Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Telugu Literature: పంజాలు కురిపించిన మల్లయోధ

Telugu Literature: పంజాలు కురిపించిన మల్లయోధ

సాంస్కృతిక విప్లవం రావాలి

యుగాలు మారినా తరాలు మారినా భారతదేశంలో స్త్రీల తలరాతలు మారలేదు. నాటి వేదకాలం నుండి నేటి సాంకేతిక యుగం వరకు జరిగిన పరిణామ క్రమంలో మహిళల జీవితాలలో జీవన శైలిలో అనేక మార్పులు వచ్చినప్పటికీ సాంఘీక రాజకీయ ఆర్థిక విద్య వైధ్య ఉద్యోగ క్రీడా రంగాలలో మహిళలు తమదైన విధానాలతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలపై హింసలు‌ హత్యలు అత్యాచారాలు లైంగిక వేధింపులు రాను రానూ ఎక్కువైపోతున్నాయి. దీనికి నిదర్శనం గత 11 మాసాల క్రితం అంటే 18 -2023 జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా. ఇది మహిళా రెజ్లర్లపై ఒక రాజకీయ కామాంథుడు ఆడిన కామక్రీడలకు బలైన మహిళల నిరసన గళం. ఈ అంశం పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మహిళలను చైతన్య పరచే ఉద్దేశ్యంతోటి ప్రముఖ కవి, రచయిత, సాహితీ విశ్లేషకులు, సంపాదకులు నీలం సర్వేశ్వర రావు గారు తనదైన శైలిలో సాహిత్యం ద్వారా మహిళా సమస్యలపై మహిళలతో అక్షర చైతన్యాన్ని నింపి సమర్థవంతమైన కవిత్వం రాయించి ఆచార్య గిడ్డి వెంకట రమణన్ని ఆవిష్కరించారు. నీలం సర్వేశ్వర రావు గారి సామాజిక బాధ్యతను గుర్తిస్తూ …. మహిళల పట్ల తనకున్న కృతజ్ఞతా భావాన్ని తనదైన శైలిలో సాహిత్యం ద్వారా వ్యక్తపరిచినందుకు సమాజం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈ సంకలనాన్ని దృష్టిలో పెట్టుకుని నీలం సర్వేశ్వర రావు గారి మాటల్లో “స్త్రీకి వ్యతిరేకంగా పుత్రకామేష్టి యాగాలు” అంటూ శీర్షికతో ముందుమాట రాస్తూ ” పురుషుడిని ఆత్మగా ధరించిన ఆదిపరాశక్తి స్త్రీ స్వేచ్ఛా విముక్తి ప్రదాత ఎలా అవుతుందో ఎంత బుర్రగోక్కున్నా అర్థం కాదు అంటారు. ఎవరికి? ఫెమినిజం అంటే ఫాంటసీ రోల్ కాదని – రియల్ ఫైట్ అని తన విశ్వసనీయతని చాలా ఆలోచనాత్మకంగా చెప్పారు. ఈ సంకలనంలో 58-మంది కవులు తమదైన శైలిలో చాలా ప్రతిఘటనాత్మకంగా స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి విశ్లేషణాత్మకమైన కవిత్వం రాశారు.
దేశం తలెత్తేలా ఎగిరే జెండాలు /దేశం జెండా తొక్కైనా/రాజ దండాన్ని రక్షించే/రాజకీయ రక్షక భట రక్షణలో/తరాజు ఏ వైపు మొగ్గిందో/చూసుకోలేని గాంధారి ధ్యానంలో/ఆట ఢిల్లీ గుండెలపై /బేటీ బచావో బేటీ బచావో/దేశభక్తి కారుతున్న పురుషాంగాల నుండి/బేటీ బచావో బేటీ బచావో అంటున్నారు కవి వడ్డెబోయిన శ్రీనివాస్ గారు.ఆట కూడా నీ జన్మ/మైదానం అంటున్నావు కదరా/వాడిని క్రీఢా మైదానంలో పాతి పెడదాం రండి అని పిలుపునిచ్చారు శిఖా ఆకాష్ గారు. ఒలంపిక్ క్రీఢల్లో వీరోచితంగా పోరాడి/దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే చాంపియన్లకు/దేశం ఇచ్చే బహుమానం లైంగిక వేధింపులా/ఎటు పోతుందీ స్పోర్ట్స్ సమాజం అని ప్రశ్నిస్తున్నారు బాస్కర్ పెనుమాకుల గారు. మోచేతులే ఈటెలుగా కలిగిన వాళ్ళం/కక్షి రక్తం మొరపెట్టుకునేలా చేతివేళ్ళు తల్లి కోడికత్తులుగా మొలుసుకొచ్చిన వాళ్ళం/ తల్లి హక్కుకై కదబడుతున్న వాళ్ళం/మీ వీర్యనదీ ప్రవాహాన్ని ఢీకొట్టడం టైటానిక్ షిప్పులకు తెలుసు/మావి జింబాడీలు ఆడపులులు మెసలి కసరి తిరిగే గాండ్రింపుల రాతిబండల కొండగుహలమయం/తుపాకీల్లేని మా చూపుడు వెళ్ళ ఫిస్ట్ ల పిస్తోళ్ళతో నేలకూల్చుతాం/ఇపుడు కాషాయాంబరాల్లో సూర్యుడు కాదు/గుజరాత్ గాయంలోంచి పొడుచుకొస్తున్న బిల్కిజ్ గ్రహణాలం/మీకు రెజ్లింగంటే కామారంగమో బూమారాంగమో కావొచ్చు గాక/కానీ అది పితృస్వామ్యానికి ప్రేత కళ/మాకది స్త్రీ విముక్తి యుద్ధకళ/ఆఖరిగా మీ కేంద్రీయ రక్త కుంకుమల శిఖరాల కొప్పురోలు కొనల మీద /పంజాలిసిరికొట్టే బఠీ బెచ్చారాళ్ళం అంటూ కవి సర్వేశ్వర రావు గారి వినూత్నాభివ్యక్తీకరణలు మల్లయోధ సంకలనానికి “బేఠీ బెచ్చారాళ్ళం” అను కవిత శిరస్సు వంటిదని చెప్పక తప్పదు. దేశ విదేశాలలో జాతి గౌరవాన్ని గుండెలపై ఎగరేసి/దేశాన్నే గెలిపించినోళ్ళు/ఆత్మ గౌరవ పోరులో ఇంట గెలవలేక పోతున్నారు అని నాగరాజు గారు రెజ్లర్ల ఆత్మగౌరవాన్ని ప్రస్తావించారు.
వాళ్ళు ఈ దేశపు పతాక దాతలు/పతక దాతలు/తమ ప్రతిభను చూపించి క్రీఢల్లో అనేక స్వర్ణ పతకాలు సాధించిన/ఎందరో ఉత్తమ మహిళా మణులు/వాళ్ళను నువ్వు వేధింపుల కొలిమిలో/నిరంతరం బాధ పెట్టొద్దు అంటూ మల్లయోధుల బాధను గుర్తు చేశారు కవి అంజనశ్రీ గారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పైశాచిక పనులు చేస్తున్నారు/ప్రజాసేవకుల ఫోజు కొడుతూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు/పాలకుల్లారా ఇకనైనా కళ్ళు తెరవండి/కామాంథుల కళ్ళు తెరిపించండి/ప్రజాస్వామ్య వాదుల్లారా రెజ్లర్లకు అండగా నిలబడండి/పెద్దల ముసుగులో జరుగుతున్న అరాచకాలను ఎండ గట్టండి అంటూ నాయకులకు హితబోధ చేశారు ఆచార్య గిడ్డి వెంకట రమణ గారు. ప్రత్యర్థితో యుద్ధం /వాళ్ళకు కొత్తేమీ కాదు కానీ/నిర్లజ్జగా నీతిని వదిలేసిన మృగంతో యుద్ధంమిది/గాయాలు వాళ్ళకు కొత్తేమీ కాదు /క్రీఢా ప్రపంచంలో మన జెండా ఎగరేసే బరిలో/నెత్తురు చిందినప్పటి గాయాలకన్నా అంటూ మల్లయోధుల గుండె గాయాలను కవితగా మలిచారు కవి రహీమొద్దీన్ గారు. దేశ గౌరవం కోసం దేహంతో పోరాడిన ఆమె /ఇప్పుడదే దేహానికి గౌరవం దక్కాలని/గెలిచిన పతకాల్ని పతాకాల్లా ఎగరేస్తున్నది/దేశం అభిమానాన్ని జెండాల్లా కప్పుకున్న ఆమె/ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నది అంటూ మహిళా మల్లయోధుల పోరాటాన్ని కవిత్వీకరించారు వైష్ణవ శ్రీ గారు. ఆడపిల్ల అఘాయిత్యయత్నం చేశారని/గల్లీలో కాదు ఢిల్లీలో గొంతెత్తుతున్నది/సాక్ష్యం చూపించమన్నాడు కుషురుషుడొకడు/ఆ ఆడపల్లలే వాడి పిల్లలైతే అదే కూత కూస్తాడా అంటూ రెజ్లర్లపై లైంగిక వేధింపులు చేసిన వారిపై తనదైన శైలిలో కవిత్వం ద్వారా ప్రశ్నించారు ప్రముఖ కవి మెట్టా నాగేశ్వర రావు గారు. కీర్తి పతాకాలను రెపరెపలాడించిన/ఆ ప్రతిభ చీకటి గదిలో కామ క్రీఢలాడమని/తెగించి నిరసన గళమెత్తింది అంటూ మహిళల మనో వేధనను తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచారు కవి విశ్వ గారు. ఈ మట్టి సింధూరం ధరించి/బరిలో దిగినప్పుడు వారు/భారతమ్మ ప్రతినిధులు /కానీ ఇప్పుడు తల్లులను కామించే కాలమిది/చెల్లెళ్ళైనా చెరబట్టె /మగతనపు మదం తలకెక్కి/పసిడి పధకాల విజేతలు/పాతాళానికి తొక్కేసే కాళికలు అంటూ కవి సవ్యసాచి గారు. అకుంఠిత దీక్షతో ఆటల్లో రాణించి/భూమాతకి బంగారు పతకాలందించి/భరతజాతి కీర్తిని నలుదిసెల పంచిన/బంగరు తల్లుల రెజ్లర్లకు తప్పని లైంగిక వేధింపులు/రక్షించాల్సిన నాయకుడే మానవత్వాన్ని మంచి చెడులను మరచి/కీఛకుడై క్రీఢికారులను వేధిస్తుంటే/భక్షకులను శిక్షించి భళా అనిపించుకోవాలి అంటున్నారు కవయిత్రి బండారు సుజాత గారు. ప్రపంచానికే ఆదర్శ దేశంలో/రాక్షస పనులు చెయబట్టిరి/కామాంధుడు ఎంతటి వాడైనా కఠిన శిక్ష పడాల్సిందే అంటూ క్రాంతి కుమార్ గారు పదునైన పదాలతో మల్లయోధుల బాధలను కవిత్వీకరించారు. ఈ సంకలననానికి నిరసన గళం అంటూ కవయిత్రి రూపరుక్మిణీ గారు ముందుమాట అందించారు.ప్రముఖ కవి విమర్శకులు తోకల రాజేశం గారు ఆకాశంలో సగం చరిత్ర అంటూ సాంస్క్రుతికంగా స్త్రీలపట్ల జరుగుతూ వచ్చిన కుట్రలు సమాజానికి అర్థం కావాలి దీనికోసం అంబేడ్కర్ మార్క్సిజం సిద్దంతాల వెలుగులో పెద్ద సాంస్క్రుతిక విప్లవం రావాలి అంటారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ధైర్యంగా మహిళల వైపు నిలబడిన సర్వేశ్వర రావు లాంటి వారికి దేశం రుణపడి ఉంటుందని రాజేశం గారు ప్రశంసించడం హర్షించదగ్గ విషయం . ఈ మల్లయోధ కవితా సంకలనం నుంచి ఆలోచనా పరులు మహిళా చైతన్యం పొందుతారని ఆశిద్దాం.

- Advertisement -
                     కవి సాహితీ విశ్లేషకులు
                       పూసపాటి వేదాద్రి
                        9912197694.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News