Tuesday, September 10, 2024
Homeఓపన్ పేజ్Telugu poetry: ఏది ఆధునిక కవిత నిర్మాణం?

Telugu poetry: ఏది ఆధునిక కవిత నిర్మాణం?

పద్యానికి కొన్ని లక్షణాలు నియమాల ఆధారంగా
రాసుకుంటూ పోతారు. ఇప్పుడొచ్చిన చిక్కు
వచన కవిత్వపు మర్మములు తెలియడం లేదు.
ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు.
ప్రాచీన కాలాన్ని అధ్యయనం చేస్తే.
కవనీయం కావ్యం (వర్ణింపదగినది కావ్యం) అంటూ అభి నవగుప్తుడు ప్రవచించాడు.
‘దర్శనాత్‌ వర్లోచ్చాద రూడే లోక కవిశ్రుతి:’ అని మరో శ్లోకం వ్యాఖ్యాన రూపంలో వినిపిస్తుంది.
కానీ.. మన ప్రాచీన గ్రంథాల్లో, ప్రబంధాల్లో, పద్యాల్లో, కావ్యాల్లో, గేయ కవితల్లో ఈ వర్ణనే అధికం. అది అప్పటి శైలి. ఆ నిర్మాణరీతి అలాంటిది.
ఉదాహరణకు మనుచరిత్ర, ఆభిజ్ఞాన శాకుంతలం, పాండు రంగ మహత్యం వంటి పద్యకావ్యాల్లోనూ.. చెల్లీ చంద్రమ్మ, ఉద్య మం నెలబాలుడు లాంటి గేయ కవిత్వంలోనూ ఈ తరహా వర్ణన వ్యక్తమవుతుంది.
నేను ఆధునిక కాలంలో ఏది కవిత్వం :
ఏది కవిత్వం అంటే ఇప్పుడు నిర్వచనాలు చెప్పడం
ఆధునిక కాలం కష్టం.ఎవ్వరికి తోచింది వారు వివరిస్తూ ఉన్నారు. నాలుగు పదాలు పేర్చి నాలుగు వరుసలు రాసి కవిత్వం అంటున్నారు. నాకు తెలిసి నేను చదివిన, విన్న వాటిని బట్టి అందరి నిర్వచనాలను కలిపి రాస్తున్నాను. నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజ నాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే మనసు భావోద్వేకాల సమహారం. అక్షర రమ్యత, శబ్ద విన్యాసం, శిల్ప సౌందర్యం ఉండాలి కవిత్వం అంటే అక్షరాల నర్తన తాం డవం కావాలి. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. ఆలోచనల వ్యతిరేకం, ఇలాంటి లేకపోతే కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా భావం బలంగా ఉండాలి. కవి త్వం రాసేవారిని కవులు/కవయిత్రులు అంటారు. ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవితలను కవి రాయలేడు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవి ఆ కవితలో తన్మయత్వం చెందాలి. పాఠకులను కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. రసానుభూతి ఘడి యల్లో సృజించిన కవిత కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసి కస్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో తేలుసుకోవాలి. అలా తీసుకు వెళ్ళినట్లైతే అది కవిత కవిత్వం అవుతుంది.
అనుభవాలు వ్యక్తపరచడం కాక, అది మనకు అనుభవం అనుభూతమయ్యేటట్లు చెయ్యటం కవిత్వం యొక్క పని. అస్పష్ట రూపానికి మన దైనందిక అనుభవాలకి ఒక క్రమాన్ని, అర్ధాన్నీ కవిత్వం ఆపాదిస్తుందన్నమాట. మానవ తత్త్వం జీవితాలకు ఒక అర్ధమూ లక్ష్యమూ నిర్దేశిస్తుంది, శాస్త్రం కూడా మన చుట్టూ తిరు గుతున్న ప్రాపంచిక సంఘటలని గణితశాస్త్రంలో శాస్త్రీయ సూత్రాల ద్వారా అర్ధవంతాలుగా చెయ్యటానికి ప్రయత్నిస్తుందనీ వింటుంటాం. మరి వీటి అర్ధవత్త్వానికి కవిత్వం అర్ధవత్వానికి తేడా ఏమిటి? ఏ అమూర్త ప్రత్యయాల, శాస్త్రీయ సూత్రాల నిమి త్తత్త్వం లేకుండానే జీవితానుభవాలను ప్రత్యక్షంగా అనుభూతమ య్యేటట్లు చెయ్యగలిగే శక్తి కవిత్వానికి ఉంది. కవిత్వంలో అను భవాన్ని అనుభవరూపంలోనే తెలుసుకుంటాం. మామిడి పండును నోటితో తెలుసుకున్నంత ప్రత్యక్షంగా.
