అబ్దుల్లా కుటుంబానికి కాశ్మీర్‌తో అవినాభావ సంబంధం ఉంది. గత వారం కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒమర్ అబ్దుల్లా ‘నేను మళ్లీ వచ్చేశా” అని ట్వీట్ చేశారు. రావడమైతే వచ్చారు కానీ, కాశ్మీర్ విషయంలో ఆయన ఏం చేయబోతున్నారనేది ఒక ప్రశ్నగా మారింది. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ 54 ఏళ్ల కొత్త ముఖ్యమంతి అబ్దుల్లా వంశంలో మూడవ తరం నాయకుడు. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా 3.20 కోట్ల మంది అనుచరులున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన షేర్వానీ, పజామాను ధరించడాన్ని బట్టి ఆయన తన కుటుంబ సంప్రదాయాలకు, స్థానికత్వానికి, కొనసాగింపునకు కట్టుబడి ఉండబోతున్నారని అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి మరిన్ని అధికారాలను కట్టబెట్టాలని, పాకిస్తాన్‌తో చర్చలను పునరుద్ధరించాలని, జమ్మూ కాశ్మీర్‌ను ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఆదరించాలని ఆయన కుటుంబం, ఆయన నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గట్టిగా కోరుకుంటున్నాయి. అయితే, ఒమర్ అబ్దుల్లాలో అప్పటికీ, ఇప్పటికీ కొద్దిగా మార్పు వచ్చింది. ఆర్టికల్ 370ని బుట్టదాఖలు చేసిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.
చాలా ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నందువల్ల ఆయనలో ఒక విధమైన రాజకీయ జ్ఞానోదయం కలిగినట్టు కనిపిస్తోంది. ఆయన పార్టీ ఒక కొత్త రాజకీయ వాస్తవంతో మనుగడ సాగించక తప్పదనే వాస్తవం ఇప్పుడు ఆయనకు పూర్తిగా అవగతమైంది. ప్రస్తుతం కాశ్మీర్‌లో అసలు సిసలు లౌకికవాదాన్ని, మత సామ రస్యాన్ని ఆచరించవలసిన అగత్యాన్ని కూడా ఆయన గుర్తించారను కోవాలి. కాశ్మీర్ కు మరింత రాష్ట్ర ప్రతిపత్తి కావాలన్న పక్షంలో ఆయన ప్రాథమికంగా కొన్ని సానుకూల పరిస్థితులను కల్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, తన ప్రభావం కాశ్మీర్ వరకే పరిమితమని, జమ్మూలో కాషాయ జెండా ఎగురుతోందని ఆయన గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌లో తమ అధికారం అయిదేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగాలన్నా, రాజకీయ ప్రశాంతత ఏర్పడాలన్నా తాను తప్పనిసరిగా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇక 1990 నుంచి ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయిన నయా కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లాకు లక్షలాది మంది ఓటర్లు పట్టం కట్టారంటే అందులోని అంతరార్థమేమిటో అబ్దుల్లా తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఆయనలోని ఆధునిక భావాలు, దూకుడు తత్వం పాలనలో ఆయనకు కొంత ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ, తాను కూర్చున్నది ముళ్ల సింహాసనమనే విషయం ఆయన ఇప్పటికే గ్రహించుకుని ఉంటారు. అంపశయ్య మీద ఉన్న పాలనకు మళ్లీ ప్రాణం పోయడం ఇప్పుడు అత్యంత అవసరం.
వ్యవహారశైలిలో మార్పు
ఇవన్నీ జరగాలన్న పక్షంలో ఆర్థిక, రాజకీయ సుస్థిరత ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఎక్కువ కాలం కేంద్ర ప్రభుత్వ పాలనలోనే ఉన్న ఈ రాష్ట్రంలో 1951 నుంచి ఇటీవలి వరకు అబ్దుల్లా కుటుంబం 34 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. రాజకీయాలు, పాలన అన్నవి ఈ కుటుంబం రక్తంలోనే ఉన్నాయి. అధికారానికి సంబంధించిన పరిమితులు, పరామితులు ఈ కుటుంబానికి క్షుణ్ణంగా తెలుసు. కొత్తగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నందువల్ల ఆయన వేర్పాటువాద శక్తుల ఒత్తిడికి తలవంచాల్సిన అవసరం లేదు. చిన్నా చితకా పార్టీలన్నీ ఓడిపోయాయి.
