“భారత ప్రజాస్వామ్యానికి బలమైన కేంద్రం ఉం డాలి. కానీ అది ఉత్తరాది కేంద్రం కాకూడదు” -1955లో పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అన్న వ్యాఖ్యలివి. దేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా దక్షిణాదికి సమాన రాజకీయ గౌరవం, భాగస్వామ్యం లభించినప్పుడే దేశం నిజమైన సమాఖ్య అవుతుందని ఉద్ఘాటించారు. అంబేద్కర్ తన రచనలు, ప్రసంగాల్లోనూ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, అక్కడి ప్రజలు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వంటి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ రాసిన ‘‘భాషా ప్రయుక్త రాష్ట్రాలు- ఆలోచనలు” గ్రంథంలో దక్షిణాది గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించారు. మరోవైపు ఉత్తరాది రాజకీయ పెత్తనం పైనా నిజానిజాలు రూఢీ చేశారు. అంబేద్కర్ ప్రధానంగా దేశం ప్రజాస్వామ్యం పేరుతో ఉత్తరాది ఆధిపత్యం కిందకు వెళ్లిపోతుందని ఆందో ళన చెందారు. ఇలా ఎందుకంటే.. దేశ రాజధాని ఢిల్లీ ఉత్త రాది రాష్ట్రాలకు చేరువలో ఉండటం కూడా రాజకీయ పెత్త నానికి ఒక కారణమని భావించారు. ఢిల్లీలో కూర్చుని పరిపాలించే పాలకులకు దక్షిణాది ప్రజల సమస్యలు, సంస్కృతిపై సరైన అవగాహన ఉండదని అభిప్రాయప డ్డారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వంపై ఉత్తరాది ప్రభావం తగ్గాలంటే హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని ఆనాడే అంబేద్కర్ స్పష్టం చేశారు. తద్వారా దక్షిణాదికి కూడా కేంద్రంలో అధికార భాగస్వామ్యం లభిస్తుందని ప్రతిపాదించారు. హిందీని జాతీయ భాషగా రుద్దడం వెనుక కూడా ఉత్తరాది రాజకీయ పెత్తనం దాగి ఉందని గ్రహించారు. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకే కాకుండా, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఒక సాధ నంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. “ఉత్తరాది రాష్ట్రాలన్నీ హిందీ మాట్లాడటం వల్ల అవి రాజకీయంగా సులభంగా ఏకమవుతాయి. దక్షిణాదిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భిన్న భాషలు ఉండటం వల్ల అవి రాజకీయంగా ఏకమవ్వడం కష్టం. ఇలాంటి వైవి ధ్యాన్ని ఉత్తరాది తన రాజకీయ ఆధిపత్యానికి అనుకూ లంగా మార్చుకుంటుంది’’ అని అంబేద్కర్ ఆనాడే ఆందో ళన వెలిబుచ్చారు.
70 ఏళ్ల కిందటి వ్యాఖ్యలను గుర్తు చేసి..
కొద్దిరోజుల కింద లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యాంగ సవరణ 131పై జరిగిన చర్చ దేశ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఉత్తర, దక్షిణ రాష్ట్రాలుగా రెండు వర్గాలుగా విడిపోయింది. మహి ళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీల సభ్యు లందరూ స్వాగతించినప్పటికీ, దాన్ని నియోజకవ ర్గాల పునర్విభజనతో ముడిపెట్టడంతోనే తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. ఇదే ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల మధ్య అధి కార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర విభేదాలకు, వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. బిల్లు ఆమోదం పొందితే 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను దాదాపు 850కి పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపైనే దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు తీవ్ర అభ్యంతర్యాలు వ్యక్తపరిచారు. జనాభా నియంత్రణ పాటించిన, ఆర్థికంగా దేశానికి వెన్నుదన్నుగా నిలిచే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభలో సీట్ల సంఖ్య తగ్గి పోతుందని ఆందోళన చెందారు. అదే జరిగితే.. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి, రాజకీ యంగా దక్షిణాది ప్రాధాన్యత తగ్గుతుందని వాదించారు. అయితే.. లోక్‌సభలో చర్చ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 70 ఏళ్ల కింద పార్లమెంట్ సాక్షిగా వెలిబుచ్చిన ‘ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం’ గురించిన అభిప్రాయాలను పలువురు దక్షి ణాది ఎంపీలు ఉటంకిం చడం విశేషం. ఆనాడు అంబేద్కర్ పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని మరోసారి దక్షిణాది రాష్ట్రాల మెజార్టీ ఎంపీలు వాదించారు. మరో వైపు ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ’ అనే ప్రజాస్వామ్య సూత్రం మేరకు జనాభా ప్రాతిపదికన సీట్లు ఉండాలని, ఇది ఏ ప్రాంతానికి వ్యతి రేకం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అధికార, ప్రతి పక్షాల మధ్య వాడీవేడీగా చర్చలు కొనసాగాయి. చివరకు దక్షిణాది రాష్ట్రాల మెజారిటీ ఎంపీ లు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది.
