Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్కూట‌మికి ఇటు మోదం.. అటు ఖేదం

కూట‌మికి ఇటు మోదం.. అటు ఖేదం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. ఒక‌టి క‌లిసొస్తోంది అనుకునేలోపు వంద విష‌యాలు ఎదురు తిరుగుతాయి. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 164 స్థానాలు సాధించి తిరుగులేని బ‌లంతో అధికారం చేప‌ట్టిన ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వానికి ఒక‌వైపు అన్నీ మంచి శకున‌ములే అన్న‌ట్లు ఉండ‌గా.. మ‌రోవైపు అనుకోని ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి.  ఇప్ప‌టికే శాస‌నస‌భ‌లో త‌గింత బ‌లం ఉండ‌గా, మండ‌లిలోనూ ఆధిప‌త్యం సాధించేందుకు వీలుగా తాజాగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు మార్గం సుగ‌మం చేశారు. వాళ్లు ముగ్గురూ ఆ పార్టీతో పాటు ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి.. ఈ ముగ్గురూ టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇక ఇప్ప‌టికే జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ లాంటి వాళ్లు రాజీనామా చేసి, దాని ఆమోదం కోసం కోర్టుకు కూడా వెళ్లారు. దాన్ని ఛైర్మ‌న్ ఎప్పుడు ఆమోదిస్తే అప్పుడు ప‌చ్చ‌కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నారు.

- Advertisement -

మ‌రోవైపు.. సంఖ్యాబ‌లం ఉండ‌డం వ‌ల్ల అసెంబ్లీలోను, ప్ర‌ధాన‌స్ర‌వంతి మీడియా అండ‌దండ‌లు ఉండ‌డం వ‌ల్ల బ‌య‌ట కూడా ఎలాగోలా నెట్టుకొస్తున్నా, సోష‌ల్ మీడియాలో మాత్రం ఉతికి ఆరేస్తున్నారు. ముఖ్యంగా వైద్య క‌ళాశాల‌ల విష‌యంలో ఎంత న‌చ్చ‌చెబుతున్నా ఆ విష‌యం గురించి బాగా తెలిసిన‌వారు ఏమాత్రం ఊరుకోవ‌డం లేదు. పీపీపీ పద్ధ‌తిలో వైద్య క‌ళాశాల‌ల‌ను ఏర్పాటుచేయ‌డం అంటే వాటిని చేతులారా తీసుకెళ్లి ప్రైవేటు రంగం చేతుల్లో పెట్ట‌డ‌మే అంటున్నారు. గ‌తంలో జ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని, ఆయ‌న వైద్య క‌ళాశాల‌ల్లో స‌గం సీట్లు ప్రైవేటుకు అప్ప‌గించేస్తున్నార‌ని గ‌గ్గోలు పెట్టిన టీడీపీ అండ్ కో ఇప్పుడు చేస్తున్న‌ది ఏంట‌న్న ప్ర‌శ్న‌లు సూటిగా వినిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌మ‌ర్థంగా త‌మ‌వాద‌న వినిపించ‌లేక‌పోతున్నా, ఆ ప‌ని సోష‌ల్ మీడియా మాత్రం చాలా గ‌ట్టిగా చేస్తోంది.

వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేర‌డం.. రాష్ట్రంలో మారిన అధికార సమతుల్యతకు, వైసీపీలో మొదలైన సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తోంది. విభిన్న నేపథ్యాలు కలిగిన ఈ ముగ్గురు నేతల నిష్క్రమణ, వైసీపీలోని అసంతృప్తి తీవ్ర‌త‌ను తెలియజేస్తుంది. ఒకరు పార్టీలో సీనియర్ నేత, విద్యావేత్త కాగా, మరొకరు బలహీన వర్గాల ప్రతినిధిగా, విద్యావేత్తగా గుర్తింపు పొందారు, ఇంకొకరు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువ నాయకుడు. ఈ రాజీనామాలను కేవ‌లం వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలుగా చూడ‌లేం. గ‌తంలో జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ రాజీనామా చేసిన‌ప్పుడు ఇంత చ‌ర్చ లేదు. నాయ‌కులు అటూ ఇటూ పార్టీలు మార‌డం, అధికార ప‌క్షం వైపు మొగ్గుచూప‌డం మామూలేన‌ని అంతా స‌రిపెట్టుకున్నారు. ఈసారి తీసుకున్న‌ది మాత్రం కేవలం ఆ ముగ్గురి వ్యక్తిగత నిర్ణయంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో మారిన అధికారబలానికి, వైసీపీలో మొదలైన సంక్షోభానికి ఇదో సంకేతం.

