Homeఎడిటోరియల్ / బహుళబహుజన దృక్పథమే సామాజిక తెలంగాణకు మార్గం

బహుజన దృక్పథమే సామాజిక తెలంగాణకు మార్గం

గులాబీ పార్టీలోని కుటుంబ ఆధిపత్య పోరు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత తెరపైకి తెచ్చిన కొత్త గళం తీవ్ర చర్చనీయాంశమైంది. కుటుంబంలో వారసత్వపు సమాన భాగస్వామ్యం దక్కలేదనే అసంతృప్తితో ఆమె సామాజిక న్యాయ తెలంగాణ అనే నినా దాన్ని ఎత్తుకోవడం కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్ర మేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఆధిపత్య కుటుంబ రాజకీయ వేదిక నుండి ఉద్భవించిన ఈ కొత్త గళానికి బహుజన సమాజం నుండి ఆశించిన స్పందన రాకపోవడానికి చారిత్రక చేదు అనుభవాలే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో, తెలంగాణ చారిత్రక నేపథ్యం, సామాజిక న్యాయం కోణంలో సమకాలీన రాజకీయ పరిణామాల విశ్లేషణ చేయాల్సి ఉంది.
నిజాం నుండి నేటి పాలకుల దాకా.. సుమారు 400 సంవత్సరాల పాటు నిజాం నవాబుల పాలనలో మగ్గిన తెలంగాణ ప్రాంతం, చరిత్ర పుటల నిండా పోరాటాల గాథలనే కలిగి ఉంది. నిజాం రాజరికపు అణచివేతను, గ్రామస్థాయిలో భూస్వామ్య, వ్యాపార వర్గాలు సాగించిన దోపిడీని ఎదిరిస్తూ ఇక్కడి ఎస్సీ ఎస్టీలు, బీసీలు, పేద ముస్లింలు నిరంతరం పోరాడారు. ఈ చారిత్రక పీడనకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు కొనసాగించిన సాయుధ, స్వశక్తి పోరాటాలు ప్రపంచ చరిత్రలోనే ఒక మైలు రాయి. విశాలాంధ్ర పేరుతో పెద్దమనుషుల ఒప్పందంతో తెలంగాణ ప్రాంతం 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయబడింది. అయితే ఈ ఒప్పందంలోని హామీలన్నీ కాలరాయబడి, నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ తీవ్ర మోసానికి గురైంది. ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోవడంతో 1969, 1990ల నుండి 2014 వరకు అనేక రూపాల్లో తెలంగాణ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయి. వందలాది మంది ప్రాణత్యాగాలు, ఆత్మబలిదానాలు, జైలు శిక్షల, రాజకీయ వ్యూహాల ఫలితంగా ఎట్టకేలకు 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.

- Advertisement -

భౌగోళిక తెలంగాణ వర్సెస్ సామాజిక న్యాయ తెలంగాణ

తెలంగాణ ఉద్యమ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుంది. 1920ల నుండి నేటి వరకు ఉద్యమాలను నడిపిన అగ్రకుల నాయకులు దీనిని కేవలం మొదటగా ముస్లిం వ్యతిరేక, మలిదశలో నీళ్లు, నిధులు, ఉపాధి అనే భౌగోళిక అంశాలుగానే చూశారు. కానీ, ఈ ఉద్యమానికి అసలైన ప్రాణప్రతిష్ట చేసిన బహుజన సమాజం మాత్రం దీనిని సామాజిక న్యాయ తెలంగాణ కోణంలో భావించారు. అనగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో ప్రతి ఒక్కరికీ సమానమైన స్వేచ్ఛ, ఈక్విటీ, న్యాయం లభించాలన్నదే బహుజనుల ఆకాంక్ష. అయితే, 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం, నేడు రేవంత్‌ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తాత్కాలిక సంక్షేమ పథకాలతో సరిపెడుతూ, భూ సంస్కర ణలు, నాణ్యమైన విద్య, వైద్యం, జనాభా ప్రాతి పదికన రాజ్యాధికార అవకాశాలు కల్పించడం వంటి గుణాత్మక మార్పుల వైపు దృష్టి పెట్టలేదు. ఆ అంశాల కేంద్రంగా రాజకీయ ఉద్యమాలను నిర్మించే సమూహాలను, నాయకులను కౌటిల్య నీతితో కట్టడి చేస్తున్నారు.