రెండు ప్రాంతాల మధ్య భిన్న వైరుధ్యాలపై..
అంబేద్కర్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య భౌగోళిక, రాజకీయ, సామాజిక వ్యత్యాసాలను అత్యంత లోతుగా విశ్లేషించి చెప్పారు. సామాజికంగా రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన స్పష్టంగా గుర్తించారు. దేశ సమగ్రతకు, సమానత్వానికి ఆనాడు ఆయన ప్రతిపాదిం చిన అభిప్రాయాలు ఇప్పటికీ అత్యంత కీలకమైనవి. సంద ర్భానుసారం చర్చకు వస్తుంటాయి. ఆనాడు అంబేద్కర్ “ఉత్తరాది రాష్ట్రాలు భౌగోళికంగా, జనాభా పరంగా చాలా పెద్దవి. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు కేటాయిస్తే, కేంద్రంలో ఎప్పుడూ ఉత్తరాది వారే నిర్ణయాధికారం కలిగి ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నా, కేంద్ర రాజకీయాల్లో తమ స్వరం బలహీన పడుతుంది” అని భయాందోళన వ్యక్తం చేశారు. దక్షిణా దిలో సామాజిక చైతన్యం, హేతుబద్ధత, ఆధునిక విద్య అధి కంగా ఉన్నాయని భావించారు. సామాజిక, కుల వ్యతిరేక ఉద్యమాలు దక్షిణాది సమాజంలో మార్పు తీసుకువచ్చా యని ప్రశంసించారు. ఉత్తరాది సంప్రదాయవాదానికి, మూఢనమ్మకాలకు కట్టుబడి ఉందని, అక్కడ సామాజిక సంస్కరణలు నెమ్మదిగా సాగుతున్నాయని విశ్లేషించారు. అభివృద్ధి సమానంగా జరగాలంటే రాష్ట్రాలు చిన్నవిగా ఉండాలని వాదించారు. పెద్ద రాష్ట్రాలు పరిపాలనా పరంగా విఫలమవుతాయని పేర్కొన్నారు. ఇలా ఉత్తర దక్షిణ భారత్ మధ్య సామాజిక నిర్మాణం, ఆలోచనా విధానంలో స్పష్టమైన తేడాను అంబేద్కర్ వివరించారు. అంబేద్కర్ ఆలోచన కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికి చెందినది కాదు. అది ఒక సమాఖ్యకు చెందినది. ఏ ఒక్క ప్రాంతం మరొక ప్రాంతంపై రాజకీయంగా, ఆర్థికంగా, సామాజి కంగా పెత్తనం చెలాయించకూడదని నొక్కి చెప్పారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే, హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని గట్టిగా ప్రతిపాదించారు. హైదరాబాద్ దేశం మధ్యలో ఉండటం వల్ల రక్షణ పరంగా సురక్షితమని, ఇది దక్షిణాది ప్రజల్లో కేంద్రంలోని అధికారంలో భాగస్వాము లమనే భావనను కలిగిస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆర్థికవేత్త కావడంతో, వనరుల కేటాయింపులో జరిగే అన్యాయాన్ని గణాంకాలతో విశ్లేషించారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా, కేంద్రం నుంచి వచ్చే నిధుల కేటాయింపులో ఉత్తరాది రాష్ట్రాలకే (జనాభా ప్రాతిపదికన) ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని ఆయన గుర్తించారు. ఉత్తరాదిలో భూస్వామ్య వ్యవస్థ వల్ల ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, దక్షిణాదిలో సామా జిక సంస్కరణల వల్ల కొంత మెరుగైన స్థితి ఉందని ఆయన విశ్లేషించారు. అంబేద్కర్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యత్యాసాలను చాలా లోతుగా విశ్లేషించారు. ముఖ్యంగా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, జనాభా ప్రాతిపదికన అధికార విభజన వంటి అంశాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు నేటికీ చర్చనీయాంశాలే. ఉత్తరాది ఆధిపత్యం దక్షిణాదిని అణచి వేస్తే, అది దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అందుకే ఆయన ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ ఉండాలని బలంగా వాదించారు. ఇలా అంబేద్కర్ 1955లో పార్లమెంట్‌లో చేసిన అభిప్రా యాలు, హెచ్చరికలు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచన లపై పేర్కొన్న అభిప్రాయాలు ఇప్పటికీ ఎంతగానో ప్రాధా న్యతను కలిగి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
-వేల్పుల సురేష్
జర్నలిస్టు.