ఈ ముగ్గురు నేతల నేపథ్యాలు వేరు. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ పార్టీలో సీనియర్ నేత, విద్యావేత్త. కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ బలహీనవర్గాల ప్రతినిధి, విద్యావేత్త. గూడూరుకు చెందిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజకీయ వారసుడు. వారి పార్టీ మార్పు వెనుక ఒకే కారణం లేదు. నెరవేరని వ్యక్తిగత ఆశయాలు, వైసీపీ ఓటమితో మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త అధికార కేంద్రంతో ఉండాలనే ఆకర్షణ వంటివి ఈ పరిణామాలకు దారితీశాయి. 2024 ఎన్నికల తీర్పు ఏపీలో ఒకర‌కంగా చెప్పాలంటే.. రాజకీయ భూకంపం లాంటిది. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, ఈసారి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ ఘోర పరాజయం చాలా మంది నాయకులను పార్టీ వీడేలా చేసింది. పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ ఓటమి వైసీపీ శ్రేణుల నైతిక‌స్థైర్యాన్ని దెబ్బతీసింది. జగన్ నాయకత్వంపై కొంత‌మందిలో నమ్మకం సడలింది. గ‌తంలోనూ కొంత‌మంది నాయ‌కుల్లో అసంతృప్తి ఉన్నా, 151 సీట్ల బ‌లం ఉండ‌డంతో నోరు పైకెత్తేవారు కారు. ఇప్పుడు అలాంటివాళ్లంతా తమ గళం విప్పుతున్నారు. ఈ వలసలు శాసనమండలి బలాబలాలను మారుస్తున్నాయి. 2023 మార్చి నాటికి 58 మంది సభ్యులున్న మండలిలో వైసీపీకి 44 స్థానాలు ఉండేవి. ఇప్పుడు ఆ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. మరోవైపు, 164 స్థానాల‌తో తిరుగులేని ఆధిక్యం సంపాదించిన టీడీపీ.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కూడా మొద‌లుపెట్టేసింది. స‌హ‌జంగానే అధికార‌ప‌క్షం పిలిస్తే కాద‌న‌డం చాలామంది నేత‌లు చేయ‌లేని ప‌ని. అధికార పార్టీ అండ‌దండ‌లు ఉంటే త‌ప్ప త‌మ ప‌నులు చేసుకోలేమ‌ని, అలాగే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండాల‌న్నా అధికార‌కూట‌మితోనే ఉండాల‌ని చాలామంది భావిస్తుంటారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్రబాబు స్వ‌యంగా తానే ఈ ముగ్గురు ఎమ్మెల్సీల‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానించ‌డం ద్వారా.. వైసీపీలో ఉన్న అసంతృప్త నేత‌లంద‌రికీ కూడా ఒక సంకేతం పంపారు.

మర్రి రాజశేఖర్:
మర్రి రాజశేఖర్ వైసీపీలో 14 ఏళ్లు పనిచేసిన సీనియర్ నేత. ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్. 2019, 2024 ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది . ఆ స్థానానికి విడదల రజినిని ఇన్‌చార్జిగా నియమించడం ఆయనకు నచ్చలేదు . 2023లో పార్టీ ఆయనను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేసింది. అయినా 2024లో ప్రభుత్వం మారగానే, ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

కర్రి పద్మశ్రీ:
కర్రి పద్మశ్రీ ఒక విద్యావేత్త. అట్టడుగు వర్గాల కోసం, ముఖ్యంగా మత్స్యకార వ‌ర్గాల‌ కోసం పనిచేశారు. ఆమెను 2023లో గవర్నర్ కోటాలో వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీగా నియమించింది . ఆమె బీసీ వర్గానికి ప్రతినిధి. నామినేటెడ్ పదవి కావడంతో, ప్రభుత్వం మారినప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త అధికార పార్టీతో సర్దుబాటు చేసుకోవడం అవసరమని ఆమె భావించారు. ఆమె భర్త గతంలో టీడీపీలో పనిచేశారు.

బల్లి కళ్యాణ్ చక్రవర్తి:
బల్లి కళ్యాణ్ చక్రవర్తి దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కుమారుడు . తండ్రి మరణం తర్వాత, తిరుపతి ఉప ఎన్నికలో ఆయన టికెట్ ఆశించారు. కానీ జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీతోనే ఆయన 2021లో ఎమ్మెల్సీ అయ్యారు. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా లేదని ఆయన భావించారు. దాంతో, తన రాజకీయ మనుగడ కోసం అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు.

