భారతదేశానికి స్వతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినా పాలకులు, అధికార యంత్రాంగం మారినా గిరిజనుల తలరాతలు మారడం లేదు. భారత రాజ్యాంగంలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రత్యేకమైన చట్టాలు, హక్కులు కల్పించడం జరిగింది. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్న ఆ చట్టాలు కొందరికి చుట్టాలుగా మారినాయి తప్ప గిరిజనులకు దోహదపడటం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా గిరిజన బతుకులు మారడం లేదు. ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని పార్టీలు గిరిజనులకు తమ జెండాలు మోయడానికి ముడి సరుకుగా ఉపయోగించుకొని ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు చట్టాలు కల్పించిన వాటిని అమలు పరచడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్, పిసా చట్టం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం లేదు. గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి మళ్లించి గిరిజనుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. పాలకులు అధికారులు గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని హంగు ఆర్భాటాలతో ప్రచారం చేస్తాయి. కానీ జీవోలు కాగితాలకే పరిమితం అవుతాయి తప్ప వాటిని అమలు చేయడంలో నత్తనడకగా జాప్యం చేస్తూ నిర్లక్ష్యం వహిస్తా వస్తున్నారు. దానికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. నేటికీ గిరిజన గూడాలకు తండాలకు మౌలిక సదుపాయాలు రోడ్డు రవాణా వీధి దీపాలు నీళ్లు విద్య వైద్యం అందని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వాలు వీరికి సంక్షేమ ఫలాలు అందించడం కోసం వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించామని గొప్పలు చెప్పుకుంటాయి. కానీ ఎక్కడా అవి ఖర్చు చేసినట్లు కనిపించదు. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో నేటికీ గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారిని అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంచుతున్నారు. నేటికీ అనేక గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలోని ప్రాంతాలలో పాలకులు అధికారులు గిరిజనుల చట్టాలను అమలు చేయడంలో వివక్షత చూపిస్తున్నారు.
ప్రకృతి తల్లి ఒడిలో పుట్టిన గిరిజనులు
భూమి.. ఆకాశం.. నీరు.. నిప్పు.. చెట్టు ఇవే వారి ఆరాధ్య దైవాలు. అడవి, సెలయేర్ల పరివాహకాలే వారి నివాసయోగ్యాలు. చల్లంగా చూడమ్మా అంటూ ప్రకృతి తల్లిని నమ్ముకుని బతుకుతారు.. తమ ఆరాధ్య దైవాలను కొలవనిదే ఏ పనీ ముట్టరు. అనాదిగా ప్రకృతినే నేస్తంగా చేసుకుని స్వచ్ఛమైన జీవనం గడుపుతున్న గిరిజనం వారి సమాజంలోని సంప్రదాయాలను కొనసాగించలేని స్థితిలో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నారు. దారి లేని అడవుల్లో ఆనందం ఉంది. ఏకాంత తీరంలో నిశ్చలమైన వెలుగుంది. ఎవరూ అడుగుపెట్టని ప్రాంతంలో సమాజం ఉంది… అని అన్నాడో కవి. కానీ దీనికి భిన్నంగా ఇప్పటి పరిస్థితులున్నాయి. చొరబాటుతనంతో తమ ఆచారం, సంప్రదాయం, సంస్కృతి కనుమరుగవుతుందన్న ఆవేదన వారిని పట్టి పీడిస్తోంది. పాలకుల విధానాలు తమని అడవికి దూరం చేస్తున్నాయన్న భయాందోళనలో గిరిజనులు బతుకుతున్నారు.
ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో 1982, ఆగస్టు తొమ్మిదిన జెనీవాలో నిర్వహించిన మానవ హక్కుల పరిరక్షణ సమావేశంలో అంతరించిపోతు న్న ఆదిమ తెగ అంశం తెరమీదకొచ్చింది. దీంతో వీరి జీవన విధానంపై అధ్యయనం చేయాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సూచిస్తూ ఆరు వర్కింగు కమిటీలను నియమించగా వారి జనాభా, భాషలు, తెగలు, సంస్కృతులపై అధ్యయనం చేసి ఓ నివేదికను 1992లో సమర్పించాయి. తర్వాత 1994, డిసెంబరు 23న ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో ప్రతిఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాల్సిందిగా రిజల్యూషన్ పాస్ చేశారు. అప్పటినుంచి ప్రతిఏటా ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 15 శాతం ప్రాంతంలో 10.428 కోట్ల గిరిజనులు (ఎస్.టి) ఉన్నారని, వారి జనాభా దేశం మొత్తం జనాభాలో 8.61 శాతంగా ఉందని తేలింది. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చవలసి వుందని గమనించబడింది. విద్యుత్ శక్తి, త్రాగు నీరు, వ్యవసాయ భూములను స్వంతంగా కలిగివుండుట, బాలింతల, శిశువుల మరణాలు మొదలైన విషయాలకు వస్తే, వీరు సాధారణ ప్రజానీకం కంటే చాలా వెనుకబడి వున్నారు. 2009-–10 లెక్కల ప్రకారం 47.4% గ్రామీణ, 30.4 పట్టణ ప్రాంతాలలో గిరిజన (ఎస్.టి) జనాభా దారిద్య్రరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారు.
