కవాత్తు చేయిస్తూ భాషని శ్వాసగా పిలుస్తూ వాక్యాలతో వాగ్దానాలు చేస్తూ చెమటకు చుక్క కు మద్దతు ఇస్తూ అక్షరాస్త్రాలు సంధిస్తున్న కవి నిఖిలేశ్వర్‌ గారు గురించి ఎంత చెప్పినా తక్కువే.
సాదే సురేష్‌
పుస్తక సమీక్షకుడు

  • 9441692519
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News