నది జీవితాన్నిస్తుంది. అది నాగరకతను నేర్పుతుంది. తన నిస్వార్థతను వారసత్వంగా ఈ లోకానికిస్తుంది. నదిలాగే కొందరుం టారు. మన మధ్యే ఉంటారు. కోటాను కోట్లమందికి ఆదర్శంగా నిలుస్తారు. భిన్న కార్యాచరణతో చరిత్రపై తమదైన ముద్ర వేస్తారు. రాబోయే కాలానికి ఆదర్శంగా నిలుస్తారు. ఎవ్వరి నుండి ఏమీ ఆశించకుండా తన వంతు చేయూతనిస్తూ పలువురి జీవితాలను వెలిగిస్తూన్న ఈ తరం పెద్దన్న అప్పికట్ల భరత్ భూషణ్. అందరూ ఆయనను ‘‘బిగ్ బి’’ అంటారు. మరికొందరు ఆయనను భరత్ భూషణ్ సర్ అని ప్రేమతో పిలుచుకుంటారు. కష్టాల్లో ఉన్నవారికి ఆదుకునే ఆపన్న హస్తమైతడు. వారి భవిష్యతుకు భరోసానిస్తడు. రెం డు దశాబ్ధాలకు పైగా ఆయన పలువురి జీవితాలకు కొత్త దారి చూపించారు. తన పూర్వికుల సేవా తత్పరతను కొనసాగించారు. కొనసాగిస్తున్నారు. పేగు బంధాలే బరువైపోతున్న ఈ రోజుల్లో మాన వీయ సంబంధాలకు ఊపిరిపోస్తున్న అప్పికట్ల భరత్ భూషణ్ గురించి ఈ తరానికే కాదు ముందు తరాలకు మరింత తెలియాలి. పే బ్యాక్ టూ సొసైటీ నినాదాన్ని ఆత్మప్రభోధానుసారం అమలు చేస్తున్నవారి గురించిన తలంపు అనివార్యం కూడా. కాలం మారు తున్నా, మనుష్యుల ఆలోచనలు మారుతున్నా, ఈయన తన ప్రేమగుణాన్ని కోల్పోలేదు.
అందరికీ గుండె కింద తడి ఉండదు. అట్లా ఉన్నవారిని ఈ ప్రకృతి నిలువ నీయదు. కష్టాల జీవితం నుండి వచ్చినవారికి జీవితం విలువ బాగా తెలుస్తుంది. దాని లోతుపాతులూ అందరి కంటే ఇంకా ఎక్కువ అర్థం అవుతాయి. అంటరాని కులంలో పుట్టినవారికైతే భారతీయ సమాజపు కులం పెట్టిన బాధల తీవ్రత కారణంగా ఎదుటి వారిని మరింత లోతుగా అర్థం చేసుకునే శక్తి వస్తుంది. భరత్ భూష ణ్ పుట్టుకతో పేదవారేమీ కాదు. తాను పుట్టే నాటికే వారి మాతామ హులు అప్పికట్ల జోసెఫ్, మార్తమ్మలు స్థితిమంతులే. చట్టూ ఉన్న అంటరాని కులాల వారి కంటే మెరుగైన జీవితాన్ని గడుపుతుండి నవారే. వారి తల్లిదండ్రులు పేదల పట్ల దాయర్థహృదయులై ఉండే వారు. పరుల బాధల్లో పాలు పంచుకోవాలనే తలంపు వారి నుండే ఆయనకు వచ్చింది. వందలాది కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడంలో భరత్ భూషణ్ తోడ్పాటు ఉంది. 2012లో ప్రారం భం అయిన ఆయన సేవా ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగు తూనే ఉన్నది. కుల మతాలకు అతీతంగా అందరికీ ఆయన చేయూ తనిస్తున్నారు. మెరిట్ ఉండి వనరులు లేనివారికి ఆ మేరకు సాయం అందిస్తున్నారు. ఇట్లా ఇప్పటిరకు 1366 మంది ప్రభుత్వ ఉద్యోగా లు పొందారు. అట్లా ఎ.పి. , తెలంగాణ రాష్ట్రాల్లో వందలాది మం దిని ఆయన ఆదుకున్నారు. ఐఏఎస్ నుండి గ్రామ కార్యదర్శి వరకు ఉద్యోగాలు సంపాదించుకున్నవారు ఉన్నారు.
