Quit India Movement: 1942 ఆగస్టు 8న బొంబాయి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా (భారత్ ఛోడో/దేశాన్ని వదిలిపొండి) అనే తీర్మానం ఆమోదం పొందిన వెంటనే, కాంగ్రెస్ ప్రధాన నాయకులు దాదాపు అందరినీ తెల్లదొరతనం అరెస్ట్ చేసేసింది. ఆగస్టు 9న ఉద్యమం ప్రారంభమయ్యే సమయానికి దేశంలో నాయకుడు అనేవాడే లేడు. జైళ్ళకు వెళ్ళిన నాయకులు ఎవరూ ప్రజలకు ఉద్యమం గురించి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఇవ్వలేదు. జాతీయవాద సమూహలు, కాంగ్రెసేతర పార్టీలను విశ్వాసంలోకి తీసుకోనేలేదు. అందువల్ల భారతీయ ప్రజలు తమ ఆలోచనలు అందిన మేరకు, తమకు తోచిన విధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసారు. అందుకే, 7వేల మంది ప్రాణాలు త్యాగం చేసిన, 60వేల మంది ఖైదు అయిన ఉద్యమం నిశ్శబ్దంగా ఊపిరి విడవడం ఆశ్చర్యకరం కాదు.
భారత్ ఛోడో ఆందోళన
1942 నాటి ఉద్యమం నిస్సందేహంగా 1920, 1930, 1932ల్లో జరిగిన ఆందోళనల కంటె చాలా పెద్దది. ఆ మూడు ఉద్యమాల్లోనూ కలిపి సుమారు 50వేల మంది అరెస్టయ్యారు. కానీ ఒక్క 1942లోనే 60,229మందిని అరెస్ట్ చేసారు. భారత స్వతంత్ర పోరాట చరిత్రలో అంతవరకూ అంత ఎక్కువ మందిని ఖైదు చేసిన మొదటి సందర్భమది. అయితే 1942 ఉద్యమం విషయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఉద్యమం మహాత్మా గాంధీ పిలుపు మేరకే మొదలైనప్పటికీ, దాని స్వరూప స్వభావాలు గాంధేయవాద విధానంలో లేవు. బొంబాయి గోవాలియా ట్యాంక్ గ్రౌండ్స్‌లో (అనంతర కాలంలో ఆగస్ట్ క్రాంతి మైదాన్‌గా పేరు మారింది) 1942 ఆగస్టు 8న జరిగిన ఎఐసిసి సమావేశంలో భారత్ ఛోడో (క్విట్ ఇండియా) తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సమావేశం డెలిగేట్స్‌ను, ప్రజలను ఉద్దేశించి గాంధీ ప్రసంగించారు. అప్పుడే ఆయన తన ప్రఖ్యాత నినాదం ‘కరో యా మరో’ (డు ఆర్ డై – చేయండి లేక చావండి) పిలుపునిచ్చారు. ఉద్యమంలో హింసకు, గోప్యతకూ ఎలాంటి తావూ లేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఆగస్టు 9నుంచీ జరిగిన సంఘటనలు వేరేలా ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వ విభాగాలపై బహిరంగంగానే కాక, రహస్యంగా కూడా దాడులు చేసారు. అంటే, గాంధీ చెప్పినట్లు తమ ఉద్యమం చేసే ప్రదేశం, సమయం వంటి వివరాలను అధికారులకు ముందస్తుగా తెలియజేయకుండా దాడులకు పాల్పడ్డారు. గాంధీ ‘కరో యా మరో – చేయండి లేక చావండి’ అని పిలుపునిస్తే జనాలు దాన్ని ‘కరో యా మారో – చేయండి లేక చంపండి’ అని అర్ధం చేసుకుని, బ్రిటిష్ వారిని చంపారు కూడా. 1942 ఆగస్టు విప్లవాన్ని ముందుకు నడిపింది కాంగ్రెసేతర సంస్థలూ, సామాన్య ప్రజలే. దాదాపు మొత్తం కాంగ్రెస్ నాయకత్వం సరైన కార్యాచరణ ప్రణాళిక లేక, ముందుగానే జైళ్ళపాలయింది.
