Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న భాష తెలుగు భాష

గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న భాష తెలుగు భాష

తేనె లాంటిది కనుక ‘తెనుగు’ అనాలని పెద్దలు చెబుతారు. ఆంధ్రా ప్రాంతాన్ని గతంలో ‘త్రిలింగ దేశం’గా పిలిచేవారు. త్రిలింగ దేశం అంటే 3 శివలింగాలు ఉన్న దేశం .శివుడు మూడు పర్వతాల మీద లింగ స్వరూపంలో వెలిశాడు. శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరం క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశంగా వ్యవహరించేవారు. త్రిలింగ పదం నుంచి తెనుగు ఉద్భవించిందని చెబుతారు. ఆ తెనుగు కాస్త కాలక్రమేనా తెలుగుగా స్థిరపడిందని చరిత్రకారులు వివరిస్తున్నారు.

- Advertisement -

క్రీస్తు పూర్వం 400 నాటి శిధిలాల్లో తెలుగు భాష ఆనవాళ్లు గుర్తించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజుల పాలనను వివరించే ‘గాధాసప్తశతి’ అనే ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటసారిగా గుర్తించారు. అద్దంకి శిలాశాసనం తెలుగు భాషకు సంబంధించిన అతి ప్రాచీన శిలాశాసనంగా భావిస్తున్నారు. తెలుగు వ్యాకరణాన్ని ఉపయోగించి రాసిన మొట్టమొదటి శిలాశాసనంగా దీన్ని పేర్కొంటున్నారు. తెలుగు భాషలో మొత్తం 27 మాండలికాలు ఉన్నాయి. భాషలో అనేక యాసలు ఆయా ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉన్నాయి.

గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాచీన భాషైన తెలుగు భాష విశిష్టతను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గర్వకారణం.

తెలుగు భాషా దినోత్సవం మూల చరిత్ర:
1966లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తించి 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవం గా ప్రకటించింది. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యావహారిక భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు, ప్రఖ్యాత తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 – 1940 జనవరి 22 ) గారి జన్మదినాన్నే రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం గా ప్రకటించింది. అప్పటినుంచి తెలుగు వారందరూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నారు.

ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష తెలుగు భాష:
భారతదేశానికి చెందిన రెండు గొప్ప భాషల కలయిక నుంచి తెలుగు ఆవిర్భవించిందని భాషా నిపుణులు చెబుతారు. సంస్కృతం, ద్రవిడ భాషల్లోని పదాలతో కలిసి తెలుగు ఏర్పడిందట. ఇండో ఆర్యన్ ప్రజలు ఉపయోగించిన గొప్ప భాషలుగా ఈ రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే తమిళ మలయాళ కన్నడ భాషల్లాగా తెలుగు భాష ద్రావిడ జన్యమా లేక సంస్కృత ప్రాకృత జన్యమా అనే విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి.

క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా:
భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు కూడా ఉంది. భారతదేశంలో స్థానిక భాషలు మాట్లాడేవారి సంఖ్య 75 మిలియన్లకు పైగా ఉందనేది ఒక అంచనా అందులో మూడవ అతిపెద్ద భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది.ఎథ్నోలాగ్ జాబితా ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 1.15% ప్రజలు తెలుగు భాషను మాట్లాడతారనే గణంకాలున్నాయి.”క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా” గా కేంద్ర ప్రభుత్వం 2008లో తెలుగు భాషకు గుర్తింపు ఇచ్చింది.

ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్-అజంతా భాష:
16వ శతాబ్దంలో నికోలో డి కాంటీ అనే ఇటాలియన్ యాత్రికుడు ప్రపంచ యాత్రలు చేస్తూ భారతదేశం వచ్చాడు. ఆయన తెలుగు భాషలో ఉన్న పదాలన్నీ ఇటాలియన్ భాషలో లాగే అచ్చులతో అంతమవుతాయని కనుగొన్నాడు అందుకే తెలుగు భాషను ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని కొనియాడాడు.తెలుగు లోని ప్రతిపదం “అచ్చుతో” అంతమౌతుంది. అలా అచ్చులతో అంతమయ్యే భాషలను “అజంతా” భాష అని అంటారు. అందుకే తెలుగును అజంతా భాష అని కూడా అంటారు.

దేశభాషలందు తెలుగు లెస్స:
1500 శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆంధ్రభోజుడు, కన్నడ రాజ్య రమారమణుడు, తుళువ వంశస్తుడైన శ్రీ కృష్ణదేవ రాయలు తీర్థయాత్రలను చేస్తున్న సమయంలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆయన కలలో కనిపించి దేశ భాషలలో లెస్సైన తెలుగులో ఒక ప్రబంధాన్ని రచించమని తెలిపినట్లు ఆయన స్వయంగా రచించిన ఆముక్తమాల్యదంలో పేర్కొన్నారని చరిత్ర చెబుతుంది. అయితే అంతకు పూర్వమే వినుకొండ వల్లభ రాయుడు తాను రచించిన క్రీడాభిరామం కావ్యంలో దేశభాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నారని మరొక వాదన ఉంది. అయితే సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదంలో పేర్కొన్న విషయమే ఎక్కువ ప్రాచుర్యం చెందింది.