ఉగ్రవాద సంస్థలకు చెందిన స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించలేదు. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి అటు కాశ్మీర్‌లో గానీ, ఇటు జమ్మూలో గానీ ఒక్క సీటు కూడా లభించలేదు. బీజేపీ సహకారం లభించినందు వల్ల ఈ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ లభించింది. ఈ ప్రాంతం మీద చాలా కాలం పాటు ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరు స్థానాలు మాత్రమే లభించాయి. జమ్మూకు చెందిన ఒక ఆదివాసీ హిందువుకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా జమ్మూకు కూడా సరైన ప్రాతినిధ్యం లభించినట్టయింది.
కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే అవకాశం ఉంది కానీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్టికల్ 370 తిరిగి వచ్చే అవకాశం మాత్రం లేదు. అబ్దుల్లాకు ఈ విషయం బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ, ‘ఆర్టికల్ 370ని పునరుద్ధరించే విషయాన్ని మరచిపోవడం మంచిది. జమ్మూ కాశ్మీర్‌కు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేదు. ఒకవేళ వాగ్దానం చేసినా ఓటర్లు నమ్మే స్థితిలో లేరు. అందువల్ల ఆ విషయాలను ఇక పక్కన పెట్టేయండి’ అని వ్యాఖ్యానించారు. నిజానికి, 2019 తర్వాత కేంద్రం తీసేసుకున్న అధికారాలన్నింటినీ తిరిగి ఇచ్చేంత ఔదార్యాన్ని మోడీ ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు.
సరికొత్త అనుభవాలు
మోడీ ప్రభుత్వంతో ఘర్షణకు దిగే పక్షంలో తాము ముందుకు పోలేమని, ఏదీ సాధించలేమని ఒమర్ అబ్దుల్లాకు అర్థమైపోయింది. కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడంతో పాటు, ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఈ రాష్ట్రానికి కూడా అధికారాలు అప్పగించే విషయంలో మాత్రమే ఆయన మోడీ మీద ఒత్తిడి తీసుకు రాగలరు. మోడీతో ఢీ అంటే ఢీ అనడం వల్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఏం జరిగిందో కూడా ఆయన గమనించి ఉండాలి. సైద్ధాంతిక పోరాటాలను బట్టి సమర్థ పాలనను నిర్ణయించడం జరిగే పని కాదు. ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్న పలువురు ప్రతిపక్ష నాయకుల జాబితాలో అబ్దుల్లా ప్రస్తుతానికి చేరకపోవడం మంచిది. కేంద్ర పాలిత ప్రాంతానికి ఒనగూడిన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆయన ఎంతగా కాపాడుకుంటే అంత మంచిది. రాళ్లు విసరడాన్ని నిరోధించడం, చొరబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం వంటివి ఆయన ప్రభుత్వం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. పర్యాటకుల రాకపోకలతో, ప్రాథమిక సదుపాయాల కల్పనతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న జమ్మూ కాశ్మీర్ కు ఆయన మరింతగా చేయూతనందించాల్సిన అవసరం ఉంది.
జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో అనేక ప్రాథమిక సదుపాయాల నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఆ ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి మరింతగా దేశ, విదేశీ పెట్టుబడులు రావడానికి ఒమర్ అబ్దుల్లా ప్రయత్నించడం మంచిది. మత సామరస్యాన్ని పెంపొందించడంతో పాటు, కాశ్మీరీ పండిట్ల పునరావాసానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తమ వెనుకటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు, కాశ్మీర్ పూర్వ వైభవాన్ని పునరుద్ధ్దరించడానికి కూడా అబ్దుల్లా ప్రయత్నించాల్సి ఉంటుంది. కాశ్మీర్ భారతీయులందరికీ చెందినది. అదే విధంగా భారతదేశం కాశ్మీరీ లందరికీ చెందినది. అమాయకులు రక్తంలో తడుస్తూ వచ్చిన కాశ్మీర్ ను మళ్లీ ప్రజాస్వామిక స్వర్గంగా అబ్దుల్లా మార్చగలరా అన్న దానిపై ఆయన సత్తా, సమర్థత ఆధారపడి ఉంది.
- జి. రాజశుక