హేతువాద సాహిత్యంలోనూ, సంస్కరణ సాహిత్యంలోనూ సమకాలీన సాహితీ వేత్తల్లో తాపీ ధర్మారావును మించినవారుండరు. 1970ల వరకూ తన సాహిత్యంతో, తన రచనలలో ఆంధ్ర ప్రాంతాన్ని ఒక ఊపు ఊపిన తాపీ ధర్మారావు ప్రభావం పడని రచయిత లేడంటే అతిశయోక్తి ఏమీ లేదు. అప్పన్న, నరసమ్మ దంపతులకు ఒరిస్సాలోని బరంపురంలో 1887లో జన్మించిన ధర్మారావు సాహిత్యంలో స్పృశించని విభాగం లేదు. చివరికి పత్రికా రచనలో కూడా చెరగని ముద్ర వేయడం జరిగింది. ఆయన శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడిలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన కల్లికోట రాజావారి కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకుడుగా పనిచేశారు. ఆయనకు పర్లాకిమిడిలో ప్రముఖ సాహితీవేత్త, వ్యవహార భాషకు ఆద్యుడు అయిన గిడుగు రామ్మూర్తి పంతులు గురువు. మొదటి నుంచి గ్రంథ పఠనం పట్ల విశేష ఆసక్తి కలిగి ఉన్న ధర్మారావు 1910లో కొందరు సాహితీ మిత్రులతో కలిసి బరంపురంలో వేగు చుక్క పేరుతో ఒక గ్రంథమాలను స్థాపించారు.
దీని తర్వాత కొన్నాళ్లకు ఆయన అభ్యుదయవాదంపైనా, సమకాలీన సాహిత్యంపైనా చర్చలు జరపడానికి, గోష్ఠులు నిర్వహించడానికి మరో సంఘాన్ని నెలకొల్పారు. కొద్దిగా చిత్రకళ కూడా నేర్చుకున్న తాపీ ధర్మారావు మిత్రులు వేసే నాటకాలకు కథా రచన, సంభాషణల రచన, నిర్వహణ, వేషధారణ వంటి పనులన్నీ చేసి పెట్టేవారు. అంతేకాదు, మ్యాజిక్కు కూడా నేర్చుకుని అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉండేవారు. అమిత బలశాలిగా పేరుపొందిన కోడి రామ్మూర్తి నుంచి కూడా ఆయన మల్లయుద్ధాన్ని నేర్చుకోవడం జరిగింది. కాగా, 1904లో ఆయనకు దూరపు బంధువైన అన్నపూర్ణమ్మతో వివాహం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు తాపీ చాణక్య ఆయన కుమారుడే. చదువుకుంటున్న వయసులోనే ఆయన కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. తండ్రి సంపాదన కుటుంబానికి సరిపోకపోవడం వల్లా, ఆయన అన్నయ్య వైద్య విద్యలో చేరినందువల్లా ఆయన తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1906లో టెక్కలి, బరంపురంలలో ఉపాధ్యాయుడుగా పనిచేసిన తర్వాత ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగైంది. దాంతో ఆయన ఉన్నత విద్యకు వెళ్లడం జరిగింది. మద్రాసులో పచ్చయప్ప కళాశాలలో బి.ఏ పూర్తి చేయడం జరిగింది.
మద్రాసులో ఉండగా ఆయన తమిళ భాషలో పాండిత్యం సంపాదించారు. శిలప్పదికారం, మణిమేఖలై, కంబ రామాయణం వంటి పుస్తకాలను అధ్యయనం చేయడమే కాకుండా, వాటి గురించి తెలుగు పత్రికల్లో వ్యాసాలు కూడా రాయడం జరిగింది. పత్రికా రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన నార్ల వెంకటేశ్వరరావు ఆయన శిష్యులు. తాపీ ధర్మారావు తొలి రచన ‘ఆంధ్రులకొక మనవి’ 1911లో వెలువడింది. అప్పటికే పత్రికా నిర్వహణలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ధర్మారావు కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలను నిర్వహించడం జరిగింది. ఆయన మాలపిల్ల, రైతుబిడ్డ, కీలుగుర్రం, పల్లెటూరి పిల్ల, రోజులు మారాయి వంటి సినిమాలకు సంభాషణలు రాశారు.
ఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?, పెళ్లి – దాని పుట్టు పూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు, హృదయోల్లాసము వంటి ఆయన రచనలు బాగా జనాదరణ పొందాయి. ఆయన ఏ గ్రంథం రాసినా హేతువాదం లేదా సంస్కరణ వాదానికి పెద్ద పీట వేసేవారు. మొత్తం మీద ఆయన 22 అపురూప గ్రంథాలను రాయడం జరిగింది. శృంగేరీ పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల నుంచి ఆయన 1926లో ‘ఆంధ్ర విశారద’ బిరుదును అందుకున్నారు. చేమకూర వెంకటకవి రచించిన ‘విజయ విలాసం’ కావ్యానికి ఆయన చేసిన హృదయోల్లాసం అనే వ్యాఖ్యకు 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్టు లభించింది. ఆయన 1973 మేలో కాలధర్మం చెందారు.