భారత రాజ్యాంగం గిరిజనులలోని అన్ని తెగలను షెడ్యూల్డు తెగలుగా నిర్వచించలేదు. భారత రాజ్యాంగంలోని అధికరణ 342 ను, 366 (25)ను అనుసరించి షెడ్యూల్డు తెగలు అనగా షెడ్యూలులో వివరించిన తెగలు/ వర్గాలు మాత్రమే షెడ్యూల్డు తెగలుగా నిర్వచించారు. భారత రాజ్యాంగం అధికరణ 342 ప్రకారం షెడ్యూల్డు తెగలు లేదా గిరిజనులు అనగా లేదా గిరిజనులలోని కొన్ని తెగలు, కొన్ని వర్గాలు లేదా అన్ని వర్గాలు లేదా అన్ని తెగలు అని భారత రాష్ట్రపతి ద్వారా ప్రకటింపబడిన ప్రకటనలో పేర్కొన్నారు. 1991 జనాభా లెక్కలను అనుసరించి గిరిజనులలో 6.776 కోట్ల మంది, దేశ జనాభాలో 8.08 శాతం మాత్రమే పెడ్యూల్డు తెగలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గిరిజన మహిళల్లో నలుగురిలో ముగ్గురు నిరక్షరాస్యులు. అసలే నియత విద్యలో పాఠశాలకు వెళ్లడం మానుకున్న వారి శాతంతో కలిపి ఎక్కువ మంది విద్యకు దూరమవుతుండగా, ఈ వ్యత్యాసాలు ఇలావుండగా, వారిలో అతి తక్కువ శాతం మంది ఉన్నత విద్యార్జనలో వున్నారు. ఆశ్చర్య పడకూడని విషయమేమిటంటే, దేశంలోని సగటు పేదరికాన్ని అంచనా వేస్తే అందులో అతి ఎక్కువ శాతం మంది గిరిజనులు సాధారణ పేదవారి కంటే ఎంతో హెచ్చు స్థాయిలో దారిద్య్ర రేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారు. 1993–-94లో ప్రణాళికా సంఘం పేదరికంపై చేసిన అధ్యయనంలో 51.92 శాతం మంది గ్రామీణ గిరిజనులు, 41.4 శాతం మంది పట్టణ గిరిజనులు (ఎస్.టి) ఇప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారని తెలిసింది.
భారత రాజ్యాంగంలో ఈ గిరిజనుల కోసం (ఎస్.టి)ల కొన్ని ప్రత్యేక ప్రయోజన కారకమైన నిబంధనలను పొందుపర్చారు. వారి విద్యాభ్యున్నతికి, ఆర్థిక ప్రగతికి, వారికి సామాజిక న్యాయం జరిగేలా, ఇంకా వారు ఏ విధమైన శ్రమ దోపిడికి గురవకుండా రక్షణను ఈ నిబంధనలలో పేర్కొనబడింది. పంచ వర్ష ప్రణాళికా విధానం ప్రారంభ సమయంలోనే ఈ లక్ష్యాల సాధన కోసం గిరిజన ఉప వ్యూహం ఒకదానిని రూపొందించారు. ఈ ఉప వ్యూహం, ఈ లక్ష్యాలను సాధించే దిశలో రూపొందింపబడి, వాటిని అమలు చేస్తుంది. ఈ వ్యూహం లేదా ఉప ప్రణాళికను అమలు చేసి గిరిజనుల అభివృద్ధి సాధించేందుకు తగినంత నిధులను రాష్ట్ర ప్రణాళికల్లో కేటాయించి, అలాగే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాల పథకాలు/ కార్యక్రమాలలో కేటాయింపులు జరిపి, ఆర్ధిక, అభివృద్ధి సంస్థలు అందించే ధన సహాయంతో నిర్వహిస్తారు. ఈ ఉప ప్రణాళికలో భాగంగా అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో వాటిలో వున్న గిరిజనుల జనాభా నిష్పత్తిని అనుసరించి గిరిజన ఉప ప్రణాళిక నిధులను కేటాయిస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు ఈ గిరిజనుల ఉప ప్రణాళికను అమలుచేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి తేవడానికి కృషి చేస్తాయి. కాగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా వారికి వివిధ రకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా వారికి ప్రయోజనం కలిగిస్తాయి.
