Homeఎడిటోరియల్ / బహుళమండల్‌ ఆశయాలే మార్గదర్శకం

మండల్‌ ఆశయాలే మార్గదర్శకం

భారతదేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడినప్పుడల్లా రెండు చారిత్రాత్మక ఘట్టాలు మన ముందుకు వస్తాయి. ఒకటి కాకా కలేల్కర్‌ కమిషన్‌, మరొకటి మండల్‌ కమిషన్‌. ఈ రెండు కమిషన్లు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగబద్దమైన మార్గాన్ని చూపించాయి. ముఖ్యంగా బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ నాయకత్వంలో ఏర్పాటైన మండల్‌ కమిషన్‌ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మలుపు తిప్పిన ఘట్టంగా నిలిచింది.

- Advertisement -

1953లో కాకా కలేల్కర్‌ కమిషన్‌ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల గుర్తింపునకు తొలి ప్రయత్నం చేసింది. అనంతరం 1979లో ఏర్పాటు చేసిన మండల్‌ కమిషన్‌ దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి అవసరమైన విధానాలను సూచించింది. 1980లో సమర్పించిన తన నివేదికలో ఓబీసీలు దేశ జనాభాలో సుమారు 52 శాతం ఉన్నారని పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 27 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సిఫార్సు చేసింది.

మండల్‌ కమిషన్‌ కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మాత్రమే ప్రతిపాదించలేదు. విద్య, ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు, బ్యాంకులు, ప్రజా రంగ సంస్థల్లో సము చిత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే సమగ్ర దిశానిర్దేశాన్ని అందించింది. సామాజిక, విద్యా, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఓబీసీలను గుర్తించేందుకు 11 సూచికలను రూపొందించడం ఈ కమి షన్‌ ప్రత్యేకత. 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాన మంత్రి విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్‌ ప్రకటించడం సామాజిక న్యాయ ఉద్యమంలో ఒక చారిత్రక విజయం. అనంతరం సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్ని తీర్పు ద్వారా ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన మద్దతు లభించింది.

రిజర్వేషన్లు అనేవి దానం కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కు. శతాబ్దా లుగా సామాజిక, విద్యా, ఆర్థిక అవకాశా లకు దూరమైన వర్గాలకు సమాన అవకా శాలు కల్పించేందుకు రూపొందించిన రాజ్యాంగబద్దమైన సాధనం. సమాజంలో సమానత్వం నెలకొల్పడం, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం, ఆర్థిక సాధికారతను పెంపొందించడం రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యం.
నేడు దేశంలో బీసీల జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ వ్యవస్థల్లో వారి ప్రాతినిధ్యం గురించి ఖచ్చితమైన సమాచారం అవసరం. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనకు మద్దతు తెలుపుతోంది. ‘జిత్నీ ఆబాదీ – ఉత్నా హక్‌’ అనే సూత్రం సామాజిక న్యాయానికి ప్రతిబింబం. జనాభాకు అనుగుణంగా విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ అవకాశాలు కల్పించినప్పుడే రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో అమలవుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాలనలో కీలక సూత్రంగా తీసుకుని ముందుకు సాగుతోంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల సాధికారత కోసం అనేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

మండల్‌ కమిషన్‌ డే సందర్భంగా బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌, కాకా కలేల్కర్‌ వంటి మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మండల్‌ ఆశయాలు సాకారం అయినప్పుడే రాజ్యాంగం కలలుగన్న సమానత్వ భారతదేశం నిర్మితమవుతుంది. అదే వారికి మనం అందించే నిజమైన నివాళి.

డా. కేతూరి వెంకటేష్‌
టీపీసీసీ ఓబీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్‌
నేడు మండల్‌ కమిషన్‌ దినోత్సవం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News