రాజకీయ వారసత్వ పోరాటాలు.. అగ్రకుల నేతల పరిమితులు

ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీలో తన అన్న కేటీఆర్‌తో పాటు లింగ సమానత్వ సమాన రాజకీయ భాగస్వామ్యం కోరి భంగపడిన కల్వకుంట్ల కవిత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో సామాజిక న్యాయం అంటూ ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆమె అంచనా వేస్తున్న స్థాయిలో ప్రజల నుండి పెద్దగా స్పందన రావడం లేదు. దీనికి ప్రధాన కారణం చారిత్రక అనుభవమే. సమస్త సహజ వనరులు, భూములు, పదవులు ఆధిపత్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నప్పుడు, కేవలం కుటుంబ కలహాల వల్ల బయటకు వచ్చిన నేతలు సామాజిక న్యాయం మాట్లాడటం ఒక రాజకీయ వ్యూహం మాత్రమేనని భావించడం స్త్రీ కేంద్రీకృత రాజకీయా లను వ్యతిరేకించడం మాత్రం కాదు. ఆధిపత్య కులాల నుండి వచ్చే నాయకత్వం పట్ల సామాజిక చైతన్యం పొందిన బహుజ నులలో ఒక రకమైన అప్రమత్తత ఉంది. కనుక కవిత లాంటి ఆధిపత్య కుల నేపథ్యం ఉన్న నాయకులు సామాజిక న్యాయాన్ని నిజమైన అర్థంలో సాధించాలంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా, తమ ఆస్తులను, రాజకీయ పదవులను ఫూలే, అంబేడ్కర్‌ తాత్విక పునాదిగా బహుజనులకు పంచే నిజమైన రాజకీయ యోగ్యతను, చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంటుంది. కవిత కూడా పితృస్వామ్య బాధితురాలే! కుటుంబ రాజకీయాలలో పురుషాధిక్యతే గీటురాయిగా ఉన్నప్పుడు, ఎంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్న మహిళలకైనా రాజకీయ వారసత్వంలో సమాన భాగస్వామ్యం దక్కకుండా అడ్డుకట్ట పడుతుంది. కవిత ఎదుర్కొన్న ఈ రాజకీయ అణచివేత ఉదంతం, ఆధిపత్య కులాల లోపలి పురుషాధిక్య రాజకీయ సంస్కృతి కాఠిన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, సామాజిక న్యాయ వేదికలపై కేవలం తమ కుటుంబ పరిధిలో ఎదురైన పితృస్వామ్య వివక్షను మాత్రమే హైలైట్‌ చేస్తూ, శతాబ్దాలుగా అణచివేయబడిన బహుజన మహిళల బతుకులను, వారి ఉమ్మడి వేదనను విస్మరిస్తే ఆ గళానికి విశ్వసనీయత లభిం చదు. ఆధిపత్య కుల మహిళలు ఎదుర్కొనే పితృస్వామ్య హింసను గుర్తిస్తూనే, వ్యవస్థాగతమైన కుల వ్యవస్థను, దాని ఆధారిత అసమానతలను కూకటివేళ్లతో పెకిలించనంత వరకు నిజమైన లింగ సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యం కావు. ఈ విషయాన్ని త్రికరణశుద్ధిగా అవలోకన చేసుకొని కవిత తన రాజకీయ కార్యాచరణను రూపొందించుకోవాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ శక్తుల రాజకీయ వ్యూహాలు..

ఈ తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు, మేధా వులు తమ బలాలను, బలహీనతలను బేరీజు వేసు కుంటూ పకడ్బందీ రాజకీయ వ్యూహాలను రచించాలి. బహుజనులలో ఉన్న ఐక్యతా లోపాన్ని, ఆర్థిక బలహీన తలను తమ బలంగా మలుచుకుంటున్న ఆధిపత్య కుల రాజకీయ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలి. అంబేడ్కర్‌ ప్రబోధించిన బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని కాన్షీరామ్‌ రాజనీతిజ్ఞతతో ముడిపెట్టి ఆచర ణలో పెట్టాలి. కేవలం భావోద్వేగాల ద్వారా కాకుండా, ఆర్థిక, రాజకీయ అధికార వికేంద్రీకరణే ధ్యేయంగా కలిసొచ్చి అగ్రకుల ప్రజాస్వామ్య శక్తులతో విశాలమైన ఐక్యవేదికలను ఏర్పాటు చేసుకోవాలి. ఆధిపత్య కులాల పార్టీల నుండి వచ్చే ఎలాంటి వంచనాపూరిత నినాదాలకు లొంగకుండా, సొంత నాయకత్వాన్ని తయారు చేసుకునే దిశగా అడుగులు పడాలి. అప్పుడే తెలంగాణ అమర వీరుల ఆశయాలు, బహుజనుల త్యాగాలు ఫలించి, నిజ మైన సామాజిక న్యాయ తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. లేనిచో ఈ పోరాటాలన్నీ కేవలం పాలకులు మారే మార్పులుగానే మిగిలిపోతాయి తప్ప, పీడిత ప్రజల బతుకులు మారవు. చివరగా, సుదీర్ఘ కాలంగా, సువిశాల మానవీయ దృక్పథంతో ఆవిష్కరించవలసిన సామాజిక తెలంగాణ సాధనలో కవితమ్మ లాంటి వాళ్ళు త్రికరణ శుద్ధితో తమ ఆచరణ రూపొందించుకుంటే సమాజం తప్పక వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తది తప్ప, ముందే నేనే ముఖ్యమంత్రినని ప్రకటించి, రాజకీయ క్షేత్రంలో ఉంటానంటే గత చరిత్ర అనుభవంతో బహుజన సమాజం అనుమానంగానే చూస్తుంది. ఇప్పుడు ఏ దృక్పథంతో పని చేయాలో నిర్ణయించుకోవాల్సింది కవిత నే.

డా.నాగం కుమారస్వామి
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
పాలమూరు యూనివర్సిటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News