క్విట్ ఇండియా అనేది ఉద్యమమే కానీ ఎలాంటి సమన్వయం లేకుండా ఎవరికి తోచినట్లు వారు చేసిన ఉద్యమం. దానికి కారణం స్పష్టం. కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు అందరూ జైలుపాలయ్యారు. కేవలం కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు, జయప్రకాశ్ నారాయణ్ లాంటి కాంగ్రెస్ సోషలిస్టు నాయకులు మాత్రం బైట మిగిలారు. ఎవరి నుంచి ఆదేశాలు స్వీకరించి ఉద్యమాన్ని నడిపించాలో ప్రజలకు తెలియదు. కారాగారాలకు తరలిన అగ్రనాయకులు తాము ఖైదు అవడానికి ముందు, తమ తరువాతి వారికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో చెప్పలేదు. మరో ప్రధానమైన కారణమూ ఉంది. నిజానికి చాలామంది కాంగ్రెస్ అగ్రనాయకులు క్విట్ ఇండియా ఉద్యమానికి మనస్ఫూర్తిగా అంగీకరించలేదన్న విషయం ఆరోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి నాయకుల్లో జవహర్‌లాల్ నెహ్రూ, చక్రవర్తుల రాజగోపాలాచారి, సరోజినీ నాయుడు, భూలాభాయి దేశాయ్ తదితరులు ఉన్నారు.
అంతమందికి ఇష్టం లేని ఉద్యమంలోకి దూకాలని గాంధీ ఎందుకు భావించారు? దానికి కారణాలు వెంటనే తెలియకపోయినా, తర్వాతి పరిణామాలను గమనిస్తే సులువుగానే అర్ధమవుతుంది. క్రిప్స్ మిషన్ విఫలం చెందడం, జపాన్ బలగాలు భారతదేశపు తూర్పుభాగానికి చేరుకోవడం అనే రెండు ప్రధాన పరిణామాల కారణంగా గాంధీ హడావుడిగా క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. నిజానికి 1939 మార్చిలోనే త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, బ్రిటిష్ వారిని ఆరు నెలల్లోగా భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపొమ్మనాలి అని పిలుపునిచ్చాడు. అప్పటికే ఆయన కొన్నాళ్ళలో ప్రపంచ యుద్ధం మొదలుకానుందని గ్రహించాడు. భారతదేశానికి స్వతంత్రం సాధించడానికి ఆ యుద్ధాన్ని గరిష్ఠంగా వాడుకోవాలని భావించాడు. సెప్టెంబర్ 3న యునైటెడ్ కింగ్‌డమ్ ప్రపంచ యుద్ధంలోకి దిగినప్పుడు, కష్టకాలంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం గడ్డుస్థితిని మనకు అనుకూలంగా వాడుకోవడం సరికాదంటూ గాంధీ నెహ్రూలు సుద్దులు చెప్పుకొచ్చారు. దేశానికి స్వతంత్రం సాధించడానికి సరైన తరుణంలో గాంధీ నెహ్రూలు చేసిన ఆ వాదనతో భారతీయులు నిరాశా, నిస్పృహలకు లోనయ్యారు. అలాంటి సామాన్య భారతీయులను శాంతింపజేయడానికి 1940లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించారు. కానీ ప్రజలు ఆ అస్త్రానికి లొంగలేదు. దాంతో ప్రజలను మళ్ళీ ఆకట్టుకోడానికి ఒక భారీ ఉద్యమం చేపట్టవలసిన రాజకీయ అవసరం కాంగ్రెస్‌కు కలిగింది. లేనిపక్షంలో, అప్పటికే బ్రిటిష్‌వారిపై పోరు కోసం అజ్ఞాతంగా ఐరోపాకు చేరుకున్న సుభాష్ చంద్రబోస్ వైపు ప్రజలు తిరిగిపోతారని కాంగ్రెస్ కు భయం పట్టుకుంది.
యుద్ధం మొదలైన దాదాపు మూడేళ్ళ తర్వాత, యుద్ధ ఫలితం మిత్రరాజ్యాలకు అనుకూలంగా నిశ్చయమయ్యాక, కాంగ్రెస్ ఒక సామూహిక ఉద్యమం మొదలుపెడుతోందని భారతీయులు తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, చౌకులు, జైళ్ళు, పోస్టాఫీసులు, టెలిగ్రాఫ్ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, కోర్టు భవనాలు, కార్యనిర్వాహక కార్యాలయాల భవనాల మీద దాడులు జరిగాయి. క్వీన్ విక్టోరియా, ఇతర సామ్రాజ్యవాద ప్రతీకల విగ్రహాలు కూలిపోయాయి. ఆ ప్రయత్నాల్లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ప్రాణాలొడ్డారు.
