ప్రముఖ తమిళ నటుడు ‘దళపతి’ విజయ్ ఎట్టకేలకు ‘తమిళ నాడు విజయ పక్షం’ అనే అర్థంలో ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించడం తద్వారా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త సంచలనాన్ని సృష్టించడమే కాకుండా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాలగమనంలో ఎం. జి. రామచంద్రన్, జయలలిత, శివాజీ గణేశన్, విజయకాంత్ మరియు కమల్ హాసన్ మొదలైన నటులు తమిళనాడు రాజకీయాలలో ప్రముఖ పాత్రని పోషించారు. నేడు అదే సినిమా రంగంలో రజనీకాంత్ తర్వాత అత్యంత ప్రేక్షకారాధన ఉన్న దళపతి విజయ్ ప్రజాసంక్షేమం కోసం ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యంగా ఉద్యుక్తులు కావడం నిజంగా హర్షణీయం.
దళపతి విజయ్ నేతృత్వంలో విజయ్ మక్కల్ ఇయక్కం అనేక సంవత్సరాలుగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్ననూ లాభాపేక్ష లేని ఆ సంస్థ ద్వారా సువిశాల రాజకీయ మార్పులు సాధ్యం కాని తరుణంలో ‘రాజకీయ అధికారం సాధనే లక్ష్యం’గా తమిళగ వెట్రి కళగం పార్టీ ఆవిర్భవించడం శుభ పరిణామం. కేవలం పార్టీ పేరుని విజయ్ ప్రకటించగానే ఆయనపై విశ్వాసం ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవదాన్ని గమనిస్తే ఆ పార్టీ విజయం దిశగా దూసుకుపోవడం ఖాయం అని ముందుగానే ఉహించడంలో ఏమాత్రం సందేహం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే కాకుండా పోటీ చేసే ఏ పార్టీకి కూడా మేము మద్దతు ప్రకటించం అని విజయ్ సృష్టంగా పేర్కొనడాన్ని గమనించవచ్చు. 2026 లో జరగబోయే తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ముందుకు పయనించే విధంగా నిర్దిష్ట విధివిధానాలను అనుసరించనుండడాన్ని విజయ్ వ్యూహాత్మక దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
‘తమిళనాడు ప్రజలు మార్పును ప్రజలు ఆకాంక్షిస్తున్న రాజకీయ మార్పునకు మార్గాన్ని సుగమం చేయడం మా లక్షం’ అని దళపతి విజయ్ పేర్కొనడం గమనార్హం. రాజకీయం అనేది ఒక వృత్తి కాదు అని, ఒక ‘పవిత్రమైన ప్రజా సేవ’ అని ఆయన పేర్కొనడాన్ని సునిశితంగా గమనించవచ్చు. ప్రస్తుతం పరిపాలన యంత్రాంగం క్షీణించి అవినీతి, పాలనాపరమైన అవకతవకలతో కూడిన కలుషితమైన రాజకీయాలు, ప్రజలను కుల, మతాల ప్రాతిపదికన విభజించే విభజన సంస్కృతి పాదుకొని ఉండడాన్ని దళపతి విజయ్ తీవ్రంగా నిరసించడాన్ని సృష్టంగా గమనించవచ్చు. సమైక్యతను దెబ్బతీసే విధంగా విభజన రాజకీయాలు ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించడాన్ని సునిశితంగా గమనించవచ్చు.
‘ నిస్వార్థ, పారదర్శక, దూరదృష్టి గల, అవినీతి రహిత, కుల, మత విభేదాలు లేని సమర్థ పాలన యంత్రాంగానికి మార్గం సుగమం చేసే రాజకీయ ఉద్యమం కోసం తమిళులు ఆకాంక్షిస్తున్నారు’ అని దళపతి విజయ్ పేర్కొనడం విశిష్ట ప్రాధాన్యాన్ని సృష్టంగా వెల్లడిస్తుంది. ప్రజా ఉద్యమం మాత్రమే రాజకీయ మార్పు తేగలదని, అది తమిళ నాడు హక్కులను కాపాడగలదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ‘చాలా మంది రాజకీయ నేతలు ఆయా పదవులలో ఉండి సినిమాలలో మాదిరిగా నటించారు తప్ప ప్రజల సంక్షేమం కోసం పెద్దగా పని చేసినది ఏమి లేదు’ అని విజయ్ పేర్కొనడాన్ని సునిశితంగా గమనించవచ్చు. ఏది ఏమైననూ దళపతి విజయ్ మిగతా నటులకు భిన్నంగా తాను నిర్దేశించుకున్న విధివిధానాలను ఆచరణ రూపంలో ముందుకు తీసుకువెళ్లి తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో నవశకాన్ని సృష్టించనున్నాడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
- జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ స్కాలర్,
సెల్: 94933 19690.