ఇక వైద్య‌క‌ళాశాల‌ల విష‌యానికొద్దాం. జ‌గ‌న్ హ‌యాంలో 107,108 జీవోలు తీసుకొచ్చి వైద్య క‌ళాశాల‌ల్లో స‌గం సీట్ల‌ను సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలోకి తీసుకొచ్చిన‌ప్పుడు టీడీపీ వ‌ర్గాలు తీవ్రంగా ఆందోళ‌న చేశాయి. వైద్యవిద్య వ్యాపారానికి న‌యా పెత్తందారు  జ‌గ‌న్ అంటూ త‌మ పార్టీకి అండ‌గా ఉండే ప్ర‌ధాన ప‌త్రికల్లో ప‌తాక శీర్షిక‌ల క‌థ‌నాలు వండి వ‌డ్డించాయి. నిజానికి ఆ నిర్ణ‌యం మీద చాలామంది అప్ప‌ట్లో కోర్టుల‌ను కూడా ఆశ్ర‌యించారు. అయినా ఆ కేసు ఇంకా కొన‌సాగుతూనే ఉంది త‌ప్ప దాన్నుంచి ఎలాంటి ఊర‌ట లేదు.  కేవ‌లం స‌గం సీట్ల గురించే అంత గొడ‌వ చేసిన‌ప్పుడు.. ఇప్పుడు ఏకంగా కాలేజీల‌కు కాలేజీల‌నే ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టేస్తుంటే ఏం చేయాలి? పీపీపీ పేరుతో ప్రభుత్వం కేవలం రూ.160 కోట్లతో పూర్తి చేయగల పులివెందుల వైద్య‌క‌ళాశాల‌ను అప్పనంగా కార్పోరేట్లకు అందిస్తోంది. ఆ ఖర్చు చంద్రబాబు కోసం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన హెలికాప్టర్ ఖర్చు కన్నా తక్కువే. పీపీపీ అనేది ప్రైవేటీక‌ర‌ణ కాదంటూ ప్ర‌భుత్వం స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. కానీ, పీపీపీ ప‌ద్ధ‌తిలో నిర్మిస్తున్న జాతీయ ర‌హ‌దారుల మీద టోల్ గేట్ల వ‌సూళ్ల విష‌య‌మే చూసుకుంటే, మ‌నం ఎన్ని సంవత్స‌రాలుగా ఆ టోల్ ఫీజులు చెల్లిస్తున్నాం, ఇంకా ఎన్ని సంవ‌త్స‌రాల పాటు చెల్లిస్తూనే ఉంటాం? క‌నీసం ఒక‌టి రెండు త‌రాలు అలా దాటిపోతాయి. ఇప్పుడు వైద్య క‌ళాశాల‌ల ప‌రిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొన్ని త‌రాల పాటు అవి క‌చ్చితంగా ప్రైవేటు యాజ‌మాన్యాల చేతుల్లోనే ఉంటాయి. త‌ర్వాత ఎప్పుడో ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తార‌ని అంటున్నా.. అది ఎప్ప‌టికి జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇప్పటివరకూ పీపీపీ చేతుల్లో పెట్టిన ఎలాంటి ప్రాజెక్టులైనా, అస‌లు ఎక్కడైనా ప్రైవేటు లాభాల కోసం నడుస్తోందా లేక ప్రజల ప్రయోజనాల కోసం సాగుతోందా అన్నది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

ఇప్పుడు పీపీపీని అంగీకరిస్తే ఇకపై ఏపీలో ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల‌ను ప్రారంభించరు. ఎందుకంటే ఒకసారి చేతులు దులిపేసుకున్న త‌ర్వాత మళ్లీ నెత్తినెట్టుకునే పని ప్రభుత్వాలు చేస్తాయనుకుంటే అది భ్రమ. రెండోది ప్రభుత్వాసుపత్రులను కట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధం కాదు. దానికి పీపీపీ వంటి ముసుగులేసి ప్రజలను ప్రైవేట్ దయాదాక్షిణ్యాలకు వదిలేస్తుంది.

ఒకసారి ఈ పీపీపీ మొదలైన తర్వాత ఇప్పటికే ఉన్న కాలేజీలను కూడా క్రమంగా అదే పద్ధతిలోకి తోసేస్తారు. ఆర్థిక భారం పేరుతో వైద్య విద్య తమ వ‌ల్ల అయ్యే పనికాదని చెప్పేస్తారు. మొత్తంగా ఏపీలో ప్రజారోగ్యం పణంగా పెట్టేస్తున్నారు. ప్రైవేటు అయితే ఏమవుతుంది.. మహా అయితే కొంత ఫీజులుంటాయంతే కదా అని కొందరి మాట. కరోనా తొలిదశలో ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఏమయ్యాయో.. ప్రజలకు సేవచేయడానికి ఎవరు అవసరమయ్యారో గుర్తిస్తే ప్రమాదం అర్థమవుతుంది. భార‌త‌దేశంలోనే  కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉన్న దేశాల్లో మాత్రం కరోనా మ‌ర‌ణాలు కొంత తగ్గాయి. అందుకు విరుద్ధంగా ప్రైవేటు పెత్తనమున్న చోట ప్రజలకు భరోసా లేకుండా పోయింది. ఇకపై అలాంటి విపత్తుల వేళ లాభమే పరమావధిగా పనిచేసే ప్రైవేటు రంగం ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం అనివార్యం.