అసమాన త్యాగాలు
1942 ఉద్యమం గురించి రాజకీయ నాయకులకు భిన్నాభిప్రాయాలు ఉండిఉండవచ్చు, కానీ అది దేశాన్ని కొంతకాలంపాటు ఊపేసింది. బాలబాలికలు, యువతీ యువకులు మొదలు వృద్ధుల వరకూ అన్ని వయసుల వారూ పెద్ద సంఖ్యలో త్యాగాలు చేసారు. అస్సాంలోని నౌగామ్ వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసే ప్రయత్నంలో కనకలతా బారువా (14) ప్రాణాలు త్యాగం చేసింది. బిహార్‌లోని కటీహార్‌లో 13ఏళ్ళ ధ్రువ్ కుందూ పూర్ణియా జిల్లా కలెక్టర్ చేతిలో మరణశిక్ష పాలయ్యాడు. బెంగాల్‌లోని తామ్లుక్‌లో చేతిలో మువ్వన్నెల జెండా పట్టుకున్నందుకు 73 ఏళ్ళ మహిళ మాతంగినీ హజరాను కాల్చి చంపారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని రెండు వారాల పాటు బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి విడిపించారు. ఆ విజయం సాధించిన వారిలో సుశీల్ ధారా, రామచంద్ర బేరా, సతీశ్ సామంత్, అజయ్ ముఖర్జీ తదితర యువతరం ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో కూడా అదే కథ పునరావృతమైంది. చిట్టూ పాండే నేతృత్వంలో జరిగిన ఉద్యమానికి భయపడిన ప్రభుత్వ అధికారులు జిల్లా వదిలి పారిపోయారు.
అహ్మదాబాద్‌లో సుమారు 8వేల మంది మిల్లు కార్మికులు ఉద్యోగాలు వదిలేసారు. బిహార్‌లో పెద్దసంఖ్యలో రైల్వే ట్రాకులు తొలగించారు. దాడులకు పాల్పడేవారిని గమనించి, వారిపై కాల్పులు జరపడానికి ప్రభుత్వం వైమానిక దళాన్ని రంగంలోకి దింపింది. బొంబాయిలో ఉషా మెహతా అనే విద్యార్ధిని అండర్‌గ్రౌండ్ రేడియో స్టేషన్ ప్రారంభించి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల వివరాలను ప్రసారం చేసింది. మీరట్ జిల్లా భామోరీ, సతారా జిల్లా పత్రి, ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్, బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్ వంటి ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
వార్ధా జిల్లాలోని అష్టి, చందా జిల్లాలోని చిమూర్ అనే రెండు పట్టణాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాలు 50 రోజులకు పైగా బ్రిటిష్ వారి కబంధహస్తాల నుంచి స్వేచ్ఛను అనుభవించాయి. దానికి కారణం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నాయకత్వం నుంచి ప్రేరణ పొందిన స్థానిక యువతరమే. ఆ పోరాటంలో ముగ్గురు స్వయంసేవకులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సంఘటనలతో బ్రిటిష్ వారు మరింత పాశవికంగా తయారయ్యారు. స్వతంత్ర సమర యోధుల పట్ల మరింత క్రూరంగా ప్రవర్తించారు. 8మందికి ఉరిశిక్ష విధించారు. 15కంటె ఎక్కువ మందికి జీవిత ఖైదు విధించారు.
అమరావతి ప్రాంతంలో 14మంది అమరులయ్యారు. వార్ధాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాగపూర్‌కు చెందిన ఇద్దరిని కాలాపానీ జైలుకు పంపించారు. రామ్‌టెక్ నగర ఆర్ఎస్ఎస్ కార్యవాహ బాలాసాహెబ్ దేశ్‌పాండేకు మరణ శిక్ష విధించారు. తర్వాత దాన్ని ఆమరణ కారాగారవాసంగా మార్చారు. అదే దేశ్‌పాండే 1952లో వనవాసీ కళ్యాణ ఆశ్రమాన్ని ప్రారంభించారు.
కమ్యూనిస్టుల విశ్వాస ద్రోహం
క్విట్ ఇండియా ఉద్యమానికి కమ్యూనిస్టులు నిస్సిగ్గుగా వెన్నుపోటు పొడిచారు. దానికి ప్రభుత్వం నుంచి తగిన బహుమతులూ అందుకున్నారు. 1942 తొలినాళ్ళ వరకూ, నిషిద్ధ సంస్థ అయిన సిపిఐ అగ్రనాయకులు జైళ్ళలో ఉండేవారు. కానీ యుద్ధంలో సోవియట్ రష్యా తన విధేయతను మార్చుకుని మిత్రపక్షాల వైపు చేరిన వెంటనే, ఇక్కడ భారతదేశంలో సిపిఐ మీద నిషేధం ఎత్తివేశారు. శ్రీపాద అమృత డాంగే, బి టి రణదివే, రాహుల్ సాంకృత్యాయన్, సునీల్ ముఖర్జీ, సజ్జాద్ జహీర్, సోలీ బాట్లీవాలా, ఎస్ ఎస్ మిరాజ్‌కర్, ఎ కె ఘోష్, ఎస్ జి పట్కర్ వంటి కమ్యూనిస్టు నాయకులు అందరూ జైళ్ళ నుంచి విడుదలయ్యారు. వారందరూ బ్రిటిష్ వారికి విధేయత ప్రకటించారు. గతంలో తాము పాల్పడిన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల విషయంలో క్షమాపణలు చెప్పుకున్నారు. ఆ తర్వాత అప్పటి సిపిఐ ప్రధాన కార్యదర్శి పి సి జోషి, నాటి బ్రిటిష్ పాలక ప్రతినిధి, హోం మెంబర్ అయిన రెజినాల్డ్ మ్యాక్స్‌వెల్‌తో రహస్య ఒప్పందం కుదర్చుకున్నాడు. తనకు, తన సహచరులకు కాలమిస్టులుగా కేటాయింపులు వచ్చేలా చేసుకున్నాడు. వారు బ్రిటన్ యుద్ధ ప్రయత్నాల్లో కూడా ప్రత్యక్షంగా సాయపడ్డారు.
భారతదేశంలో జాతీయవాద శక్తులను అరెస్టు చేయించేందుకు కమ్యూనిస్టులు తమ శక్తికొద్దీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, అలాంటి వారికి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ఆశ్రయం కల్పించారు. పట్రీ ప్రాంతానికి చెందిన నానా పాటిల్‌కు ఔధ్ ప్రాంత సంఘచాలక్ పండిట్ సాత్వలేకర్ తన ఇంటిలో సురక్షితంగా ఆశ్రయం కల్పించారు. సానే గురూజీకి పూణే సంఘచాలక్ భావుసాహెబ్ దేశ్‌ముఖ్ ఆశ్రయమిచ్చారు. అలాగే జయప్రకాష్ నారాయణ, అరుణా అసఫ్ అలీలకు ఢిల్లీ సంఘచాలక్ హన్స్‌రాజ్ గుప్తా తమ ఇంటిలో ఆశ్రయం కల్పించారు.
ఉద్యమ ఫలితం
జాతీయవాద శక్తులతో ఉమ్మడి కూటమి లేకపోవడం, కాంగ్రెస్ ఎలాంటి ఏర్పాట్లూ చేయపోవడంతో బ్రిటిష్ వారు దేశానికి వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వలేదు. అయితే ‘భారత్ ఛోడో ఆందోళన’ భారతీయుల దృఢ సంకల్పానికి ప్రతీకగా, భవిష్యత్తులో సాధించబోయే స్వాతంత్ర్యానికి భూమికగా నిలిచింది. ‘‘జాతీయ విప్లవ శక్తులను సమర్ధంగా నిర్వహించే వ్యవస్థ లేకపోవడం, ప్రజలకు తదుపరి కార్యారణ లేకపోవడం, భారత సైన్యంలోనూ ఇతర సర్వీసులలోనూ పని లేకపోవడం వంటి కారణాల వల్ల క్విట్ ఇండియా ఉద్యమం ఎలాంటి తక్షణ ఫలితాలనూ ఇవ్వలేకపోయింది’’ అని జయప్రకాశ్ నారాయణ అనంతర కాలంలో నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు.
కానీ, తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన 7వేలకు పైగా మహనీయ దేశభక్తుల చరమ త్యాగాలనూ, దేశవ్యాప్తంగా అరెస్టయిన 60వేల మందికి పైగా స్వతంత్రవీరుల ఆకాంక్షలనూ మరచిపోవడమేనా? వారి మహత్తర ప్రయత్నాలకు ఫలితం లేదా. అలాంటిదేం కాదు. వారు భవిష్యత్ తరాలకు మార్గదర్శక జ్వాలలుగా నిలిచారు.
ఫణీంద్ర పురాణపణ్డ
సీనియర్ జర్నలిస్ట్(7981868517)

