BBC: ఇజ్రాయెల్ తుదముట్టించిన, హమాస్ తదితర సంస్థలకు చెందిన, 53మంది ఉగ్రవాదులను ‘జర్నలిస్టులు’గా చిత్రీకరిస్తూ వార్తలు వెలువరించడంపై బ్రిటిష్ వార్తాసంస్థ బీబీసీ తీవ్రస్థాయి విమర్శలను ఎదుర్కొంటోంది. పలు నివేదికలు, ఫొటోగ్రాఫ్‌లు, పటిష్టమైన ఇతర సాక్ష్యాధారాల ప్రకారం ఆ వ్యక్తులకు హమాస్ సహా వివిధ ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నిర్ధారణ అయింది. వారిలో కొంతమంది 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రవాద సంస్థ చేసిన క్రూరమైన దాడిలో ప్రత్యక్షంగా క్రియాశీలంగా పాల్గొన్నారు. మిగిలినవారికి ఉగ్రవాద సంస్థలే బహిరంగంగా ‘అమర వీరులు’ అంటూ నివాళులు అర్పించాయంటే వారు ఎవరో ఇట్టే అర్ధమవుతుంది.
ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులను జర్నలిస్టులుగా చిత్రీకరిస్తూ పాఠకులను లేదా ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే ఆ నివేదికలు ‘బీబీసీ అరబిక్’ ఛానెల్, వెబ్సైట్లలో ప్రసారమయ్యాయి, ప్రచురితమయ్యాయి. అయితే ఆ కథనాలలోని నిజానిజాలపై ది టెలిగ్రాఫ్ పత్రిక పరిశోధనాత్మక కథనాన్ని 2025 సెప్టెంబర్ 26న బైటపెట్టింది. సదరు వ్యక్తులను జర్నలిస్టులు అంటూ బీబీసీ వెలువరించిన కథనాలు తప్పుడువని బహిర్గతం చేసింది. ఆ 53మంది ఉగ్రవాదుల్లో పదిమందిని ‘బీబీసీ న్యూస్’ ఇంగ్లిష్ వెబ్సైట్ సైతం జర్నలిస్టులుగా ప్రకటించిన సంగతిని కూడా బైటపెట్టింది.
బీబీసీ తప్పుడు కథనంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆ సంస్థ ఇప్పుడు పరువు కాపాడుకునే పనిలో పడింది. గాజాలో జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన పాలస్తీనా ఉగ్రవాదులను తమ వార్తా కథనాల్లో జర్నలిస్టులుగా గుర్తించడం గురించిన సమాచారాన్ని పునస్సమీక్షిస్తున్నామని బీబీసీ పేర్కొంది. ఇజ్రాయెల్ – గాజా యుద్ధం విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం బీబీసీకి ఇదేమీ మొదటిసారి కాదు. బీబీసీ గతేడాది ‘గాజా: హౌ టు సర్వైవ్ ఎ వార్జోన్’ అనే డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఆ డాక్యుమెంటరీ గురించి కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బీబీసీ సంస్థ సొంత పాత్రికేయ ప్రమాణాలను ఆ డాక్యుమెంటరీ నిర్మాణంలో ఉల్లంఘించారని వెల్లడయింది.
53మంది ‘జర్నలిస్టుల’ గురించి పరిశోధనలో ఏం తేలిందంటే…
హమాస్ ఉగ్రవాదులను పాత్రికేయ కార్యకర్తలుగా (ప్రెస్ వర్కర్స్) బీబీసీ ఎలా చిత్రించిందన్న వివరాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. పాత్రికేయులుగా పేర్కొనబడిన ఆ వ్యక్తుల్లో చాలామంది సామాజిక మాధ్యమాల్లో తమ నిజరూపాలను ప్రదర్శించారు. యుద్ధంలో వాడే దుస్తులు ధరించి, ప్రమాదకరమైన ఆయుధాలు చేత పుచ్చుకొని ఉన్న ఫొటోలను తమతమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసారు. పలు సందర్భాల్లో వారు ఉగ్రవాద సంస్థల నినాదాలు ముద్రించి ఉన్న తలపట్టీలు (హెడ్‌బ్యాండ్స్) ధరించిన ఫొటోలు సైతం కనిపిస్తున్నాయి.
కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) అనే సంస్థ అమెరికా కేంద్రంగా నడుస్తోంది. ఘర్షణాత్మక, యుద్ధ ప్రదేశాల్లో (కాన్ఫ్లిక్ట్ జోన్స్) పనిచేసే మీడియా వర్కర్స్ కోసం ఆ సంస్థ పనిచేస్తోంది. వివిధ సందర్భాల్లో మరణించిన లేదా చంపబడిన జర్నలిస్టుల వివరాల జాబితాను అధికారికంగా నిర్వహిస్తోంది. బీబీసీ ప్రచురించిన 53మంది పేర్లలో పన్నెండు పేర్లను ఆ సంస్థ తమ అధికారిక జాబితా నుంచి తొలగించింది. ఆ వ్యక్తులు జర్నలిస్టులు లేదా మీడియా వర్కర్స్‌గా గుర్తించబడడానికి అర్హులు కారని, లేదా వారు ప్రత్యక్షంగా యుద్ధం, ఘర్షణల్లో పాల్గొన్నారనీ నిర్ధారించింది.
బీబీసీ నివేదికలో పేర్కొన్న యాభైముగ్గురు సోకాల్డ్ పాత్రికేయుల్లో ఒక ముగ్గురి వివరాలు తెలుసుకుందాం. మొదట అబ్దుల్లా దర్వీష్ సంగతి చూద్దాం. హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన అల్ అక్సా టీవీ ఛానెల్లో అబ్దుల్లా దర్వీష్ కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్నాడని బీబీసీ పేర్కొంది. హమాస్‌కు చెందిన ఇజ్జాద్ దిన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌లో కార్యకర్త హోదాలో అబ్దుల్లా దర్వీష్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద జరిపిన దాడిలో పాల్గొన్నాడు అనడాన్ని కాదనలేని తిరుగులేని సాక్ష్యం ఉండడంతో సీపీజే అతన్ని జర్నలిస్టుల జాబితా నుంచి తొలగించింది. ఆ వ్యక్తి ఉగ్రవాద సంస్థ చిహ్నాలతో తయారైన ఆకుపచ్చ హెడ్‌బ్యాండ్ ధరించి తీసుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి.
మరొక ఉదాహరణ యాకూప్ అల్ బోర్ష్. బీబీసీ అరబిక్ అతన్ని నమా రేడియో అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని పేర్కొంది. అయితే అతను హమాస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు అని గుర్తించిన తర్వాత సీపీజే అతని పేరును కూడా జర్నలిస్టుల జాబితా నుంచి తొలగించింది. హమాస్ తన అధికారిక వెబ్‌పేజ్‌లో యాకూప్ అల్ బోర్ష్ను ‘‘అమర వీరుడి’’గా కీర్తిస్తూ ప్రముఖంగా ప్రదర్శించింది.
రిజిక్ అబూ షకియన్ సంగతి కూడా అంతే. బీబీసీ అతన్ని పాలస్తీనాలో పాత్రికేయుడిగా పేర్కొంది. అయితే టెలిగ్రాఫ్ పరిశోధనలో, అతడు హమాస్ ఉగ్రవాద సంస్థ యూనిఫాం ధరించి, చేతిలో ఆటోమేటిక్ రైఫిల్ పట్టుకొని ఉన్న ఫుటేజ్ లభించింది. ఉగ్రవాద చర్యల్లో అతని పాత్ర ఉందని సందేహ రహితంగా నిరూపణ అయాక సీపీజే తమ జాబితాలోనుంచి రిజిక్ అబూ షకియన్ పేరు కూడా తొలగించింది.