మాటల ద్వారా తెలుసుకోలేం. కొన్ని సార్లు వట్టి కవిత్వం లోను శబ్ద సంవిధానం అర్ధ సంవిధానాన్ని అనుశాసించలేవు. శబ్దా లంకారాలు అర్ధాన్ని శాసించగలవనే భ్రమ అప్పుడప్పుడు కవులకు కలుగుతూ వచ్చింది. ముఖ్యంగా మన పూర్వ కవులకు. అర్ధాలతో సంబంధం లేకుండా వట్టి శబ్ద లాలిత్యం వల్లనే రసోత్పత్తి కలిగిం చవచ్చునని మలార్మే అనే ఫ్రెంచ్‌ కవినమ్మి, కొన్ని ప్రయోగాలు చేశాడు. ఆ తరువాత ఫ్రాన్స్‌లో డాడాయిస్టులూ, ఇటలీ, రష్యాల్లో ఫ్యూచరిస్టులు పదాలచేత వ్యభిరింప చెయ్యటానికి చాలా ప్రయ త్నాలు చేశారు. తెలుగులో శ్రీ శ్రీ కూడా ప్రయోగాలు చేశాడు. కానీ ఇవేవీ సఫలం కాలేదు. కావ్యానికి లేదా కవిత్వానికి కవి యొక్క అద్వంద్వమైన అనుభవమే ఆ కావ్యము యొక్క అర్ధ సంవిధానాన్ని, ఆకృతిని నిర్ణయిస్తుంది. ఈ లక్షణాలే కవిత్వాన్ని వచన కవిత్వం నుంచి వేరు చేస్తుందనీ చెప్పవచ్చును., కవిత్వంలో వివిధ పదచిత్రాల పరస్పర సంబంధం వలన కావ్యానికి అర్ధ వంతం లభిస్తుంది.
వచనాన్ని, కవిత్వంతో కప్పి చెప్పిన సరళ వాక్యంలోని నిర్మా ణశైలికి మధ్య సారూప్యత గోచరిస్తుంది. కవితా వాక్యాల్లోని విశ్లేష ణాత్మక, విమర్శనాత్మక కోణాల్ని అనేక పార్శ్వాల్లోంచి కనిపిం చాలి. వాటి మధ్య అనుసంధానాన్ని.. ఈ మనసులో తొంగి చూసే నిగూఢమైన అంతర్లయని. చూపాలి విషయ రచనలోని మార్మిక దృష్టిని. అది వ్యక్తీకరించే తీరుతెన్నుల్ని కవి కవితలో ప్రదర్శించాలి. భావగర్భితంగా చర్చించే విషయాల సముదాయ నేపధ్యాన్ని చూపించాలి కాచి ఒడబోస్తే మిగిలిన సారాంశ చిక్కదన కొల మానమే కావాలి. ఈ తేడాలను బుద్ధి పూర్వకంగా అధ్యయనం చేసి.. ఆకళింపు చేసుకున్నాకనే.. ఆధునిక వచన కవిత్వ రచనకు శ్రీకారం చుట్టాలి
జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా అనుభూతికి అంది వ్వటమేనా కవిత్వం ధ్యేయం., అసంబద్ధమైన వాటిమధ్య సంబం ధమే కవిత్వానికి అర్ధం చేకూరుస్తుంది. ఈ సంబంధమే కవిత్వ సారమూ, అది ప్రసరించే కాంతి.