72000 నాడులను ఉత్తేజపరిచే ఉత్తమ లిపి గల భాష తెలుగు భాష:
తెలుగు భాష లిపి, పదకోశం చాలా గొప్పది. అందుకే, ప్రపంచంలోని 2వ ఉత్తమ లిపి(బెస్ట్ స్క్రిప్ట్) ఉన్న భాషగా 2012లో అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగును ఎంపిక చేసింది. రామాయణం, మహాభారతంలోని అనేక తెలుగు శ్లోకాల్లో 40 శ్లోకాలను ముందు నుంచి వెనకకు చదివినా లేక వెనుక నుంచి ముందుకు చదివినా ఒకే అర్థం వచ్చేలా పాలిండ్రోమ్తో రాశారు. ఇలాంటి ప్రత్యేకత ఉన్న భాష మరొకటి లేదు. ఏ భాషలో లేని విధంగా ఒకే అక్షరంతో ముగిసే ఏకాక్షర పద్యం ఉన్న ఏకైక భాష తెలుగు భాష.భావ వ్యక్తీకరణకు అత్యంత సులభతరమైన భాష గా తెలుగుకు గుర్తింపు ఉంది. తెలుగు భాష మాట్లాడితే మన దేహంలో ఉన్న 72,000 నాడులు ఉత్తేజమవుతాయి. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది.

కనుమరుగవుతున్న అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాష:
ప్రస్తుత సమాజంలో మన మాతృభాషైన తెలుగును వ్యాకరణ దోషాలు లేకుండా వ్రాయగలిగిన, చదవగలిగిన, మాట్లాడగలిగిన వారి శాతం రాను రాను కనుమరుగవుతుంది.దానికి కారణం బాల్యం నుండి విద్యార్థులకు తెలుగు భాష ను ఆసక్తికరముగా బోధించకపోవడం, మాతృభాష యొక్క గొప్పతనాన్ని విసిదీకరించకపోవడమే. ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆంగ్ల భాష యొక్క ప్రభావం కూడా మరొక బలమైన కారణం.

తెలుగు ఆంగ్ల భాషల పరస్పర ప్రభావం:
ప్రస్తుతం మనిషి ఎటువంటి ఎల్లలనైనా దాటి ఎక్కడికెళ్లైనా ఉద్యోగాన్ని చేయగలుగుతున్నాడు. ప్రపంచ నలుమూలలలో ఉన్న అన్ని అవకాశాలను చేజెక్కించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా మంచి అవకాశాలు సంపాదించాలంటే ఆంగ్ల భాషను నేర్చుకోవడం తప్పనిసరి. రాను రాను ఇంగ్లీష్ భాష ప్రపంచ నిత్యవసర వస్తువుగా మారుతుంది. ఇది కాదనలేని నగ్నసత్యం. అందువలన ఆంగ్ల భాషను ప్రాథమిక విద్య నుండి నేర్చుకునే క్రమంలో దాని ప్రభావం తెలుగు భాష పై పడుతుంది. మరియొక కోణంలో మాట్లాడితే ప్రాంతీయ భాష ప్రభావం వలన ఆంగ్ల భాషను కూడా వ్యాకరణం దోషారహితంగా నేర్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగు ఇంగ్లీష్ రెండిటిని కలిపిన ఒక వర్ణ సంకరం లాంటి భాష ” తెంగ్లీష్’ ను నేటి యువత వాట్సప్ భాషగా వాడుతుంది. ఈ వాట్స్అప్ భాషా సంస్కృతి తో అటు ఇంగ్లీష్ పైన ఇటు తెలుగు పైన నేటి యువత పట్టుకున కోల్పోతుంది.

అన్ని భాషలకు పునాది మాతృభాషే:
మాతృభాష అంటే పిల్లలకు తల్లి ఉగ్గుపాలతో ఉయ్యాల పాటలతో నేర్పిన భాష. ఒక మనిషి తన భావవేశాలను ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలపగలిగే పలకగలిగే భాషే ఆ వ్యక్తి మాతృభాష. ఎందుకంటే, ప్రతి ఒక్కరి నర నరాల్లో వారి మాతృభాష జీర్ణించుకుపోయి ఉంటుంది. ఒక మనిషి ప్రపంచంలోని 7000 భాషలలో ఏ భాషనైనా నేర్చుకోవడానికి అతని మాతృభాషే పునాది. ఏ భాషనైనా నేర్చుకోవడానికి గట్టి పునాదిగా ఉపయోగపడే మన మాతృభాష తెలుగు లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాకరణ దోషరహితంగా మాట్లాడగలగాలి, వ్రాయగలగాలి, చదవగలగాలి మరియు విని అర్థం చేసుకోగలగాలి. మన ప్రవృత్తినీ ఉనికినీ తెలియజేసే మన మాతృభాషైన తెలుగును ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తప్పులు లేకుండా నేర్చుకోవాలి. అలాగే, మనం చేసే వృత్తికి అవసరమైన అన్ని ఇతర భాషలను కూడా మన మాతృభాషను పునాదిగా చేసుకుని తప్పనిసరిగా నేర్చుకోవాలి.

అమృత భాష…తెలుగు భాష:
తెలుగు భాషలోని తీయ్యందనం కమ్మదనం మరే భాషకు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి భాషకూ తనదైన ప్రత్యేకత, మాధుర్యం ఉంటాయి. ప్రపంచంలోని పలు భాషలతో పోలిస్తే తెలుగు భాషకు కొన్ని అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే విదేశీయుల చేత కూడా జేజేలు అందుకుంది.మన తెలుగు భాష అమృత భాష. కమ్మనైన పద కళ గల భాష. కవితా సుగంధాల భాష. మన మాతృభాషా గౌరవానికి మనవంతు కృషి చేసి తల్లి లాంటి మన తెలుగు భాషను కాపాడుకుందాం. మాతృభాష ఉన్నతికి కృషి చేయడం మాతృమూర్తి గర్భాన జన్మించిన ప్రతి ఒక్కరి బాధ్యత.
-ననుబోలు రాజశేఖర్,
9885739808, 8330969808

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News