తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఒక చర్చ జోరుగా సాగుతోంది. అదే ‘తెలంగాణ జాతిపిత’ చర్చ! ఎవరు తెలంగాణకు జాతి పిత అనే విషయం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. హైదరాబాద్ పరిసర గ్రామమైన తెల్లాపూర్ ఒక డిక్లరేషన్ చేసింది. గద్దరే తెలంగాణకు అసలైన జాతిపిత అని. ఇది చాలా మందిలో ఆలోచనను కలిగిస్తున్నది. నిజానికి తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రొ.జయశంకర్‌ను తెలంగాణ జాతిపితగా పిలుచుకున్నారు. దీనిని అంగీకరించడానికి కేసీఆర్‌కు మనసు రాలేదు. తెలంగాణ తానే తెచ్చానని, అందువల్ల తానే జాతిపిత కావాలనే కోరిక కేసీఆర్‌లో లోపలెక్క డో ఉన్నది. అందువల్లనే ఆయనకు ప్రొ.జయశంకర్‌ను ఒప్పుకునేందుకు మనసు రాలేదు. ఈ నేపథ్యంలో గద్దర్‌ను తెలంగాణ జాతిపితగా తెల్లాపూర్ వేదికగా గద్దర్ గళం ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో జాతిపిత చర్చ పెద్దెత్తున జరుగుతున్నది. ఎవరు జాతిపితనో, ఎవరికి ఆ అర్హత ఉందో ఒకసారి పక్షపాతాలు పక్కన పెట్టి ఆలోచించాలి.
దేశానికి జాతిపితగా గాంధీ చెలామణిలో ఉన్నాడు. అది ఆయనకు ఎవరిచ్చిన బిరుదు అనేది ఇప్పటికీ అస్పష్టమే. పైగా గాంధీ కేవలం స్వాతం త్య్రోద్యమం దాకే ఆలోచించగలిగాడు. బ్రిటీష్ వారి నుండి స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న తరువాత ఎట్లా పాలించుకోవాలో గాంధీకి అవగాహన లేదు. అదే బాబా సాహెబ్ అంబేద్కర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నది. భారతదేశ సామాజిక చరిత్ర ఆమూలాగ్రం అధ్యయనం చేసింది ఆయనొక్కడే. అంతటి అవగాహన నుండే భారత రాజ్యాంగ పరిషత్‌కు ఛైర్మన్‌గా ఎన్నుకోబడ్డాడు. అసమానతలన్నీ తొలగి దేశం సర్వతోము ఖాభివృద్ధి ఎలా చెందాలో సూచించాడు అంబేద్కర్. అందుకే దేశానికి ఆయనను జాతిపితను చేయాలనే ఆలోచన కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నది. అలాగే తెలంగాణలో గద్దర్‌ను జాతిపితగా తెల్లాపూర్ సభ ప్రకటించుకుంది. ఈ సందర్భంగా చాలామందిలో ఒక కన్ఫ్యూజన్ బయలు దేరింది. గద్దర్ ఎట్లా జాతి పిత అవుతాడనేది వారి సందేహం. పైగా ఇప్పటికే వాడుకలో ఉన్నవారి పేరును ఎందుకు పక్కన పెట్టాలి? అన్నది వారి ఆవేదన.
జాతిపితగా ఎన్నుకోవడానికి లేదా గుర్తించడానికి కొన్ని అర్హతలు ఉండాలి. బాబా సాహెబ్ అంబేద్కర్‌లాగా ఈ తెలంగాణను ఎలా పాలించు కోవాలో ఒక స్పష్టత ఉండాలి. అలాగే తెలంగాణే ఏకైక ఎజెండాగా పని చేసిన ఉద్యమ చరిత్ర ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధం కావాలి. ఇవేవి లేకుండా ఎవ్వరినీ జాతిపితగా భావించలేం. ప్రొ.జయశంకర్‌ను కాదన్న కేసీఆర్ ఈ యేడాది ఫిబ్రవరి 21 తన జన్మదినం రోజు తననే జయశంకర్‌గా హో ర్డింగులు పెట్టించుకున్నాడు. ఇది ఎంతమా త్రమూ ఆమోదయోగ్యం కాదు. కేసీఆరే దీక్షలు చేసి చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధిం చాడని గులాబీ శ్రేణులు వాదించవచ్చు. కానీ, ఆ దీక్షను గురించి గులాబేతర రాజకీయ శ్రేణు లకు భిన్నాభిప్రాయాలున్నాయి. 13 వందల మంది విద్యార్థుల బలిదానాల త్యాగం, సబ్బండ వర్ణాల మడమతిప్పని పోరాటం వల్లనే తెలం గాణ సాధ్యమయ్యింది తప్ప ఏ ఒక్కరి దీక్షల వల్ల సాధ్యం కాలేదనేది జగద్విదితం. మరి అలాంటప్పుడు కేసీఆర్‌ను జాతిపితగా ప్రకటిం చుకోవడం హాస్యాస్పదమే అవుతుంది.
