Homeఎడిటోరియల్ / బహుళRegional Parties: ప్రాంతీయ పక్షాలకు ప్రజలే రక్ష

Regional Parties: ప్రాంతీయ పక్షాలకు ప్రజలే రక్ష

ఎస్ఐఆర్‌ విషయమై ఇటీవల సమావేశమైన ఇండియా కూటమి దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రదర్శనలు జరపాలనుకోవడం మంచి నిర్ణయం. పూర్వం వామ పక్షాలు ప్రజల కేంద్రంగా ప్రచారం చేసేవి, పనిచేసేవి. మిగతా పక్షాల ధోరణి కూడా అంతో ఇంతో ఇదే విధంగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో మతవాద శక్తులు ప్రజల్లో పనిచేస్తుంటే, ప్రగతి శీల శక్తులుగా గుర్తింపు పొందినవి మాత్రం కోర్టుల ద్వారా ఇతర విధాలుగా మతవాద శక్తులకు అడ్డుకట్టవేయడానికి నామమాత్రపు కృషి చేస్తున్నయి. రాజ్యాంగ వ్యవస్థలను, మీడియాను ఉపయోగిం చుకోవడం కూడా అవసరమే కానీ, ప్రజల మధ్య చేరడమే ప్రధానం. వాట్సాప్‌ ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ఫాసిస్టు శక్తులు గోబెల్స్​‍ ప్రచారం సాగిస్తున్నప్పుడు లౌకిక పక్షాలు కనీస స్థాయిలో తిప్పి కొట్టడం లేదు. లౌకిక భావజాలం గల నిబద్ధత గల కొందరు మేధావులే ముందుకు వచ్చి ఎంతో కొంత ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతున్నరు. గతంలో వివిధ ప్రగతిశీల పక్షాలలో, విద్యార్థి సంఘాలలో పనిచేసిన వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. వాళ్ళ యినా కనీస ఉమ్మడి కార్యక్రమం పెట్టుకొని ఈ ఫాసిస్టు భావజాలాన్ని ఎండగట్టే పని చేయడం లేదు.

- Advertisement -

రాజకీయ పక్షాలపై భారం వేసి పౌర సమాజం చేతులు ముడుచుకొని ఉండకూడదు. ఇదే రీతిలో చైతన్యవంతమైన విద్యా ర్థులు, యువత ముందుండి కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం అసాధ్యమేమీ కాదని నిరూపిం చినప్పుడు రాజకీయ పక్షాలు ఆ అవకాశాన్ని అందుకోకపోవడం కూడా తప్పే అవుతుంది. ఈ పరిస్థితులలో ఇండియా కూటమి సమావేశమై ఎన్నికల కమిషన్‌ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రద ర్శనలు జరపాలని నిర్ణయించడం వల్ల ఏదైనా మార్పుకు దారి తీస్తుందనే ఆశ పుడుతున్నది.

ప్రజలలోకి వెళ్ళడంతో పాటు ఇండియా కూటమి భారత బహుళత్వ సమాజానికి ప్రాతినిధ్య సంస్థగా మారడానికి ఎంతో కృషి చేయాలె. స్వభావరీత్యా ఈ కూటమి చాలా పరివర్తన చెందాలె. పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే, ప్రాధాన్యాన్ని కోల్పోవలసి రావచ్చు. ఇండియా కూటమిని భిన్నత్వంలో ఏకత్వ మనే సూత్రానికి అనుగుణంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఎక్కువగా ఉంటుంది. కానీ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపట్టిన నాటి నుంచి అనుసరిస్తున్న విధానం ప్రాం తీయ పార్టీలకు ఇబ్బందికరంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పోరాడు తున్నది బీజేపీతోనా లేక ప్రాంతీయ పార్టీలతోనా అనే సందేహం కలుగుతున్నది.

