Homeఎడిటోరియల్ / బహుళఅంబేడ్కరిజంలో మితవాదులు, విప్లవవాదులు

అంబేడ్కరిజంలో మితవాదులు, విప్లవవాదులు

డానీ
సమాజ, రాజకీయ విశ్లేషకులు
కాలమ్‌: కాలధార

కార్పొరేట్‌ కమ్యూనల్‌ డిక్టేటర్‌షిప్‌ సమాజంలో అంబేడ్కరిజం మరొక్కసారి చర్చనీయాంశంగా మారింది. భారత రాజ్యాంగ డ్రా ఫ్టింగ్‌ కమిటీ చైర్మన్‌గా బీఆర్‌ అంబేడ్కర్‌ మనందరికీ తెలుసు. భార త సమాజ పరిణామం మీద అంబేడ్కర్‌ ప్రభావం రాజ్యాంగం కన్నా ఎక్కువ. ఆయన వారసులు ఇప్పుడు మితవాదులు, విప్లవాదులు అంటూ రెండు రకాలుగా చీలిపోయారు.

- Advertisement -

కులం సాంస్కృతిక రంగానికి మాత్రమే పరిమితమై లేదనీ; అది ఆర్ధిక రంగంలో పీడక సాధనంగా స్థిరపడిందనేది స్థూలంగా అంబేడ్కర్‌ సిద్ధాంతం. కార్ల్‍ మార్క్స్‍ వర్గనిర్మూలన కార్యక్రమాన్ని ప్రతిపాదించినట్టు అంబేడ్కర్‌ కులనిర్మూలన కార్యక్రమాన్ని ముం దుకు తెచ్చాడు. ఇవి పైకి పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ ‘స మానత్వం’ అనే విలువల ప్రాతిపదికగా వీటి నిర్మాణం జరిగిందని సులువుగానే అర్ధం అవుతుంది. అది వాటి మధ్య ఐక్యత. ఈ రెండిం టి మధ్య సమన్వయాన్ని సాధించాల్సిన అవసరాన్ని ఒక బాధ్యతగా అటు కమ్యూనిస్టు ఆలోచనాపరులు గానీ ఇటు అంబేడ్కరిస్టు ఆలోచనాపరులుగానీ ఎన్నడూ స్వీకరించలేదు.  దీనినొక తాత్విక ఘర్షణ అంశంగానే రెండు శిబిరాలు కొనసాగిస్తున్నాయి.
చరిత్ర చాలా కటువైనది. ఇబ్బందికర ప్రశ్నలు వేసి ఆలోచనా పరుల్ని మెడపట్టి నిలదీస్తూ వుంటుంది. అలాంటి సందర్భం 1964 లో ఒకసారి కీలవేన్మణీలో వచ్చింది.

హరిత విప్లవం తరువాత వ్యవసాయోత్పత్తుల దిగుబడి భారీ గా పెరిగినప్పటికీ తమిళనాడులో వ్యవసాయ కూలీ రేటు పెరగ లేదు. సీపీఎం నాయకత్వంలో కూలీ రేటు పెంపు కోసం పోరాడు తున్న వ్యవసాయ కూలీలు 44 మందిని కీలవేన్మణీలో భూస్వాము లు క్రూరంగా చంపేశారు. గోపాలకృష్ణన్‌ నాయుడు అనే స్థానిక భూస్వామి ఈ దాడికి నాయకత్వం వహించాడు. దాడిలో చనిపో యినవారు దళితులు.

కీలవేన్మణి సంఘటనలో నాలుగు నేరేటివ్స్‍ వున్నాయి. మొదటిది; వ్యవసాయకూలీల్ని భూస్వాములు చంపారు. రెండు; దళితుల్ని భూస్వాములు చంపారు. మూడు దళితుల్ని నాయుళ్ళు చంపారు. నాలుగు; దళితులైన వ్యవసాయకూలీల్ని భూస్వాములైన నాయుళ్ళు చంపారు.
కమ్యూనిస్టు పార్టీలు మొదటి నేరేటివ్‌ వరకే ఏకాభిప్రాయంతో వుంటాయి. మిగిలిన నేరేటివ్స్‍తో భేదాభిప్రాయాలు వ్యక్తం చేస్తుం టాయి. అయితే, సామాజిక ఆలోచనాపరులు వీటికి సమాధా నాలు, పరిష్కారాలు వెతికే పనిలో ఎలాగూ వుంటారు.

1984లో ఢిల్లీ పరిసరాల్లో శిక్కుల ఊచకోత తరువాత మన దేశంలో మత అంశం కూడ ఎజెండా లోనికి చర్చకు వచ్చింది. కు లం విషయంలో సాగినట్టే మతం విషయంలోనూ మేధోరంగంలో డొల్లతనం కొనసాగింది.