వైద్య‌క‌ళాశాల‌ల‌ను పీపీపీ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించే విధానాన్ని తొలుత గుజ‌రాత్‌లో అమ‌లుచేశారు. మోదీ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే.. అంటే 2009లో జీఎంఈఆర్ఎస్‌.. అంటే గుజ‌రాత్ మెడిక‌ల్ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ సొసైటీ పేరుతో ప్రారంభించారు. అక్క‌డ ప్ర‌భుత్వం వైద్య క‌ళాశాల భ‌వ‌నాల నిర్మాణానికి భూములిచ్చి, నిర్వహణకు అనుమతులు ఇచ్చింది. ప్రైవేటు సంస్థలు నిర్మించి, నిర్వహణ చేస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వమే వైద్య క‌ళాశాల భ‌వ‌నాల‌ను చాలావరకూ నిర్మించింది. ప్రైవేటు రంగం మాత్రం కేవ‌లం పెత్తనం చేస్తుందన్న మాట. మ‌రో విష‌యం ఏమిటంటే, గుజ‌రాత్ పీపీపీ మోడ‌ల్ ప్ర‌వేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రకోటా 85%, జాతీయ కోటా 15% ఉన్నాయి. ఏపీలో ఆలిండియా కోటా 15% ఉన్నా, మిగిలిన 85% సీట్ల‌లో స‌గం సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు. మ‌రో స‌గం మాత్ర‌మే స్టేట్ కోటా ఉంటుంది.

గుజరాత్ లో జునాగఢ్, గోద్రా సహా ఇలాంటివి ప‌ది కాలేజీలు నడుపుతున్నారు. అక్క‌డ స్టేట్ కోటాలో సగటు ఫీజు ఏడాదికి రూ. 4లక్షలు. బీ కేటగిరీ సీటు రూ. 13లక్షలు, సీ కేటగిరీ 25 లక్షల చొప్పున ఉంది. ఏపీలో మాత్రం దానికి మించి ఉండబోతున్నాయి. ఆయా కాలేజీల్లో సదుపాయాలను బట్టి నిర్ణయించేందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తున్నారు. ఏ కేటగిరీ సీటు మెరిట్ కోటాలో తెచ్చుకున్నా కూడా  కనీసం రూ. 25లక్షలు లేకుండా ఈ కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయడం సాధ్యం కాదన్నట్టుగా ప‌రిస్థితి ఉంది. అంతేకాదు.. గుజరాత్ లో కూడా ఆస్పత్రులను ప్రైవేటుకి అప్పగించారు. ఏపీలో కూడా 650 పడకల ఆస్పత్రుల నిర్మాణం అంటూ టెండర్లలో పేర్కొన్నారు. కానీ వాటిలో ప్రైవేటు ఫీజుల దందా అనివార్యం.  అన్నింటికీ మించి అసలు సమస్య ఏమంటే..తొలుత కొన్ని కాలేజీలతోనే మొదలయినప్పటికీ క్రమంగా మెడికల్ కాలేజీలన్నీ ఇలా ప్రైవేటు పెత్తనం కిందకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది.

ఇక అన్నింటికంటే విచిత్ర‌మైన వాద‌న మ‌రొక‌టి క‌నిపిస్తోంది. జ‌గ‌న్ హ‌యాంలో 2021లో వైద్య క‌ళాశాల‌ల నిర్మాణం ప్రారంభించి, 2023 నాటికి ఐదు చోట్ల ప్ర‌వేశాలు మొద‌లుపెట్టారు. ఇప్పుడు మిగిలిన ప‌ది కాలేజీల నిర్మాణాలు పూర్తిచేయ‌డానికి త‌మ‌కు 23 ఏళ్లు ప‌డుతుంద‌ని సాక్షాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వాకృస్తున్నారు. ఒక‌వైపు జ‌గ‌న్ ఏమీ క‌ట్ట‌లేద‌ని, పునాదులు వేస్తే క‌ళాశాల‌లు పూర్త‌యిపోయిన‌ట్లేనా అంటూ విమ‌ర్శిస్తున్న టీడీపీ కూట‌మి నేత‌లు.. ఈ వాద‌న‌ను ఏమంటారో చూడాలి మ‌రి!!

– స‌మ‌య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad