Modi: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తున్నది. ‘ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌తో రాజీనామా చేయిస్తారా?’ అనే ప్రశ్న దేశ రాజధానితో పాటు రాజకీయవర్గాలను కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం.. జ్ఞానేశ్ కుమార్‌ను ఈ పదవి నుంచి తప్పించడం అంత ఆషామాషీ కాదు. ఒకవేళ ప్రజా ఒత్తిడికి తలొగ్గి ఆయన్ను తొలగిస్తే, అది ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిణామాలకు దారితీస్తుంది. ప్రజల ఆందోళనల కారణంగా ఒక అత్యున్నత అధికారిని బలవంతంగా సాగనంపితే.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు భయపడి వెనకడుగు వేస్తోందనే సంకేతాలు వెలువడతాయి. అంతేకాకుండా, ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో, మోడీ సర్కార్ ఎదుర్కొంటున్న ఈ సరికొత్త సవాళ్లు, ప్రజా ఆందోళనలు ఎటువైపు దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది.
ప్రజా నిరసనల ముందు తలవంచిన సర్కార్
సుమారు రెండు నెలల కిందట.. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, పేపర్ లీకేజీలు, నిరుద్యోగంపై యువత చెలరేగిన నిరసనల ఉద్ధృతికి ప్రధాని మోడీ దిగిరాక తప్పలేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి దేశంలో ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వంటి కొత్త తరహా ఉద్యమాలు ప్రారంభం కావడం, పాఠశాలల మౌలిక వసతుల నుంచి మహిళలపై అఘాయిత్యాల వరకు ప్రతి అంశంపై నేడు యువత రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నది. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు అతీతంగా, రాహుల్ గాంధీ వంటి విపక్ష నేతల పిలుపునకు యువత భారీగా తరలివస్తుండటం బీజేపీని కలవరపెడుతున్నది. గతంలో ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా’ విషయంలోనూ మోడీ ప్రభుత్వం మొదట గట్టిగా నిలబడాలని చూసింది. కానీ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గింది. అప్పుడే ప్రధాని మోడీకి ఉన్న ‘ప్రజా నిరసనలకు ఎప్పటికీ తలవంచని గట్టి నాయకుడు’ అనే పేరు తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ విషయంలోనూ ప్రభుత్వం అచ్చం అలాంటి క్లిష్ట పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నది.
జ్ఞానేశ్ కుమార్‌ను తప్పిస్తే వచ్చే చిక్కులేంటి?
ఒకవేళ ప్రజా ఒత్తిడికి తలొగ్గి జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే.. రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు నిజమేనని ఒప్పుకున్నట్లవుతుంది. అంతేకాక, 2024 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలను కూడా రద్దు చేయాలంటూ విపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతాయి. మరోవైపు, ఆయన్ను పదవిలో అలానే కొనసాగిస్తే.. విపక్షాలు, సీజేపీ వంటి పౌర సమాజ సంస్థలు ఈ అంశాన్ని సజీవంగా ఉంచి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాయి. రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికల పోరాటానికి విపక్షాలు ఈ వివాదాన్నే ప్రధాన అస్త్రంగా మలచుకునే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం పారదర్శకత కోల్పోయిందనే ప్రచారాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఇది ప్రతిపక్షాలకు ఒక మంచి వేదికగా మారుతుంది.
మోడీ సర్కార్ ముందున్న సవాళ్లు
భారతదేశంలో మూడోసారి వరుసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండో వ్యక్తి నరేంద్ర మోడీనే. అయితే, గతంలోలాగా జాతీయ రాజకీయాల్లో ఏ అంశాలపై చర్చ జరగాలో నిర్ణయించే పూర్తి పట్టును ఇప్పుడు ప్రధాని మోడీ కోల్పోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏ రాజకీయ వాతావరణం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తాము అనుకున్న అంశాలనే చర్చకు పెట్టి విపక్షాలను డిఫెన్స్‌లో పడేసేది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాహుల్ గాంధీ, యువజన సంఘాలే రాజకీయంగా ఏ అంశం ముందంజలో ఉండాలో శాసిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై నేడు యువతలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఎన్నికల జాబితా తయారీలో మారుతున్న విధానాలు కూడా ఈ యువతరానికి ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు జ్ఞానేశ్ కుమార్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చి ‘అన్నీ సజావుగానే సాగుతున్నాయి’ అని నిరూపించే ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్నికల సంఘం కోల్పోయిన విశ్వసనీయతను అది పూర్తిగా ప్రజల్లో పునరుద్ధరించలేకపోవచ్చు.హిందుత్వసిద్ధాంతంతో పాటు ప్రజలు తనపై ఉంచిన అపారమైన నమ్మకమే మోడీ విజయాలకు అసలు పునాది. కానీ నేడు ఆ నమ్మకానికే పెద్ద ఎత్తున తూట్లు పడుతున్నాయి. కేవలం రాజకీయ పార్టీలతోనే కాకుండా, భవిష్యత్ తరాలైన యువతలో ప్రభుత్వ వ్యవస్థలపై పెరుగుతున్న అభద్రతాభావాన్ని తొలగించాల్సిన పెద్ద బాధ్యత నేడు మోడీ ప్రభుత్వం ముందుంది. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నాటికి ఈ ప్రజా నిరసనలను ఎదుర్కొనేందుకు బీజేపీ ఎలాంటి సరికొత్త వ్యూహాలను రచిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
– ఆసరి రాజు
సీనియర్ జర్నలిస్ట్
8096677042