తన సేవా కార్యక్రమం కేవలం విద్యావంతులకు మాత్రమే పరిమితం కాలేదు. కోవిడ్ కష్ట కాలంలో ఆయన వందలాది మంది కార్మికులను ఆదుకున్నారు. అవసరమైన వారికి మందులు, బూట్లు, ఆహారం అందించారు. అవసరమైన మేరకు ఆర్థిక వనరులు సమకూ ర్చారు. తనకున్న నెట్వ ర్క్ ద్వారా ఆ కాలంలో పేదలకు సాయం అందించారు. రైల్వేలో ఉన్నతోద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తన జీవితాన్ని తాను సుఖప్రదం చేసుకోవచ్చు. కానీ సావిత్రిబాయి, జోత్యిబాఫూలే, ఆంబేద్కర్, కాన్షీరాంలను మార్గదర్శ కంగా తీసుకున్నానని భరత్ భూషణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. జీవితంలో ఓ స్థాయికి వచ్చిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలనే తలంపు బహుజన మేధావి పరంపర నుండే తనకు వచ్చిందని అంటు న్నారు. తమది కృష్ణా జిల్లా, అందరి కంటే ముందే చైతన్యవంతం అయిన ప్రాంతం అని కూడా ఓ సందర్బంలో చెప్పారు. హిందూ కుల వ్యవస్థ అంటరాని వారిని అతిహీనం చేస్తే భారత రాజ్యాంగం వారిని అక్కున చేర్చుకున్నదని గతాన్ని గుర్తు చేస్తారు. వీరి తండ్రి జోసెఫ్ 1949-52 మధ్య కాలంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిం చారు. 1966-72 మధ్య కాలంలో ఎంఎల్సీగా ఉన్నారు. నాటి స్వాతంత్య్రోదమ నాయకులు, తొలి ప్రధాని నెహ్రు, బాబు జగ్జీవన్ రాం, నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వంటి వారితో తమ తండ్రికి సన్నిహిత సంబంధాలుండేవని తమ కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. వారిందరి ప్రభావాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని కూడా వారు చెప్తారు.
తెలుగునాట జరిగిన సామాజికోద్యమాలకూ ఆయన చేయూత నిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. పుష్కర కాలం కింద కృష్ణా, తుంగభద్రా నదులు ఉప్పొంగిన సందర్బంలో నిరాశ్రుయులైన వారిని ఆదుకున్నారు. ఇట్లా ఆయన చేసిన ఎన్నో సామాజిక కార్యక్రమాలున్నాయి. ఎదుటి వ్యక్తులు కష్టాలలో ఉంటే ఆయన తన భాగస్వామ్యాన్ని జోడిస్తారు. వారి కష్టాలు తీరేంత వరకు వారి వెన్నంటి నిలబడ్తారు. బహుజన ఉద్యమ శిబిరాల్లో ఆయనను పెద్దన్నగా సంబోధిస్తారు. ఏ.పి, తెలంగాణ రాష్ట్రాలో అంబేద్కర్, పూలే రాజకీయ ఆలోచనలు మరింత బలపడా లని కోరుకుంటారీయన. మన చైతన్యం కేవలం పుస్తకాలకే కాదు ఆచరణకూ నోచుకోవాలని చెప్తారు. అందుకే తాను క్షేత్ర స్థాయి జీవితాలను చూస్తానని, వారి వెన్నంటే ఉంటానని అంటారు. 2012 లో శూద్రగవర్ణానికి చెందిన అమ్మాయి, ఎస్సీ కులానికి చెందిన మరో అమ్మాయి ఇద్దరూ ఆయన వద్దకు వచ్చారు. వారిలో ఎస్సీ అమ్మా యి తన ఆర్థిక స్థితి గురించి ఆయనకు చెప్పింది. ఆమెకు ఆర్థికంగా సాయం అందించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించారు. శూద్రాగ్రవర్ణ అమ్మాయి తన స్థితి బయ టకు చెప్పుకోలేక పోయింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నభరత్ భూషణ్ ఆమెనూ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించారు. ఆ అమ్మాయి కుటుంబం నుండి ఆయనకు ఊహించని ప్రశంసలు వచ్చాయి. కులాన్ని కాదు చూడాల్సింది అవసరాన్ని. మనుష్యులను కాదు చూడాల్సింది. వారి అవసరాన్ని ఆదుకునే తత్వాన్ని అని ఆచరణలో చూపిస్తున్న నిఖార్సైన అంబేద్కర్ వాది భరత్ భూషణ్.
బాబాసాహేబ్ అంబేద్కర్ భారతీయ సమాజానికి ఎంతో చేశారు. కేవలం దళితులకు మాత్రమే కాదు. ఆయన మార్గంలో సమాజాన్ని ప్రేమించేవారి సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఆ పరంపరం లో ముందుకు సాగుతున్న వారిలో తొలి వరుసలోని పేరు భరత్ భూషణ్ అని చెప్పొచ్చు. తాను సామాజిక కార్యక్రమాలతో పాటు, రాజకీయంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. చదువు ద్వారా సమాజం ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతున్నారు. పే బ్యాక్ టూ సొసైటీ ఆలోచన ద్వారా దాన్ని నిజం చేస్తున్నారు. రాబో యే రోజుల్లో మరింత మంది, మరిన్ని కుటుంబాలకు సాయం చేయాలనే తలంపుతో ఉన్నారు. తన ద్వారా మరిన్ని కుటుంబాలు సంతోషంలో ఉంటే అంత కంటే కావాల్సిందేముంటదని అంటారు భతర్ భూషణ్. సమత, మానవత, ఆత్మీయతలకు పూలే, అంబేద్కర్ లు ప్రతిబింబాలని వారి దారిలో అందరూ నడవాలని తన ఆశ అంటారాయన. రాజకీయాధికారం ద్వారానే బహుజనులు ఆత్మగౌర వాన్ని సాధించుకుంటారని ఆ దిశగా ప్రయాణం సాగించాలంటు న్నారు సర్వజనహితవాది అప్పికట్ల భరత్ భూషణ్.
(ఈ నెల 24న భరత్ భూషణ్ కు స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేస్తున్న సందర్భంగా)
కాలమ్ : భిన్నస్వరం
గోర్ల బుచ్చన్న