1990వ దశకం ప్రపంచాన్నే పునర్‌వ్యవస్థీకరించిందని మన కు తెలుసు. కులం, మతంతో పాటు తెగ, లింగం, భాషా, ప్రాంతం తదితర అంశాలు కూడ పునర్‌నిర్వచనాన్ని కోరుకున్నాయి. అప్పటి వరకు కమ్యూనిస్టు శిబిరాల్లో వున్నవారే బయటికి వచ్చి తమ స్వీయ సామాజికవర్గాల అభ్యున్నతి కోసం పూనుకున్నారు. తమ సమస్యల మీద సమాజాన్ని సెన్సిటైజ్‌ చేయడం వీరి తొలి లక్ష్యం.  అది చాలా వరకు నెరవేరింది కూడ.
భౌతికశాస్త్రంలో వున్నట్టే సమాజంలోనూ చలన సూత్రాలు వుంటాయి. ప్రతీ చర్యకు తత్సమానమైన ప్రతిచర్య వుండడమేగాక ఆ ప్రతిచర్యకు సహితం తత్సమానమైన ప్రతిచర్యలు వుంటాయి.

ఆరెస్సెస్ సామాజిక దృక్పథం సనాతన ధర్మం. దాని సామా జిక నిర్మాణం చాతుర్వర్ణ వ్యవస్థ. ఇందులో ముస్లింలు, క్రైస్తవులకు ఎలాగూ స్థానం లేదు. దళితులు, ఆదివాసులకు కూడ స్థానం లేదు. అయితే, 1990లలోనే ఆరెస్సెస్ రాజకీయ విభాగమయిన బీజేపీ విస్తరించి అధికారాన్ని చేపట్టడానికి విశాలమయిన ఓటు బ్యాంకు అవసరం అయింది. ఈ రాజకీయ అవసరాన్ని పరిష్కరించడానికి దళితులు, ఆదివాసులకు ద్వారాలు తెరిచారు.
రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే ఆరెస్సెస్ అంబేడ్కర్‌ మీద తీవ్ర విమర్శలు చేసింది. రాజ్యాంగ రచన పూర్తి అయిన తరువాత కూడ అది ఈ దేశానికి పనికిరాదనీ, మనుధర్మశాస్త్రం ఒక్కటే తమ రాజ్యంగం అని ప్రకటించింది. తమవైన రోజులు వచ్చి నపుడు మనుధర్మశాస్త్రాన్ని అధికారిక రాజ్యాంగంగా ప్రకటిస్తామని ఆరెస్సెస్ నాయకులు బాహాటంగానే ప్రకటనలు చేశారు.

అయితే, రాజకీయ లబ్ది కోసం దళితులు, ఆదివాసుల్ని దగ్గరకు తీసుకోవాల్సి రావడంతో సంఘపరివారానికి అంబేడ్కర్‌ మీద సానుకూల వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం వచ్చింది. అంబేడ్కర్‌ను హిందూ సంస్కర్తగా మార్చి తనలో కలుపుకుంది.
ఏ సంకల్పాన్ని అయినాసరే ఒక పటిష్ట ప్రణాళికతో అమలు చేయడంలో సంఘ్‌ పరివారం గొప్ప అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. చేపట్టిన యజ్ఞానికి ముహుర్తాలను నిర్ణయించడంలోనూ సంఘపరి వారానికి సాటి మరొకరు లేరు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చడానికి అంబేడ్కర్‌ వర్ధంతి నాడే ముహూర్తం పెట్టడంలోనే సంఘ్‌ పరివారం నేర్పరితనం కనిపిస్తుంది.

అస్పృశ్యులంటూ ఒకప్పుడు గుళ్ళలో ప్రవేశానికి అనుమతి నిరాకరించిన సమూహాలకు రోడ్ల మీద పందిళ్ళు వేసి గణపతి నవరాత్రులు, శ్రీరామ నవమి, హనుమాన్‌ జయంతి తదితర పండుగలు, శోభాయాత్రలు నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పారు. దేవతా విగ్రహాలు తమ గుమ్మం ముందుకు రావడంతో వారూ పూనకంతో ఊగిపోయారు. కర్రలు, కత్తులతో విన్యాసాలు చేస్తూ చెలరేగిపోయారు. ఇవి సంఘ్‌ పరివారానికి రాజకీయరంగంలో అనూహ్య విజయాలను సాధించిపెట్టాయి.

నరేంద్ర మోది రాజకీయ పునాదిని పటిష్టం చేసిన గుజరాత్‌ అల్లర్లలో కాల్బలంగా ఎస్సీలు పోషించిన పాత్ర సామాన్యమైనది కాదు. హిందూమత సమాజ నిర్మాణం కోసం కొందరు ఎస్సీలు నడుం బిగించి చెలరేగిపోయారు. వారి కొత్త పూనకాన్ని కొన్ని అంతర్జాతీయ పత్రికలు కవర్‌ పేజీల మీద భద్రపరిచాయి.
ఇవన్నీ పాతికేళ్ళ నాటి పరిణామాలు. ఇప్పుడు బీజేపీ దేశంలో తిరుగులేని రాజకీయ పార్టి. దాని అగ్రనేతలిద్దరూ ఏది మాట్లాడినా అదే వేదం. అదే శాసనం.  వాళ్ళిద్దరూ అన్నింటినీ అమ్మేస్తుంటారు. ఇంకో ఇద్దరు వాటన్నింటినీ కొనేస్తుంటారు. ఇప్పుడు ఇండియా అంటే ఆ నలుగురే!!
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సామ్‌, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే చివరి విడి ఎన్నికలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలిమిటేషన్‌ ప్రక్రియ సాగుతోంది. ఆ తరువాత జమిలీ ఎన్నికలే వుంటాయి. దక్షణాది ప్రజాభిప్రాయంతో పనిలేకుండానే ఉత్తరాదివారే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే రోజులు వస్తున్నాయి. ఇక ఎస్సీలు, ఆదివాసుల ఓట్లతోనూ వారికి పెద్దగా పనివుండదు.

సరిగ్గా ఈ సమయంలో సుప్రీం కోర్టు ఒక కీలక తీర్పు చెప్పింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించదు అని స్పష్టం చేసిం ది. సుప్రీం కోర్టు టైమింగే టైమింగు.

ఈ తీర్పు 40 యేళ్ల క్రితం వచ్చుంటే కారంచేడు దురాగతం నేరేటివ్‌ మారి పోయి వుండేది. కారంచేడు దురాగతం లో బాధితులు దళిత క్రైస్తవులు. ఇప్పటి తీర్పు ప్రకారం దళిత క్రైస్తవులు ఎస్సీ హో దాను కోల్పోతారు. దళితుల మీద అత్యా చారాల నిరోధక చట్టం వారికి వర్తించేది కాదు.
సుప్రీంకోర్టు కొత్త తీర్పు నేపథ్యంలో ఎస్సీలలో అనేక అభి ప్రాయాలు చెలరేగుతాయి. వీటన్నింటికీ అంబేడ్కరే కేంద్ర బిందువు అవుతాడు. సంఘ్‌ పరివారంతో ఘర్షణ లేకుండా సర్దుకుపోవా లనుకునే వర్గం ఒకటి ముందుకు రావచ్చు. రామ్‌ విలాస్ పాశ్వాన్‌, రామ్‌దాస్ అథవాలే వంటివారు వేసిన దారి వారికి ఎలాగూ వుంది. వాళ్ల బాటలో నడుస్తూ, అధికారానికి దగ్గర కావచ్చు. తమను తాము బహుజన హిందువులమని ప్రకటించుకుని కులరహిత హిందూమత సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామనవచ్చు.

పాకిస్తాన్‌ ఏర్పాటు సందర్భంగా ముస్లిం సమాజం మీద అం బేడ్కర్‌ చేసిన కామెంట్లు కొన్ని సంఘ్‌ పరివారానికి గొప్పగా నచ్చు తాయి. కులరహిత హిందూమత సమాజ నిర్మాతలు వాటిని వల్లెవే యవచ్చు.  అప్పుడు, అంబేడ్కర్‌ను వదలనట్టూ వుంటుంది. సంఘ్‌ పరివారాన్ని హత్తుకున్నట్టూ వుంటుంది. రెండు ఉపయోగాలు.

ఈ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకించే అంబేడ్కర్‌వాదులూ వుం టారు. వారు అంబేడ్కర్‌ సిద్ధాంతాల్లోని విప్లవకర అంశాల్ని ముందుకు తెస్తారు. వాళ్ళు, ‘కులరహిత హిందూమత సమాజ’ ని ర్మాతల్ని మితవాదులు అంటారు. ఈ క్రమం ఈపాటికే మొదల యిపోయింది.
ఈ పరిణామాలు దళిత సమూహానికే పరిమితం కావు. సమస్త ఉనికివాద సమూహాల్లోనూ సంఘపరివారం ఆశ్రయం కోరే, నిరాకరించే విభజనలు వస్తాయి. ఒకప్పుడు కమ్యూనిస్టుల్లో రివ ల్యూషనరీ, రివిజనిస్టు శిబిరాలుండేవి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శిబిరాల్లోనూ ఈ రెండు పంథాల పోరాటం మొదలవు తుంది. ఎవరు గెలుస్తారూ? అనేది చెప్పడానికి మరికొంత కాలం వేచి చూడాలి.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News