కృష్ణా జిల్లాలో 1894 మే 18న జన్మించిన గుడిపాటి వెంకట చలం ఇప్పటి స్త్రీవాద రచయితల్లో ఎంతో మందికి మార్గదర్శి. ‘చలం’ పేరుతో ఆయన రాసిన తన ఆత్మకథ ఆయన స్త్రీవాదిగా మారడానికి దారి తీసిన పరిస్థితులకు అద్దం పట్టింది. ఆయన స్త్రీవాదిగా మారడానికి, ఆ తర్వాతి కాలంలో స్త్రీవాద ధోరణులను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి, నిస్సహాయ, నిర్భాగ్య స్త్రీలకు అండగా నిలబడడానికి బీజం ఇంట్లోనే పడింది. బాల్యంలో తెనాలిలో తమ తల్లితండ్రులు కాపురం ఉండగా తన తండ్రి తన తల్లి పట్ల వ్యవహరించిన తీరు ఆయనను బాగా చిన్నతనంలోనే స్త్రీ జన పక్షపాతిగా మార్చేసింది. ఆయన తండ్రి పేరు కొమ్మూరి సాంబశివరావు కాగా, తల్లి పేరు వెంకట సుబ్బమ్మ. చలం దత్తత వెళ్లడం వల్ల ఇంటి పేరు మారింది. తండ్రి సాంబశివరావు తననే కాక, తన తల్లిని అకారణంగా, ప్రతి చిన్న విషయానికి విపరీతంగా కొట్టేవాడట. తల్లిని అనేక పర్యాయాలు బహిరంగంగా, అందరి ముందూ అవమానించడం కూడా జరిగేది. దీన్ని భరించలేకపోయాడు చలం.
దత్తత వచ్చేసిన తర్వాత కూడా మనసంతా తల్లి చుట్టూనే తిరుగుతుండేది. వీలైనప్పుడల్లా తల్లిని చూడడానికి వెళ్లేవాడు. తన ముందు తన తల్లిని తండ్రి కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, అవమా నించినప్పుడు ఆయన తన తల్లికి తండ్రిని విడిచి వెళ్లాల్సిందిగా ప్రాధేయపడేవాడు. ఆ తరువాత రోజుల్లో ఆయన తన తల్లిని తండ్రి ముందే వెనకేసుకు వచ్చేవాడు. తండ్రితో వాదనలకు దిగడం, పోట్లాడడం, తిరగబడడం వంటివి చేసేవాడు. అదే కాక, తన సోదరి అమ్మణ్ణిని ఆమె ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేయడం, ఆ వివాహం వల్ల ఆమె నానా కష్టాలూ పడుతున్నా తండ్రి పట్టించుకోకపోవడం వంటివి కూడా ఆయనను కలచివేసింది. ఈ కారణంగా ఆయనలో స్త్రీలకు అనుకూలంగా సమాజంపై పోరాడడం అలవాటైంది. ఆయన ఆత్మకథ అయిన ‘చలం’తో పాటు, ఆయన గ్రంథాలైన ‘స్త్రీ’, ‘మైదానం’ వంటివి స్త్రీల పట్ల ఆయనకున్న అపార సానుభూతిని, పక్షపాతాన్ని ప్రతిఫలిస్తాయి.
తల్లితండ్రులు మరణించిన తర్వాత కూడా ఆయనలోని ఆవేశం చల్లారలేదు. ఆయన తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ, అనేక కుటుంబాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా చూస్తూ, సమాజంలో దాంపత్య జీవితాలు ఎంత పేలవంగా ఉన్నాయో, కుటుంబ వ్యవస్థ అనేది ఎంత అతుకుల బొంత వ్యవహారమో, వివాహ వ్యవస్థ ఎంత అర్థరహితమైనదో అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. హేతువాది అయిన తాపీ ధర్మారావు తో తరచూ ఈ సమస్యలపై చర్చలు జరిపేవాడు. విజయవాడలో టీచర్‌గా, డీఈఓగా పనిచేస్తున్న కాలంలోనే ఆయన నిస్సహాయ మహిళలలో పోరాట స్ఫూర్తిని నింపడం, వారిలో తిరుగుబాటు ధోరణులను నూరిపోయడం వంటివి చేసేవాడు. అక్కడే స్త్రీలకు సంబంధించిన అనేక కథలు, నవలలు, నాటకాలను రాయడం జరిగింది. వివిధ వర్గాల వారు ఆయనపై దాడులు జరపడం ప్రారంభించడంతో అరుణాచలం వచ్చేసి, అక్కడ తన స్త్రీవాద ధోరణులను మరింత ఎక్కువగా వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు.
ఆయన మీద ప్రముఖ సంఘ సంస్కర్త రఘుపతి వెంకట రత్నం నాయుడు ప్రభావం కూడా ఉంది. ఆయన వంటి మిత్రుల సహాయంతో ఆయన సమాజంలోని మూఢ నమ్మకాల మీదా, దురాచారాలు, దుర్నీతుల మీదా తన పోరాటాలను ఉధృతం చేశాడు. ఆయన అన్ని కులాల వారితోనే కలిసిపోయేవారు. వారితో కలిసి మాంసాహారాన్ని కూడా భుజించేవారు. తన కులానికి సంబంధించిన ఆచార సంప్రదాయాలను పాటించడం మానేయడం జరిగింది. ఆయన చిట్టి రంగ నాయకమ్మను వివాహం చేసుకుని ఆమెను మొదట్లోనే ఒక కాన్వెంటులో చేర్చి ఉన్నత విద్య వరకూ చెప్పించడం జరిగింది. ఆమెలో కూడా పురుషాధిక్యత వ్యతిరేకతను నింపడమే కాకుండా అవసరమైతే తన భావాలను వ్యతిరేకించేంత స్వాతంత్య్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన తన జీవిత కాలంలో ఎందరు స్త్రీల జీవితాలను చక్కదిద్దారో లెక్క లేదు. ఎందరో వితంతువులకు, నిస్సహాయ, అనాథ మహిళలకు ఆయన ఆశ్రయం కల్పించారు. ప్రతి సంస్కరణనూ ఆయన తాను ఆచరించి, తన కుటుంబ సభ్యులతో ఆచరింపజేసి, ఆ తర్వాత సమాజానికి మార్గదర్శనం చేశారు.
The first feminist writer: మొట్టమొదటి స్త్రీ వాద రచయిత చలం
బాల్యం చలంను ఫెమినిస్టుగా మార్చింది