ఇక్కడే ప్రొ.జయశంకర్ ప్రశ్న ఉత్పన్నమవు తుంది. ప్రొ.జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండా ల్సిన అవసరం లేదు. కానీ, ప్రొ.జయశంకర్‌కు తెలంగాణను రేపు ఎవరు పాలించాలి? ఏ సా మాజిక వర్గానికి ఏం దక్కాలి అనే విషయంలో స్పష్టత లేదు. ఆయన లక్ష్యం కేవలం తెలంగాణ సాధించుకోవడం మాత్రమే. అందుకే ఆయన అక్కడికే పరిమితం అయ్యా డు. సాధించుకున్న తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో, ముఖ్యంగా పరిపాలనలో ఆయా సామాజిక వర్గాల పాత్ర ఎలా ఉండాలో ఆయన ఆలోచించలేదు. చివరికి కేవలం కేసీఆర్ మనిషిగా టీఆర్‌ఎస్తో ఉండిపో యారు. ఆయా సందర్భాల్లో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.
————————————————————
ALSO READ:
ప్రజల నుంచి దూరమైన విప్లవవాదులు
ఔషధ భద్రత, నియంత్రణ- – ప్రజారోగ్య పరిరక్షణ
కులమే పేదరికానికి మూలం
————————————————————
1997 మార్చి నెల 8, 9 తేదీలలో భువనగిరిలో తెలంగాణ జనసభ పెద్దెత్తున జరిగింది. ఆ సభలో గద్దర్ ప్రత్యేక ఆకర్షణ. గద్దర్ కోసం ప్రజలు సముద్రపు అలల్లా కదిలారు. బెల్లి లలిత తదితర ప్రజాకళాకారులు పాల్గొని తెలంగాణ విముక్తి కోసం గొంతెత్తారు. ఈ సభ జరిగిన నెల రోజుల లోపు 1997 ఏప్రిల్ 6వ తేదిన గద్దర్‌పై కాల్పులు జరిగాయి. అందుకు కారకుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడే అన్నది బహిరంగ రహస్యం. ఆరు బుల్లెట్లు తన శరీరాన్ని ఛిద్రం చేశాయి. అయినా సరే ఆయన మృత్యుంజయుడిలా వెన్నులో ఒక బుల్లెట్‌తో బతికి వచ్చాడు. మళ్లీ తెలంగాణ కోసం పునరం కితమై ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా’ అంటూ కాలికి గజ్జె కట్టుకుని ఊరూరు తిరిగాడు. శాంతియాత్ర తీసి ప్రజలను పాటతో చైతన్యపరి చాడు. ధూంధాం వేదికల మీద పాటల పెద్ద దర్వాజగా నిలబడి కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచాడు. తెలంగాణ సాధనలో అలుపెరుగని పాత్రను పోషించాడు. తెలంగాణ వచ్చాక కూడా ఎవరికి ఎంత వాటా దక్కాలో కోరుతూ సామాజిక తెలంగాణ సాధించుకోవాలన్నాడు.
ఈ నేపథ్యంలో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఏప్రిల్ 6వ తేదిని ‘గద్దర్ పునరుజ్జీవన సభ’గా గద్దర్ గళం ఘనంగా నిర్వహించింది. గద్దర్ 20 అడుగుల విగ్రహం సాక్షిగా ‘‘గద్దరే తెలంగాణ జాతిపిత’’ అని ఒక డిక్లరేషర్‌ను తెలంగాణ సమా జానికి అందించింది.
ఈ ప్రకటనకు ఇప్పటికే వివిధ ప్రజాసంఘాలు, నేతలు మద్దతు తెలుపడం హర్షనీయం. అలాగే తెలంగాణ సమాజంలో ప్రముఖులుగా ఉన్న ప్రొ.కంచ ఐలయ్య, కొల్లూరి సత్తయ్య, పాశం యాదగిరి, జేబీరాజు, అద్దంకి దయాకర్, డా.జిలుకర శ్రీని వాస్, విమలక్క, నలమాస కృష్ణ, పృథ్విరాజ్ యాదవ్, గుడిపల్లి రవి, నలిగంటి శరత్, కొల్లూరి భరత్, నల్లమల మురళి వంటి వారు మద్దతు ప్రకటించారు.
డా. పసునూరి రవీందర్
రచయిత, సామాజిక విశ్లేషకులు