ఇటీవలి ఇండియా కూటమి సమావేశానికి సమాజ్‌ వాది పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ హాజరుకాలేదు. డీఎంకె ఇప్పటికే ఇండియా కూటమి నుంచి వెళ్లిపోయింది. డిఎంకె పరాజయం నేపథ్యంలో మెజారిటీకి దగ్గరగా ఉన్న విజయ్‌కు మద్దతు ఇవ్వ డంలో తప్పులేదని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుకొని ఉండ వచ్చు. కానీ డిఎంకె ఆగ్రహానికి ఈ ఒక్కటే కారణం కాదు. రెండు పార్టీల మధ్య సఖ్యత ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇదే నిర్ణయాన్ని డిఎంకె ను ఒప్పించి కూడా తీసుకోవచ్చు. కానీ డిఎంకె తోనే కాదు, పలు ఇతర ప్రాంతీయ పార్టీలతోనూ కాంగ్రెస్ వైషమ్యంతోనే వ్యవహ రిస్తున్నది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో తన శక్తిని మించి సీట్లు కోరడం, చివరి క్షణం వరకు ఇబ్బంది పెట్టడం చాలా సార్లు జరిగింది. సమాజ్‌ వాది అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆయా నియో జక వర్గాలలో యాదవ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, బీఎస్పీకి వ్యతిరేకంగా ఆయా సామాజికవర్గాల వారిని అభ్యర్థులుగా నిల బెట్టడం వంటి చెడగొట్టుడు పనులను కాంగ్రెస్ చాలా చేసింది. బిహార్‌, తమిళనాడు తదితర రాష్ట్రాలలోనూ మిత్ర పక్షాలను పీడించడం తెలిసిందే. రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌ మొదలైన పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాలు బీజేపీకి ఆయువు పట్టు. ఇక్కడ పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంది. ఈ రాష్ట్రాలలోని దాదాపు వంద సీట్లలో దృష్టి సారించి బీజేపీని ఓడిస్తే చాలు, దేశంలో ఆ పార్టీ చతికిలపడిపోతుంది. కానీ రాహుల్‌ మాత్రం ప్రియాంకతో ఈ కీలక సీట్లలో ప్రచారం చేయించడానికి బదులు, తమకు ఏ మాత్రం పునాదిలేని ఉత్తర ప్రదేశ్‌లో పూర్తి స్థాయి ప్రచారానికి దింపారు.

బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం బలంగా ఉండాలనుకునే సెంట్రలిస్టు పార్టీ. అధికారానికి వస్తే, ప్రాంతీయ పార్టీలను అణచివేయడానికి ఏ మాత్రం సంకోచించదు. 1960 దశకంలో ఇందిరాగాంధీ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఎంత నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారో చూసినం. బీజేపీతో పోలిస్తే ఉదారవాద పార్టీగా కనిపించినప్పటికీ, దేశంలోని భిన్న ప్రాంతీయ ఆకాంక్షలను సహించదు.

ఇప్పటి పరిస్థితులలో కాంగ్రెస్కు ప్రాంతీయ పార్టీలతో ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వందకు పైగా స్థానాలు సంపా దించుకుంటే, ప్రాంతీయ పార్టీలు తప్పనిసరిగా ఆ పార్టీ నాయకు డికే ప్రధాని పదవిని వదలి పెడతయి. అయితే కాంగ్రెస్ ఆ స్థానా లను బీజేపీతో పోరాడి దక్కించుకోవాలె. పెద్దమనసుతో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరిం చాలె. అవసర మైతే ఒక ఐదేండ్లు ప్రధాని పదవి ప్రాంతీయ పక్షాలకు వదలిపెడతా మనే స్థాయికి దిగివచ్చి సర్దుబాటుకు సిద్ధపడాలె. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వ్యవహార సరళి చూస్తే ఇది అత్యాశే అవుతుంది.

ప్రాంతీయ పార్టీల నాయకులపైన, వారికి అనుకూలమైన వ్యాపారవర్గాలపై బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఈడీ వగైరా దాడులు జరపడం, వేధింపులకు పాల్పడం ఇక ముందు ఎక్కువ కావచ్చు. ఏ రాజకీయ పక్షాన్నయినా, పార్లమెంటులో ప్రవేశించ కుండా చేస్తే, వీధుల్లోకి దిగక తప్పదు. ఇది చాలా సందర్భాలలో రుజువైంది. ప్రాంతీయ పార్టీలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది వేరే పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ ఒంటరిగా పోరాడలేదు.. అందువల్ల ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడక తప్పదు.

ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయడానికి డిఎంకె చర్చలు ప్రారంభించినట్టు వార్తలు వచ్చినయి. డిఎంకె నాయకు రాలు కనిమొళి మమతా బెనర్జీతో, మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ పార్టీలతో మంతనాలు జరిపినట్టు తెలిసింది. ప్రాంతీయ పక్షాలు ఏకమైతే, ఈ కూటమి కాంగ్రెస్తో ఎన్నికలకు ముందు లేదా తరువాత పొత్తు పెట్టుకోవచ్చు. సంఘటితంగా బలమైన స్థితిలో చర్చలకు పోవచ్చు.

పూర్తి స్థాయి కూటమి కాకున్న, తక్షణం ఒక రాజకీయ వేదిక అయినా ఏర్పడాలె. మొదటగా కనీసం ఆయా రాజకీయ పక్షాల మద్దతుతో, లౌకిక ప్రజాస్వామిక భావజాలానికి కట్టుబడిన – వివిధ వర్గాల, వివిధ రంగాల వేదికలను ఏర్పరచుకోవాలె. ఈ మధ్య ద్రవిడ వాదం ప్రాతిపదికగా చర్చలు సాగుతున్నాయి. దక్షిణా దిన ప్రాంతీయ ఆకాంక్షలకు వేదిక ఏర్పడితే ఆ తరువాత ఈశాన్యం మొదలుకొని దేశమంతటా వివిధ జాతులు తెగలతో సంప్రదింపులు జరపవచ్చు. అంతా కలిసి భిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, జాతులు, తెగల సమాహారంగా దేశాన్ని తీర్చిదిద్దుకోవాలె. రాజ్యాంగం అందుకు అవకాశం కల్పిస్తున్నది. ‘హౌ డెమొక్రసీస్ డై’ అనే పుస్తకంలో (ఇప్పటి మన దేశ రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ పుస్తకంలోని అంశాలను గతంలో రెండు సార్లు చర్చించాను) రచయితలు స్టీవెన్‌ లెవిట్‌ స్కీ, డేనియల్‌ జిబ్లాట్‌ చెప్పినట్టు రాజ్యాంగ వ్యవస్థలు వాటికవే మనలను కాపాడవు. మనం వాటిని కాపాడుకోవాలె.

ఆయా రాష్ట్రాల వారీగా చూస్తే, ప్రాబల్య శక్తులకు, ఇతర వర్గాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ప్రాంతీయ శక్తులు ఎంత తొక్కినా నిలదొక్కుకోగలుతున్నాయి. అయినా ఆయా రాష్ట్రాలలోని వైరుధ్యాలను ఆసరాగా చేసుకోవడానికి జాతీయ స్థాయి ‘పక్షాలు’ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కలుపుగోలుతనం లేకపోతే ప్రాంతీయ పక్షాలు నిలబడలేవు. మరొక ప్రధానమైన అంశం వివిధ ప్రాంతీయ శక్తుల మధ్య సౌహార్దత పెంచుకోవడం. క్రీడా స్ఫూర్తితో పోటీ పడాలె తప్ప, పరస్పర హననానికి దిగ కూడదు. అయినా కేంద్రీకృత శక్తుల ఒత్తిడిని తట్టుకుంటూ ప్రాంతీయ పక్షాలు నిలబడటం అంత సులభం కాదు. ప్రాంతీయ పక్షాలు జాతీయ పక్షాలతో రాజీ పడి కేవలం స్థానిక వనరుల పంపిణీకే పరిమితమైతే, చివరకు ఈ మాత్రం మనుగడ కూడా ఉండదు. సమ్మిళిత దృక్పథంతో లౌకిక, ప్రజాస్వామిక శక్తులకు ప్రాతినిధ్య శక్తులుగా పరివర్తన చెందాలె.

రైతులు, విద్యార్థులు మొదలుకొని భిన్న సామాజిక వర్గాలు ఆందోళన బాట పట్టాయి. వీటన్నిటిని కలుపుకొని పోవాలె. ప్రజాస్వామిక భావజాలంతో ప్రజలలోకి పోవాలె. అప్పుడు తమ ప్రాతినిధ్య శక్తులను ప్రజలే కాపాడుకుంటారు.

పరాంకుశం వేణుగోపాలస్వామి
సీనియర్‌ జర్నలిస్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News