కవితకు శైలి అన్నది కవియొక్క తనదైన ప్రత్యేక గుర్తింపు లాంటిది. ఇది వర్ణనలో కానీ, భాషలో కానీ, ఎంచుకునే వస్తువులో కానీ ఎందులోనైనా ఉండవచ్చు. ఒక కవి అలతి పదాలతో విరు స్తూ కవిత్వమల్లితే, ఒక కవి ధారాపాతంగా పదాలతో కవిత్వ మల్లవచ్చు. ఒక కవి వాస్తవాన్ని చెబితే, ఒక కవి ఊహలు చేయ వచ్చు. ఒక కవి పక్కాగా ఉన్న భాషలోనే కవిత్వం చెబితే, మరొక కవి తనకి నచ్చిన రెండుమూడు భాషా పదాలని కలుపవచ్చు. శైలి అనేది వైయక్తికం. కవికి ప్రత్యేకతను నిలబెడుతుంది.
ఉదాహరణకి
ఎముకులు క్రుళ్ళిన/వయస్సు మళ్ళిన/సోమరులారా చావండి./నెత్తురు మండే,/శక్తులు నిండే,/సైనికులారా రారండి./
ఇది శ్రీశ్రీ కవిత. శైలి గమనించండి ఒక ప్రత్యేకతను
అక్షర విన్యాస ప్రతిభను గుర్తు చేస్తుంది.
ఆకులో ఆకునై/పూవులో పూవునైకొమ్మలో కొమ్మనై/
నునులేత రెమ్మనై/ఈ అడవి దాగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా.
ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ఇందులో పదాల లాలిత్య
స్పష్టంగా కవి హృదయం ప్రకృతిలో తేలిపోతుంది.ఈతని శైలిలో.
రెండూ వచన కవితలే అయినా రెండూ లయబద్ధంగా ఉన్నవే. కానీ ఇద్దరి శైలిలోనూ తేడాలు స్పష్టంగా కనపడుతుంది. శ్రీశ్రీ గారిది మనిషి ఎదగాలనే కోరిక
బలంగా కనిపిస్తుంది ప్రాపంచికదృష్టి. కృష్ణశాస్త్రి గారిది మనసులో తన్మయత్వం పొందాలనే తపన. అందుచేత కఠినంగా కుండ బద్దలు కొట్టినట్లున్న శైలి శ్రీశ్రీది. అందమైన లోకములో విహరించాలన్నది మనసుకు పట్టుకున్నట్లు ఉండేది కృష్ణశాస్త్రిది శైలి.
కవిత్వరంగంలో దీర్ఘకాలం కొనసాగాలంటే, స్పందనాశీలత ను కాపాడుకోవడం మొదటి అవసరం. వస్తు, వ్యక్తీకరణలలో వైవి ధ్యాన్ని సమకూర్చుకోవడం అనివార్యం. సమకాలంతో కలసి నడవడం, రూపపరంగా క్రమ పరిణతిని సాధించడం అత్యా వశ్యకం. తనదైన విలక్షణ శైలి రూపొందడం లేదా రూపొందిం చుకోవడం ఎంత కష్టమో, తన శైలిని తానే చెరిపేసుకుంటూ, శైలీ వైవిధ్యాన్ని శైలీ నవ్యతను సాధించడం అంత కష్టం ఏమి కాదు. కవిత్వం రావాలి, అందరూ కవిత్వం రాయాలి.
నిత్యసాధన ద్వారా అద్భుత కవిత్వం సృష్టించగలం.
నిరంతరం అధ్యాయం చేస్తూ, కవులు రాసిన ప్రతి కవితను
చదువుతూ అక్షర సంపదను, శిల్ప నిర్మాణ పద్ధతులను
గమనిస్తూ కవిత్వం మెరుగులు దుద్దుకోవాలి. మంచి సాహి త్యం రావాలి అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. సజీవంగా నిత్య నూతనంగా
కవిత్వం విరాజిల్లుతునే ఉండాలి.
కొప్పుల ప్రసాద్‌
9885066235

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News