బీబీసీ మోసం అక్కడితో ఆగలేదు. పై ముగ్గురితో పాటు మరో యాభై మందిని కూడా బీబీసీ సంస్థ పాత్రికేయులుగా గుర్తించింది. నిజానికి వారి సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా, పలువురిని చంపేస్తామంటూ వారు జారీ చేసిన నోటీసులను ఉగ్రవాద సంస్థలు బహిరంగంగానే ప్రదర్శించాయి. మొహమ్మద్ అల్ జక్ అనే ఉగ్రవాదికి పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థ సంస్మరణ ప్రకటించింది. ముస్తఫా బకీర్ తమ సంస్థకే చెందిన రఫా బ్రిగేడ్‌లో ఫీల్డ్ కమాండర్ అని హమాస్ వెల్లడించింది. హమాస్ తమ సంస్థకే చెందిన ఖాన్ యూనిస్ బ్రిగేడ్‌కు చెందిన అబ్దుల్లా అయాద్ బ్రెయిస్కు ‘నైట్’ (సైన్యాధిపతి) హోదా ఇచ్చి గౌరవించింది. అహ్మద్ అబూ స్కెయిల్ను పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అమర వీరుడిగా బహిరంగంగానే ప్రకటించింది.
ఇంకా, బీబీసీ జర్నలిస్టులుగా ప్రకటించిన మరో 21మంది ఉగ్రవాదులు సైతం భారీ ఆయుధాలతోనూ, యుద్ధ దుస్తులతోనూ సామాజిక మాధ్యమాల్లో కనిపించినవారే. వారిలో అహ్మద్ సమీర్ మొహమ్మద్ వాషా అనే వ్యక్తి గ్రెనేడ్ లాంచర్‌ను ప్రయోగించడం ఎలాగో అభ్యసిస్తున్న వీడియోలు ఉన్నాయి. మరో ఉగ్రవాది అమీర్ అబూ ఔదాను ఇజ్జద్దీన్ అల్ కసమ్ బ్రిగేడ్ గొప్ప వీరుడిగా ప్రకటించింది.
ఇదేమీ మొదటిసారి కాదు:
బిబిసి ఇలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం లేదా గాజాకు సంబంధించి పక్షపాత ధోరణితో కూడిన కథనాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది బీబీసీ ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ‘‘గాజా: హౌ టు సర్వైవ్ ఎ వార్జోన్’’ అనే పేరున్న ఆ డాక్యుమెంటరీ నిజానికి ప్రచారమే (ప్రాపగాండా) అని బీబీసీ స్వయంగా అంగీకరించింది. ఆ డాక్యుమెంటరీని వ్యాఖ్యానం చేసిన పిల్లవాడు నిజానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ అయిన హమాస్‌లో సభ్యుడైన ఒక వ్యక్తి కొడుకు. ఆ విషయాన్ని దాచిపెట్టడం వల్ల ఆ ప్రసారం కీలకమైన ప్రయోజన వైరుధ్యాన్ని (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్) వెల్లడించడంలో పూర్తిగా విఫలమైంది. తద్వారా బీబీసీ అత్యంత ప్రాథమికమైన సంపాదకీయ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు స్పష్టమైంది. ఆ విషయం బైటపడిన తర్వాత బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ సమీక్షకు ఆదేశించారు. ఆ సమీక్ష ఆధారంగా అసలు ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేయడానికి అసలు అనుమతే ఇచ్చి ఉండిఉండకూడదు కాదు అని బీబీసీ అంగీకరించింది.
నిజానికి ఆ డాక్యుమెంటరీని హొయో ఫిలిమ్స్ అనే ఒక స్వతంత్ర కంపెనీ నిర్మించింది. అందులోని వ్యాఖ్యాత నేపథ్యం గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తడంతో ఈ యేడాది ఫిబ్రవరిలో ఐ ప్లేయర్ తమ ప్లాట్‌ఫాం నుంచి ఆ డాక్యుమెంటరీని చడీచప్పుడూ లేకుండా తొలగించింది. డాక్యుమెంటరీలో వ్యాఖ్యానం చేసిన పిల్లవాడి తండ్రి హమాస్ నిర్వహిస్తున్న గాజా ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయమంత్రి అన్న విషయం నిర్మాణ కంపెనీలోని కనీసం ముగ్గురు సభ్యులకు ముందుగానే తెలుసు అన్న విషయం అంతర్గత సమీక్షలో ధ్రువీకరించబడింది. అయితే ఆశ్చర్యకరంగా, అంత కీలకమైన విషయం బీబీసీలో డాక్యుమెంటరీ ప్రసారం అవడానికి ముందు ఆ సంస్థలో ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదట.
బీబీసీ ప్రాథమికమైన సంపాదకీయ తనిఖీలు చేపట్టడంలో విఫలమైందని, కార్యక్రమ నిర్మాణంలోనూ తర్వాత దాన్ని అనుమతించే దశల్లోనూ నిశిత పరిశీలన జరగనేలేదనీ అంతర్గత సమీక్ష తీవ్రంగా విమర్శించింది. డాక్యుమెంటరీ వ్యాఖ్యాత కుటుంబం ప్రత్యక్షంగా ఎక్కడా జోక్యం చేసుకోలేదంటూ సమీక్ష ముగించినప్పటికీ, అలాంటి నిర్దిష్ట పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని వ్యాఖ్యాతగా ఉపయోగించుకోవడం ‘సముచితమైన చర్య కాదు’ అని బహిరంగంగా ప్రకటించింది.
ఆ వివాదం తర్వాత బీబీసీ న్యూస్ సీఈఓ డెబోరా టర్నెస్ ఒక ప్రకటన చేసారు. జరిగిన తప్పుకు ప్రసారకర్తదేనని ఒప్పుకున్నారు. అటువంటి తప్పులు జరగకుండా తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అందులో భాగంగా కొత్త పర్యవేక్షణ నియమాలు, మరింత జాగ్రత్తగా వ్యాఖ్యాతల ఎంపిక, వివాదాస్పద అంశాలపై కార్యక్రమాల ప్రసారానికి ముందు అంతర్గత నిబంధనలను తనిఖీ చేసే పటిష్టమైన వ్యవస్థల ఏర్పాటు వంటి చర్యలు ఉంటాయని వివరించారు.
వివాదం అక్కడితో సమసిపోలేదు. డెబోరా టర్నెస్ తర్వాత అదే అంశానికి సంబంధించిన ‘గాజా – డాక్టర్స్ అండర్ ఎటాక్’ అనే మరో డాక్యుమెంటరీని తనిఖీ చేసారు. నిష్పాక్షికతకు సంబంధించిన ఆందోళనలు ఎక్కువ అయిపోయిన కారణంగా ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిలిపివేయవలసి వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన జర్నలిస్టు రమితా నవాయ్ సామాజిక మాధ్యమాల్లో సమస్యాత్మక వైఖరిని ప్రదర్శించడం, బీబీసీ రేడియో 4లో ప్రసారమయ్యే కార్యక్రమంలో సంస్థ ప్రమాణాలకు సరిపడని విధంగా వ్యాఖ్యలు చేయడం సమస్యను మరింత పెంచింది. రమితా నవాయ్ రేడియో 4 కార్యక్రమంలో ‘ఇజ్రాయెల్ యుద్ధనేరాలకు, జాతి నిర్మూలనకు, పాలస్తీనియన్ల సామూహిక హత్యాకాండకూ పాల్పడుతున్న దుష్టదేశం’ అని వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. అలాంటి కారణాలతో గాజా డాక్యుమెంటరీని మొత్తానికే నిలిపివేయవలసి వచ్చింది. ఆ విషయంలో డెబోరా టర్నెస్ ‘ఆ ప్రాజెక్టును కొనసాగించడం అసాధ్యంగా మారింది’ అని వ్యాఖ్యానించారు. విషయం బైటపడడంతో బీబీసీకి తదుపరి డాక్యుమెంటరీని నిలిపివేయక తప్పని పరిస్థితి కలిగింది. అయితే ఆ సంస్థ ప్రాధాన్యాలు స్పష్టంగా బహిర్గతమవుతూనే ఉన్నాయి. పాలస్తీనా ఉగ్రవాదులను జర్నలిస్టులుగా చిత్రీకరించే తప్పుడు కథనాలు బీబీసీ నైజానికి నిదర్శనంగా నిలిచాయి.
ఫణీన్ద్ర పురాణపణ్డ
సీనియర్ జర్నలిస్ట్