గిరిజనులు ప్రభుత్వాల నుంచి కోరుతున్న అంశాలు:
1. గిరిజన జనాభా లెక్కల ప్రకారం 10% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో గిరిజనులకు రిజర్వేషన్ సత్వరమే అమలు చేయాలి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఎస్టీ లంబాడి జనాభాను బహిర్గతం చెయ్యాలి.
2. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీచేయాలి.
3. 500 జనాభాలో గల తండాలను, గూడాలను గ్రామ పంచాయితీ ఏర్పాటు చేశారు గాని, రెవెన్యూ గ్రామపంచాయతీలుగా సత్వరమే చేయాలి.
4. కర్ణాటక రాష్ట్రంలో తండాల అభివృద్ధి బోర్డు తరహా తెలంగాణ రాష్ట్రంలో తండాల అభివృద్ధి కోసం బోర్డును ఏర్పాటు చేయాలి.
5. ఎస్సీ ఎస్టీ ప్రైడ్ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ అనే పథకం ద్వారా గిరిజన సోదరులకు వివిధ రకాల వాహనాలపై ఇస్తామని చెప్పిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలి.
6. బయ్యారం స్టీల్ ప్లాంటును కూడా ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి.
7. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల కోసం, వారి అభివృద్ధి సంస్కృతి, ఆచార సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఐటీడీఎ లను ఏర్పాటు చేయాలి.
8. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల హక్కు పత్రాలు జారీ చేయాలి.
9. విద్యాహక్కు చట్టం అమలు చేసి అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే ఎస్టీ విద్యార్థులకు 25% విద్యాహక్కు చట్టం పొందేలా అమలు చేయాలి.
10. ఎస్టీ సబ్ ప్లాన్లో కేటాయించిన నిధులు నిర్దేశిత సమయంలో ఖర్చు చేసేటట్లు చర్యలు చేపట్టాలి.
11. గిరిజన విద్యార్థులకు అన్ని జిల్లాలో పోటీ పరీక్షలకోసం గ్రూప్1,2, గేట్ ఇతర అన్ని పోటీ పరీక్షలకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలి.
12. ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకులు గిరిజనులకు రుణాలు సత్వరమే మంజూరు చేయాలి.
13. నియోజకవర్గ స్థాయిలో, మండలస్థాయిలో చదువుతున్న విద్యార్థులకు ఎస్టీ స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి.
14. గిరిజన నిరుపేదలకు 3 ఎకరాల భూమిని సత్వరమే కేటాయించాలి.
15. బంజారాల పవిత్రమైన తీజ్ పండుగను తెలంగాణ ప్రభుత్వం 20 కోట్లు నిధులు మంజూరు చేసి అధికారికంగా నిర్వహించాలి.
16. బంజారా భాష లిపి ఏర్పాటుకై షెడ్యుల్ 8లో చేర్పించుట గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
17. ప్రతి జిల్లా, నియోజకవర్గం కేంద్రంలో బంజారా భవన్ ఏర్పాటుకై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
18. తెలంగాణలోను జిల్లా యూనిట్గాను చట్టసభ (అసెంబ్లీ / పార్లమెంటు)లయందు ప్రతి రాష్ట్రంలోను ప్రస్తుతం ఎస్సీలకు సీట్ల రిజర్వేషన్లు చేసినట్లుగాను ఎస్టీలకు కూడా ప్రతి జిల్లా యూనిట్గా తీసుకొని చట్టసభలో గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి.
19. ఎస్టీలు సాగు చేస్తున్న లావుణి, సీలింగ్, పోడు భూములకు శాశ్వతంగా పూర్తి హక్కులతో అసెంబ్లీలో చట్టం చేసి పట్టాలు ఇవ్వాలి.
20.రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ద్వారా ఎజెన్సీ ప్రాంతంలో 100% శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యాలి.
21. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎంపీల స్థానాలు పెంచే పునర్వీభజనలో రాష్ట్ర జనాభా యూనిట్ కాకుండా, జిల్లా జనాభా యూనిట్ ఆధారంగా ఎస్టీలకు ఎమ్మెల్యే, ఎంపీ రిజర్వేషన్ సీట్లు కేటాయించాలి.
22. ఎస్టీల రిజర్వేషన్ 7.5% శాతాన్ని, పెరిగిన జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 14 శాతానికి పెంచాలి.
డా. గుగులోతు శంకర్ నాయక్
9908817986
నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం


