Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Telugu Sahithyam: రికార్డులు సృష్టించిన కొవ్వలి రచనలు

Telugu Sahithyam: రికార్డులు సృష్టించిన కొవ్వలి రచనలు

ఏ రచన చేసినా అది రైల్వే సాహిత్యంగా పేరు గడించింది

ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలో ‘కొవ్వలి’ ఒక విశిష్ట నవలా రచయిత. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆయన దాదాపు వెయ్యికి పైగా నవలలు రాశారంటే ఆశ్చర్యం వేస్తుంది. కొవ్వలిగా సుప్రసిద్ధులైన కొవ్వలి లక్ష్మీ నరసింహా రావు 1912లో తణుకులో పుట్టి 1975లో ద్రాక్షారామంలో కన్నుమూశారు. రచనల వాసిలోనూ, రాశిలోనూ రికార్డులు సృష్టించిన కొవ్వలి ఇటు జానపద సాహిత్యాన్నే కాక, ఇటు డిటెక్టివ్‌ సాహిత్యాన్ని కూడా కాచి వడబోశారు. ఆయన రచనలు ఎంతగా ప్రజాదరణ పొందాయంటే, ఆయన ఏ రచన చేసినా అది రైల్వే సాహిత్యంగా పేరు గడించింది. ఎక్కువగా రైలు ప్రయాణికులు తమ ప్రయాణంలో ఆయన పుస్తకాలను చదివే వారని ప్రతీతి.
తెలుగునాట 1935, 1975 సంవత్సరాల మధ్య శృంగార రచనలు సాహితీ రంగం నుంచి క్రమంగా అదృశ్యం అవుతూ, ప్రగతిశీల ఉద్యమాలు ఊపందుకుంటున్న సమయంలో ఆయన కొత్త ఒరవడిని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని ఒక కీలక మలుపు తిప్పారు. అదే సమయంలో మహిళలు ధైర్యం కూడగట్టుకుని ప్రేమలు, శృంగారం, లైంగిక ధోరణుల గురించి రహస్యంగానైనా చదవడం ప్రారంభించారు. అటువంటి సమయంలో ఆయన మహిళలకు సంబంధించి సరికొత్త సాహిత్యానికి నాందీ ప్రస్తావన చేశారు. ఆయన రచనలను ‘గౌరవనీయ’ కుటుంబాలు దాదాపు బహిష్కరించాయి. ఆయన రచనల్లో ‘అనారోగ్యకర’, ‘అవాంఛనీయ’, ‘వికార’ ధోరణులు ఎక్కువగా ఉంటాయని ఈ కుటుంబాలు భావించేవి. కొద్దిపాటి విరామాలతో ఆయన ఇటువంటి రచనలను ఎన్నో చేశారు. అప్పట్లో ఆయన వారానికి ఒక నవల రాసేవారని చెప్పుకునే వారు. కొన్నిసార్లు ఆయన రెండు రోజులకొక నవల రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆయన రాసిన చిన్నపాటి నవలలను రైళ్లలో అమ్మేవారు. రైలు బయలుదేరిన మరుక్షణం ఈ నవలలు వేడి వేడి మిరపకాయ బజ్జీల్లా అమ్ముడుపోయేవి. ఆయనకు విపరీతంగా అభిమాను లుండేవారు. ఆయన తాజా రచనల కోసం ఎదురు చూసేవారు. ఆయనలో సామాజిక స్పృహ ఓ పాలు ఎక్కువగానే ఉండేది. ఆయనయ తన రచనల్లో మహిళల సమస్యలను ఎక్కువగా ప్రస్తావించేవారు. అసంతృప్తి, అశాంతి, అవాంఛనీయ వివాహ బంధాలకు అంటిపెట్టుకుని ఉండవద్దని, మహిళలు చదువులకు, ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోవాలని ఆయన తన రచనల ద్వారా ఉద్బోధించేవారు. ముఖ్యం గా బాల్య వివాహాలను నిర్భయంగా తిరస్కరించాలని, ప్రేమ వివాహాలను ప్రాధాన్యం ఇవ్వాలని సూచించేవారు. ఆయన రచనల్లోని మహిళా పాత్రలు, కథానాయికలు ఇటువంటి ఆశయాలనే ప్రతిఫలించేవారు.
మహిళా సమస్యలకు ఆయన తేలికపాటి పరిష్కారాలను సూచించేవారు. ఒక్కోసారి ఆ పరిష్కా రాలు కొద్దిగా నాటకీయంగా కూడా ఉండేవి. అయితే, ఆయన ఉద్దేశాలు మాత్రం ఉదాత్తమైనవి. మహిళల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆయన రచనాపరంగా ఏ పని చేసినా నిబద్ధతగా, నిజాయతీగా చేసేవారు. నయవంచనకు పూర్తిగా వ్యతిరేకి. ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా చెప్పేవారు. ఆచార సంప్రదాయాలను మూఢంగా నమ్మవద్దని కూడా ఆయన తన రచనల ద్వారా ప్రవచించేవారు. ఆయన నవలల్లో కొన్నిటిని ఆ తర్వాత సినిమాలుగా నిర్మించడం జరిగింది. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, సిపాయి కూతురు వంటి ఆయన నవలను సినిమాలుగా నిర్మించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News